15, ఆగస్టు 2020, శనివారం

బాజీ రౌత్ : స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అత్యంత పిన్న వయస్కుడు

బాజీ రౌత్ విగ్రహం. ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లా డొంగొపొలాలో బాజీ రౌత్ విగ్రహం

Baji Rout : The youngest martyr of India

బాజీ రౌత్.. భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చాలామంది వినని పేరిది. కానీ, ఇప్పటికైనా తెలుసుకుని గుర్తుంచుకోవాల్సిన స్ఫూర్తిదాత బాజీ రౌత్.

కేవలం పన్నెండేళ్ల వయసులోనే బ్రిటిష్ వాళ్లను ఎదిరించి తెల్ల తూటాలకు బలైపోయిన బాల యోధుడు బాజీ.

భారత స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల్లో అత్యంత పిన్నవయస్కుడు బాజీ. 

The Youngest Martyr of India ఎవరంటే ఖుదీరాం బోస్ పేరు కూడా కొందరు చెబుతారు కానీ, ఖుదీరాం కంటే బాజీ రౌత్ చిన్నవారని చరిత్ర తేల్చింది.

ఇంతకీ బాజీ రౌత్ ఎక్కడివారు?.. ఆయన ఎలా చనిపోయారు? బ్రిటిషర్లు అంత చిన్న పిల్లాడిని ఎందుకు చంపారో తెలుసుకుందాం..


బాజీ రౌత్

ఒడిశా రాష్ట్రం ఢెంకనాల్‌లోని నీలకంఠాపురం బాజీ రౌత్‌ది. 1926 అక్టోబరు 5న జన్మించాడు. తండ్రి నీలకంఠాపురానికి సమీపంలో ఉన్న బ్రహ్మణి నదిలో పడవ నడిపేవారు. 

బాజీ పెరిగి పెద్దవాడవుతున్న సమయంలో తండ్రితో పాటే వెళ్తూ పడవ నడపడం నేర్చుకున్నాడు. 

ఆ రోజుల్లో స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఢెంకనాల్‌లో వైష్ణవ్ చరణ్ పట్నాయిక్ ప్రజామండల్ పేరుతో ప్రజలను సమీకరించి స్థానిక సంస్థానాధిపతి శంకర్ ప్రతాప్ సింగ్‌దేవ్ ప్రజాకంటక పాలన, అధిక పన్నులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తున్నారు. 

ఆ పోరాటాన్ని అణచివేయడానికి సింగ్ దేవ్ బ్రిటిష్ వారి సాయం తీసుకున్నారు. 

దాంతో పట్నాయక్‌ను పట్టుకోవడానికి ఆయన ఉండే భువన్ గ్రామంపై సింగ్‌దేవ్ మనుషులు, ఢెంకనాల్ స్టేట్ పోలీస్ తరచూ దాడి చేసేవారు.

అలా 1938అక్టోబరు 10న కూడా రాజు సింగ్‌దేవ్ మనుషులు, బ్రిటిష్ సైనికులు కలిసి  పట్నాయిక్ ఉండే భువన్ గ్రామంలో బీభత్సం సృష్టించారు. వైష్ణవ్ చరణ్ పట్నాయక్, ఆయన అనుచరుల కోసం ఇల్లిల్లూ వెతుకుతూ ప్రజలను హింసించారు. ఎంతో మందిని అరెస్టు చేశారు. ఆ అరాచకలను ప్రజలు ప్రతిఘటించడంతో బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రఘు నాయక్, ఖురీ నాయక్ అనే ఇద్దరు చనిపోయారు.

దీంతో ప్రజలు తిరగబడ్డారు. ఆగ్రహంతో ఉన్న ప్రజలకు ఎదురు నిలవలేక అదే రాత్రి సింగ్‌దేవ్, బ్రిటిష్ సైనికులు భువన్ నుంచి ఢెంకనాల్ పారిపోయే ప్రయత్నం చేయగా ప్రజలు వారిని వెంటాడారు.

ఆ క్రమంలో అక్టోబరు 11 వేకువజామున ఢెంకనాల్ వెళ్లే మార్గంలో నీలకంఠాపురం రేవు వద్ద బ్రహ్మణి నదిని దాటేందుకు 20 మందికి పైగా సైనికులు చేరుకున్నారు. 

కానీ, అప్పటికీ వారిని ప్రజలు తరుముతున్నారు.

నీలకంఠాపురం రేవులో పడవ వద్ద బాజీ రౌత్ ఉన్నాడు. బాజీ వయసు అప్పుడు పన్నెండేళ్లే. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న సైనికులు తమ అందరినీ పడవలో నది అవతలికి దాటించాలని బాజీని బెదిరించారు.

కానీ, పట్నాయిక్ చేస్తున్న ఉద్యమం.. బ్రిటిష్ సేనల అరాచకాల గురించి తెలిసిన బాజీ అందుకు అంగీకరించలేదు. అంతేకాదు... ప్రజామండల్‌కు అనుబంధంగా ఉన్న పిల్లల బృందం వానరసేనలో బాజీ సభ్యుడు కూడా. దీంతో ఆయన వారిని నదిని దాటించేందుకు అంగీకరించలేదు.

బాజీని కొట్టారు.. అయినా, ఆ పిల్లాడు ఏమాత్రం భయపడకుండా వారిని పడవలో ఎక్కించుకునే ప్రసక్తే లేదని చెప్పాడు.

ఇంతలో తమను తరుముతున్న ప్రజలు దగ్గరకు వచ్చేస్తుండడంతో బ్రిటిష్ అధికారులు తుపాకీతో బాజీని, ఆయనకు అండగా నిలిచిన మరో నలుగురిని కాల్చేశారు.  


బాజీ రౌత్ ది ఇమ్మోర్టల్ బోట్ బాయ్ సినిమా


బాజీ రౌత్‌పై సినిమా

బాజీ రౌత్ వీరత్వానికి గుర్తుగా 2016 నుంచి ఏటా ఉత్కల్ దివస్ రోజున ఉత్కళ్ కల్చరల్ అసోసియేషన్, ఐఐటీ బాంబే కలిసి ‘బాజీ రౌత్ సమ్మాన్’ అవార్డును ఆ రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులైన యువతకు అందిస్తున్నాయి.

2018లో భువనేశ్వర్‌కు చెందిన మీడియా కంపెనీ ప్రిలూడ్ నావెల్ వెంచర్స్ బాజీ రౌత్‌పై 27 నిమిషాల నిడివి ఉన్న ‘బాజీ: ది ఇమ్మోర్టల్ బోట్ బోయ్’ అనే చిత్రాన్ని తీసింది.



వైష్ణవ్ చరణ పట్నాయక్ Baishnab Charan Patnaik

వైష్ణవ్ చరణ్ పట్నాయక్ ఏమయ్యారు?

ఢెంకనాల్ రాజుకు, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ప్రజామండల్‌ను స్థాపించి ఉద్యమం చేసిన వైష్ణవ్ చరణ్ పట్నాయక్ స్వాతంత్ర్యం వచ్చేవరకు తన పోరాటాలను కొనసాగించారు.

బాజీ రౌత్ మరణం తరువాత బాజీ శవాన్ని మోసుకుంటూ ఉద్యమించిన ఆయన ఆ తరువాత తన ఉద్యమాన్ని మరింత ముమ్మరం చేశారు. 1939లో ఆయన్ను బ్రిటిష్ పాలకులు అరెస్టు చేశారు. ఆరు నెలలు జైలులో ఉన్న ఆయన అక్కడి నుంచి బయటపడ్డారు. 

కానీ, 1940లో మళ్లీ ఆయన్ను అరెస్టు చేశారు. 1942లో విడిచిపెట్టారు. అయితే, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో మళ్లీ ఆయన్ను పట్టుకుని ఉరి తీసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించగా ఆయన వారికి చిక్కకుండా అండర్‌గ్రౌండ్‌లో ఉంటూ ఉద్యమానికి సహకరించారు.

విద్యార్థి దశ నుంచే రైతులను, కార్మికులను కూడగట్టి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన స్వాతంత్ర్యానంతరం కూడా ప్రజల మనిషిగానే బతికారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయన ఢెంకనాల్ సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో కలపాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించారు. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగిన ఆయన 1947లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 

జైలు నుంచే ఎన్నికల్లో విజయం

తనను తాను కమ్యూనిస్టుగా ప్రకటించుకోవడంతో 1948లో ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. 1952 వరకు ఆయన జైలులోనే ఉన్నారు.

1952లో జరిగిన ఎన్నికల్లో ఆయన కమ్యూనిస్టు పార్టీ తరఫున జైలు నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించి 1952-57 మధ్య ఢెంకనాల్ ఎమ్మెల్యేగా పనిచేశారు.

అనంతరం 1962లో లోక్‌సభకు ఎన్నికూ 1967 వరకు ఎంపీగా పనిచేశారు.

2013లో 99 ఏళ్ల వయసులో పట్నాయిక్ మరణించారు.

ఒడిశాలో ‘వీర్ వైష్ణవ్’గా ప్రజలు పిలుచుకునే ఆయన జీవిత కథను ‘వీర్ వైష్ణవ్ జీవన్ గాథా’ పేరిట నిత్యానంద మిశ్రా ఒరియాలో పుస్తకంగా తీసుకొచ్చారు. 

(ఆధారం: డి.పి.మిశ్రా రాసిన పీపుల్స్ రివోల్ట్ ఇన్ ఒరిస్సా పుస్తకం, లోక్ సభ వెబ్ సైట్, ఒరిస్సా స్టేట్ ఆర్కైవ్స్, వీర్ వైష్ణవ్ జీవన్ గాథా)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి