31, ఆగస్టు 2020, సోమవారం

చైనా, భారత్ ఘర్షణ: మళ్లీ ఆక్రమణలకు తెగబడిన చైనా.. తిప్పికొట్టిన భారత్

 

చైనా సైన్యం (ఇమేజ్ క్రెడిట్ గ్లోబల్ టైమ్స్)

చైనా మరోసారి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వింది. రెండు నెలల కిందట గల్వాన్ లోయలో ఘర్షణ తరువాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడినా వివిధ స్థాయిల్లో చర్చలు జరగడంతో బలగాల ఉపసంహరణ, కొన్ని కొత్త ఒప్పందాలు జరిగాయి.

అయితే.. ఈ ఒప్పందాలను పక్కనపెడుతూ చైనా మరోసారి భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో ఇండియన్ ఆర్మీ ఆ యత్నాలను అడ్డుకుంది. 

పాంగాంగ్ సో సరస్సు వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆర్మీ మళ్లీ యాక్టివిటీ పెంచి సరిహద్దులను అతిక్రమించే చర్యలతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించగా ఇండియన్ ఆర్మీ దాన్ని తిప్పికొట్టింది.

ఇంతకుముందు పాంగాగ్ సరస్సుకు ఉత్తర వైపు గడబిడ సృష్టించి చైనా ఈసారి భారత సైన్యం దృష్టి మళ్లిస్తూ సరస్సు దక్షిణ వైపు ఆక్రమణలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్ తీవ్రంగా ప్రతిస్పందించడంతో మరోసారి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే, ఇండియన్ ఆర్మీ ఘర్షణ జరిగినట్లు ప్రకటించలేదు.. చైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినట్లు మాత్రమే తెలిపింది.

గత గల్వాన్ ఘర్షణ కానీ ప్రస్తుత ఘర్షణ కానీ అంతా పాంగాంగ్ సో సరస్సు ప్రాంతంలోనే చోటుచేసుకున్నాయి.

పాంగాంగ్ సో సరస్సు Pangong Tso


పాంగాంగ్ సరస్సు కథేంటి?

భారత్, చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌లో పాంగాంగ్ సరస్సు ఉంది. టిబెట్‌లో దీన్ని సో న్యాక్ అని.. చైనాలో సోమో గాంగ్లా రింగ్పో అంటారు.

5 కిలోమీటర్ల వెడల్పు  134 కిలోమీటర్ల పొడవు ఉన్న దీని విస్తీర్ణం సుమారు 650 చదరపు కిలోమీటర్లు ఉంది.

అయితే, ఇందులో సుమారు 60 శాతం సరస్సు ప్రాంతం టిబెట్ భూభాగంలో ఉంది. 

శీతాకాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది.

చుట్టూ భూభాగమే ఉండి, సముద్రంతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఇది ఉప్పు నీటి సరస్సు. అయితే, ఇందులో తూర్పు ప్రాంతం చాలా తక్కువ లవణత కలిగి ఉంటుంది.. దాదాపు మంచినీరులాగే ఉంది. కానీ, సరస్సులో పశ్చిమ ప్రాంతాన మాత్రం లవణ గాఢత ఎక్కువగా ఉంటుంది. 

భారత్ వైపు ఉన్న ప్రాంతంలో చేపలు వంటి నీటి జీవులు చాలా తక్కువ.. టిబెట్ వైపు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అయితే, ఈ సరస్సు కేంద్రంగా అనేక పక్షి జాతులు ఉన్నాయి. 

సింధునది ఉపనది అయిన శ్యోక్ నది ఒకప్పుడు ఈ సరస్సుకు నీరందించేది కానీ కాలక్రమేణా సరస్సుకు, శ్యోక్ నదికి లింక్ తెగిపోయింది. ప్రస్తుతం భారత్ వైపు నుంచి రెండు సెలయేర్లు ఈ సరస్సులోకి ప్రవహిస్తుంటాయి.


ఎవరికి ఎంతవరకు పట్టుంది

భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ కొంత భాగం ఈ సరస్సు మీదుగా వెళ్తుంది. అయితే, ఇక్కడ రెండు దేశాల మధ్య సరిహద్దులు కచ్చితంగా నిర్ణయించుకోకపోవడంతో ఎవరికివారు తమదంటే తమదంటూ కొంత ప్రాంతం విషయంలో వాదిస్తుంటారు. పాంగాంగ్ సో సరస్సు తీరం వెంబడి ఉన్న పర్వత బంజర్లు ఉంటాయి. వీటిని ఫింగర్లు అంటారు. భారత వాదన ప్రకారం ఫింగర్ 8 వరకు మన భూభాగమే. కానీ, చైనా కూడా ఫింగర్ 2 వరకు తమదే అంటుంది.

అయితే, భారత్ ఫింగర్ 8 వరకు తమదే అంటున్నా ఫింగర్ 4 వరకు మాత్రమే సైనిక నియంత్రణ ఉంది. అటు చైనా కూడా ఫింగర్ 2 వరకు తమదే అంటున్నా పింగర్ 4 వరకు సైనిక నియంత్రణ ఉంది. 

చాలాకాలంగా ఫింగర్ 4 వరకు ఇటు భారత్, అటు చైనా సైన్యాల సంచారం ఉన్నా ఇప్పుడు చైనా ఫింగర్ 2 దాటి భారత్ సైన్యం రాకుండా అడ్డుపడుతుండడంతో ఘర్షణలు పెరుగుతున్నాయి.

కార్గిల్ యుద్ధం సమయంలో భారత్ పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని బలగాలను కొంత పాక్ సరిహద్దుకు తీసుకెళ్లినప్పుడు అదే అదనుగా చైనా ఫింగర్ 4 దాటి రోడ్డు నిర్మాణాలకు ప్రయత్నించింది. ఇప్పుడు ఫింగర్ 2 వరకు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది.

Read Our Exclusives:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి