shakuntala devi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
shakuntala devi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, జులై 2020, గురువారం

Shakuntala Devi : హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి మెదక్ నుంచి పోటీచేశారు తెలుసా

శకుంతలా దేవి హ్యూమన్ కంప్యూటర్

Shakuntala Devi, Vidya Balan, Human Computer, Shakuntala Devi Review
శకుంతలా దేవి.. విద్యాబాలన్ నటిస్తున్న ఈ సినిమాతో మరోసారి అసలైన శకుంతలా దేవిని భారతీయులు గుర్తు చేసుకుంటున్నారు. శకుంతలా దేవి గురించి తెలిసినవారు ఆమె గొప్పదనాన్ని మననం చేసుకుంటుంటే.. తెలియని వారు గూగుల్‌లో వెతికి మరీ తెలుసుకుని అవునా అని ఆశ్చర్యపోతున్నారు.
హ్యూమన్ కంప్యూటర్ అనిపించుకున్న శకుంతలాదేవి గణిత ప్రతిభ గురించి తెలుసుకుని ఈ తరం నోరెళ్లబెడుతోంది. 
అయితే, చాలామందికి తెలియని విషయం ఒకటుంది. శకుంతలా దేవి ఒకప్పుడు తెలుగు నేల నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు. 
అవును.. ఇందిరాగాంధీపై ఆమె పోటీ చేశారు. అయితే, గణితంలో ఎదురులేని ఆమెకు ఎన్నికల రాజకీయాల లెక్క మాత్రం అర్థం కాలేదు.

మెదక్ నుంచి ఇందిరాగాంధీపై పోటీ..

మానవ కంప్యూటర్ శకుంతలా దేవి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. 
ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన తరువాత  ప్రతిష్ఠ కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో (1977) కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ఇందిర కూడా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తొలిసారి జనతా పార్టీ నేతృత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, అది ఎంతో కాలం కొనసాగలేదు.
ఆ తరువాత 1980లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పుడు రాయ్‌బరేలీతో పాటు మరో సురక్షిత ప్రాంతం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం ఇందిరకు సూచించింది.
ఉత్తర భారతదేశంలో అప్పుడు జనతా పార్టీ ప్రభావం బాగా కనిపిస్తుండటంతో ఇందిరాగాంధీకి గెలుపుపై అనుమానం కలిగింది. దాంతో దక్షిణ భారతదేశంలోనూ ఎక్కడైనా పోటీ చేయాలని అనుకున్నారు.
పార్టీలో దీనిపై చర్చ జరగడంతో అప్పటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి, ఇతర ముఖ్య నేతలు మెదక్ నుంచి పోటీ చేయాలని ఇందిరకు సూచించారు. దాంతో ఇందిరాగాంధీ మెదక్ నుంచి బరిలో దిగారు.
అయితే.. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని అప్పట్లో రాజకీయ నాయకులే కాకుండా దేశంలోని మేధావులూ వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించినవారిలో శకుంతలా దేవి కూడా ఒకరు. 
ఇందిర గాంధీ ఎమర్జెన్సీ విధించడానికి నిరసనగా శకుంతల దేవి ఆమెపై పోటీ చేస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే ఆమె మెదక్‌లో ఇందిర పోటీ చేయడంతో తానూ అక్కడి నుంచి నామినేషన్ వేశారు.
పీవీ నరసింహారావు తనయుడు పీవీ రాజేశ్వరావు, తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకుడు కేశవ్ రావు జాదవ్, జైపాల్ రెడ్డి తదితరులు కూడా ఆ ఎన్నికల్లో ఇందిరపై పోటీకి దిగారు. 
అయితే, ఆ ఎన్నికల్లో జనం ఇందిరాగాంధీకే ఓటేశారు. 
ఇందిరకు ఈ ఎన్నికల్లో 3,01,577 ఓట్లు రాగా, జైపాల్ రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి. కేశవ్‌రావుజాదవ్‌కు 26,149 ఓట్లు పడ్డాయి. స్వతంత్రంగా పోటీ చేసిన శకుంతలాదేవి 6,514 ఓట్లతో డిపాజిట్ కోల్పోయి 9వ స్థానంలో నిలిచారు. 
ఆ తరువాత మళ్లీ ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు.

శకుంతలాదేవిలో విద్యాబాలన్

ఇకపోతే.. శకుంతలా దేవి చిన్న వయసులోనే యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌, అన్నామలై వర్సిటీలో గణితంలోని తన ప్రతిభను ఆవిష్కరించారు.
201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గాన్ని మనసులోనే గుణించి 50 సెకన్లలో సమాధానం చెప్పి ఓ సరికొత్త రికార్డు సృష్టించారు. గణితంపై అనేక పుస్తకాలూ రాశారు. ఖగోళ, జ్యోతిష శాస్త్రాలలోనూ ఆమెకు ప్రవేశం ఉంది.