23, ఆగస్టు 2020, ఆదివారం

కరోనా వ్యాక్సిన్ కనుగొనడం కంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికే కష్టం

 

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ

సోనియా గాంధీ ఆరోగ్యం రాజకీయాలకు సహకరించడం లేదు.. 

రాహుల్ గాంధీ రాజకీయం ఈ దేశానికి సరిపోవడం లేదు... 

ప్రియాంకాగాంధీ ఇంకా నియోజకవర్గ స్థాయికి మించి ఎదగలేదు.. 

మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కయిన కుటుంబంలోని తలకాయలేవీ ఆ పార్టీని గాడిన పెట్టగలిగేలా కనిపించడం లేదు. 

రాజకీయాల్లో ఎంతో అనుభవించినందుకు ఇంకేముందిలే అనుకుంటూ.. అనుభవం ఉన్నందున మనకెందుకులే అనుకుంటూ ఈ చేతకానితనాన్నంతా భరిస్తూ పార్టీలో కొనసాగుతున్నారు నాయకులు. 

మూడు చేపల కథంలోని సుమతి వంటి నాయకులు ముందుచూపుతో బయటపడుతుంటే... కాలమతి టైపు నాయకులు అదను కోసం ఎదురుచూస్తున్నారు.. మందమతులు అడుగంటిన కాంగ్రెస్ చెరువులోని బురదలో ఆక్సిజన్ కోసం వెతుక్కుంటూ ఎగఊపిరి తీస్తున్నారు. 

కాంగ్రెస్ అనే ఆ చెరువును బతికించడం, అందులో చేపలు బయటకుపోకుండా, బతుకుపోకుండా చూడడం ఇక సోనియా, రాహుల్, ప్రియాంక వల్ల కాదని పార్టీ నాయకులందరికీ అర్థమైపోయి చాలాకాలం గడవడంతో ఇప్పుడు సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు ఒక 23 మంది సీనియర్లు నేరుగా సోనియాకే లేఖ రాశారు. 

నాయకత్వాన్ని మార్చి పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్టీకి పూర్తి కాల, క్రియాశీల అధ్యక్షుడు కావాలని కోరారు.

అంటే అవుట్ డేటెడ్ సోనియా, ఆన్ అండ్ ఆఫ్ రాహుల్, అప్ డేట్ కాని ప్రియాంకా కాకుండా ఇంకెవరైనా అధ్యక్ష స్థానంలోకి రావాలని నిర్మొహమాటంగా చెప్పేశారు. 

మరెవరు?

దీంతో.. సోనియా కుటుంబానికి చెందని నేతలు ఎవరున్నారనేదీ సందిగ్థంగానే ఉంది ఆ పార్టీలో. బీజేపీకి అంతగా పట్టులేని, ఆ పార్టీ సిద్ధాంతాల బలవంతపు రుద్దుడును వ్యతిరేకిస్తున్న దక్షిణాది నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న వాదన వినిపిస్తున్నా ఆ అవకాశమూ కనిపించడం లేదు. 

జాతీయ స్థాయి నేత చిదంబరం, శశి థరూర్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.. కానీ, చిదంబరం జైలులో పడడంతో ఆయన దూకుడు తగ్గిపోయింది. థరూర్‌‌కు నాయకుడిగా కంటే మేధావిగానే పేరుంది. 

పైగా ఆయన అప్పుడప్పుడూ బీజేపీ వాసన కొడుతున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి.

ఉత్తరాది నేతల విషయానికొస్తే జాబితా పెద్దగానే ఉన్నా అన్నీ గోడ మీద పిల్లులే. 

పార్టీ పరిస్థితి చూసి సగం మంది ఇప్పటికే బీజేపీతో రహస్య ప్రేమాయణాలు నడిపిస్తున్నారు.

కేవలం అధికార ప్రతినిధులే నోరు విప్పి రాహుల్ గాంధీకి సపోర్టుగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 

దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నారు సోనియా. 

పోనీ ఎవరో ఒకరిని నమ్మి అధ్యక్ష స్థానం కట్టబెడితే వారి మాట మిగతావారు ఎంతవరకు వింటారన్నదీ ప్రశ్నే. 

ఇక రాహుల్ గాంధీనే ఎలాగోలా బతిమాలుదామనుకున్నా ఆయన కుర్చీ ఎక్కడానికి మొరాయిస్తున్నాయి. 

ఒకవేళ ఆయన్నే మళ్లీ చేసినా ఆయన నాయకత్వంపై విశ్వాసం లేక చాలామంది పార్టీ నుంచి జారిపోయే ప్రమాదం ఉందని ఆ పార్టీలోనే డౌట్లు. 

 ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పగ్గాలు అందుకుని పార్టీలో దూకుడు నింపే నాయకుడి కోసం ఆ పార్టీ కరోనా వ్యాక్సిన్ కనుగొనడం కోసం ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాల కంటే కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోంది.

Read Our Exclusives:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి