IndiraGandhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
IndiraGandhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, అక్టోబర్ 2019, గురువారం

ఇందిరాగాంధీనే పార్టీ నుంచి బహిష్కరించిన ఏపీ మాజీ సీఎం



ఎమర్జెన్సీ తరువాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి అదే తొలి ఓటమి. ఆ ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ నిలువునా చీలిపోయింది. ఇందిరాగాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు. 1977 లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, పశ్చిమబెంగాల్‌కు చెందిన నేత సిద్ధార్థ శంకర్ రే పోటీ పడ్డారు. కాసునే విజయం వరించి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఆ తరువాత పార్టీని మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నాలు చేశారాయన. ఆ క్రమంలో ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఇందిర తనవర్గంతో కలిసి సొంత కుంపటి పెట్టుకున్నారు.
దాంతో 1978 జనవరి 1న ఇందిరను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అప్పటి అధ్యక్షుడు కాసు బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. ఆ సమయంలో వైబీ చవాన్, వసంత్ దాదా పాటిల్, స్వరణ్ సింగ్ వంటివారంతా బ్రహ్మానందరెడ్డి వెంట నిలిచారు. 'ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర' అన్న డీకే బారువా కూడా బ్రహ్మానందరెడ్డికే మద్దతు పలికారు. అయితే, ఇందిర వర్గం ఏమీ వెనక్కి తగ్గలేదు. వీసీ శుక్లా, బన్సీ లాల్, అంబికా సోనీ, కరణ్ సింగ్, డీకే బారువా వంటివారు తనతో లేకున్నా బూటా సింగ్, ఏపీ శర్మ, జీకే మూపనార్, బుద్ధప్రియ మౌర్య వంటి కొత్త అనుకూల వర్గంతో ఇందిర తన 'ఇందిరా కాంగ్రెస్' వైపు నేతలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు.బూటా సింగ్ కొందరు నేతలను వెంటబెట్టుకుని కాసు బ్రహ్మానందరెడ్డి ఇంటికి వెళ్లి 'నెహ్రూ కుమార్తెనే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తావా' అంటూ నిలదీశారు. ఆ సంగతి మళ్లీ ఇందిరకు చెప్పగా.. 'ఎంతైనా ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అమర్యాదకరంగా మాట్లాడడం సరికాదు' అని బూటాసింగ్‌ను మందలించారని రషీద్ కిద్వాయి తన '24 అక్బర్ రోడ్' పుస్తకంలో పేర్కొన్నారు.
బహిష్కరణ మరునాడే అంటే జనవరి 2న ఇందిర గాంధీ కాంగ్రెస్(ఐ) అనే పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. 153 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 66 మంది మద్దతు కూడా ఇందిరకు లభించలేదు.అంతేకాదు, ఆమె తన కొత్త పార్టీకి కొత్త ఆఫీసు కూడా వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. పార్టీ గుర్తయిన 'ఆవు - దూడ' చిహ్నాన్ని కూడా ఆమె కోల్పోవాల్సి వచ్చింది. అత్యధిక మంది మద్దతు తమకే ఉన్నందున 'ఆవు, దూడ' గుర్తు తమకే చెందాలంటూ కాంగ్రెస్(ఐ) తరఫున బూటా సింగ్ ఎలక్షన్ కమిషన్‌ను కోరారు. కానీ, బ్రహ్మానందరెడ్డి వర్గం నుంచి అభ్యంతరాలు ఉండడం, ఆ గుర్తుకే తమకే చెందాలని వారు కూడా పట్టుపట్టడంతో ఎలక్షన్ కమిషన్ అప్పటికి ఆ గుర్తును ఎవరికీ కేటాయించకుండా నిలిపివేసింది. మరోవైపు, ఇందిర వర్గం చీలిపోయిన తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని 'రెడ్డి కాంగ్రెస్'గా పిలిచేవారు.  అటు రెడ్డి కాంగ్రెస్, ఇటు ఇందిరా కాంగ్రెస్ ఎవరికి వారు పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేశారు. బూటాసింగ్, ఏపీ శర్మ, మూపనార్ వంటి ఇందిర నమ్మకస్థులంతా ఆమెకు మద్దతుగా 700 మందికిపైగా ఉన్న ఏఐసీసీ సభ్యుల సంతకాలను సేకరించేందుకు దేశ వ్యాప్త యాత్ర మొదలుపెట్టారు. లఖ్‌నవూ, జైపూర్, పట్నా, భోపాల్, ముంబయి, జమ్ము, శ్రీనగర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, తిరువనంతపురం, బెంగళూరు సహా పలు ఇతర రాజధాని నగరాల్లో వారికి మంచి మద్దతు లభించింది.
కాంగ్రెస్ పార్టీ గుర్తు 'ఆవు, దూడ'ను ఎలక్షన్ కమిషన్ నిలిపివేయడంతో కాంగ్రెస్(ఐ)కి కొత్త గుర్తు ఎంచుకోమని సూచించింది ఎలక్షన్ కమిషన్. అప్పటికి ఇందిరాగాంధీ పీవీ నరసింహారావుతో కలిసి విజయవాడలో పర్యటిస్తున్నారు. గుర్తు ఎంచుకోమని ఎలక్షన్ కమిషన్ బూటా సింగ్ ముందు మూడు ఆప్షన్లు ఉంచింది.ఆ మూడు ఏనుగు, సైకిల్, హస్తం. అందులో హస్తం అయితే బాగుంటుందని భావించి ఇందిర ఆమోదం కోసం విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీకి ట్రంక్ కాల్ చేస్తారు బూటాసింగ్. లైన్లన్నీ అస్పష్టంగా ఉన్నాయి.. బూటాసింగ్ చెబుతున్నది ఇందిరకు స్పష్టంగా వినిపించలేదు. ఆ సమయంలో ఎంతో గందరగోళం చోటుచేసుకుంది. బూటాసింగ్ హాత్(హస్తం) అని చెబుతుంటే.. ఇందిరకు అది హాథీ(ఏనుగు) అన్నట్లుగా వినిపించింది. దాంతో ఆమె వద్దని చెప్పారు. ఆ సంగతి అర్థం చేసుకున్న బూటాసింగ్... ఏనుగు కాదు హస్తం అని వివరిస్తున్నా ఫోన్ లైన్ అస్పష్టంగా ఉండడం, బూటాసింగ్ స్వరం కూడా బాగా బొంగురుగా ఉండడంతో ఇందిరకు ఏమీ అర్థం కాలేదు. దాంతో ఆమె ఫోన్ రిసీవర్‌ను పక్కనే ఉన్న పీవీ నరసింహరావుకు ఇచ్చారు.బహు భాషా కోవిదుడైన పీవీకి వెంటనే విషయం అర్థమైంది. బూటా చెబుతున్నది అర్థం చేసుకున్న ఆయన హాథీ, హాత్ అనే పదాల మధ్య పోలిక వల్ల గందరగోళం తలెత్తిందని అర్థం చేసుకుని వెంటనే హస్తానికి ప్రత్యాయపదం సూచించి ఇందిరకు ఆ మాట చెప్పమంటారు. ''బూటా సింగ్‌జీ పంజా కహియే పంజా''(బూటాసింగ్ గారూ.. పంజా అని చెప్పండి పంజా) అని పీవీ సూచించడంతో ఇందిర వెంటనే రిసీవర్ అందుకుని ''ఆ గుర్తు బాగుంటుంది.. అదే ఖాయం చేయండి'' అని చెప్తారు. ఇలా కాంగ్రెస్(ఐ)కి హస్తం గుర్తు వచ్చిందని ఆనాటి పరిణామాలను రషీద్ కిద్వాయి తన '24 అక్బర్ రోడ్' పుస్తకంలో రాసుకొచ్చారు.

హస్తం గుర్తు చాలామంది నేతలకు నచ్చలేదు. ట్రాఫిక్ పోలీస్‌ చేతిని చూపించినట్లుగా ఇదేం గుర్తన్న విమర్శలు వచ్చాయి. కానీ, ఇందిర మాత్రం ఈ కొత్త గుర్తుపై సంతోషించారట. అందుకు కారణం, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆవు, దూడ గుర్తును ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ‌లతో పోల్చి విపక్షాలు విమర్శలు కురిపించాయి.ఈ కొత్త గుర్తుతో ఆ బాధ తప్పిందని ఇందిర సంతోషించారట. ఇందిర గాంధీ కొత్త కాంగ్రెస్‌కు బలం చేకూరాక ఇక పార్టీ ఆఫీసు ఏర్పాటు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకోసం పార్టీకి చెందిన వివిధ నేతల ఇళ్లను పరిశీలనలోకి తీసుకున్నారు. కానీ, ఏదీ అంత అనుకూలంగా కనిపించలేదు. 3 జనపథ్‌లో ఎం.చంద్రశేఖర్ ఇల్లు.. ఆ తరువాత పండిట్ కమలాపతి త్రిపాఠీ ఇల్లు పరిశీలించారు. కానీ, వివిధ కారణాల వల్ల వాటినీ వద్దనుకున్నారు. ఆ సమయంలో జి.వెంకటస్వామి నివసిస్తున్న 24 అక్బర్ రోడ్ ఇల్లు బూటాసింగ్ దృష్టికొచ్చింది. లోక్‌సభ ఎంపీగా ఉన్న వెంకటస్వామి అప్పటికి ఒంటరిగా అక్కడ నివసిస్తున్నారు. అప్పటికి అవివాహితుడైన వెంకటస్వామి ఇల్లు ఎంతోమంది యువజన కాంగ్రెస్ నేతలకు ఆశ్రయంగా ఉండేది. 10 జనపథ్‌‌లో అగ్రనేతలను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారందరికీ 24 అక్బర్ రోడ్‌లోని వెంకటస్వామి ఇల్లు అడ్డాగా ఉండేది.  అక్కడ 'ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఇందిర)' అనే బోర్డు ఏర్పాటు చేయడంతో వెంకటస్వామి ఇల్లు అలా కాంగ్రెస్(ఐ) కార్యాలయంగా మారిందని '24 అక్బర్ రోడ్' పుస్తకంలో కిద్వాయి రాసుకొచ్చారు.

1978లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగ్గా మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్(ఐ) మంచి విజయం సాధించింది. బ్రహ్మానందరెడ్డి వర్గం ప్రభావం చూపలేకపోయింది. దీంతో కొద్దికాలానికే కాసు బ్రహ్మానందరెడ్డి తన నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్(ఆర్)ను కాంగ్రెస్(ఐ)లో విలీనం చేశారు. అనంతరం ఇందిర నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 1980 లోక్‌సభ ఎన్నికల్లో 351 సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కాసు బ్రహ్మానంద రెడ్డి అంతకుముందు 1964 నుంచి 1971 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.