17, మార్చి 2020, మంగళవారం

దేశవ్యాప్తంగా స్కూల్స్ బంద్


దేశవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) కేసులు 123కు చేరుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి ఈయూ దేశాలు, బ్రిటన్, టర్కీపై ట్రావెల్ బ్యాన్ చేసి ప్రయాణికులు రాకుండా కేంద్రం నిషేధం విధించింది. ఈ నెల 31 వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించింది. అంతేకాకుండా ఈ వైరస్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన కూడా జారీ చేసింది. మార్చి 31 వరకూ దేశవ్యాప్తంగా స్కూళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్, షాపింగ్‌మాల్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీలైనంత వరకూ అన్ని రంగాల ఉద్యోగులూ ఇండ్ల నుంచే పని చేయడం మంచిదని సూచనలు జారీ చేసింది. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని తెలిపింది. వ్యక్తి వ్యక్తికి కనీసం ఒక మీటర్ దూరం ఉండే విధంగా చూసుకోవాలని సూచించింది. ఒకేచోట 50 మంది కంటే ఎక్కువగా గుమిగూడొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

16, మార్చి 2020, సోమవారం

కరోనా వైరస్ Coronavirus మనిషిని ఎలా చంపుతుంది?


కరోనా వైరస్ పేరు చెబితేనే చాలు ప్రజలు గడగగడలాడుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది చనిపోయారు. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ కరోనా వైరస్.. ఇది మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.. దీనివల్ల మనుషులు ఎలా చనిపోతున్నారు.. దీనికి చికిత్స చేయడం ఎలా అనేది చూద్దాం..

కరోనా మనిషి శరీరంలో చేరిన తరువాత వివిధ దశల్లో అది ఆ శరీరాన్ని పీల్చిపిప్పి చేయడానికి ప్రయత్నిస్తుంది.

ఇంక్యుబేషన్ పీరియడ్

వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తన పట్టును పెంచుకునే సమయం ఇది. వైరస్‌లు.. మన శరీర నిర్మాణంలోని కణాలలోకి వెళ్లి, వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి. కొత్త కరోనావైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు. మనం ఈ వైరస్‌ను స్వాసలోకి పీల్చినపుడు (ఇది సోకిన వారు ఎవరైనా మనకు దగ్గరగా ఉండి దగ్గినపుడు), లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు ఇది మన శరీరంలోకి చొరబడుతుంది. మొదట మన గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి ఇది వ్యాపిస్తుంది. వాటిని 'కరోనావైరస్ కర్మాగారాలు'గా మార్చేస్తుంది. అంటే.. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి ఉప్పెనలా మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది.
ఇది ప్రాధమిక దశ. ఈ దశలో మనం జబ్బుపడం. అసలు కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.
ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ - అంటే వైరస్ తొలుత సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం - ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే.. ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంది.

మైల్డ కేసెస్.. 

చాలామందిలో కరోనా వైరస్ ఈ స్టేజ్‌లోనే తగ్గిపోతుంది. కోవిడ్-19 వ్యాధి వచ్చిన ప్రతి 10 మందిలో ఎనిమిది మందికి స్వల్ప ఇన్‌ఫెక్షన్‌గానే ఉంటుంది. ప్రధాన లక్షణాలు జ్వరం, దగ్గు. ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి వంటివి కూడా రావచ్చు. తప్పనిసరిగా వస్తాయనేమీ లేదు. జ్వరం రావటానికి, నలతగా ఉన్నట్లు అనిపించటానికి కారణం.. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌కు ప్రతి స్పందించటమే. శరీరంలో ప్రవేశించిన వైరస్‌ను దాడి చేసిన శత్రువుగా మన రోగనిరోధక వ్యవస్థ గుర్తించి.. ఏదో తేడా ఉందంటూ కైటోకైన్లు అనే రసాయనాలను విడుదల చేయటం ద్వారా శరీరంలోని మిగతా భాగమంతటికీ సంకేతాలు పంపిస్తుంది.
నిజానికి ఈ కైటోకైన్లు మన రోగనిరోధక వ్యవస్థలో భాగం. కానీ దీనివల్ల ఒళ్లు నొప్పులు, జ్వరం వస్తాయి.కరోనావైరస్ వల్ల వచ్చే దగ్గు ఆరంభంలో పొడిగా ఉంటుంది. అంటే తెమడ వంటిదేమీ రాదు. వైరస్ సోకినపుడు కణాల్లో కలిగే అలజడి బహుశా దీనికి కారణం కావచ్చు.
కొన్ని రోజులు గడిచిన తర్వాత కొందరిలో దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంది. వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటకు వస్తాయి.
ఈ లక్షణాలకు.. శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ.. ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం, పారాసెటమాల్ మందులతో చికిత్స అందిస్తారు. ప్రత్యేకమైన ఆస్పత్రి చికిత్స అవసరం ఉండదు.
ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సమయానికి చాలా మంది కోలుకుంటారు. ఎందుకంటే.. వారిలోని రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడి దానిని తరిమేస్తుంది.
అయితే.. కొంతమందిలో కోవిడ్-19 వ్యాధి మరింతగా ముదురుతుంది. ఈ దశలో ముక్కు కారటం వంటి జలుబు వంటి లక్షణాలు కూడా రావచ్చని ఇప్పుడిప్పుడే పలు అధ్యయనాల్లో తెలుస్తోంది.

వ్యాధి ముదిరితే..

 వ్యాధి ముదిరిందంటే.. దానికి కారణం మన రోగనిరోధక వ్యవస్థ - వైరస్ మీద పోరాడటానికి అతిగా ప్రతిస్పందించటం.
రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని మిగతా భాగానికి పంపించే రసాయన సంకేతాలైన కైటోకైన్ల వల్ల వాపు రావచ్చు. దీంట్లో సున్నితంగా సంతులనం సాధించాల్సి ఉంటుంది. వాపు విపరీతంగా పెరిగినట్లయితే శరీరమంతటా చాలా నష్టం జరగవచ్చు.
ఊపిరితిత్తుల వాపును న్యుమోనియా అని పిలుస్తారు.
ఈ ఊపిరితిత్తులు రెండు చిన్న పాటి గాలి సంచుల్లా ఉంటాయి. మన శ్వాసప్రక్రియలో.. ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశించటం, కార్బన్‌డయాక్సైడ్ వెలుపలికి రావటం జరిగేది ఈ ఊపిరితిత్తుల్లోనే. కానీ న్యూమోనియా వచ్చినపుడు.. ఈ గాలి సంచులు నీటితో నిండిపోవటం మొదలవుతుంది. దీనిఫలితంగా శ్వాస తీసుకోవటం ఇబ్బందికరంగా మారుతూ వస్తుంది. చివరికి చాలా కష్టమవుతుంది.
కొంతమందికి శ్వాస అందించటానికి వెంటిలేటర్ (కృత్రిమ శ్వాస పరికరం) అవసరమవుతుంది.
చైనా నుంచి అందిన సమాచారం ఆధారంగా చూస్తే.. కరోనావైరస్ సోకిన వారిలో సుమారు 14 శాతం మంది ఈ దశకు చేరుతున్నట్లు భావిస్తున్నారు.


విషమించిన వ్యాధి

మొత్తం మీద ఆరు శాతం కేసుల్లో విషమంగా జబ్బుపడుతున్నట్లు అంచనా. ఈ దశకు వచ్చేసరికి.. శరీరం విఫలమవటం మొదలవుతుంది. మరణం సంభవించే అవకాశం అధికం. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పిపోతూ.. శరీరమంతటినీ పాడుచేస్తుండటం ఇక్కడ సమస్య.
దీనివల్ల 'సెప్టిక్ షాక్' సంభవించవచ్చు. అంటే.. రక్తపోటు ప్రమాదకరస్థాయిలో పడిపోయి, అంతర్గత అవయవాలు సరిగ్గా పనిచేయటం ఆగిపోయి చివరికి పూర్తిగా విఫలమవుతాయి.
ఊపిరితిత్తుల్లో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వాపు వల్ల.. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ తలెత్తుతుంది. అంటే శ్వాసప్రక్రియ దాదాపుగా ఆగిపోయి.. శరీర మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందకుండా పోతుంది. ఆక్సిజన్ అందకపోతే.. శరీరంలోని కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయలేవు. పేగులు దెబ్బతింటాయి.
ఈ వైరస్ ఎంత భారీగా వాపు సంభవిస్తుందంటే.. దానివల్ల శరీరంలోని అనేక అవయవాలు విఫలమై మరణం సంభవిస్తుంది. వైరస్‌ను రోగ నిరోధక వ్యవస్థ అదుపులోకి తేలేకపోయినట్లయితే.. ఆ వైరస్ శరీరంలోని ప్రతి మూలకూ విస్తరిస్తుంది. దానివల్ల మరింత విధ్వంసం జరుగుతుంది.
ఈ దశలో చికిత్స అందించటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈసీఎంఓ - ఎక్స్‌ట్రా-కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ కూడా చేయాల్సి రావచ్చు.
అంటే.. కృత్రిమ ఊపిరితిత్తులు శరీరంలోని రక్తాన్ని ట్యూబుల ద్వారా బయటకు తీసి, దానికి ఆక్సిజన్ అందించి మళ్లీ శరీరంలోకి పంపిస్తుంది.
కానీ.. చివరికి శరీరంలో అంతర్గత విధ్వంసం ప్రాణాంతక స్థాయికి చేరవచ్చు.. అప్పుడు అంతర్గత అవయవాలు ఇక శరీరాన్ని సజీవంగా ఉంచలేవు.

మరణాలు...

తాము శాయశక్తులా ప్రయత్నించినా కూడా కొంతమంది పేషెంట్లు ఎలా చనిపోయారనేది డాక్టర్లు వివరించారు.
చైనాలోని ఉహాన్‌లో గల జిన్‌యిన్‌టాన్ హాస్పిటల్‌లో చనిపోయిన మొదటి ఇద్దరు రోగులు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ.. వారు దీర్ఘకాలంగా ధూమపానం చేస్తున్నారని, దానివల్ల వారి ఊపిరితిత్తులు దెబ్బతిని ఉంటాయని.. లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో వివరించారు.
మృతుల్లో మొదటి వ్యక్తి వయసు 61 సంవత్సరాలు. ఆయన ఆస్పత్రికి వచ్చేటప్పటికే న్యుమోనియా తీవ్రంగా పెరిగింది. ఆయనకు వెంటిలేటర్ ద్వారా శ్వాస అందించినప్పటికీ.. ఊపిరితిత్తులు విఫలమయ్యాయి. అతడి గుండె కొట్టుకోవటం ఆగిపోయింది.
ఆస్పత్రిలో చేర్చిన 11 రోజుల తర్వాత అతడు చనిపోయాడు.
మృతుల్లో రెండో వ్యక్తి వయసు 69 సంవత్సరాలు. ఆయనకు కూడా అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ తలెత్తింది.
ఆయనకు ఈసీఎంఓ మెషీన్ (కృత్రిమ ఊపిరితిత్తులు) ఉపయోగించినా కూడా సరిపోలేదు. ఆయన తీవ్రమైన న్యుమోనియాతో పాటు, రక్తపోటు పడిపోవటంతో సెప్టిక్ షాక్ వల్ల చనిపోయాడు.

కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు


కరోనా వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది.
వీటిలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, ఆహార జాగ్రత్తలు ఉన్నాయి.
శ్వాస ఇబ్బందులు ఎదుర్కుంటున్న రోగులకు దగ్గరగా ఉండకూడదని సూచించారు.
తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని, ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలని చెప్పింది.
పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలని సూచించింది.
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌ వచ్చినవారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది.
అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.

కరోనా వైరస్ లక్షణాలు


కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది.
శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు.
కానీ కరోనా కుటుంబానికే చెందిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), మర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వంటి కొన్ని వైరస్‌లు చాలా ప్రమాదకరం.
వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్‌కు 'నావెల్ కరోనా వైరస్ లేదా nCoV'అని పేరు పెట్టారు.
ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. దీనిని ఇంతకు ముందు వరకూ మనుషుల్లో గుర్తించలేదు.
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల వల్ల ఇది జ్వరంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తర్వాత పొడి దగ్గు తీవ్రంగా ఉంటుంది.
వారం వరకూ అదే పరిస్థితి కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి.
కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది.
కిడ్నీలు ఫెయిలై రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు.
ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు.
ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులకు డాక్టర్లు ప్రస్తుతం వారి లక్షణాల ఆధారంగా చికిత్సలు అందిస్తున్నారు.