31, అక్టోబర్ 2019, గురువారం

ఇందిరాగాంధీనే పార్టీ నుంచి బహిష్కరించిన ఏపీ మాజీ సీఎం



ఎమర్జెన్సీ తరువాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి అదే తొలి ఓటమి. ఆ ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ నిలువునా చీలిపోయింది. ఇందిరాగాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు. 1977 లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, పశ్చిమబెంగాల్‌కు చెందిన నేత సిద్ధార్థ శంకర్ రే పోటీ పడ్డారు. కాసునే విజయం వరించి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఆ తరువాత పార్టీని మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నాలు చేశారాయన. ఆ క్రమంలో ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఇందిర తనవర్గంతో కలిసి సొంత కుంపటి పెట్టుకున్నారు.
దాంతో 1978 జనవరి 1న ఇందిరను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అప్పటి అధ్యక్షుడు కాసు బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. ఆ సమయంలో వైబీ చవాన్, వసంత్ దాదా పాటిల్, స్వరణ్ సింగ్ వంటివారంతా బ్రహ్మానందరెడ్డి వెంట నిలిచారు. 'ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర' అన్న డీకే బారువా కూడా బ్రహ్మానందరెడ్డికే మద్దతు పలికారు. అయితే, ఇందిర వర్గం ఏమీ వెనక్కి తగ్గలేదు. వీసీ శుక్లా, బన్సీ లాల్, అంబికా సోనీ, కరణ్ సింగ్, డీకే బారువా వంటివారు తనతో లేకున్నా బూటా సింగ్, ఏపీ శర్మ, జీకే మూపనార్, బుద్ధప్రియ మౌర్య వంటి కొత్త అనుకూల వర్గంతో ఇందిర తన 'ఇందిరా కాంగ్రెస్' వైపు నేతలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు.బూటా సింగ్ కొందరు నేతలను వెంటబెట్టుకుని కాసు బ్రహ్మానందరెడ్డి ఇంటికి వెళ్లి 'నెహ్రూ కుమార్తెనే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తావా' అంటూ నిలదీశారు. ఆ సంగతి మళ్లీ ఇందిరకు చెప్పగా.. 'ఎంతైనా ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అమర్యాదకరంగా మాట్లాడడం సరికాదు' అని బూటాసింగ్‌ను మందలించారని రషీద్ కిద్వాయి తన '24 అక్బర్ రోడ్' పుస్తకంలో పేర్కొన్నారు.
బహిష్కరణ మరునాడే అంటే జనవరి 2న ఇందిర గాంధీ కాంగ్రెస్(ఐ) అనే పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. 153 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 66 మంది మద్దతు కూడా ఇందిరకు లభించలేదు.అంతేకాదు, ఆమె తన కొత్త పార్టీకి కొత్త ఆఫీసు కూడా వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. పార్టీ గుర్తయిన 'ఆవు - దూడ' చిహ్నాన్ని కూడా ఆమె కోల్పోవాల్సి వచ్చింది. అత్యధిక మంది మద్దతు తమకే ఉన్నందున 'ఆవు, దూడ' గుర్తు తమకే చెందాలంటూ కాంగ్రెస్(ఐ) తరఫున బూటా సింగ్ ఎలక్షన్ కమిషన్‌ను కోరారు. కానీ, బ్రహ్మానందరెడ్డి వర్గం నుంచి అభ్యంతరాలు ఉండడం, ఆ గుర్తుకే తమకే చెందాలని వారు కూడా పట్టుపట్టడంతో ఎలక్షన్ కమిషన్ అప్పటికి ఆ గుర్తును ఎవరికీ కేటాయించకుండా నిలిపివేసింది. మరోవైపు, ఇందిర వర్గం చీలిపోయిన తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని 'రెడ్డి కాంగ్రెస్'గా పిలిచేవారు.  అటు రెడ్డి కాంగ్రెస్, ఇటు ఇందిరా కాంగ్రెస్ ఎవరికి వారు పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేశారు. బూటాసింగ్, ఏపీ శర్మ, మూపనార్ వంటి ఇందిర నమ్మకస్థులంతా ఆమెకు మద్దతుగా 700 మందికిపైగా ఉన్న ఏఐసీసీ సభ్యుల సంతకాలను సేకరించేందుకు దేశ వ్యాప్త యాత్ర మొదలుపెట్టారు. లఖ్‌నవూ, జైపూర్, పట్నా, భోపాల్, ముంబయి, జమ్ము, శ్రీనగర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, తిరువనంతపురం, బెంగళూరు సహా పలు ఇతర రాజధాని నగరాల్లో వారికి మంచి మద్దతు లభించింది.
కాంగ్రెస్ పార్టీ గుర్తు 'ఆవు, దూడ'ను ఎలక్షన్ కమిషన్ నిలిపివేయడంతో కాంగ్రెస్(ఐ)కి కొత్త గుర్తు ఎంచుకోమని సూచించింది ఎలక్షన్ కమిషన్. అప్పటికి ఇందిరాగాంధీ పీవీ నరసింహారావుతో కలిసి విజయవాడలో పర్యటిస్తున్నారు. గుర్తు ఎంచుకోమని ఎలక్షన్ కమిషన్ బూటా సింగ్ ముందు మూడు ఆప్షన్లు ఉంచింది.ఆ మూడు ఏనుగు, సైకిల్, హస్తం. అందులో హస్తం అయితే బాగుంటుందని భావించి ఇందిర ఆమోదం కోసం విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీకి ట్రంక్ కాల్ చేస్తారు బూటాసింగ్. లైన్లన్నీ అస్పష్టంగా ఉన్నాయి.. బూటాసింగ్ చెబుతున్నది ఇందిరకు స్పష్టంగా వినిపించలేదు. ఆ సమయంలో ఎంతో గందరగోళం చోటుచేసుకుంది. బూటాసింగ్ హాత్(హస్తం) అని చెబుతుంటే.. ఇందిరకు అది హాథీ(ఏనుగు) అన్నట్లుగా వినిపించింది. దాంతో ఆమె వద్దని చెప్పారు. ఆ సంగతి అర్థం చేసుకున్న బూటాసింగ్... ఏనుగు కాదు హస్తం అని వివరిస్తున్నా ఫోన్ లైన్ అస్పష్టంగా ఉండడం, బూటాసింగ్ స్వరం కూడా బాగా బొంగురుగా ఉండడంతో ఇందిరకు ఏమీ అర్థం కాలేదు. దాంతో ఆమె ఫోన్ రిసీవర్‌ను పక్కనే ఉన్న పీవీ నరసింహరావుకు ఇచ్చారు.బహు భాషా కోవిదుడైన పీవీకి వెంటనే విషయం అర్థమైంది. బూటా చెబుతున్నది అర్థం చేసుకున్న ఆయన హాథీ, హాత్ అనే పదాల మధ్య పోలిక వల్ల గందరగోళం తలెత్తిందని అర్థం చేసుకుని వెంటనే హస్తానికి ప్రత్యాయపదం సూచించి ఇందిరకు ఆ మాట చెప్పమంటారు. ''బూటా సింగ్‌జీ పంజా కహియే పంజా''(బూటాసింగ్ గారూ.. పంజా అని చెప్పండి పంజా) అని పీవీ సూచించడంతో ఇందిర వెంటనే రిసీవర్ అందుకుని ''ఆ గుర్తు బాగుంటుంది.. అదే ఖాయం చేయండి'' అని చెప్తారు. ఇలా కాంగ్రెస్(ఐ)కి హస్తం గుర్తు వచ్చిందని ఆనాటి పరిణామాలను రషీద్ కిద్వాయి తన '24 అక్బర్ రోడ్' పుస్తకంలో రాసుకొచ్చారు.

హస్తం గుర్తు చాలామంది నేతలకు నచ్చలేదు. ట్రాఫిక్ పోలీస్‌ చేతిని చూపించినట్లుగా ఇదేం గుర్తన్న విమర్శలు వచ్చాయి. కానీ, ఇందిర మాత్రం ఈ కొత్త గుర్తుపై సంతోషించారట. అందుకు కారణం, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆవు, దూడ గుర్తును ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ‌లతో పోల్చి విపక్షాలు విమర్శలు కురిపించాయి.ఈ కొత్త గుర్తుతో ఆ బాధ తప్పిందని ఇందిర సంతోషించారట. ఇందిర గాంధీ కొత్త కాంగ్రెస్‌కు బలం చేకూరాక ఇక పార్టీ ఆఫీసు ఏర్పాటు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకోసం పార్టీకి చెందిన వివిధ నేతల ఇళ్లను పరిశీలనలోకి తీసుకున్నారు. కానీ, ఏదీ అంత అనుకూలంగా కనిపించలేదు. 3 జనపథ్‌లో ఎం.చంద్రశేఖర్ ఇల్లు.. ఆ తరువాత పండిట్ కమలాపతి త్రిపాఠీ ఇల్లు పరిశీలించారు. కానీ, వివిధ కారణాల వల్ల వాటినీ వద్దనుకున్నారు. ఆ సమయంలో జి.వెంకటస్వామి నివసిస్తున్న 24 అక్బర్ రోడ్ ఇల్లు బూటాసింగ్ దృష్టికొచ్చింది. లోక్‌సభ ఎంపీగా ఉన్న వెంకటస్వామి అప్పటికి ఒంటరిగా అక్కడ నివసిస్తున్నారు. అప్పటికి అవివాహితుడైన వెంకటస్వామి ఇల్లు ఎంతోమంది యువజన కాంగ్రెస్ నేతలకు ఆశ్రయంగా ఉండేది. 10 జనపథ్‌‌లో అగ్రనేతలను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారందరికీ 24 అక్బర్ రోడ్‌లోని వెంకటస్వామి ఇల్లు అడ్డాగా ఉండేది.  అక్కడ 'ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఇందిర)' అనే బోర్డు ఏర్పాటు చేయడంతో వెంకటస్వామి ఇల్లు అలా కాంగ్రెస్(ఐ) కార్యాలయంగా మారిందని '24 అక్బర్ రోడ్' పుస్తకంలో కిద్వాయి రాసుకొచ్చారు.

1978లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగ్గా మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్(ఐ) మంచి విజయం సాధించింది. బ్రహ్మానందరెడ్డి వర్గం ప్రభావం చూపలేకపోయింది. దీంతో కొద్దికాలానికే కాసు బ్రహ్మానందరెడ్డి తన నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్(ఆర్)ను కాంగ్రెస్(ఐ)లో విలీనం చేశారు. అనంతరం ఇందిర నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 1980 లోక్‌సభ ఎన్నికల్లో 351 సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కాసు బ్రహ్మానంద రెడ్డి అంతకుముందు 1964 నుంచి 1971 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్: వన్ మ్యాన్ ఆర్మీ


పూర్తి పేరు: వల్లభ్‌భాయ్‌ జవేరీభాయ్‌ పటేల్‌
పుట్టిన తేదీ: 1875 అక్టోబరు 31
తల్లిదండ్రులు: లాడ్‌భాయి, జవేరీభాయ్‌.
జన్మస్థలం: నడియాద్‌, గుజరాత్‌
* 1893లో 18ఏళ్ల వయసులోనే జవేర్బాను పటేల్‌ పెళ్లి చేసుకున్నారు.
* 1901 నుంచి గోద్రా జిల్లా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు.
* 1903లో కుమార్తె మణిబెన్‌, 1905లో కుమారుడు దహ్యాభాయ్‌ జన్మించారు.
* 1910లో మిడిల్‌ టెంపుల్‌ వర్సిటీలో న్యాయవిద్య పై చదువులకు లండన్‌ వెళ్లారు.
* 1914లో క్రిమినల్‌ లాయరుగా అహ్మదాబాద్‌లో ప్రాక్టీస్‌ ప్రారంభించారు.
* 1915లో గుజరాత్‌ సభలో సభ్యుడిగా నియమితులయ్యారు. ముంబయిలో జరిగే భారత జాతీయ కాంగ్రెస్‌ సభలకు ప్రతినిధిగా ఎంపికయ్యారు.
* 1917 జనవరి 5న అహ్మదాబాద్‌ మున్సిపాలిటీలోని దరియాపూర్‌ వార్డు సభ్యుడిగా గెలిచారు. అదే ఆయన రాజకీయ ప్రవేశం.ఈ ఎన్నికను కొందరు సవాలు చేయడంతో రద్దైంది. మే 14న మళ్లీ ఎన్నిక నిర్వహించగా తిరుగులేని విజయం సాధించారు.
* 1931లో భారత జాతీయ కాంగ్రెస్‌కు పోటీ ద్వారా ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.
* 1947లో దేశ విభజనపై జరిగిన సమావేశంలో పాల్గొన్న పటేల్‌ విభజనకు అంగీకరించారు.
* 1950 డిసెంబరు 15న ముంబయిలో తుదిశ్వాస విడిచారు.
* 1991లో భారతరత్న వరించింది.


పట్టుదలకు మారుపేరు ఆయన.. అరువు తెచ్చుకున్న పుస్తకాలతో న్యాయవిద్య చదివి బారిస్టర్‌ ఎట్‌ లా పరీక్షల్లో ప్రథముడిగా నిలిచిన దీక్ష ఆయనది. ఎంతో ఇష్టమైన న్యాయవాద వృత్తిని, భోగభాగ్యాలను త్యజించి స్వాతంత్య్ర పోరాటంలోకి దిగిన యోధుడాయన.  సమైక్య భారత నిర్మాతగా, సుపరిపాలన ప్రణాళికలకు ఆద్యుడిగా నిలిచిన ఆ నాయకుడే సర్దార్ వల్లభాయ్ పటేల్.

చిన్ననాటి నుంచి అదే పట్టుదల

ఉక్కుమనిషిగా గుర్తింపు పొందిన వల్లభాయ్ పటేల్‌ది దృఢ చిత్తం. ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేసేవరకు విశ్రమించని తత్వం ఆయనది.   పట్టుదల, సంకల్పబలం వల్లభ్‌భాయ్‌కు చిన్ననాడే ఒంటబట్టాయి. న్యాయవాద విద్యలో బారిస్టర్‌ కావాలన్నది పటేల్‌ కల. అది నెరవేరాలంటే ఇంగ్లాండ్‌ వెళ్లి బారిస్టర్‌ ఎట్‌ లా చదవాలి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన పటేల్‌కు ఆ ఖర్చును తట్టుకోవడం సాధ్యం కాని పని. కానీ ఆయన పట్టు వదల్లేదు. న్యాయవిద్య చదువుతున్న స్నేహితుడి దగ్గర పుస్తకాలు అరువు తెచ్చుకుని చదువుకున్నారు. నిత్యం కోర్టుకు వెళ్లి న్యాయవాదులు ఎలా వాదిస్తారో చూసి తెలుసుకున్నారు. అలా న్యాయ విద్యను అభ్యసించి గుజరాత్‌లోని గోద్రాలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.

అన్న కోసం త్యాగం

బారిస్టర్‌ చదవడానికి సరిపడా డబ్బు సంపాదించారు. కానీ వెంటనే ఇంగ్లాండ్‌ వెళ్లిపోలేదు. బారిస్టర్‌ కావాలని కలలుగన్న తన అన్న విఠల్‌భాయ్‌ పటేల్‌ను ముందు ఇంగ్లాండ్‌ పంపించారు. ఆయన బారిస్టర్‌ చదువు పూర్తి చేసుకుని వచ్చాకే వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఇంగ్లాండ్‌ బయల్దేరారు. బారిస్టర్‌ ఎట్‌ లా పరీక్షలో ప్రథముడిగా నిలిచి తన కల నిజం చేసుకున్నారు.

గాంధీని కలిశాక మారిన దారి

ఎంతో ఇష్టపడి, చిన్ననాటి నుంచి లక్ష్యంగా పెట్టుకుని బారిస్టర్‌ చదివిన పటేల్‌ న్యాయవాద వృత్తిలో విశేషంగా రాణిస్తున్న సమయంలోనే మహాత్మాగాంధీని కలిశారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ సాగిస్తున్న అహింసాయుత పోరాటంతో స్ఫూర్తి పొందారు. న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి తానూ సంగ్రామంలోకి దూకారు.
మహిళలు ఇచ్చిన బిరుదు సర్దార్
1918లో బ్రిటిష్‌ ప్రభుత్వం గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో భూమిశిస్తును భారీగా పెంచింది. పన్ను తగ్గించేవరకు సహాయ నిరాకరణ చేయాలని గాంధీజీ ప్రజలకు సూచించారు. ఈ ఉద్యమాన్ని నడిపే బాధ్యతను పటేల్‌ భుజస్కంధాలపై పెట్టారు. రైతులను, ముఖ్యంగా రైతు మహిళలను ఏకం చేసి పటేల్‌ పోరాడారు. ‘ఈ ఉద్యమంలో మనకెన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆస్తులు జప్తు చేయొచ్చు. కానీ మనం వెనక్కి తగ్గొద్దు. మన పోరాటమే మనకు శ్రీరామరక్ష’ అని వారిలో ధైర్యం నూరిపోశారు. రైతుల సహాయ నిరాకరణ ఉద్యమ ఉద్ధృతికి బ్రిటిష్‌ ప్రభుత్వం తలొగ్గింది. పన్నుల పెంపును రద్దు చేసింది. దీంతో ఉద్యమ సారథిగా పటేల్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అప్పుడే ఆ ప్రాంత మహిళలు సర్దార్‌ అని పటేల్‌కు బిరుదునిచ్చారు. అదే తర్వాత ఆయనకు ఇంటిపేరయింది. తర్వాత బర్దోలీ ఉద్యమాన్నీ పటేల్‌ ముందుండి నడిపారు.

దేశాన్ని ఏకం చేసిన ఘనుడు

దేశానికి స్వాతంత్ర్యం రావడానికి సమయం దగ్గరపడిన కాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వం ‘విభజించి పాలించు’ సిద్ధాంతంతో దేశాన్ని రెండు ముక్కలు చేసింది. స్వాతంత్య్రం వచ్చిందన్న ఆనందం అనుభవించకముందే విభజనతో భరతజాతిని నిలువునా చీల్చేసింది. కొందరు సంస్థానాదీశులు భారత్‌లో విలీనం కావడానికి అంగీకరించలేదు. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి పెనుసవాలుగా నిలిచిన ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను ప్రధాని నెహ్రూ.. పటేల్‌కు అప్పగించారు. అప్పటికి పటేల్‌ వయసు 72 సంవత్సరాలు. అయినా ఆయన వయోభారాన్ని లెక్క చేయలేదు. సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేసేవరకు విశ్రమించలేదు. సంస్థానాధీశులను ఒప్పించారు. హైదరాబాద్‌ నిజాంలా మొండికెత్తిన వాళ్లకు ముచ్చెమటలు పట్టించారు. మొత్తానికి భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ దేశంగా నిలిపారు.

అఖిల భారత సర్వీసులు ఆయన ఆలోచనే

దేశంలో అతిపెద్ద వర్గంగా ఉన్న రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి స్వాత్రంత్య్ర సంగ్రామంలో ముందుకు నడిపించారు పటేల్‌. విభిన్న కులాలు, మతాలు, వర్గాలను కూడగట్టి పోరాడారు. అయితే స్వరాజ్యం సాధించిన తర్వాత దేశం ముందు నిలిచిన మరో పెద్ద సవాలు.. సురాజ్య స్థాపన. అంటే సుపరిపాలన. విభిన్న కులాలు, మతాలు, వర్గాలు, జాతులుగా ఉన్న దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చినప్పుడే అది సాధ్యమవుతుందని పటేల్‌ బలంగా విశ్వసించారు. దేశ తొలి ఉపప్రధానిగా, హోం మంత్రిగా ఆ లక్ష్యసాధనలో త్రికరణశుద్ధిగా శ్రమించారు. పరిపాలనా సౌలభ్యం కోసం అఖిలభారత సర్వీసులు తేవాలన్న ఆలోచన పటేల్‌దే.

మంచి అడ్మినిస్ట్రేటర్

పోరాట యోధుడిగానే కాదు.. పరిపాలనా దక్షుడిగానూ భారతావని పటేల్‌ను వేనోళ్ల పొగుడుతుంది. కానీ పటేల్‌ ఉపప్రధాని కాకముందే.. అసలు స్వాతంత్రోద్యమంలోకి రాకముందే ఆయన పాలనాదక్షతను అహ్మదాబాద్‌ ప్రజలు కళ్లారా చూశారు. న్యాయవాద వృత్తిలో ఉండగానే 1917లో వల్లభ్‌భాయ్‌ పటేల్‌ అహ్మదాబాద్‌కు నగర శానిటేషన్‌ కమిషనర్‌గా పని చేశారు. పరిశుభ్రంగా, ప్రణాళికాబద్ధంగా నగరాన్ని తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశారు. 1922, 1924, 1927ల్లో అహ్మదాబాద్‌ మున్సిపల్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. నగరమంతటా విద్యుత్‌ సరఫరా, విద్యారంగంలో సంస్కరణలు ఇలా ఎన్నింటికో ఆయనే శ్రీకారం చుట్టారు.

24, అక్టోబర్ 2019, గురువారం

Dushyant Chautala: దుష్యంత్ చౌతాలా.. చిన్న వయసులోనే పెద్ద పదవులు అందుకున్న నేత




హరియాణాలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ మద్దతిస్తే సీఎం అయ్యే సూచనలున్నాయి.
దుష్యంత్ చౌతాలా మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు. హరియాణా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలాకు మనవడు. దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలా. దుష్యంత్ బాబాయి అభయ్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ అధినేత. దుష్యంత్ కూడా ఇటీవల వరకు ఆ పార్టీలోనే ఉండేవారు. కొద్దికాలం కిందట ఆయన బాబాయితో విభేదించి బయటకు వచ్చేసి జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) పెట్టారు. తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేసి కింగ్ మేకర్‌గా ఎదిగారు.
1988 ఏప్రిల్ 3న జన్మించిన దుష్యంత్ చౌతాలా 26 ఏళ్ల వయసులో 2014లో లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. హిస్సార్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసి గెలిచారు. 2018లో ఐఎన్‌ఎల్‌డీ నుంచి బయటకొచ్చి జేజేపీ ప్రారంభించారు.
దేవీలాల్ కుటుంబ వారసుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడం వల్ల ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) కొన్ని నెలల క్రితం నిలువునా చీలిపోయింది. ఇలా చీలిపోయిన దేవీలాల్ కుటుంబ సభ్యులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాజకీయ వారసత్వాన్ని చేజిక్కించుకోవడానికి పోటీ పడ్డారు. దుష్యంత్ కొత్త పార్టీ పెట్టడంతో ఒకప్పుడు హర్యానాలో ప్రబల శక్తిగా ఉన్న ఐఎన్‌ఎల్‌డీ బలం ఇప్పుడు గణనీయంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. దుష్యంత్ నేతృత్వంలోని జేజేపీ ఇప్పుడు అనేక స్థానాల్లో ఐఎన్‌ఎల్‌డీని పక్కకు నెట్టి మూడో పక్షంగా ముందుకు వచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో ఐఎన్‌ఎల్‌డీ ప్రాబల్యం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు దేవీలాల్ రాజకీయ వారసత్వ ప్రతినిధిగా జేజేపీ ఆవిర్భవించింది.
దుష్యంత్ తన ప్రసంగాలలో దేవీలాల్‌కు నిజమయిన రాజకీయ వారసుడిని తానేనని చెప్పుకుంటున్నారు. దేవీలాల్ గురించి, ఆయన రాజకీయ విధానాల గురించి దుష్యంత్ మాట్లాడుతున్నారు. అయితే, ఆయన ఏ సభలోనూ తన తాత ఓంప్రకాశ్ చౌతాలా పేరును ప్రస్తావించలేదు. ఎందుకంటే, రాజకీయ వారసత్వ పోరులో ఓం ప్రకాశ్ చౌతాలా తన బాబాయి అభయ్ చౌతాలాకు మద్దతిచ్చారని దుష్యంత్ ఆగ్రహంగా ఉన్నారు. అయితే, అదే సమయంలో దుష్యంత్ తన ప్రసంగాలలో ఎక్కడ కూడా వారిని విమర్శించడం లేదు. దేవీలాల్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసికెళ్లే క్రమంలో దుష్యంత్ జింద్ జిల్లాలోని ఉచన కలాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిటింగ్ ఎమ్మెల్యే ప్రేమలతతో తలపడ్డారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు బీరేందర్ సింగ్ సతీమణి ప్రేమలత.

Dushyant Chautala దుష్యంత్ చౌతాలా: ప్రఫుల్ల కుమార్ మహంతో రికార్డు బద్దలు కొడతారా?




హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని మలుపు తిరుగుతుండడంతో జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా ముఖ్యమంత్రయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 16వ లోక్‌సభ‌కు ఎంపీగా ఎన్నికైన దుష్యంత్ పేరిట ఇంతవరకు దేశంలో అత్యంత చిన్నవయసులో ఎంపీగా గెలిచిన వ్యక్తిగా రికార్డు ఉంది. ఇప్పుడు దుష్యంత్ చౌతాలా హరియాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే దేశంలో ఒక పూర్తిస్థాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రయినవారిలో అత్యంత చిన్నవయసు నేతగా రికార్డు సృష్టిస్తారు. ఇంతవరకు ఆ రికార్డు అస్సాం మాజీ సీఎం ప్రఫుల్లకుమార్ మెహంతా పేరిట ఉంది.
90 అసెంబ్లీ సీట్లున్న హరియాణాలో మేజిక్ ఫిగర్ 46 ఎవరూ సాధించే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ ఎక్కువ సీట్లలో అధిక్యం ఉన్నా కూడా ఆ పార్టీ కూడా 46 సీట్లు సాధించడం కష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అంతకంటే వెనుకబడే ఉంది. ఈ పరిస్థితుల్లో దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జననాయక్ జనతా పార్టీ పదికి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండడంతో ఆ పార్టీ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే దుష్యంత్‌ను సంప్రదించి అవసరమైన పక్షంలో ఆయన్నే సీఎంను చేస్తామని, తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
అదే జరిగితే దుష్యంత్ చౌతాలా హరియానా సీఎం కావడం ఖాయం. అప్పుడు ఇంతవరకు అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతో పేరిట ఉన్న రికార్డు బద్దలవుతుంది. దేశంలోనే అత్యంత చిన్న సీఎంగా దుష్యంత్ రికార్డు సృష్టిస్తారు.
దేశంలో అత్యంత చిన్న వయసులో సీఎం పదవి దక్కించుకున్న నేతలుగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరేమో అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతో(Prafulla Kumar Mahanta) కాగా.. మరొకరు పాండిచ్చేరి మాజీ సీఎం ఎంవోహెచ్ ఫరూక్(M. O. H. Farook). రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే అత్యంత చిన్నవయసులో సీఎం అయిన రికార్డు ఎం.ఒ.హెచ్ ఫరూక్(M. O. H. Farook) పేరిట ఉంది. పూర్తి స్థాయి రాష్ట్రానికి చిన్న వయసులో సీఎం అయిన రికార్డు ప్రఫుల్ల కుమార్ మహంతోది.

ఎం.ఒ.హెచ్.ఫరూక్(M. O. H. Farook): 29 ఏళ్లకే సీఎం

1937 సెప్టెంబరు 6న జన్మించిన ఫరూక్ 1967 ఏప్రిల్ 6న పాండిచ్చేరికి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి ఆయన వయసు 29 సంవత్సరాలు మాత్రమే. 1967 ఏప్రిల్ 9 నుంచి 1968మార్చి 6వరకు మొదటి విడత.. 1969 మార్చి 17 నుంచి 1974 జనవరి 3 వరకు రెండో విడత.. 1985 నుంచి 1990 వరకు మూడోసారి ఆయన పాండిచ్చేరికి సీఎంగా ఉన్నారు. అనంతంర కేంద్ర మంత్రిగా, గవర్నరుగా, సౌదీలో భారత రాయబారిగానూ పనిచేశారు. కేరళ గవర్నరుగా ఉంటున్న సమయంలో 2012 జనవరి 26న మరణించారు.

ప్రఫుల్ల కుమార్ మహంతో(Prafulla Kumar Mahanta): 32 ఏళ్లకు సీఎం

అస్సాంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అస్సాం గణపరిషత్ పార్టీ స్థాపించి 32 ఏళ్లకే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని సంచలనం సృష్టించిన లీడర్ ప్రఫుల్ల కుమార్ మహంతో.
1952 డిసెంబరు 23న జన్మించిన ప్రఫుల్ల కుమార్ మహంతో 1985 డిసెంబరు 24న 33 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. రెండు సార్లు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు.

దుష్యంత్ చౌతాలా(Dushyant Chautala): 32 ఏళ్లు

ఇప్పుడు దుష్యంత్ హరియాణా సీఎం అయితే ప్రఫుల్ల కుమార్ మహంతో  రికార్డు కనుమరుగు కానుంది.
దుష్యంత్ చౌతాలా 1988 ఏప్రిల్ 3న జన్మించారు. ఇప్పడు 2019 అక్టోబరు, నవంబరు నెలల్లో ఆయన సీఎం బాధ్యతలు చేపడితే 32 ఏళ్లకు సీఎం అయినట్లవుతుంది.

BCCI అధ్యక్షుడిగా Sourav Ganguly

Credit: Twitter/SouravGanguly

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నూ తన అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బు ధవారం జరిగిన సర్వసభ్య సమావే శంలో దాదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేష న్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. 
సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ 33 నెలల పాటు బీసీసీఐని నడిపించిన అనంతరం బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 39వ అధ్యక్షుడిగా గంగూలీ నియమితుడయ్యాడు. దాదాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీ ఐ కార్యదర్శిగా, అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ సింగ్ ధూమల్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.


సర్ విజ్జీ తరువాత గంగూలీయే

ఒక మాజీ క్రికెటర్ పూర్తిస్థాయ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం 65 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1954లో టీమిండియా మాజీ కెప్టెన్, విజయనగరం మహారాజు విజయానంద గజపతిరాజు(సర్ విజ్జీ) బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2014లో సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అయతే వీరు కొన్ని నెలలు మాత్రమే తాత్కాలిక అధ్యక్షులుగా పనిచేశారు.
ఇప్పుడు పూర్తిస్థాయ పదవీ బాధ్యతలు చేపట్టిన గంగూలీ మరో పది నెలలు మాత్రమే పదవిలో ఉంటారు. ఇప్పటికే ఐదేళ్లకు పైగా క్రికెట్ పాలనా వ్యవహారాల్లో ఉండడంతో లోధా కమిటీ ‘తప్పనిసరి విరామం’ నిబంధన ప్రకారం వచ్చే ఏడాది జులైలో పదవి నుంచి తప్పు కోవాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత తిరిగి అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు.

బీసీసీఐ అధ్యక్షులుగా చేసింది వీరే..

1 ఆర్‌ఈ గ్రాంట్ గోవన్ 1928-1933
2 సర్ సికందర్ హయత్ ఖాన్ 1933-1935
3 నవాబ్ హమిదుల్లా ఖాన్ 1935-1937
4 మహారాజా కేఎస్ దిగ్విజయ్‌సిన్హాజీ 1937-1938
5 పీ సుబ్బారాయన్ 1938-1946
6 అంటోనీ ఎస్ డీమెల్లో 1946-1951
7 జేసీ ముఖర్జీ 1951-1954
8 మహరాజ్ కుమార్ ఆఫ్ విజయనగరం 1954-1956
9 సర్దార్ ఎస్‌ఎస్ మజిథియా 1956-1958
10 ఆర్కే పటేల్ 1958-1960
11 ఎంఏ చిదంబరం 1960-1963
12 మహారాజా గైక్వాడ్ 1963-1966
13 జెడ్.ఆర్. ఇరానీ 1966-1969
14 ఏఎన్ గోస్ 1969-1972
15 పీఎం రంగ్తా 1972-1975
16 రాం ప్రకాశ్ మెహ్రా 1975-1977
17 ఎం. చిన్నస్వామి 1977-1980
18 ఎస్కే వాంఖేడ్ 1980-1982
19 ఎన్‌కేపీ సాల్వే 1982-1985
20 ఎస్ శ్రీమాన్ 1985-1988
21 బీఎన్ దత్ 1988-1990
22 మాధవరావు 'సింధియా 1990-1993
23 ఐఎస్ బింద్రా 1993-1996
24 రాజ్‌సింగ్ దుంగార్పూర్ 1996-1999
25 ఏసీ ముత్తయ్య 1999-2001
26 జగన్మోహన్ దాల్మియా 2001-2004
27 రణబీర్‌సింగ్ మహేంద్ర 2004-2005
28 శరద్ పవార్ 2005-2008
29 శశంక్ మనోహర్ 2008-2011
30 ఎన్.శ్రీనివాసన్ 2011-2013
31 జగన్మోహన్ దాల్మియా (తాత్కాలిక) 2013-2013
32 ఎన్.శ్రీనివాసన్ 2013-2014
33 శివ్‌లాల్ యాదవ్ (తాత్కాలిక) 2014-2014
34 సునీల్ గవాస్కర్ (తాత్కాలిక) 2014-2014
35 జగన్మోహన్ దాల్మియా 2015-2015
36 శశంక్ మనోహర్ 2015-2016
37 అనురాగ్ ఠాకూర్ 2016-2017
38 సీకే ఖన్నా (తాత్కాలిక) 2017-2019
39 సౌరవ్ గంగూలీ (ప్రస్తుతం) 2019-

15, అక్టోబర్ 2019, మంగళవారం

అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో: నోబెల్ బహుమతి గెలిచిన ఈ జంట గురించి నిజాలు తెలుసా?

అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో (photo credit: twitter/thenobelprize)

అభిజిత్ బెనర్జీ వ్యక్తిగత వివరాలు.. నెటిజన్లు సెర్చ్ చేసిన ప్రశ్నలకు సమాధానాలు

Abhijit Banerjee date of birth: ఫిబ్రవరి 21, 1961
Abhijit Banerjee Age: 58 సంవత్సరాలు(2019 నాటికి)
Abhijit Banerjee mother: తల్లి నిర్మలా బెనర్జీ (Centre for Studies in Social Sciences, Calcuttaలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
Abhijit Banerjee father: తండ్రి దీపక్ బెనర్జీ(Presidency College, Calcuttaలో ఎకనమిక్స్ విభాగాధిపతిగా పనిచేశారు).
Abhijit Banerjee Family: ప్రస్తుత భార్య ఎస్తేర్ డఫ్లో(Esther Duflo), తొలి భార్య అరుంధతి తులి.
(వైవాహిక జీవితానికి సంబంధించిన వివరాల కోసం వ్యాసం మొత్తం చదవండి)
Abhijit Banerjee Books: Poor Economics, Good Economics for Hard Times: Better Answers to Our Biggest Problems 2019, Making Aid Work, Pitfalls of Participatory Programs: Evidence from a Randomized Evaluation in Education in India.


భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీని ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అభిజిత్ బెనర్జీ(Abhijit banerjee), ఎస్తేర్ డఫ్లో(Esther Duflo), మిఖాయిల్ క్రెమెర్‌(Michael Kremer)లకు ఉమ్మడిగా ఈ బహుమతి ప్రకటించారు. బహుమతి కింద వీరికి 90 లక్షల స్వీడిష్ క్రోనాలు అంటే సుమారు రూ.6.5 కోట్లు ఇస్తారు. ప్రపంచంలో పేదరిక నిర్మూలన కోసం వీరు చూపిన మార్గదర్శకత్వానికి గాను ఈ బహుమతికి ఎంపిక చేశారు.
ఈ బహుమతికి ఎంపికైన ముగ్గురిలో అభిజిత్ బెనర్జీ(Abhijit banerjee), ఎస్తేర్ డఫ్లో(Esther Duflo)ల గురించే ఎక్కువ మంది తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వీరికి నోబెల్ బహుమతి ప్రకటించారన్న వార్త వెలువడగానే గూగుల్ సెర్చ్‌లో వీరి గురించి వెతుకులాట మొదలైంది. వీరు భార్యాభర్తలా? సహజీవనం చేస్తున్నారా? వీరికి పిల్లలున్నారా? ఎస్తేర్ డుఫ్లోది  ఏ దేశం? వీరు ఒకే చోట కలిసి పనిచేస్తున్నారా? గురుశిష్యులా? అభిజిత్ భార్య(Abhijit banerjee wife) ఎవరు? వంటి అనేక ప్రశ్నలు గూగుల్‌ని అడిగారు నెటిజన్లు.

ఇద్దరూ భార్యాభర్తలే

వారి ప్రశ్నల్లో చాలావాటికి వారు ఆశించిన సమాధానాలే ఉండడం విశేషం. అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డుఫ్లోలు నిజంగానే భార్యాభర్తలు. 2015లో వారు పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు. ఎస్తేర్‌ను వివాహం చేసుకోవడానికి ముందే అభిజిత్‌కు పెళ్లయింది. ఆయన తొలి భార్య(Abhijit Banerjee first wife) భారతీయురాలే. ఆమె పేరు అరుంధతి తులి(Arundhati tuli Banerjee). ఆమె కూడా అభిజిత్ పనిచేసే మసాచూషెట్స్ ఇనిస్టిట్యట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లోనే పనిచేస్తారు. లిటరేచర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తారామె. అభిజిత్ బెనర్జీ, అరుంధతి తులి బెనర్జీలకు చాలాకాలం కిందటే వివాహం కాగా 1991లో వారికి కబీర్ బెనర్జీ(Kabir Banerjee) అనే కొడుకు పుట్టాడు. ఆయన 25 ఏళ్ల వయసులో 2016లో మరణించాడు. కబీర్ మరణం తరువాత అభిజిత్, అరుంధతిలు విడిపోయారు.
ఎస్తేర్ డఫ్లో(Esther Duflo)ది ఫ్రాన్స్. ప్రస్తుతం అమెరికా పౌరురాలు. ఎస్తేర్ డఫ్తో ఈ పురస్కారం గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. అంతేకాదు.. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న రెండో మహిళగానూ ఘనత సాధించారు. ఆమె కూడా అభిజిత్ బెనర్జీతో పాటే ప్రస్తుతం మసాచూషెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఇద్దరికీ ఎలా పరిచయం?

హార్వర్డ్‌లో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన అభిజిత్ అక్కేడ కొంతకాలం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఎస్తేర్ డఫ్లో అక్కడ పీహెచ్డీ చేయగా అభిజిత్, మరో ప్రొఫెసర్ ఆమెకు గైడ్‌గా పనిచేశారు. ఒక రకంగా వారిద్దరూ తొలుత గురుశిష్యులే. అనంతరం ఇద్దరూ కలిసి పనిచేశారు. ఇద్దరూ కలిసి కొన్ని పుస్తకాలు రాశారు, ఓ సంస్థను స్థాపించారు. గతంలోనూ ఇద్దరికీ కలిపి పలు అవార్డులు వరించాయి. ఎస్తేర్‌‌తో సాన్నిహిత్యం, అనంతరం వివాహం చేసుకోవడంతో అభిజిత్ బెనర్జీ, ఆయన మొదటి భార్య అరుంధతి తులిల మధ్య దూరం పెరిగి విడాకులకు దారి తీసింది.

11, అక్టోబర్ 2019, శుక్రవారం

విరాట్ కోహ్లీ వీరందరినీ దాటేశాడు


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌మ్యాచ్‌లో విజృంభించాడు. టెస్టుల్లో తన 26వ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. రెండో రోజు ఆటలో భారత జట్టు 601 పరుగుల వద్ద డిక్లేర్ చేసేటప్పటికి కోహ్లీ 254 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన డాన్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలుకొట్టాడు.
కెప్టెన్‌గా ఉంటూ టెస్టుల్లో అత్యధికసార్లు 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు.
డాన్ బ్రాడ్‌మన్ ఎనిమిదిసార్లు ఇలాంటి ఫీట్ సాధించగా కోహ్లీ ఇప్పుడాయన్ను అధిగమించి తన కెప్టెన్సీలో తానే తొమ్మిది సార్లు 150కి పైగా పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు.

పాంటింగ్, గ్యారీ సోబర్స్, సంగక్కరల సరసన..
ఈ టెస్టులో విరాట్ కోహ్లీ మరికొన్ని రికార్డులనూ సాధించాడు. ఇంకొందరి రికార్డులను సమం చేశాడు.
కెప్టెన్‌ హోదాలో కోహ్లీకి ఇది 19వ సెంచరీ. దీంతో పాంటింగ్ రికార్డును సమం చేసినట్లయింది. కెప్టెన్‌గా 25 టెస్ట్ సెంచరీలతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ వీరి కంటే ముందున్నాడు.
ఇక భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రికార్డును కోహ్లీ ఈ మ్యాచ్‌లో సాధించాడు. ఇప్పటి వరకు సచిన్, సెహ్వాగ్‌లు ఆరేసి టెస్ట్ డబుల్ సెంచరీలు సాధించి ఇంతవరకు అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ ఇప్పుడు వారిని అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లోనే కోహ్లీ 7 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో గ్యారీ సోబర్స్, కుమార సంగక్కరల సరసన 7 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు.

అమితాబ్ బచ్చన్ అసలు పేరేమిటి?


Amitabh Bachchan height, Amitabh Bachchan movie, Amitabh Bachchan twitter, Amitabh Bachchan daughter, Amitabh Bachchan father, Amitabh Bachchan date of birth, Amitabh Bachchan movie list, Amitabh Bachchan brother, Amitabh Bachchan family.. గూగుల్‌లో అమితాబ్ అనికొట్టగానే ఆటోమేటిగ్గా వస్తున్న సెర్చ్ సజెషన్స్ ఇవి. యూజర్ల శోధన ఆధారంగా గూగుల్ కూడా ఎక్కువగా వెతికే అంశాలనే సజెషన్స్‌గా చూపిస్తుంది. అమితాబ్ బచ్చన్ 77వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించిన వివరాలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
అమితాబ్ గురించి గూగుల్‌లో ఎక్కువమంది తెలుసుకోవాలనుకుంటున్న అంశాలతో పాటు మరికొన్ని ఆసక్తికర విశేషాలనూ తెలుసుకుందాం..

గూగుల్‌‌లో వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానాలు..

Amitabh Bachchan height:  1.83 మీటర్లు. అంటే 183 సెంటీమీటర్లు. అడుగుల్లో చెబితే 6 అడుగుల ఒక అంగుళంపైనే.
Amitabh Bachchan movie: సైరా నరసింహారెడ్డి (తాజా చిత్రం తెలుగులో)
Amitabh Bachchan twitter: @SrBachchan
Amitabh Bachchan daughter: శ్వేతా బచ్చన్
 Amitabh Bachchan father: హరివంశ్ రాయ్ బచ్చన్. ఈయన మంచి కవి. తల్లి తేజీ బచ్చన్
Amitabh Bachchan date of birth: అక్టోబరు 11, 1942
Amitabh Bachchan movie list: అమితాబ్ 300కి పైగా సినిమాల్లో నటించారు. షోలే, కూలీ, మర్ద్, షరాబీ, త్రిశూల్, డాన్, లావారిష్, సిల్‌సిలా, ఇంక్విలాబ్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్, సైరా నరసింహారెడ్డి
, Amitabh Bachchan brother: అజితాబ్ బచ్చన్
, Amitabh Bachchan family: భార్య జయ భాదురి, కుమారుడు అభిషేక్ బచ్చన్, కుమార్తె శ్వేతా బచ్చన్ నంద, అల్లుడు నిఖిల్ నంద, కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, మనుమరాలు ఆరాధ్య బచ్చన్

అత్యధిక డబుల్ రోల్స్ ఆయనవే

అమితాబ్ అసలు పేరు ఇంక్విలాబ్ శ్రీవాస్తవ. ఆ తర్వాత ఆయన పేరును అమితాబ్ అని మార్చారు. అమితాబ్ అంటే ఎన్నటికీ ఆగిపోని వెలుగని అర్థం.
అమితాబ్ బచ్చన్‌ ఓ ఆండీడెక్స్‌ట్రస్. అంటే రెండు చేతులతో రాయలగల సామర్ధ్యం ఉన్నవారు.
1969లో వచ్చిన భువన్ షోమ్ అనే సినిమాతో అమితాబ్ తన కెరీర్‌ను మొదలుపెట్టారు. అయితే ఆయన ఈ సినిమాకు నరేటర్‌గా మాత్రమే వ్యవహరించారు. ఆ తర్వాత వచ్చిన ‘సాథ్ హిందుస్థానీ’ సినిమాతో ఆయన నటుడిగా మారారు.
అమితాబ్ బచ్చన్ అందుకున్న తొలి జీతం రూ.300
సినిమాల్లోకి వచ్చాక అమితాబ్‌కు వరుసగా 12 ఫ్లాప్ సినిమాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ‘జంజీర్’ ఆయనకు కెరీర్‌లో తొలి హిట్ ఇచ్చింది. ఒకే నెలలో ఆయన నటించిన నాలుగు సినిమాలు విడుదలై హిట్ అయ్యాయి.
1995లో జరిగిన మిస్ వరల్డ్ కాంటెస్ట్‌కు అమితాబ్ జడ్జ్‌గా వ్యవహరించారు.
సినీ ఇండస్ట్రీలో అత్యధిక డబుల్ రోల్స్‌లో నటించిన ఏకైక నటుడు అమితాబే.
మేడమ్ టుస్సాడ్స్‌ వ్యా్క్స్ మ్యూజియంలో ఆయనకు మైనపు విగ్రహం ఉంది. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడు ఆయనే.
అమితాబ్‌కు చేతి గడియారాలు కలెక్ట్ చేయడం కంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు బయటికి వెళ్లినా రెండు వాచ్‌లు పెట్టుకుని వెళుతుంటారు.
ప్రతి ఆదివారం అమితాబ్ తన నివాసం వద్ద తనకోసం ఎదురుచూస్తున్న అభిమానులను పలకరిస్తుంటారు. ఆదివారం రాగానే వందలాది మంది అభిమానులు జుహులోని ఆయన నివాసం వద్ద ఎదురుచూస్తుంటారు.

1, అక్టోబర్ 2019, మంగళవారం

Herbert Kleber ఎవరు? గూగుల్ ఎందుకు డూడుల్‌తో గుర్తుచేసింది?


హెర్బర్ట్ క్లెబర్ ఎవరు? గూగుల్ ఎందుకు డూడుల్‌తో గుర్తుచేసింది?


Sye Raa: చిరంజీవి మూవీ అసలు కథానాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రియల్ స్టోరీ

Sye Raa Narasimhareddy Cast & Crew: Chiranjeevi, AmitabhBachchan, Nayanthara, Anushka, VijaySethupathi, Tamannaah, JagapatiBabu, RaviKishan, NiharikaKonidela, Brahmanandam

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి... మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రానికి ఈయన కథే మూలం. సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ల ముందే బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేసిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చరిత్ర చెబుతోంది. రాయలసీమకు చెందిన ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్చాస్త్రి తన ‘సుప్రసిద్ధుల జీవిత విశేషాలు’ పుస్తకంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రనూ రాశారు. అందులో ఆయన ‘‘1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్యయుద్ధానికి పదేళ్ల ముందే బ్రిటిష్ దుష్టపాలనపై తిరుగుబాటు జెండా రెపరెపలాడించిన స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’’ అని రాశారు.

ఇదీ నేపథ్యం..

విజయనగర రాజులు తళ్లికోట యుద్ధంలో బహమనీ సుల్తానుల చేతిలో ఓడిపోయారు. దాంతో సామంతులుగా ఉన్న పాలెగాళ్లు నియంతల్లా వ్యవహరించడం మొదలుపెట్టారు. 1799లో టిప్పుసుల్తాన్ ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోయాడు. అప్పటికి రాయలసీమ నిజాం పాలన కిందే ఉండేది. నిజాం నవాబు రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు. దాంతో పాలెగాళ్లు బ్రిటిష్ పాలనలోకి వచ్చారు.
కడపజిల్లాలో ఆనాడు 80మంది పాలెగాళ్లుండేవారు. వీరు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేవారు. దత్తమండలానికి మొట్టమొదటి కలెక్టర్‌గా పనిచేసిన సర్ ధామస్ మన్రో పాలెగాళ్ల వంశ పారంపర్య హక్కులను రద్దు చేసి వారికి నెలసరి ఫించన్ ఏర్పాటు చేశాడు.
ప్రస్తుత కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ పాలెగాడు పెద్ద మల్లారెడ్డి. అతని ముగ్గురు కొడుకుల్లో చివరివాడు నరసింహారెడ్డి. అప్పటి కోయిలకుంట్ల తాలూకాలో ఈ ఉయ్యాలవాడ జాగీరు ఉండేది. ఆంగ్లేయులు దాన్ని హస్తగతం చేసుకునే నాటికి ఆ జాగీర్ నుంచి 30 వేల రూపాయలకు పైగా రాబడి ఉండేది. జాగీర్‌ను వశం చేసుకున్న బ్రిటిష్‌వారు పెద్ద మల్లారెడ్డి కుటుంబానికి రు. 70 పింఛను ఇచ్చేలా నిర్ణయించారు. అందులో పెద్దమల్లారెడ్డి తమ్ముడు చిన మల్లారెడ్డికి సగంపోగా మిగతా సగం 35 రూపాయల్లో నరసింహారెడ్డికి మూడోవంతుగా 11 రూపాయల 10 అణాలు 8 పైసలు పింఛను వచ్చేది.
నరసింహారెడ్డి తాత(తల్లి తండ్రి) నొస్సం జమీందార్ జయరామరెడ్డికి చెందిన జాగీరును బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకుని ఆయన నెలకు వెయ్యి రూపాయల పింఛను ఇచ్చేవారు. ఆ జాగీరు నుంచి ఏటా 22 వేల రూపాయల రెవెన్యూ ఉండేది. నొస్సం జమీందారుకు పిల్లలు లేకపోవడంతో ఆయన మరణానంతరం పింఛను ఆగిపోయింది.

పోరాటానికి మొదలైంది ఇలా..


1846 జూన్ నెలలో తనకు రావలసిన మే నెల పింఛను కోసం కోయిలకుంట్ల ట్రెజరీకి మనిషిని పంపిస్తాడు నరసింహారెడ్డి. కానీతహసీల్దార్.. నరసింహారెడ్డి వస్తే కానీ ఇవ్వనని చెప్పి ఆ మనిషిని ఉత్త చేతులతో పంపించేస్తాడు. అయినా నరసింహారెడ్డి వెళ్లకపోవడంతో తహసీల్దారు వారంట్ జారీ చేసి బంట్రోతుతో పంపిస్తాడు. వచ్చినవారిని తన్ని తరిమేస్తాడు నరసింహారెడ్డి. దాంతో ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య పోరాటం మొదలైందంటారు అని జానమద్ది హనుమచ్చాస్త్రి తన పుస్తకంలో రాశారు.
అదేసమయంలో బ్రిటిష్ వారి కారణంగా మాన్యాలు పోగొట్టుకున్న కట్టుబడిదార్లుగిరిజన తెగలు నరసింహారెడ్డిని ఆశ్రయిస్తారు. అలా 9 వేల మంది నరసింహారెడ్డి వద్ద చేరుతారు. వారందరితో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటానికి నరసింహారెడ్డి సిద్ధమవుతాడు. వనపర్తిమునగాలజటప్రోలు జమీందార్లు పెనుగొండఔకుజమీందార్లుహైదరాబాద్‌కు చెందిన సలాం ఖాన్కర్నూలుకు చెందిన పాపాఖాన్బనగానపల్లె నవాబ్ మహమ్మద్ ఆలీఖాన్కొందరు బోయలుచెంచులుబ్రాహ్మణులు కూడా నరసింహారెడ్డి సైన్యంలో చేరుతారు. దీంతో కంపెనీ ప్రభుత్వం నరసింహారెడ్డిపై నిఘా పెడుతుంది.

తొలి దాడి ఇలా..

1846 జులై 78 తేదీలలో నరసింహారెడ్డి 9 వేల మంది అనుచరులతో చాగలమర్రి తాలూకా రుద్రవరం గ్రామంపై దాడి చేస్తాడు. మిట్టపల్లి వద్ద పోలీసులు వారిని అటకాయిస్తారు. ఈ పోరాటంలో ఒక డఫేదారు తొమ్మిదిమంది బంట్రోతులు మరణించారు.
నరసింహారెడ్డి సైన్యం మరుసటి రోజు కోయిలకుంట్ల ట్రెజరీపై దాడి చేసి అప్పటికి ఖజానాలో ఉన్న 805 రూపాయల 10 అణాల 4 పైసల మొత్తాన్ని దోచుకుంటుంది. తహసీల్దారు రాఘవాచారిని నరసింహారెడ్డి మనుషులు బందీగా పట్టుకుంటారు. ఖజానా సిబ్బందిని అయిదుగురిని చంపేస్తారు. నరసింహారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులకు సహాయంగా సైన్యాన్ని పిలిపించమని కలెక్టర్ కడపలోని కమాండింగ్ ఆఫీసరును కోరుతాడు. కర్నూలు నుండి గుర్రపు దళాన్ని పిలిపిస్తారు. నరసింహారెడ్డి ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానానుచుట్టుపట్ల గ్రామాలను దోచుకుంటాడు. అప్పటికే సైన్యం జమ్మలమడుగు చేరుకుంటుంది. ఆలోగా నరసింహారెడ్డి తన సైన్యంతో అహోబిలం కోటకు చేరుకుంటాడు. నరసింహారెడ్డి ఆచూకీ తెలుసుకోవడం ప్రభుత్వానికి కష్టమవుతుంది. కంభం తహసీల్దారును వెంటపెట్టుకుని కడప నుండి కెప్టెన్ నాట్ పెద్ద సైన్యంతో బయలుదేరుతాడు.
జె.హెచ్.కొక్రీన్ మరో సైనిక దళంతో రుద్రవరం వద్ద నాట్‌ను కలుసుకుంటుంది. ఈలోగా తిరుగుబాటు దళం గుత్తి కనుమ మీదుగా ముండ్లపాటు చేరుకుంటుంది. అక్కడికి మూడుమైళ్ల దూరంలోని కొత్తకోటలోని పాడుపడిన కోటను నరసింహారెడ్డి స్థావరంగా మార్చుకుంటాడు. నరసింహారెడ్డి ప్రతి కనుమ దగ్గర కొంత కట్టుబడి సిబ్బందిని కాపలా ఉంచుతాడు.
నరసింహారెడ్డిని వెతుక్కుంటూ వచ్చిన బ్రిటిష్ అధికారి పాట్సన్ బృందాన్ని నరసింహారెడ్డి తన 5 వేల బలగంతో గిద్దలూరు వద్ద అడ్డుకుంటాడు. పాట్సన్ వద్ద అప్పటికి 100 మంది సైనికులే ఉంటారు. ఆరు గంటల పాటు నరసింహారెడ్డి మనుషులకుపాట్సన్ సైన్యానికి భీకర పోరాటం జరుగుతుంది. నరసింహారెడ్డి మనుషులు 200 మంది మరణిస్తారు. చీకటి పడటతో రెండు పక్షాల వారు యుద్ధం ముగించి ఎవరి దారిన వారు సాగుతారు.
కొండలలోని కాలిబాటలు అడ్డదారులు బ్రిటిష్ సైనికులకు తెలియవు. నరసింహారెడ్డి మనుషుల కోసం సైన్యం కొండలన్నీ గాలిస్తుంది. గ్రామాధికార్ల మీదకట్టుబడిదార్ల మీద కేసులు మోపుతారు. నరసింహారెడ్డిని పట్టిస్తే వేయి రూపాయలుఅతని ముఖ్య సలహాదారు గోసాయి వెంకన్నను పట్టిస్తే వంద రూపాయలు బహుమానాన్ని ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. నరసింహారెడ్డి తన కుటుంబాన్ని కొత్తకోటకు తరలిస్తాడు. ప్రభుత్వ సైనికులు ఆ ప్రాంతంపై దాడి జరిపినపుడు హైదరాబాద్ రాజ్యంలోని ప్రాతకూరు జమీందారు లాల్‌ఖాన్‌కునరసింహారెడ్డి మధ్య జరిగిన ఉత్తరప్రత్యత్తరాలు దొరుకుతాయి. ఆ పత్రాలు విచారణలో ప్రభుత్వానికి బలమైన సాక్ష్యాలవుతాయి.

కుటుంబాన్ని విడిపించేందుకు వచ్చి..

నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలుఇద్దరు కుమారులుముగ్గురు కుమార్తెలు ఉండేవారు. వారందరినీ పట్టుకుని ప్రభుత్వం వారిని కడపలోని ఒక బంగళాలో ఉంచుతుంది. మెరుపుదాడి చేసి కుటుంబ సభ్యులను విడిపించాలని కొండలమీదుగా ప్రయాణం చేసి కడప చేరుకుంటాడు నరసింహారెడ్డి. 1846 అక్టోబర్ 6న ఎర్రమల నల్లమల కొండల మధ్యనున్న పేరసామలలోని జగన్నాధాలయంలో రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న కలెక్టర్ కాక్రేన్ నలుదిక్కులా సైన్యాన్ని మొహరించి 4050 మంది నరసింహారెడ్డి మనుషులను కాల్చి చంపుతాడు. కాలికి తూటా తగలడంతో నరసింహారెడ్డి ఫిరంగి దళాలకు దొరికిపోతాడు.
నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెడతారు. వారిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ల దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. ఆ శిక్ష పడినవారిలో అవుకు రాజు తమ్ముడు ఒకరు.
కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాకహత్యలకుదోపిడీలకుపాల్పడినట్లు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధిస్తారు. ఉరి తర్వాత అతని శిరస్సును కోయిలకుంట్ల దగ్గర బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వేలాడదీయవలసిందిగా తీర్పు చెబుతారు.

రెండు వేల మంది చూస్తుండగా ఉరి..

1827 ఫిబ్రవరి 22 న ఫలానాచోట ఉదయం 7 గంటలకు నరసింహారెడ్డిని ఉరి తీస్తారని ప్రభుత్వం వూరూరా చాటింపు వేయించింది. చెప్పినట్లుగానే కాక్రేన్ ఎదుట ఉరి తీశారు.
ఆ విషాద దృశ్యాన్ని 2 వేల మంది ప్రజలు కన్నీరుకార్చుతూ చూశారు. మిగతావారికి హెచ్చరిక కావాలంటూ నరసింహారెడ్డి తలను రెండు మూడు తరాల వరకు ఆ బురుజుపై వేలాడేలా బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారని జానమద్ది హనుమచ్చాస్త్రి తన ‘సుప్రసిద్ధుల జీవిత విశేషాలు’ పుస్తకంలో రాశారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథను ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో పాటల రూపంలో పాడుతుంటారు.
"దొరవారి నరసింహారెడ్డి
నీ దొర తనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి
రేనాటిసీమలో రెడ్డోళ్ల కులములోనా
దొరవారి వమిశానా ధీరుడే నరసింహారెడ్డి
కోయిల కుంట్లా గుట్టలెంటా కుందేరు వొడ్డులెంటా
గుర్రమెక్కి నీవు వస్తే కుంపిణికి గుండెదిగులూ
కాలికి సంకెళ్ళు వేసి చేతికి బేడీలు వేసి
పారాతో పట్టి తెచ్చి బంధికానులో పెట్టిరీ
కండ్లకు గంతలూ గట్టి నోటి నిండా బట్లు పెట్టి
నిలువునా నీ తల్లికేమో చావు సుద్దీ తెలిపినాదీ
కన్నకడుపే తల్లటించే గంగలోనా గంగ గలిసే
దొరవారి నరసింహారెడ్డి
నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి" అన్న పాట ప్రాచుర్యంలో ఉంది.
అలాగే... "అదుగో వచ్చేఇడుగో వచ్చే నరసింహారెడ్డి’’ అనే మరో పాట కూడా ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో వినిపిస్తూ ఉంటుంది.
"అదుగో వచ్చేఇడుగో వచ్చే నరసింహారెడ్డి
పళపళ పళపళ కేకవేసెరా నరసింహారెడ్డి
చంద్రాయుధమూ చేతబట్టెనే నరసింహారెడ్డి
ఆవుల మందలో పులి దుమికిన చందము దుమికినడూ
కరువు వచ్చినా కొలమొచ్చినా ఆదరించే రెడ్డీ
అట్టివక్క మన రెడ్డిమాటనూ చిన్న చెయ్యరాదూ
నాలుగు గ్రామాల మందిగా తాము లేచినారు." అంటూ సాగుతుంది ఆ పాట.