11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

అయినా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ?

Pregnancy


సుమారు 45 ఏళ్లుంటాయి ఆమెకు. బాగా సిగ్గు పడుతోంది.. అంతకుమించి భయపడుతోంది.

అన్ని రకాల కేసులు వస్తుంటాయి కాబట్టి డాక్టరుకు ఇలాంటివి కొత్తేమీ కావు. ఆమెలో కనిపిస్తున్న సిగ్గు, భయం రెండింటినీ చూసినప్పటికీ ఏమీ తెలియనట్లే పోయి బెడ్ మీద పడుకోమని చెప్పారు డాక్టర్.

తనిఖీ చేశాక.. గర్భం ఉందని చెప్పింది డాక్టర్.

అంతే.. అంతవరకు కనిపించిన భయం ఏకంగా ఏడుపుగా మారిపోయింది.. వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టిందామె.

మా ఆయనకు తెలిస్తే ఏమంటాడో ఏమో? అంటూ ఏడుస్తోంది.

అదేంటమ్మా.. అలా అంటావు.. గర్భం వద్దనుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలి కానీ, ఇంతవరకు వచ్చాక ఇప్పుడు ఏడిస్తే ఎలా? అన్నారు డాక్టర్.

ఎంతమంది పిల్లలు? అడిగారు డాక్టర్.

ఇద్దరండీ.. చెప్పిందామె.

ఎంత వయసు?

పెద్దోడు డిగ్రీ అయిపోయింది పాప ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చెప్పిందామె.

అంత పెద్ద పిల్లలున్న తరువాత ఇప్పుడు మళ్లీ కడుపంటే అందరూ ఏమనుకుంటారో ఏమో? పైగా మా ఆయన కూడా ఊరుకోడు అంటూ మళ్లీ ఏడుపు లంఖించుకుంది.

బయట ఒకరిద్దరు పేషెంట్లే ఉండడంతో కాస్త ఆమెకు కౌన్సెలింగ్ చేయాలని నిర్ణయించుకుంది డాక్టర్.

మరి గర్భం వద్దనుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలి కదమ్మా.. అంది డాక్టర్.

జాగ్రత్తలు తీసుకున్నామండీ.. అయినా ఎలా వచ్చిందో తెలీడం లేదు.. చెప్పిందామె.

బహుశా నిరోధ్ ఫెయిలై ఉంటుంది అంది డాక్టర్.

నిరోధ్ వాడలేదండీ.. మా ఆయనకు నచ్చదు.. చెప్పిందామె.

అయితే, మాత్రలు వాడారా? 

ఊహూ...

మరైతే ఇంకేంటి.. లూప్ కూడా లేదు కదా? డాక్టరు ఆమె వంక చూస్తూ అడిగింది.

ఆమె సమాధానం చెప్పలేదు.. సిగ్గుపడిపోతోంది.

ఇంకేం జాగ్రత్తలు తీసుకున్నారమ్మా.. ఇవేం కాకుండా.. డాక్టరు రెట్టించింది.

అదేనండీ.. ఆయన జాగ్రత్తపడతారు చెప్పిందామె.

ఆయన జాగ్రత్తపడడమంటే నిరోధ్ వాడడమే కదా.. మరి వాడలేదంటున్నారు కదా.. డాక్టరు అడిగింది.

నిరోధ్ వాడకపోయినా జాగ్రత్త తీసుకుంటారండీ..

అదెలా? డాక్టర్ అడిగింది.

ఆ టైంకి.. అని సిగ్గుపడిపోతుందామె.

ఓహో... ఆ టైంకి బయటకు తీసేస్తారా? 

అవునన్నట్లుగా తలూపిందామె.

దాన్ని జాగ్రత్త అనరమ్మా... అది అజాగ్రత్త. ఆ అజాగ్రత్త వల్లే నీకిప్పుడు కడుపొచ్చింది... చెప్పింది డాక్టర్.

అవునా అన్నట్లుగా ఆశ్చర్యంగా చూసిందామె..

డాక్టరుకు విషయం అర్థమైంది.. ఆమె ఒక్కరికే కౌన్సెలింగ్ చేస్తే చాలదని అర్థమై రిసెప్షన్లో కూర్చున్న ఆమె భర్తను కూడా పిలిచింది.

మీ ఆవిడకు ప్రెగ్నెన్సీ ఉందండీ.. చెప్పింది డాక్టర్.

భర్త ఏమీ మాట్లాడలేదు.. తన భార్యవైపు కొరకొరా చూస్తున్నాడు అక్కడే.

మీరలా చూడనవసరం లేదు.. జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వయసులోనైనా గర్భం వస్తుంది.. అన్నది డాక్టర్.

జాగ్రత్తలు తీసుకున్నామండీ ఎందుకు తీసుకోలేదు.. అచ్చం తన భార్య చెప్పినట్లే చెప్పాడాయనే.

మీరు తీసుకున్న జాగ్రత్తేమిటో ఆవిడ చెప్పారు.. దాన్ని జాగ్రత్త అనరు. అజాగ్రత్త అంటారు అంది డాక్టర్.

నిరోధ్, పిల్స్, కాపర్ టీ లాంటి సంతాన నిరోధక పద్ధతుల్లోనే ఫెయిల్యూర్లు ఉంటాయి.. అలాంటి మీరు పాటించే ఈ విధానంలో ఇంకా ఎక్కువ ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఉంటుంది.

గర్భ నిరోధక మాత్రలు వాడే వెయ్యి మందిలో ఒకరికి ఫెయిల్ అయితే, మీరు పాటించే ఈ విత్ డ్రా పద్ధతిలో 20 శాతం ఫెయిల్యూర్ ఉంటుంది.. డాక్టరు చెప్పింది.

వీర్యం బయటే ఉండిపోతే గర్భం ఎలా వస్తుంది.. అడిగాడాయన.

వీర్యం బయటే ఉండిపోతుందని మీరనుకుంటారు కానీ స్ఖలనానికి ముందు కొన్ని ద్రవాలు విడుదలవుతాయి.. అందులోనూ కొన్ని శుక్రకణాలుంటాయి.. అవి గర్భాశయంలోకి చేరితే గర్భం వస్తుంది. మీకు ఇలాగే జరిగింది.. డాక్టరు వివరించి చెప్పింది.

భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.

ముఖాలు చూసుకుని ఇప్పుడేం చేయలేరు.. ఆర్థికంగా స్థిరంగానే ఉన్నారు కదా.. ఏం ఫరవాలేదు.. మీ పిల్లలు పెద్దోళ్లయినా ఇప్పుడీ బేబీని కనండి అని చెప్పి పంపించింది డాక్టర్.

Read Also:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి