గంగవ్వ.. తెలుగు రాష్ట్రాల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న చాలామందికి తెలిసిన పేరది. ఇప్పుడు టీవీ ఉన్న అందరికీ తెలిసే టైమొచ్చేసింది. అవును.. గంగవ్వ టాలెంట్ అలాంటిది.
టెక్నాలజీ తెలియకపోయితే తన సింపుల్ స్టైల్‌తో యూట్యూబ్‌లో పాపులర్ అయిన గంగవ్వ ఇప్పుడు మొబైల్ స్క్రీన్ నుంచి టీవీ స్క్రీన్‌కు వచ్చేశారు. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు.
గంగవ్వ పూర్తి పేరు మిల్కూరి గంగవ్వ. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి ఆమె స్వగ్రామం. ఎనిమిది మంది మనవలు, మనవరాళ్లు ఉన్న గంగవ్వ వయసెంతో ఎవరికీ కచ్చితంగా తెలియదు. బర్త్ రికార్డులు వంటివి ఏమీ లేకపోవడమే దానికి కారణం.
‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ చానల్ వీడియోల్లో ఆమె కనిపిస్తారు. 2012లో ఆమె అల్లుడు శ్రీకాంత్ శ్రీరామ్ ఈ చానల్ ప్రారంభించారు. సినిమా రంగంలో అనుభవం ఉన్న శ్రీకాంత్ 9 మంది టీంతో కలిసి ఈ చానల్‌కు వీడియోలు చేస్తూ తన అత్తగారైన గంగవ్వను అందులో భాగస్వామిని చేశారు. క్రమంగా ఆమె వీడియోలకు పాపులారిటీ పెరగడంతో ఆ చానల్‌కు ఇప్పుడు మిలియన్లలో ఫాలోవర్లు వచ్చారు.
గ్రామీణ జీవితాలు, సంస్కృతిపై వీరు వీడియోలు చేస్తారు.
2012లోనే మై విలేజ్ షో చానల్ మొదలైనా పెద్దగా పాపులర్ కాలేదు. 2017 నుంచి ఆ చానల్ వీడియోల్లో గంగవ్వ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చేవారు. వాటికి మాంచి స్పందన రావడంతో ఎక్కువ వీడియోల్లో ఆమెను ఇన్వాల్వ్ చేసేవారు. దాంతో ఆ చానల్, గంగవ్వ ఇద్దరూ ఫేమస్ అయ్యారు.
అత్యంత సహజమైన నటనే గంగవ్వను యూట్యూబ్ స్టార్‌ను చేసింది.
‘‘నాకు చదువు రాదు.. ఈ ఫోన్లు, కెమేరాలు ఏవీ తెలిసేవి కాదు.. నా మాట తీరే జనానికి నచ్చినట్లుంది’’ అంటారు గంగవ్వ.
గంగవ్వ యూట్యూబ్ స్టార్ కావడానికి ముందు పొలం పనులు చేసుకునేవారు. బీడీలు చుట్టేవారు.
యూట్యూబ్‌లోనే కాదు గంగవ్వకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పాపులారిటీ ఉంది. ఆమెకు ఇన్‌స్టాలో 50 వేల మందికి పైగా ఫాలోవర్లున్నారు.
ఈ పాపులారిటీయే ఆమెను సినిమాల్లో నటించేలా చేసింది. ఇస్మార్ట్ శంకర్, మల్లేశం వంటి సినిమాల్లో ఆమె నటించారు.
ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 4లో ఆమె కూడా ఒక కంటెస్టెంట్ కావడంతో ఆమె స్టార్‌డమ్ మరింత పెరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి