10, జూన్ 2020, బుధవారం

బాలకృష్ణ 60వ పుట్టిన రోజు.. 60 స్పెషల్ థింగ్స్.. బాలయ్యకు నచ్చిన చిరంజీవి సినిమా ఏంటి?

బాలకృష్ణ



బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ, బాలయ్య, బాలయ్య బాబు, బాలా.. ఇలా ఎవరెలా పిలుచుకున్నా కానీ తనదైన స్టైల్‌లో చెలరేగిపోయే నటుడు బాలకృష్ణ. 
అప్పుడే 60 ఏళ్లు వచ్చేశాయే అనిపించేలా మెంటైన్ చేసే గ్లామర్.. స్పీడ్... ఎనర్జీ ఆయన సొంతం.
ఆయనకు కూడా అదే ఫీలింగ్.. అందుకే.. మరో 60 ఏళ్లు ఇంతే హుషారుగా బతుకుతా  అంటారాయన.
అటు హీరోగా, ఇటు ఎమ్మెల్యేగా రాణిస్తున్న ఆయనను చూసి నవ్వే వారు.. అసూయపడేవారు.. అభిమానించేవారు.. ఆరాధించేవారూ అందరూ ఎక్కువే.

నందమూరి బాలకృష్ణ షష్ఠిపూర్తి(60వ జన్మదినం) సందర్భంగా ఆయనకు సంబంధించిన 60 ప్రత్యేకమైన అంశాలు మీకోసం..
స్వీట్ 60
1. బాలకృష్ణ బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. నిజాం కాలేజ్‌లో డిగ్రీ చదివారు.
2. బాలకృష్ణ పద్నాలుగేళ్ల వయసులో తన తండ్రి ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో ఆయన సినిమాల్లో అరంగేట్రం చేశారు.
3. ఇంటర్మీడియట్ తరువాత పూర్తిగా సినీ ఫీల్డులో సెటిలైపోదామనుకున్నారాయన. కానీ.. కనీసం డిగ్రీ చదివాకే సినీ ముచ్చట తీర్చుకో అని తండ్రి చెప్పడంతో బీఏ చదివి ఆపైన హీరోగా వచ్చారు.
4. తొలినాళ్లలో సహాయ నటుడిగా వివిధ సినిమాల్లో నటించారు. వాటిలో తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించిన చిత్రాలే ఎక్కువ.
5. బాలకృష్ణ నటించిన ‘తాతమ్మ కల’, ‘దాన వీర సూర కర్ణ’, ‘అక్బర్‌ సలీమ్‌ అనార్కలీ’, ‘శ్రీమద్విరాట్‌పర్వం’, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం’ చిత్రాలకు ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించారు. 
6. కథానాయకుడిగా మారిన తర్వాత ఎన్టీఆర్‌ దర్శకత్వంలో ‘శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ చిత్రంలో బాలయ్య నటించారు.
7. బాలకృష్ణ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘సాహసమే జీవితం’. 1984 జూన్‌ 1న విడుదలైన ఈ చిత్రానికి భారతి-వాసు దర్శకత్వం వహించారు. విజి కథానాయికగా నటించారు. 
8. బాలకృష్ణ సినిమాలకు ఎక్కువగా దర్శకత్వం వహించింది ఎ.కోదండరామిరెడ్డి. ఆయన దర్శకత్వంలో  11 సినిమాల్లో బాలయ్య హీరోగా నటించారు.
9. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఏడు, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆరు సినిమాల్లో నటించారు. 
10. 1987లో అత్యధికంగా బాలకృష్ణ 8 చిత్రాల్లో నటించారు. ‘అపూర్వ సోదరులు’, ‘భార్గవ రాముడు’, ‘రాము’, ‘అల్లరి కృష్ణయ్య’, ‘సాహస సామ్రాట్‌’, ‘ప్రెసిడెంట్‌గారి అబ్బాయి’, ‘మువ్వ గోపాలుడు’, ‘భానుమతిగారి మొగుడు’ చిత్రాలు విడుదలయ్యాయి.
నందమూరి బాలకృష్ణ

11. సొంతపేరుతో బాలకృష్ణ ఏడు సినిమాల్లో నటించారు. తొలి చిత్రం ‘తాతమ్మకల’లో ఆయన పేరు కూడా బాలకృష్ణనే. ఆ సమయంలో బాలకృష్ణ తొమ్మిదో తరగతి చదివేవారు. 
12. బాలకృష్ణ 25వ చిత్రం ‘నిప్పులాంటి మనిషి’. ఎస్‌.బి.చక్రవర్తి దర్శకుడు. 50వ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇక 75వ చిత్రం ‘క్రిష్ణబాబు’ ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. 100వ చిత్రం ‘గౌతమీపుత్రశాతకర్ణి’ క్రిష్ దర్శకత్వం వహించారు.
13. ఎన్టీఆర్‌ నటించిన ‘యమగోల’ చిత్రాన్ని బాలకృష్ణతో తీయాలనుకున్నారు. ఎన్టీఆర్‌ యముడిగా, బాలకృష్ణ హీరోగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ, కుదరలేదు. 
14. బాలకృష్ణ నటించిన జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజా కథానాయిక. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. 
15. ‘భైరవద్వీపం’ విడుదలయ్యే వరకూ ఇందులో ఆయనే కురూపి వేషం వేశారన్న విషయాన్ని దాచిపెట్టారు. ఆ మేకప్‌ వేసుకోవడానికి తీయడానికి రెండేసి గంటలు సమయం పట్టేది. 
16. ‘ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌’, ‘తిరగబడ్డ తెలుగు బిడ్డ’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’, ‘లక్ష్మీ నరసింహా’, ‘అల్లరి పిడుగు’, ‘చెన్నకేశవరెడ్డి’ తదితర చిత్రాల్లో బాలకృష్ణ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. 
17.  అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి బాలకృష్ణ రెండు సినిమాల్లో నటించారు. ఒకటి ‘భార్యాభర్తల బంధం’ కాగా, మరొకటి ‘గాండీవం.
18. బాలకృష్ణ నటించిన ‘నిప్పు రవ్వ’, ‘బంగారు బుల్లోడు’ ఒకే రోజున విడుదలయ్యాయి.
19. బాలకృష్ణ మొత్తం 15 చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. ‘అధినాయకుడు’లో ట్రిపుల్‌రోల్‌ పోషించారు. 
20. బాలకృష్ణ అతిథి పాత్రలో నటించిన ఏకైక చిత్రం ‘త్రిమూర్తులు’.
21. బాలకృష్ణ నటించిన 35 చిత్రాలకు పరుచూరి బ్రదర్స్‌ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పనిచేశారు. 
22. బాలకృష్ణ కోసం పరుచూరి బ్రదర్స్‌ రాసిన కథతో ‘అల్లరి కృష్ణయ్య’ కథ క్లాష్‌ అయింది. దీంతో పరుచూరి బ్రదర్స్‌ ‘ప్రెసిడెంట్‌గారి అబ్బాయి’ కథ రాశారు. తొలుత ఈ సినిమాకు భానుప్రియను అనుకున్నారు. కానీ, సుహాసిని నటించారు. 
23. సినిమా ఆడదని తెలిసినా, తండ్రి మాటకు గౌరవం ఇచ్చి నటించిన చిత్రం ‘తిరగబడ్డ తెలుగు బిడ్డ’. 
24. ‘లారీడ్రైవర్‌’ కన్నా ముందు పరుచూరి బ్రదర్స్‌ ఒక కథ చెప్పారు. అది బి.గోపాల్‌కు నచ్చలేదు. అప్పుడు పుష్పానంద్‌ చెప్పిన లైన్‌ ఆధారంగా ‘లారీ డ్రైవర్‌’ తీర్చిదిద్దారు. 
25. బాలకృష్ణ డైలాగ్‌ బాడీ లాంగ్వేజ్‌తో పాటు, డైలాగ్‌ లాంగ్వేజ్‌ మార్చిన చిత్రం ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’. 
26. ఈ సినిమా కోసం బాలకృష్ణ రోజూ పోలీస్‌ జీపులోనే షూటింగ్‌కు వచ్చేవారట. 
27. ‘సమర సింహారెడ్డి’ చిత్రానికి తొలుత ‘సమర సింహం’ అని పెడదామనుకున్నారు. కానీ, చివరకు ప్రస్తుతం ఉన్న టైటిల్‌ అయితేనే బాగుంటుందని ఖరారు చేశారు. 
28. ‘నరసింహనాయుడు’లో కంటిచూపుతో చంపేస్తా డైలాగ్‌ మొదట లేదు. షూటింగ్‌ చివరి రోజున పరుచూరి గోపాలకృష్ణ రాశారు.
29. ‘నరసింహనాయుడు’ సినిమాను దేవి థియేటర్‌లో చూసిన గేటు బయటకు రావడానిడి దర్శకుడు బి.గోపాల్‌, రచయిత పరుచూరి గోపాలకృష్ణకు గంటా ఏడు నిమిషాలు పట్టింది. 
30. బాలకృష్ణ సెట్‌కు రాగానే తోటి నటీనటులను, సాంకేతిక బృందానికి అందరినీ విష్‌ చేసి షాట్‌కు వెళ్లిపోతారు.
31. బాలకృష్ణ నిద్రలేవగానే భూదేవికి నమస్కారం చేసి కాళ్లు కిందపెడతారు. 
32. బాలకృష్ణ తాను నటించిన చిత్రాల్లో ఎక్కువగా ఇష్టపడేది ‘సమర సింహారెడ్డి’. 
33. రజనీకాంత్‌ నటించిన చిత్రాల్లో ‘ముత్తు’, అమితాబ్‌ ‘అగ్నిపథ్‌’,  చిరంజీవి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలంటే బాలకృష్ణకు ఇష్టం.
34. బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ చిత్రానికి చిరంజీవి ప్రచారం చేశారు. 
35. ‘విశ్వామిత్ర’ షూటింగ్‌ సమయంలో కపాల మోక్షం పొందే నేపథ్యంలో సన్నివేశాలు తీస్తున్నారు. అప్పుడు బాలకృష్ణ కాలి వద్ద టపాసు పేలాలి. కానీ అది పేలలేదు. అంతలో మరొకటి విసరమని ఎన్టీఆర్‌ చెప్పారట. దీంతో పాటు అంతకుముందు వేసింది కూడా పేలింది. ఓ వైపు కాలికి గాయమై రక్తం కారుతున్నా, షాట్‌ పూర్తయ్యే వరకూ బాలకృష్ణ కదల్లేదు. 
36. బాలకృష్ణ రాముడిగా కనిపించిన చిత్రం ‘శ్రీరామరాజ్యం’
37. బాలకృష్ణ కృష్ణుడిగా ‘కృష్ణార్జున విజయం’, ‘పాండురంగడు’ చిత్రాల్లో కనిపించారు.
38. సినిమాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా ఎన్నికైన అతి తక్కువమంది నటుల్లో బాలకృష్ణ ఒకరు.
39. స్వీయ దర్శకత్వంలో ‘నర్తనశాల’ తెరకెక్కించాలనేది బాలకృష్ణ చిరకాల కోరిక. దానికి తగ్గట్టే సినిమా చిత్రీకరణ ప్రారంభించినా... వివిధ కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.
40. బాలకృష్ణ మూడుసార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘నరసింహనాయుడు’, ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల్లో నటనకు గానూ ఈ అవార్డులు లభించాయి.
41. ఎన్టీఆర్‌, బసవతారకం దంపతులకు ఆరో కుమారుడిగా నందమూరి బాలకృష్ణ 1960 జూన్‌ 10న మద్రాసులో పుట్టారు. 
42. ఎన్టీఆర్‌ ఎస్టేట్‌ కట్టిన తర్వాత ఆరేళ్ల వయసులో బాలకృష్ణ హైదరాబాద్‌ వచ్చేశారు. 
43. హైదరాబాద్‌లో రామకృష్ణ థియేటర్‌ డాబా మీద తన అన్నదమ్ములతో కలిసి ఆడుకునేవారు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేసేవారు. 
44. అద్దె సైకిళ్లు తీసుకుని ట్రూప్‌ బజార్‌, సుల్తాన్‌ బజార్‌ తిరిగేవారు. 
45.  బాలకృష్ణకు తెలుగు భాష, పద్యాలు, పురాణాల గురించి చెప్పడానికి ప్రత్యేకంగా ఒక తెలుగు మాస్టార్‌ ఉండేవారు. పద్యాలు సరిగ్గా చెప్పకపోతే ఆయన తొడపాశం పెట్టేవారట.
46. బాలకృష్ణకు 1982లో వసుంధర దేవితో వివాహం అయింది. వీరికి తేజస్వి, బ్రాహ్మణి ఇద్దరు కూతుళ్లు కాగా, మోక్షజ్ఞ కుమారుడు.
47. బాలకృష్ణ తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్రలేస్తారు. తప్పనిసరిగా యోగా, వ్యాయామం చేస్తారు.
48. బాలకృష్ణకు భక్తి ఎక్కువ. దేవుడిని నమ్ముతారు. అందుకు ప్రతిరోజూ తప్పకుండా పూజా చేస్తారు. ‘మనకోసం మనం కేటాయించుకునే సమయం ఒకటుంది. నాకు పూజా సమయం’ అని చెబుతుంటారు బాలయ్య. సూర్యోదయం అవ్వకముందే పూజా కార్యక్రమం ముగిస్తారు.
49. తన కుటుంబం కోసం ఏమిచ్చాను? తన కోసం ఎంత సమయం కేటాయించుకున్నానో బాలయ్య ఆలోచిస్తుంటారు. ఓ భర్తగా, తండ్రిగా తన కర్తవ్యాన్ని ఎప్పుడూ విస్మరించలేదని చెబుతారు.
50. ఆహారం విషయంలో బాలకృష్ణకు ప్రత్యేక నియమాలు అంటూ ఏవీ లేవు. అన్నీ తింటారు. ఇక సినిమాల్లో పాత్రను బట్టి తన డైట్‌లో స్వల్ప మార్పులు చేసుకుంటారు. అయితే, రాత్రి పూట మాత్రం భోజనం చేయరు.
51. ‘లెజెండ్‌’లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా బాలకృష్ణ ‘సైమా’ అవార్డును అందుకున్నారు.
52. బాలకృష్ణ తొలిసారి పాట పాడిన చిత్రం ‘పైసా వసూల్‌’. ‘మామా..ఏక్‌ పెగ్‌ లా’ అనే పాట పాడారు.
53. ఎన్టీఆర్‌ నటించిన అన్ని సినిమాల్లో ‘సీతారామ కళ్యాణం’ చాలా గొప్ప సినిమా అని బాలకృష్ణ అనేవారు.
54. బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. బాలకృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్టుల్లో ‘ఆదిత్య 999’ కూడా ఒకటి. 
55. బాలకృష్ణ ఇప్పటివరకూ ఒక్క కమర్షియల్‌ యాడ్‌లోనూ నటించలేదు.
56. బాలకృష్ణ ‘9’ అంకెను నమ్ముతారు. తన సినిమాకు సంబంధించిన ఏది ప్రకటించాలన్నా ‘9’ కలిసేలా చూసుకుంటారు.
57. బాలకృష్ణకు ఫేస్‌బుక్‌ ఖాతాలో మాత్రమే అకౌంట్‌ ఉంది. ప్రస్తుతం 9,07,093 మంది అనుసరిస్తున్నారు. 
58. బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరించిన ఏకైక చిత్రం ‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‌: మహానాయకుడు’
59.  బాలకృష్ణ ఇప్పటివరకూ ఎప్పుడూ సిక్స్‌ ప్యాక్‌లో కనిపించలేదు. ఎందుకు అని అడిగితే, ‘నేను రొమాన్స్‌ చేస్తే నప్పదు. చొక్కాలు విప్పి సిక్స్‌ప్యాక్‌ చేసినా చూడరు. అది మన సంస్కృతి కాదు’ అని సమాధానం ఇచ్చారు.
60. బాలకృష్ణ ‘సింహం’ పేరు కలిసేలా ఎనిమిది చిత్రాలు వచ్చాయి. ‘సింహం నవ్వింది’, ‘బొబ్బిలి సింహం’, ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘సీమ సింహం’, ‘లక్ష్మీ నరసింహా’, ‘సింహా’, ‘జై సింహా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి