21, ఆగస్టు 2020, శుక్రవారం

ఫోన్ ట్యాపింగ్: జగన్ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందా.. అలాంటి అధికారం దేశంలో ఎవరెవరికి ఉంది

చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ


ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకులు, జడ్జిలు, న్యాయవాదులు, మీడియాకు సంబంధించిన వ్యక్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు. 

పాలక వైసీపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణం రాజు సైతం తన రెండు ఫోన్‌ నంబర్లను ఏపీ నిఘా వర్గాలు కొన్ని నెలలుగా ట్యాపింగ్ చేస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తంచేశారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21ను ఉల్లంఘించడమేనని చెప్పిన ఆయన దీనిపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు.

ట్యాపింగ్ కోసం చట్టవిరుద్ధమైన సాఫ్ట్ వేర్‌లను వినియోగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అంతేకాదు.. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ చంద్రబాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలనీ డిమాండ్  చేశారు.

మ‌రోవైపు కొంద‌రు న్యాయ‌మూర్తుల ఫోన్ల‌ను ప్ర‌భుత్వం ట్యాప్ చేస్తోంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో విశాఖ‌ప‌ట్నానికి చెందిన న్యాయ‌వాది ఒకరు ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. దీనిపై టెలికాం స‌ర్వీసు ప్రొవైడ‌ర్లు, రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాల‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది.

ఇక రాజస్థాన్‌లోనూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసిందని దానిపై సీబీఐ విచారణ జరిపించాలని అక్కడి బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 

గతంలోనూ దేశవ్యాప్తంగా అనేక ఫోన్ ట్యాపింగ్ ఘటనను రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

మరి ఇంతకీ ప్రైవేటు వ్య‌క్తుల ఫోన్ల‌ను ప్ర‌భుత్వం ట్యాపింగ్ చేయొచ్చా? ఫోన్‌ ట్యాపింగ్ చేసే అధికారం ఏ ఏ సంస్థ‌ల‌కు ఉంటుంది? ఇంత‌కీ ఈ ట్యాపింగ్ ఎలా చేస్తారు?

ఇజ్రాయెల్ పేరు

గ‌తేడాది అక్టోబ‌రులో కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌లు దుమారం రేపాయి. పెగాసెస్ అనే ఇజ్రాయేల్ స్పైవేర్‌తో భార‌త్‌లోని మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, జ‌ర్న‌లిస్టుల‌పై నిఘా పెట్టార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ విష‌యాన్ని వాట్సాప్ కూడా ధ్రువీక‌రించింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని వాట్సాప్‌ను కేంద్ర‌ ప్ర‌భుత్వం కోరింది. అయితే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఈ నిఘా పెట్టింద‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన అధికార ప్ర‌తినిధి ర‌ణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు.

వివాదం న‌డుమ అస‌లు ఏ ఏ సంస్థ‌ల‌కు ఫోన్‌ ట్యాపింగ్‌చేసే అధికారం ఉంద‌ని లోక్‌స‌భ‌లో డీఎంకే నాయ‌కుడు ద‌యానిధి మార‌న్ ప్ర‌శ్నించారు. దీనిపై కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

ప్రైవేటు వ్య‌క్తుల ఫోన్ కాల్స్‌ను రికార్డుచేసే అధికారం కేంద్రం, లేదా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఫోన్ కాల్స్ ద్వారా నిఘా పెట్టొచ్చ‌ని ఆయ‌న చెప్పారు.

ఎప్పుడు నిఘా పెట్టొచ్చు?

ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం-2000లోని సెక్ష‌న్ 69తోపాటు ఇండియ‌న్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఫోన్ల‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ట్యాపింగ్ చేయొచ్చు. దేశ సార్వ‌భౌమ‌త్వం, స‌మ‌గ్ర‌త, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ, విదేశాల‌తో స‌త్సంబంధాల నిర్వ‌హ‌ణ‌తోపాటు ఏదైనా నేరాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం, లేదా కేంద్ర ప్ర‌భుత్వం కాల్స్‌ను ఇంట‌ర్‌సెప్ట్ చేయొచ్చు. లేదా ప‌ర్య‌వేక్షించొచ్చు. ఈ స‌మాచారాన్ని కావాలంటే ఏదైనా కంప్యూట‌ర్‌లో కూడా స్టోర్ చేయొచ్చు.

అంతేకానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు.

దేశ ప్రయోజనాల కోసం కాల్స్‌ను రికార్డు చేయాలంటే లేదా ఇంట‌ర్‌సెప్ట్ చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వ విష‌యంలో కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి, రాష్ట్ర ప్ర‌భుత్వం విష‌యంలో రాష్ట్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి.

అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో హోం శాఖ‌లోని జాయింట్ సెక్ర‌ట‌రీ స్థాయి లేదా ఆ పైస్థాయి అధికారి అనుమ‌తితో ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేయొచ్చు. ‌

ప్ర‌తి నెల ఫోన్ ట్యాపింగ్‌కు దాదాపు 9,000 ఆదేశాల‌ను ప్ర‌భుత్వం ఇస్తున్న‌ట్లు సాఫ్ట్‌వేర్ ఫ్రీడ‌మ్ అండ్ లా సెంట‌ర్ సంస్థ 2014లో తెలిపింది.


ఎవరికి అధికారం ఉంటుంది?

ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేసే లేదా ఇంట‌ర్‌సెప్ట్ చేసే అధికారం కేంద్ర ప్ర‌భుత్వం ప‌ది సంస్థ‌ల‌కు ఇచ్చింది. 

వీటిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ), డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), రీసెర్చ్ అండ్ అనాల‌సిస్ వింగ్ (ఆర్ఏడ‌బ్ల్యూ), డైరెక్ట‌రేట్ ఆఫ్ సిగ్న‌ల్ ఇంటెలిజెన్స్‌, దిల్లీ పోలీస్ క‌మిష‌న‌రేట్‌ ఉన్నాయి. 

రాష్ట్రాల విష‌యంలో రాష్ట్ర పోలీసు శాఖ‌కు ఫోన్ల‌ను ఇంటర్‌సెప్ట్ చేసే అధికారం ఉంటుంది.

ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలను హోం శాఖ‌ జారీచేసిన త‌ర్వాత ఒక వారంలోగా వాటిని సమీక్షా క‌మిటీకి పంపించాలి. కేంద్ర స్థాయిలో అయితే క్యాబినెట్ కార్య‌ద‌ర్శి, న్యాయ శాఖ కార్య‌ద‌ర్శి, టెలికాం శాఖ కార్య‌ద‌ర్శి ఈ క‌మిటీలో ఉంటారు. 

రాష్ట్రాల విష‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, న్యాయ శాఖ కార్య‌ద‌ర్శితోపాటు రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన మ‌రో వ్య‌క్తి స‌భ్యులుగా ఉంటారు.

ఈ క‌మిటీ రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో సంబంధిత ఆదేశాలపై విచార‌ణ చేప‌డ‌తుంది. ఒక‌వేళ ఆదేశాలు ఇవ్వ‌డంలో ఏదైనా త‌ప్పు జ‌రిగింద‌ని భావిస్తే.. రికార్డుచేసిన కాల్స్‌, స‌మాచారాన్ని డిలీట్ చేయాల‌ని లేదా రికార్డుల నుంచి తొల‌గించాల‌ని సూచిస్తారు.

అయితే, ప్ర‌స్తుతం ఎలాంటి ట్యాపింగ్ జ‌ర‌గ‌లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత చెబుతున్నారు. తాము ఎలాంటి విచార‌ణ‌కైనా సిద్ధంగా ఉన్నామ‌ని ఆమె వివ‌రించారు.


ప్రభుత్వాలే కాదు ప్రయివేటు వాళ్లూ 

అయితే, కొన్నిసార్లు ప్రైవేటు వ్య‌క్తులు, సంస్థ‌లు కూడా నిఘా పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను ఉప‌యోగిస్తుంటాయి.

2001 నుంచి 2006 మ‌ధ్య కాలంలో ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త‌లైన ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీల‌తోపాటు రాజ‌కీయ నాయ‌కులైన పీయూష్ గోయ‌ల్‌, ప్ర‌మోద్ మ‌హాజ‌న్ లాంటి ప్ర‌ముఖుల ఫోన్ల‌ను కార్పొరేట్ దిగ్గ‌జం ఎస్సార్ ట్యాప్ చేసిన‌ట్లు ఇటీవ‌ల ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

మ‌రోవైపు ఈ ట్యాపింగ్ 11ఏళ్ల‌పాటు కొన‌సాగింద‌ని అవుట్‌లుక్ కూడా ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

కొన్ని ప్రైవేటు సంస్థ‌లు, ప్రైవేటు డిటెక్టివ్‌లు, కంప్యూట‌ర్ హ్యాక‌ర్లూ.. స‌ర్వైలెన్స్ స‌ర్వీసుల‌ పేరుతో ఫోన్ ట్యాపింగ్‌లు చేస్తున్నారు. కొంద‌రైతే ఎన్‌క్రిప్టెడ్‌ వాట్సాప్ మెసేజ్‌ల‌నూ డీ కోడ్ చేయ‌గ‌ల‌మ‌ని చెబుతున్నారు

2013లో బెంగ‌ళూరుకు చెందిన ప్రైవేటు డిటెక్టివ్‌, సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఇలానే అరెస్టు అయ్యారు. ఆయ‌న ఓ ప్ర‌త్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో వంద‌ల మందిపై నిఘా పెట్టారు. ఫోన్‌కాల్స్‌తోపాటు వ్య‌క్తిగ‌త స‌మాచారం స‌ర్వ‌ర్ల‌కు ఈ సాఫ్ట్‌వేర్ చేర‌వేసేది.

ఆయ‌న సేవ‌లు వినియోగించుకున్న వారిలో పారిశ్రామిక వేత్త‌ల నుంచి సామాన్యుల వ‌ర‌కూ ఉన్న‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

ఇండియ‌న్ టెలిగ్రాఫ్ చ‌ట్టంలో సెక్ష‌న్ 26 (బి) ప్ర‌కారం.. ఫోన్ ట్యాపింగ్‌కు గ‌రిష్ఠంగా మూడేళ్ల వ‌ర‌కూ జైలు శిక్ష విధిస్తారు. అంతేకాదు త‌మ ప్రైవ‌సీ హ‌క్కును ఉల్లంఘించార‌ని కోరుతూ బాధితులు మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ను కూడా ఆశ్ర‌యించొచ్చు.


మీ ఫోన్ ట్యాప్ అయిందో లేదో స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా తెలుసుకోవచ్చు

మ‌రోవైపు మ‌న ఫోన్‌ను ఎవ‌రైనా ట్యాపింగ్ చేస్తున్నార‌ని అనుమానం వ‌స్తే టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌)ను అడిగి స‌మాచారం .

"ఈ విషంపై 2018లో ట్రాయ్‌కు దిల్లీ హైకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేసింది. ఏదైనా ప్ర‌భుత్వ సంస్థ అయినా స‌రే త‌మ కాల్స్‌ను ఇంట‌ర్‌సెప్ట్ చేస్తే.. ఆ విష‌యాన్ని అర్జీ పెట్టుకున్న వ్య‌క్తికి తెలియ‌జేయాల‌ని కోర్టు సూచించింది".

"దీని కోసం స‌మాచార హ‌క్కు కింద మనం ట్రాయ్‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. వెంట‌నే ట్రాయ్ సంబంధిత టెలికాం ఆప‌రేట‌ర్ నుంచి స‌మాచారాన్ని తీసుకుని మ‌న‌కు పంపిస్తుంది".

"ట్రాయ్ ఇచ్చిన స‌మాచారాన్ని విశ్లేషించి ఏమైనా త‌ప్పు జ‌రిగిన‌ట్లు అనిపిస్తే మ‌నం నేరుగా కోర్టును ఆశ్ర‌యించొచ్చు".

Read Our Exclusives:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి