31, ఆగస్టు 2020, సోమవారం

ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

ప్రణబ్ ముఖర్జీ


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్దిసేపటి కిందట మృతి చెందారు.

ప్రణబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం సాయంత్రం ట్విటర్‌లో వెల్లడించారు.

సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈమేరకు ఆయనకు చికిత్స అందిస్తున్న దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ హాస్పిటల్(ఆర్&ఆర్) సోమవారం వెల్లడించింది.

ఆయన డీప్ కోమాలో ఉన్నారని.. వెంటిలేటర్‌పై ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సాయంత్రానికి ఆయన మరణించారు.

ప్రణబ్ ముఖర్జీ దిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న తన ఇంట్లో పడిపోయిన తరువాత మెదడులో రక్తం గడ్డకట్టగా ఆపరేషన్ కోసం ఆగస్టు 10న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు.

ఆ శస్త్రచికిత్స తరువాత ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ కోమాలోకి వెళ్లారు.

2012-17 మధ్య దేశానికి 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలందించారు.

ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగానూ పనిచేశారు.


భారత రత్న పురస్కారం ప్రదానం చేసిన మోదీ ప్రభుత్వం

ప్రణబ్ కుమార్ ముఖర్జీ 1935, డిసెంబరు 11న బెంగాల్ (ప్రస్తుత పశ్చిమ బెంగాల్)లోని మిరాఠీ గ్రామంలో జన్మించారు. 2012 నుంచి 2017 వరకు భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నారు. రాష్ట్రపతి పదవి చేపట్టకముందు 2009 నుంచి 2012 వరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

2012లో ప్రతిభా పాటిల్ పదవీ విరమణ తరువాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టి 2017 వరకు కొనసాగారు. 2019లో ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు.

చిరు దివ్వెల నుంచి షాండ్లియర్స్ వరకు

"బెంగాల్‌లోని ఒక చిన్న దీపపు వెలుగు నుంచి దిల్లీ షాండ్లియర్ వెలుగు జిలుగులను చేరుకునే క్రమంలో నేను అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను" అని తన జీవన ప్రయాణాన్ని ఆయన ఓ సందర్భంలో వివరించారు.

కాంగ్రెస్ హయాంలో సంక్షోభ పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులను చేపట్టారు. రాజకీయల్లో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రణబ్ ముఖర్జీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ప్రణబ్ తండ్రి కమద్ కింకర్ ముఖర్జీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేక సంవత్సరాలు జైల్లో గడిపారు. స్వాతంత్ర్యం తరువాత 1952 నుంచి 1964 వరకూ పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సభ్యుడిగా ఉన్నారు. ఆయన తల్లి పేరు రాజ్యలక్ష్మి ముఖర్జి

ప్రణబ్ ముఖర్జీ చదువు, ఉద్యోగం కోల్‌కతాలో సాగింది. చదువు ముగిసిన తరువాత అధ్యాపకుడిగా, విలేకరిగా పనిచేసిన తరువాత 1969లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడంతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.

తరువాత నాలుగుసార్లు 1975, 1981, 1993, 1999 లలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.

2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేవరకూ లోక్‌సభలో కొనసాగారు.

గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ ‘‘మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్" గా గుర్తింపు పొందారు.

కేబినెటెలో 1993-95 వరకూ వాణిజ్య మంత్రిగా, 1995-96, 2006-09 ల లో విదేశీ వ్యవహరాల మంత్రిగా, 2004-06 వరకు రక్షణ మంత్రిగా, 2009-12 వరకూ ఆర్థిక మంత్రిగా పదవులు నిర్వహించారు.

ఇండియన్ ఎకానమీకి మొదటి రిఫార్మర్

భారత ఆర్థిక వ్యవస్థకు మొదటి సంస్కర్తగా ముఖర్జీ గుర్తింపు పొందారు.

1982-84 మధ్య బాలన్స్ ఆఫ్ పేమెంట్ తరుగుదలను అదుపులో పెట్టి, కేంద్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే విధానాలను తీసుకురావడంలో ముఖర్జీ ప్రముఖ పాత్ర వహించారు.

అంతేకాకుండా ఐఎంఎఫ్ చివరి విడత రుణ సహాయాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయడం ద్వారా ఆర్థిక మంత్రిగా తన సమర్థతను చాటుకున్నారు.

ఇందిరాగాంధీ మరణానంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పశ్చిమ బెంగాల్లో రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ (ఆర్ఎస్సీ)ను స్థాపించారు. మూడేళ్ల తరువాత ఈ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

1991-96 వరకూ ప్రధాని పీవీ నరసింహరావు అధ్యక్షతన ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఈ కాలంలోనే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, ప్రధాని పీవీ నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు.

2008లో పద్మ విభూషణ్ పురస్కరాన్ని గ్రహించారు.

మళ్లీ 2009 లో ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టారు. 2010-11 బడ్జెట్ ప్రసంగంలో మొట్టమొదటిసారిగా ప్రజా రుణాన్ని తగ్గించే లక్ష్యాన్ని ప్రకటించారు. ద్యవ్యలోటును తగ్గిస్తూ, వృద్ధిరేటుని పెంచే వివిధ ఆర్థిక విధానాలను రూపొందించారు.

ప్రణబ్ ముఖర్జీ దేశప్రభుత్వంలోనే కాకుండా అంతర్జాతీయ సంస్థల్లో కూడా ముఖ్యమైన స్థానాలను అధిష్టించారు.

భారత ఆర్థికమంత్రిగా ఉన్న కాలంలోనే ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్ (ఐఎంఎఫ్), వరల్డ్ బ్యాంకులలో బోర్డ్ ఆఫ్ గవర్నర్లలో ఒకరిగా వ్యవహరించారు.

కుమారుడు, కుమార్తె రాజకీయాల్లోనే..

ప్రణబ్ ముఖర్జీ 1957లో సువ్రా ముఖర్జీని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

పెద్ద కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అభిజిత్ ఓటమి పాలయ్యారు.

కుమార్తె శర్మిష్ఠ కాంగ్రెస్ పార్టీ నేత. ప్రణబ్ ముఖర్జీ చాలా పుస్తకాలు కూడా రాశారు. వాటిల్లో "థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ (2014), ద టర్బులెంట్ ఇయర్స్ (2016), కొయిలేషన్ యియర్స్ (2017) విమర్శకుల ప్రశంసలు పొందాయి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి