హరియాణాలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ మద్దతిస్తే సీఎం అయ్యే సూచనలున్నాయి.
దుష్యంత్ చౌతాలా మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు. హరియాణా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలాకు మనవడు. దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలా. దుష్యంత్ బాబాయి అభయ్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ అధినేత. దుష్యంత్ కూడా ఇటీవల వరకు ఆ పార్టీలోనే ఉండేవారు. కొద్దికాలం కిందట ఆయన బాబాయితో విభేదించి బయటకు వచ్చేసి జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) పెట్టారు. తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేసి కింగ్ మేకర్‌గా ఎదిగారు.
1988 ఏప్రిల్ 3న జన్మించిన దుష్యంత్ చౌతాలా 26 ఏళ్ల వయసులో 2014లో లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. హిస్సార్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసి గెలిచారు. 2018లో ఐఎన్‌ఎల్‌డీ నుంచి బయటకొచ్చి జేజేపీ ప్రారంభించారు.
దేవీలాల్ కుటుంబ వారసుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడం వల్ల ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) కొన్ని నెలల క్రితం నిలువునా చీలిపోయింది. ఇలా చీలిపోయిన దేవీలాల్ కుటుంబ సభ్యులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాజకీయ వారసత్వాన్ని చేజిక్కించుకోవడానికి పోటీ పడ్డారు. దుష్యంత్ కొత్త పార్టీ పెట్టడంతో ఒకప్పుడు హర్యానాలో ప్రబల శక్తిగా ఉన్న ఐఎన్‌ఎల్‌డీ బలం ఇప్పుడు గణనీయంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. దుష్యంత్ నేతృత్వంలోని జేజేపీ ఇప్పుడు అనేక స్థానాల్లో ఐఎన్‌ఎల్‌డీని పక్కకు నెట్టి మూడో పక్షంగా ముందుకు వచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో ఐఎన్‌ఎల్‌డీ ప్రాబల్యం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు దేవీలాల్ రాజకీయ వారసత్వ ప్రతినిధిగా జేజేపీ ఆవిర్భవించింది.
దుష్యంత్ తన ప్రసంగాలలో దేవీలాల్‌కు నిజమయిన రాజకీయ వారసుడిని తానేనని చెప్పుకుంటున్నారు. దేవీలాల్ గురించి, ఆయన రాజకీయ విధానాల గురించి దుష్యంత్ మాట్లాడుతున్నారు. అయితే, ఆయన ఏ సభలోనూ తన తాత ఓంప్రకాశ్ చౌతాలా పేరును ప్రస్తావించలేదు. ఎందుకంటే, రాజకీయ వారసత్వ పోరులో ఓం ప్రకాశ్ చౌతాలా తన బాబాయి అభయ్ చౌతాలాకు మద్దతిచ్చారని దుష్యంత్ ఆగ్రహంగా ఉన్నారు. అయితే, అదే సమయంలో దుష్యంత్ తన ప్రసంగాలలో ఎక్కడ కూడా వారిని విమర్శించడం లేదు. దేవీలాల్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసికెళ్లే క్రమంలో దుష్యంత్ జింద్ జిల్లాలోని ఉచన కలాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిటింగ్ ఎమ్మెల్యే ప్రేమలతతో తలపడ్డారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు బీరేందర్ సింగ్ సతీమణి ప్రేమలత.