9, ఫిబ్రవరి 2021, మంగళవారం

అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని వినతి


కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, జనసేన P.A.C. చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఆవరణ లో ఈ సమావేశం జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పవన్ కళ్యాణ్ అమిత్ షాను కోరారు.

ఈ మేరకు ఆయన వినతి పత్రం కూడా అందించారు. 




6, ఫిబ్రవరి 2021, శనివారం

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి మోదీని కలవనున్న పవన్ కళ్యాణ్



‘‘విశాఖ ఉక్కు కర్మాగారం... తెలుగువారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక. ఇటువంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నుంచి పెట్టుబడుల ఉపసంహరణ బాధాకరమేనని జనసేన భావిస్తోంది’’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

‘‘22 వేల ఎకరాల్లో విస్తరించి 17 వేల మంది పర్మినెంట్, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు సుమారు లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్న ఈ ప్లాంటు ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడం అనేది జనసేన అభీష్టానికి వ్యతిరేకం. ఒకసారి ఈ కర్మాగారం చరిత్ర పుటలను తిరగేస్తే ఈ కర్మాగారం ఆవిర్భావం కోసం 32 మంది ప్రాణాలను వదిలారు. వందలాది మంది నిర్భందాలకు గురయ్యారు. లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇంతటి త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన ఈ కర్మాగారం చేతులు మారుతుందంటే తెలుగువారందరికీ ఆమోదయోగ్యం కాని విషయమే. యు.పి.ఎ పక్షాన ప్రధాన మంత్రిగా ఉన్న కాంగ్రెస్ కు చెందిన మన్మోహన్ సింగ్ ముందుకు తీసుకెళ్లిన పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఆ పరిధిలోకి చేరిన ఉక్కు కర్మాగారాన్ని ఇప్పటి పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి జనసేన పార్టీ తనవంతు కృషి చేస్తుంది. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవలసిందిగా  ప్రధాని నరేంద్రమోదీని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరనున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రత్యక్షంగా ఈ విజ్ఞాపనను తెలుగువారి పక్షాన ఆయన తెలియచేస్తారు’’ అని నాదెండ్ల చెప్పారు.