భారత్, చైనా సరిహద్దుల్లో లద్దాఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరగడం... భారత్‌కు చెందిన 20 మంది సైనికులు.. చైనాకు చెందిన 43 మంది సైనికులు చనిపోవడం తెలిసిందే(ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం). చనిపోయినవారిలో తెలంగాణకు చెందిన సైనిక అధికారి కల్నల్ సంతోష్ బాబు కూడా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.
ఇంతకీ ఘర్షణ ఎందుకు జరిగింది?
ఇరుదేశాల సైనిక బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. సరిహద్దు నుంచి సైనికుల ఉపసంహరణ సమయంలో ఈ ఘర్షణ జరిగినట్లు భారత ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో చెప్పింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన ఒక సైనికాధికారి, ఇద్దరు జవాన్లు చనిపోయారని భారత సైన్యం మొదట తెలిపింది. ఆ తరువాత తీవ్రంగా గాయపడి మంచులో చిక్కుకుపోయిన మరో 17 మంది కూడా చనిపోయారని ప్రకటించింది.
ఇంతకీ ఈ గాల్వాన్ లోయ ఎక్కడుంది.. ఎందుకు దానిపై వివాదం?
తాజా ఘటనతో గాల్వన్ లోయ ప్రాంతం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ ఈ గాల్వన్ లోయ ఎక్కడుంది? దాని చుట్టూ వివాదం ఎందుకు రాజుకుంటోందో ఒక్కసారి చూద్దాం. తాజాగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న గాల్వన్ లోయతో సహా చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాల్లో దశాబ్దాలుగా భారత్, చైనాల మధ్య వివాదం రగులుతూనే ఉన్నాయి.
1962 భారత్-చైనా యుద్ధం తరువాత ఎన్నిసార్లు గొడవ పడ్డారంటే..
1962 భారత్ చైనా యుద్ధం తర్వాత కూడా.. సరిహద్దుల్లో కొన్నిసార్లు ఇరుదేశాల సైన్యం మధ్య కాల్పుల ఘటనలు జరిగాయి.
1967లో భారత్, చైనాల మధ్య సిక్కిం సరిహద్దుల్లో నాథూ లా, చో లా అనే రెండు ప్రదేశాల్లో కాల్పులు జరిగాయి. నాథూ లా వద్ద కాల్పుల్లో 36 మంది చైనా సైనికులు, 64 మంది భారతీయ సైనికులు మరణించగా.. చో లాలో భారత సైనికులు 36 మంది చైనా సైనికులు 160 మంది చనిపోయారు.
ఆ తరువాత 1975లోనూ రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం 2000లో గాల్వన్ సమీపంలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినా కాల్పులు జరగలేదు.
1975 తరువాత రెండు దేశాల సైనికులు చనిపోయేలా ఘర్షణ జరగడం మళ్లీ ఇదే.
అక్సాయ్ చిన్‌లోని అత్యంత వివాదాస్పద ప్రాంతం గాల్వాన్ వ్యాలీ
అక్సాయ్ చిన్‌లోని అత్యంత వివాదాస్పద ప్రాంతం గాల్వన్ లోయ. లద్ధాఖ్‌కు, అక్సాయ్ చిన్‌కు మధ్యలో ఇరుదేశాల సరిహద్దుల్లో ఈ లోయ ఉంటుంది.
పాకిస్తాన్, చైనాలతో కూడా ఈ ప్రాంతానికి సరిహద్దు ఉండటం వల్ల భారత్‌కు రక్షణ పరంగా ఇది చాలా ముఖ్యమైన ప్రాంతం.
1962లో చైనా యుద్ధంలో ఇదే ప్రధాన స్థానంగా నిలిచింది.
ఈ ప్రాంతంలో ఎలాంటి సైనిక నిర్మాణాలూ చేపట్టకూడదని చైనా అంటోంది.
ఇప్పటికే చైనా ఇక్కడ నిర్మాణాలు పూర్తి చేసిందని, ఇప్పుడు భారత్ నిర్మాణాలు చేపట్టాలనుకుంటుంటే మాత్రం చైనా పాత ఒప్పందాన్ని ప్రస్తావిస్తోందన్నది భారత్ ఆరోపణ.
గాల్వాన్ నది చాలా చిన్నదే కానీ యమ స్పీడు..
ఈ గాల్వన్ నది తూర్పు కారకోరం శ్రేణుల్లో ఉన్న శాంజున్‌లింగ్ (Samzungling) లో పుట్టి, భారత్‌లోని లద్దాఖ్ వరకూ ప్రవహించి అక్కడ షైయోక్(shyok) నదిలో కలుస్తుంది.
ఈ గాల్వన్ నది పొడవు కేవలం 80 కిలోమీటర్లు... దీనిలో నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది.
ఈ నదీలోయ ప్రాంతం రెండు దేశాల సరిహద్దుల్లో ఉంది.
చైనాతో 3,488 కిలోమీటర్ల మేర పితలాటకం
వాస్తవానికి భారత్‌కు చైనాతో 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇది, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కశ్మీర్‌లతో ఉంటుంది.
అయితే చాలా ప్రాంతాల విషయంలో సరిహద్దులను స్పష్టంగా నిర్ణయించడంపై రెండు దేశాల మధ్య ఏడు దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది.
1950లో చైనా జింజియాంగ్ నుంచి టిబెట్ వరకూ 1200 కిలోమీటర్ల రోడ్డు నిర్మించింది.
అందులో 179 కిలోమీటర్ల రోడ్డు వివాదాస్పద భూభాగమైన ఆక్సాయ్ చిన్ గుండా వెళ్తుంది.
1958లో చైనా ముద్రించిన మ్యాపుల్లో ఈ విషయాన్ని భారత్ గుర్తించింది.
అప్పటి నుంచి ఆక్సాయ్ చిన్ వివాదం నివురు గప్పిన నిప్పులా కొనసాగుతోంది.
చైనా అడ్డగోలు వాదన..
1962 యుద్ధం సమయంలో అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందనే భారత్ వాదనను చైనా ఇప్పటికీ ఒప్పుకోదు. అలాగే అరుణాచల్ ప్రదేశ్.. టిబెట్‌లో భాగమని చైనా అంటూ ఉంటుంది.
అంతేకాదు, మెక్ మోహన్ రేఖను కూడా సరిహద్దుగా చైనా అంగీకరించదు.
1914లో బ్రిటిష్ ఇండియాకు, టిబెట్‌కు మధ్య జరిగిన ఒప్పందంలో తాము భాగం కాలేదని, టిబెట్ తమ భూభాగమేననేది చైనా వాదన. నిజానికి అప్పట్లో టిబెట్ ఓ స్వతంత్ర దేశమే, కానీ బలహీనమైన దేశం. దీంతో చైనా ఆధిపత్యం కొనసాగేది.
1950లో దీన్ని చైనా పూర్తిగా నియంత్రణలోకి తీసుకుంది.
ఈ వివాదాల నేపథ్యంలోనే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే వాస్తవాధీన రేఖ ఏర్పాటైంది.
ఈ రేఖ పరిధిలోనే ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
గత పదేళ్లలో పదేపదే గొడవకు దిగిన చైనా
ఇటీవలి కాలంలో కూడా చైనా భారత్ సరిహద్దుల్లో చిన్న చిన్న వివాదాలు నెలకొంటూనే ఉన్నాయి.
2013లో లద్దాఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్దీ సెక్టార్‌లో వివాదం చోటు చేసుకుంది.
2014లో లద్దాఖ్‌లోని దెమ్చోక్ గ్రామం దగ్గర మరో వివాదం చోటు చేసుకుంది.
2015లో సెప్టెంబర్లో ఉత్తర లద్దాఖ్‌లో భారత్ చైనా బలగాలు తలపడ్డాయి.
ఇక 2017లో భూటాన్ సరిహద్దుల్లో డోక్లామ్ వివాదం చోటు చేసుకుంది.
2018లో దెమ్ చోక్ దగ్గర చైనా బలగాలు 400 మీటర్ల మేర భారత్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చాయి.
చర్చలు జరిగినా నో యూజ్
2020 మే 5 నుంచి భారత-చైనా సరిహద్దుల్లోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తాయి.
తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని చల్లార్చేందుకు రెండు దేశాల సైన్యం మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల కమాండర్లు అంగీకరించారు. సరిహద్దుకు అవతల చైనా సైన్యం భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతోందంటూ ఇటీవల భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దానికి భారత్ కూడా తగిన విధంగా చర్యలు చేపడుతుందన్నారు.
ముఖ్యంగా నియంత్రణ రేఖ దగ్గర చైనా అతిక్రమణ ఘటనలు ఏడాదిలో 600 సార్లకు చేరుకోవడంతో భారత్ ఈ చర్చలకు సిద్ధమైంది.
అంతే కాదు, రెండు దేశాల సైనికుల మధ్య అప్పట్లో మూడేళ్లలో ఒకసారి ఘర్షణ తలెత్తితే, ఇప్పుడు ఏడాదిలో మూడు సార్లు చైనా గొడవలకు దిగుతోంది.
ఈ సైనిక ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి భారత్ చొరవతో 6 జూన్ 2020న ఇరుదేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. ఇలా సరిహద్దు పోస్టులో రెండు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు జరగడం ఇదే మొదటిసారి.
సరిహద్దులు స్పష్టంగా లేకపోవడంతోనే వివాదం
రెండు దేశాల మధ్య హద్దులు నిర్ణయించడంలో అంతంత మాత్రంగానే ఉన్న వాస్తవాధీన రేఖ లద్ధాక్‌లో రెండు వైపులా వేరు చేస్తుంది.
నదులు, సరస్సులు, మంచుతో కప్పబడిన ఆ పర్వత ప్రాంతంలో స్థానిక పరిస్థితుల కారణంగా వాస్తవాధీన రేఖ రూపు రేఖలు తరచు మారుతూ ఉంటాయి.
ఫలితంగా ఎప్పటికప్పుడు రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తే పరిస్థితులు నెలకొంటున్నాయి.
ప్రస్తుతం గాల్వన్ లోయ, అలాగే పాంగాంగ్ టీఎస్ఓ ప్రాంతాల్లోనే ఘర్షణలు తలెత్తాయి. స
రిహద్దులో భారత్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతంలో నొండాస్ ప్రజలకు గాల్వన్ లోయే జీవనాధారం.
సాధారణంగా లద్ధాక్ అత్యంత చల్లదనంతో కూడిన మంచు ఎడారి ప్రాంతం.
అక్కడ మాములు పరిస్థితుల్లో కూడా పశువులకు ఆహారం లభించడం చాలా కష్టమవుతుంది.
దీంతో స్థానిక నాండోస్ ప్రజలు ప్రస్తుతం రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా మారిన పచ్చిక మైదాన ప్రాంతాలపైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు.
ఏటా చైనా బలగాలు ఆ ప్రాంతాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమిస్తూ వస్తూ ఉండటంతో తమ పశువుల మేతకు అనువుగా ఉన్న ప్రాంతం తగ్గిపోతుంది అంటారు వారు.