2, సెప్టెంబర్ 2020, బుధవారం

పబ్‌జీ సహా 118 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించిన భారత్

 

పబ్‌జీ

దేశంలో యువత విస్తృతంగా ఉపయోగిస్తున్న పబ్‌జీ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దానితో పాటు దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు విఘాతకరమైన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం ఉన్న 118 మొబైల్ యాప్‌లను బ్లాక్ చేయాలని నిర్ణయించినట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ బుధవారం సాయంత్రం ప్రకటించింది. దేశ భద్రత, రక్షణ, శాంతిభద్రతలకు అవి విఘాతకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమకు అందుబాటులో ఉన్న సమాచారం చెప్తోందని పేర్కొంది. 

భారత్ - చైనా సరిహద్దులో లదాఖ్ వద్ద ఇరు దేశాల మధ్య తాజా ఉద్రిక్తతలు తలెత్తిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.

ఇంతకు ముందు కూడా.. లద్ధాఖ్‌లో సరిహద్దు వద్ద గాల్వన్ లోయలో ఘర్షణలు చెలరేగినపుడు.. టిక్‌టాక్ సహా పలు చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే.

భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ టిక్‌టాక్, షేరిట్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ జూన్ 29 రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009 లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు చెప్పింది. అప్పుడు నిషేధించిన 59 యాప్‌ల జాబితాలో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, బైడూ మ్యాప్, షేరిట్ వంటి చైనా యాప్‌లు అధికంగా ఉన్నాయి. తాజా ఆదేశాల్లో.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫారంలలో కొన్ని మొబైల్ అనువర్తనాల దుర్వినియోగంపై తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ తెలిపింది.

ఈ యాప్‌ల సహాయంతో డాటాను దొంగిలించి భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు అందజేస్తున్నట్లు తమకు ఫిర్యాదులొచ్చాయని తెలిపారు. ఇది భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగిస్తుందని, ఈ అంశంలో తక్షణ చర్యలు చేపట్టడం అవసరమని వివరించారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ కూడా ఈ యాప్‌లను నిషేధించమంటూ అనేకసార్లు కోరిందనీ...అలాగే, అనేకమంది ప్రజా ప్రతినిధులు కూడా ఈ యాప్‌ల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తపరిచినట్లు సమాచారం. భారత సార్వభౌమత్వానికి నష్టం కలిగిస్తూ, భారత ప్రజల గోప్యతకు భంగం కలిగించే యాప్‌లను నిషేధించవలసిందేనని అనేకమంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు. వీటన్నిటి ఆధారంగా, దేశ శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఈ యాప్‌లను నిషేధించిందని తెలిపారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి