28, సెప్టెంబర్ 2020, సోమవారం

రాహుల్ తివాతియా: అప్పటివరకు తిట్టిన నోళ్లే పొగిడాయి

Rahul Tewatia రాహుల్ తివాతియా


 అప్పటివరకు కామెంటరేటర్లు ఆ బ్యాట్స్‌మన్‌ను వెటకారమాడుతున్నారు. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సిన జట్టు మాంచి హిట్టర్లను కాదని ఆయన్ను పంపించి పెద్ద తప్పు చేసిందని ఓపెన్‌గానే విమర్శిస్తున్నారు. రిక్వైర్డ్ రన్‌రేట్ కొండలా పెరిగిపోతున్న సమయంలో తడబడుతూ ఒకటీ అరా పరుగులు తీస్తూ ఎక్కువ బంతులను వదిలేస్తున్న ఆయన్ను చూసి ఆ టీం అభిమానులూ తిడుతున్నారు.. అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ అప్పటికే దూకుడుగా ఆడుతున్నాడు.. షాట్లతో హోరెత్తిస్తున్నాడు. మరోవైపు ఈయన టిక్కుటిక్కుమని ఆడుతున్నాడు.. అందుకే అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ సింగిల్ తీసే అవకాశం వచ్చిన వెళ్లకుండా స్ట్రైక్ తన దగ్గర ఉంచుకుంటున్నాడు.. కానీ, అనుకోకుండా అవుటైపోయాడు. అంతవరకు కామెంటరేటర్లు కోరుకున్న హిట్టర్ క్రీజులో అడుగుపెట్టాడు.. ఒకట్రెండు షాట్లు కొట్టాడు.. ఇంతలో అంతవరకు జిడ్డులా ఆడిన బ్యాట్స్‌మన్ ఒక్కసారిగా గేరు మార్చాడు.. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఒకటా రెండా ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టేశాడు.. ఒకటైతే ఏకంగా స్టేడియం బయట రోడ్డు దాటి పడింది.. దాంతో అంతవరకు తిట్టిన కామెంటరేటర్లు ప్లేటు మార్చేశారు.. మరోవైపు 19 ఉన్న రిక్వైర్డ్ రన్ రేట్ ఒక్కసారి నార్మల్ రేంజ్‌కు పడిపోయింది. అంతలో హిట్టింగ్ చేస్తాడనుకున్న బ్యాట్స్‌మన్ అవుటయ్యాడు.. ఆయన స్థానంలో వచ్చిన మరో బ్యాట్స్‌మన్ కూడా రెండు సిక్సర్లు బాదాడు.. మళ్లీ మన జిడ్డు అనిపించుకున్న బ్యాట్స్‌మన్‌కు స్ట్రైక్ వచ్చింది.. మరో సిక్సర్ బాదాడు.. దాంతో అంతవరకు అసాధ్యమనుకున్న గెలుపు ఈజీ అయిపోయింది.. 6 బంతుల్లో 2 పరుగులు చేస్తే చాలనే స్టేజికి వచ్చేసింది.. మరో సిక్సర్‌కి ట్రై చేశాడు కానీ, అవుటైపోయాడు.. ఆ రెండు పరుగులు తరువాత వచ్చినవారు పూర్తి చేసి గెలిపించారు.

ఇదీ కింగ్స్ లెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్. ఇందులో చెప్పుకొన్న జిడ్డు బ్యాట్స్‌మన్ రాహుల్ తివాతియా... కామెంటరేటర్లు పరిహాసమాడిన ఆయనే మ్యాచ్‌ను మలుపు తిప్పి రాజస్థాన్ రాయల్స్‌ను గెలిపించాడు. వరుస సిక్సర్లతో వావ్ అనిపించాడు.

అప్పటివరకు వీడెప్పుడు అవుటవుతాడా అని రాజస్థాన్ రాయల్స్ అభిమానులే చూశారు.. కానీ, ఆ తరువాత కింగ్స్ లెవన్ ఆటగాళ్లు, అభిమానులు ఆయన అవుట్ కోసం ఎదురుచూశారు.

మొత్తానికి ఒక్కసారి మ్యాచ్ టర్న్ చేశావు తివాతియా..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి