ఆరు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తు.. 135 కేజీల బరువు ఉండే ఆయన ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత.
అవును.. ప్రపంచ చరిత్రలో మరెందరో నియంతలు ఉన్నా వారంతా వేలు, లక్షల మందిని చంపి మారణహోమం సృష్టించినా కూడా క్రూరత్వంలో ఈయన కాలిగోటికి కూడా చాలరు.
ఎందుకంటే ఈ నియంత మనుషులను చంపడమే కాదు వారిని వండుకుని తినేసేవాడు కూడా.
అలాంటి క్రూరమైన నియంత పేరే ఈడీ అమీన్. ఉగాండాను చాలాకాలం ఏలాడు. ఆయన దెబ్బకు మన భారతీయులు కూడా చాలామంది అష్టకష్టాలు పడ్డారు.
ఉగాండాను వదిలి బతుకుజీవుడా అంటూ వేల మంది భారత్‌కు పారిపోయి వచ్చారు. మరికొందరు అక్కడే బలైపోయారు.
ఒకప్పుడు యుగాండా హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ అయిన ఈదీ అమీన్ 1971లో మిల్టన్ ఒబోటే ప్రభుత్వాన్ని కూలదోసి బలవంతంగా అధికారంలోకి వచ్చాడు.
అమీన్ ఉగాండాను పాలించిన ఎనిమిదేళ్లు అక్కడ రక్తపాతమే సాగింది. భయంకరమైన క్రూర ఘటనలకు సాక్ష్యంగా నిలిచిపోయింది.
ఆధునిక ప్రపంచ చరిత్రలో అమీన్ వంటి పాలకుడు ఇంకెవరూ లేరనే చెబుతారు చరిత్రకారులు.
మామూలోడు కాదు
|
ఈడీ అమీన్ Idi Amin
|
ఈడీ అమీన్ ఉగాండాలోని కాక్వా తెగకు చెందినవారు. ఆయన ఎప్పుడు పుట్టారన్నది కచ్చితమైన తేదీ ఇంతవరకు తెలియకపోయినా 1925లో పుట్టారని చెబుతారు.
తండ్రి వదిలేయడంతో తల్లి పోషణలోనే పెరిగిన అమీన్ 1946లో బ్రిటిష్ కొలోనియల్ ఆర్మీలో అసిస్టెంట్ కుక్‌గా చేరారు.
చాలా చురుకైనవాడు కావడంతో మిలటరీలో త్వరత్వరగా పైకెదిగాడు అమీన్. ఆరున్నర అడుగుల ఆజానుబాహుడైన అమీన్ 1951 నుంచి 1960 వరకు ఉగాండా లైట్-హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌గా ఉన్నాడు. మాంచి ఈతగాడు కూడా. అయితే.. తన డామినేటింగ్ నేచర్ వల్ల మిగతా సైనికులను వేధించేవాడు.
బ్రిటిష్ ఆర్మీలో ఒక బ్లాక్ ఆఫ్రికన్ చేరుకోగల అతిపెద్ద ర్యాంకును ఆయన సాధించాడు. కెన్యాలో 1952-56 మధ్య సాగిన తిరుగుబాటును అణచివేసే పనిలో బ్రిటిష్ ఆర్మీలో ఆయన పనిచేశాడు.
1962లో ఉగాండాకు స్వాతంత్ర్యం రావడానికి ముందు అప్పటి ప్రైమ్ మినిష్టర్ కమ్ ప్రెసిడెంట్ మిల్టన్ ఒబొటెకు సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి కాంగో నుంచి బంగారం, ఏనుగు దంతాల స్మగ్లింగ్ చేసేవారు. అయితే, తొందరలోనే ఇద్దరి మధ్యా విభేదాలు మొదలయ్యాయి.
ఇలాంటి సమయంలో 1971 జనవరి 25న ఒబొటె సింగపూర్‌లో ఒక మీటింగుకు వెళ్లగా అమీన్ సైనిక తిరుగుబాటు చేసి తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. 1976లో ఆయన ఉగాండాను తానే శాశ్వత అధ్యక్షుడిగా ఉండేలా చట్టాలను మార్చుకున్నారు.
1971లో తిరుగుబాటు చేసి అధికారం చేపట్టిన తరువాత అమీన్ కిల్లర్ స్క్వాడ్స్ ఒబొటె మద్దతుదారులు లక్షలాది మందిని వెంటాడివేటాడి చంపేశాయి. వారంతా ఎక్కువగా అకోలీ, లాంగో తెగలకు చెందినవారే. సైన్యంలో ఒబోటెకు అనుకూలంగా ఉన్నవారు, ప్రజలను కూడా అమీన్ మనుషులు దారుణంగా చంపేశారు.
లాయర్లు, జర్నలిస్టులు, విద్యార్థులు, హోమో సెక్సువల్స్‌ను కూడా చంపించాడు అమీన్.
దారుణాతి దారుణంగా సుమారు 3 లక్షల మందిని చంపించిన అమీన్‌న్ ‘ఉగాండా కసాయి’ అంటారు.
1976లో తానే స్వయంగా ఒక ఫ్రెంచ్ విమానాన్ని హైజాక్ చేశాడు అమీన్.
ఆసియా ప్రజలపై హఠాత్తుగా ఆగ్రహం
1972 ఆగస్టు 4న ఈదీ అమీన్ ఆ దేశంలో ఉన్న ఆసియా ప్రజల విషయంలో పిడుగులాంటి నిర్ణయం తీసుకున్నాడు.
ఉగాండాలోని టొరోరో నగరంలో తన సైనికాధికారులతో సమావేశమైన ఆయన అక్కడి ఆసియా ప్రజలందరినీ దేశం నుంచి వెంటనే పంపించివేయమని అల్లా తనను ఆదేశించాడని వారితో చెప్పారు.
అల్లా తనకు కలలో కనిపించి ఆ మాట చెప్పాడంటూ అమీన్ ఆదేశాలు జారీ చేశాడు.
ఆసియా ప్రజలు ఉగాండాను దోచుకోవాలని చూస్తున్నారు.. వారందరినీ 90 రోజుల్లో పంపించేయాలని సైనికాధికారులను ఆదేశించాడు.
నిజానికి 60 వేల మంది ఆసియా వాసులను అప్పటికప్పుడే దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాడు అమీన్. ఆ తరువాత వారికి 90 రోజుల గడువు ఇచ్చాడు.
అయితే.. అమీన్ ప్రకటనను ఆసియా ప్రజలు మొదట పెద్దగా పట్టించుకోలేదు. ఏదో ఆగ్రహంలో అలా అన్నాడు కానీ తరువాత సర్దుకుంటుందని అనుకున్నారు. కానీ, వారం రోజుల్లోనే వారికి అర్థమైపోయింది. ఉగాండాను వదిలి వెంటనే వెళ్లకపోతే ప్రాణాలు దక్కవని.
ఆస్తులు కూడా వదిలేసి వెళ్లాలని ఆర్డర్స్
అమీన్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఆయన నిర్ణయం మార్చుకునేలా చేయడానికి బ్రిటన్ రంగంలోకి దిగింది. ఆ దేశ మంత్రిని ఉగాండా రాజధాని కంపాలకు పంపించింది. కానీ, అమీన్ ఆ మంత్రిని వారం రోజులు వెయిట్ చేయించాడు కానీ కలవలేదు.
ఆ తరువాత కలిసినా బ్రిటన్ మాటను ఏమాత్రం లెక్క చేయలేదు.
భారత ప్రభుత్వం కూడా అక్కడి భారతీయులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా దౌత్యం చేయడానికి విదేశాంగ శాఖ అధికారులను పంపించింది. అందులో నిరంజన్ దేశాయ్ ప్రధానమైనవారు.
ఆయన ఉగాండా వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయారు.
అక్కడి పరిస్థితులను ఆయన తరువాత వివిధ సందర్భాల్లో వెల్లడించారు.
ఆసియా ప్రజలకు తమతో 250 కేజీల సామాగ్రి, 55 పౌండ్ల డబ్బుమాత్రమే తీసుకెళ్లడానికి అనుమతించారని.. మిగతాదంతా వదిలి వెళ్లాలని కఠినంగా చెప్పారని దేశాయ్ అప్పటి పరిస్థితులను చెప్పారు.
కొందరు డబ్బు ఖర్చు పెట్టేశారు.. కొందరు మళ్లీ రావొచ్చని బంగారం పాతిపెట్టారు
అమీన్ దెబ్బకు ఉగాండా వదిలివెళ్లక తప్పదని అర్థమైన ఆసియన్లు తమ డబ్బును కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు. అమీన్ నిర్ణయాన్ని అమలు చేయడంలో అధికారులు విఫలం కావడంతో కొందరు తెలివిగా తమ డబ్బును దేశం దాటించగలిగారు.
కొందరు తెలివిగా ప్రపంచమంతా తిరగడానికి మొత్తం కుటుంబానికి ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కోని... మిస్లీయస్ చార్జ్ ఆర్డర్ల ద్వారా ఈ బుకింగ్స్ చేశారు. ఉగాండా నుంచి బయటకు వెళ్లాక ఈ మిస్లీనియస్ చార్జ్ ఆర్డర్లను క్యాష్ చేసుకోగలిగారు.
మరికొందరు కార్లలో కార్పెట్ల కింద డబ్బు దాచి పొరుగు దేశం కెన్యా పారిపోయారు.
కొంతమంది పార్శిల్ ద్వారా తమ బంగారం స్వదేశాలకు పంపించేశారు.
మళ్లీ ఉగాండా రాగలమని ఆశ పెట్టుకున్నవారు తమ ఇళ్ల పెరళ్లో.. తోటల్లో బంగారాన్ని పాతి పెట్టారు.
కొందరు భారతీయులు అక్కడున్న బ్యాంక్ ఆఫ్ బరోడాలో లాకర్లలో డబ్బు, బంగారం దాచి పదిహేనేల్ల తరువాత ఉగాండా వెళ్లి తమ డబ్బు తాము తీసుకోగలిగారు.
ఆసియన్ల సంపదను దోచుకున్నారు
చాలా మంది ఆసియా ప్రజలు తమ షాపులు, ఇళ్లు అలా ఉంచేసి వచ్చేశారు. ఇంట్లో సామాను అమ్ముకునే చాన్సు కూడా వారికివ్వలేదు.
తమతో పాటు బయటికి తీసుకెళ్లే సామాన్లను కకూడా ఉగాండా సైనికులు లాక్కున్నారని చాలామంది చెబుతారు.
ప్రజలు వదిలేసి వెళ్లిన సంపదను స్థానికులు కొందరు చేజిక్కించుకోగా మరికొంత సైనికాధికారులు, ప్రభుత్వంలో ఉన్నవారు దోచుకున్నారు.
సాధారణ ప్రజలకు దొరికింది తక్కువే.
ఆసియన్ల దుకాణాలు, హోటళ్లు, ఇల్లు, ఆస్తులను అమీన్ తన సైనికాధికారులకు ఇష్టమొచ్చినట్లు పంచిపెట్టారు.
నరరూప రాక్షసుడు
ఈడీ అమీన్‌కు నరరూప రాక్షసుడనే పేరు స్థిరపడిపోయింది. అతడి క్రూరత్వం గురించి ప్రపంచమంతా కథలు కథలుగా చెప్పుకునేవారు.
అమీన్ హయాంలో ఆరోగ్య మంత్రిగా ఉన్న హెన్రీ కెయెంబా 'ఎ స్టేట్ ఆఫ్ బ్లడ్: ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఈదీ అమీన్' అనే ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన అమీన్ క్రూరత్వం గురించి రాశారు. అది చదివిన ప్రపంచం భయంతో వణికిపోయింది.
శత్రువులను చంపి మర్మాంగాలు తినేసేవాడు
ఈదీ అమీన్ తన శత్రువులను చంపడమే కాదు, వారు చనిపోయిన తర్వాత వారి శవాలను కూడా వదిలేవాడు కాడు. మార్చురీలో శవాలు తెరిచి ఉండేవని, వాటి మూత్రపిండాలు, కాలేయం, ముక్కు, పెదవులు, మర్మాంగాలు మాయమయ్యేవని ఉగాండా మెడికల్ ఉద్యోగులు ఎప్పుడూ చెప్పుకునేవారు.
1974 జూన్‌లో ఫారిన్ సర్వీస్ అధికారి గాడ్ఫ్రీ కిగాలాను కాల్చి చంపినప్పుడు అతడి కళ్లు పీకి శవాన్ని కంపాలా బయట అడవుల్లో పడేశారు.
చనిపోయిన వ్యక్తుల మధ్య ఒంటరిగా గడపడం తనకు ఇష్టమని అమీన్ తన వద్ద పనిచేసేవారితో చెప్పేవాడు.
1974 మార్చిలో కార్యనిర్వాహక సైన్యాధ్యక్షుడు బ్రిగేడియర్ చార్లెస్ అరూబే హత్య జరిగినపుడు, అమీన్ ఆయన శవాన్ని చూడడానికి ములాగో ఆస్పత్రిలోని మార్చురీకి కూడా వెళ్లాడు.
శవంతోపాటూ తను అక్కడే కాసేపు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నానని.. అందరూ వెళ్లిపోవాలని అమీన్ ఆదేశించడంతో ఆసుపత్రి మొత్తం ఖాళీ చేస్తారు.
అమీన్ కాక్వా జాతి సంప్రదాయం ప్రకారం తన శత్రువు రక్తం తాగారని ఉగాండా ప్రజలు చెబుతారు. అమీన్ కూడా కాక్వా జాతికి చెందినవాడే.
మనిషి మాంసం తిన్నానని అమీన్ అనేకసార్లు చెప్పినట్లు ఆయన వద్ద పనిచేసేవారు తరువాత కాలంలో చెప్పారు.
1975 ఆగస్టులో అమీన్ కొంతమంది సీనియర్ అధికారులకు తన జయీర్ పర్యటన గురించి అమీన్ చెబుతూ.. అక్కడ తనకు కోతి మాంసం వడ్డించారని.. కానీ, అది మనిషి మాంసం అంత రుచిగా లేదని అమీన్ చెప్పారట.
అంతేకాదు.. యుద్ధ సమయంలో తిండి దొరక్కపోతే గాయపడిన తోటి సైనికులను చంపి తినేయమని కూడా అమీన్ చెప్పేవారట.
ఫ్రిజ్‌లో మనిషి తలలు
అమీన్ దగ్గర అప్పట్లో నౌకరుగా పనిచేసిన మోజెజ్ అలోగా, కెన్యా పారిపోయి వచ్చాక ఆయన గురించి ఒక కథ చెప్పారు. దానిని ఈ కాలంలో నమ్మాలంటే చాలా కష్టం.
అమీన్ పాత ఇంట్లోని కమాండ్ పోస్ట్‌లో ఒక గది ఎప్పుడూ మూసి ఉండేది, దాని లోపలికి వెళ్లడానికి అలోగాకు మాత్రమే అనుమతి ఉండేది. అలోగాను కూడా ఆ గదిని శుభ్రం చేయడానికి మాత్రమే వెళ్లనిచ్చేవారు.
అమీన్ ఐదో భార్య సారా క్యోలాబాకు ఆ గది గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉండేది. ఆమె అలోగాను ఆ గదిని తెరవమని చెప్పారు. అమీన్ చంపేస్తాడని చెప్పినా వినకుండా ఆమె ఒత్తిడి చేయడంతో అలోగా ఆ గది తాళం సారాకు ఇస్తాడు.
ఆ గది లోపల ఉన్నరెండు ఫ్రిజ్‌లలో ఒక ఫ్రిజ్ తలుపు తెరిచిన ఆమె గట్టిగా అరిచి స్పృహతప్పి పడిపోయంది. అందులో ఆమె మాజీ ప్రియుడు జీజ్ గిటా తల కనిపిస్తుంది.
సారా ప్రియుడిలాగే, అమీన్ చాలా మంది మహిళల ప్రియుల తలలు కూడా నరికించారు. ఇండస్ట్రియల్ కోర్ట్ చీఫ్ మైకేల్ కబాలీ కాగ్వా ప్రియురాలు హెలన్ ఓగ్వాంగ్‌పై అమీన్ కన్నుపడడంతో, ఆయన బాడీగార్డ్స్ కంపాలా ఇంటర్నేషనల్ హోటల్లో స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న కబాలీని కాల్చిచంపారు. తర్వాత హెలెన్‌ను పారిస్‌లో ఉన్న ఉగాండా రాయబార కార్యాలయంలో వేశారు. ఆమె అక్కడ్నుంచి పారిపోయి తప్పించుకుంది.
మకెరేరే యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్, తొరోరోలోని రాక్ హోటల్ మేనేజర్ భార్యలపై కూడా మనసుపడ్డ అమీన్ వారి భర్తలను పక్కా ప్లాన్ ప్రకారం చంపించారు.
అమీన్ ప్రియరాళ్ల సంఖ్యను లెక్కపెట్టడం కూడా కష్టం. ఒకప్పుడు ఆయన కనీసం 30 మంది మహిళలతో సంబంధాలు నడిపేవారని, వారికోసం ఆయన మొత్తం ఉగాండా తిరిగేవారని చెబుతారు. ఆ మహిళలు ఎక్కువగా హోటళ్లు, ఆఫీసులు, ఆస్పత్రుల్లో నర్సులుగా పనిచేస్తూ ఉండేవారని చెబుతారు.
11 వేల మంది భారత్ వచ్చారు
మళ్లీ ఆసియన్లను పంపించేయడందగ్గరకు వస్తే... ఉగాండా నుంచి ఆసియా వాసులను తరిమేసిన తర్వాత ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది.
ఉత్పత్తుల లోటు ఊహించలేనంతగా పెరిగింది. హోటళ్లలో బ్రెడ్ లాంటివి కూడా దొంగిలించేవారు.
ఉగాండా నుంచి బయటపడ్డ 60 వేల మందిలో 29 వేల మంది బ్రిటన్ చేరారు.
11 వేల మంది భారత్ వెళ్లారు. 5 వేల మంది కెనడాకు, మిగతా వారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు.
కట్టుబట్టలతో వచ్చిన వారందరినీ బ్రిటన్ రిటైల్ పరిశ్రమ ఆదుకుంది. బ్రిటన్‌లోని ప్రతి నగరంలో కూడళ్లలో పటేల్ దుకాణాలు తెరుచుకున్నాయి. వాళ్లు పాలు, వార్తా పత్రికలు అమ్మేవారు.
ఆరోజు ఉగాండా నుంచి బ్రిటన్ వెళ్లిన కుటుంబాలన్నీ ఇప్పుడు బాగా స్థిరపడ్డాయి. ప్రాణాలతో బయటపడ్డ ఆసియ వాసులు బ్రిటన్ సంస్కృతికి అలవాటు పడడంతోపాటు ఆ దేశ ఆర్థికాభివృద్ధిలో కూడా భాగమయ్యారు.
8 ఏళ్ల అమీన్ క్రూర పాలన ముగిసిందిలా..
8 ఏళ్లు పాలించిన ఈదీ అమీన్, తను ఎలా అధికారం చేజిక్కించుకున్నాడో, అలాగే అధికారం కోల్పోయాడు.
1971లో సైనిక తిరుగుబాటు చేసి అధికారంలోకొచ్చిన సంగతి తెలిసిందే.
1978లో పొరుగున ఉన్న టాంజేనియాపై దాడికి ఆదేశించాడు అమీన్. కొన్నాళ్లపాటు ఈ యుద్దంసాగింది. అయితే.. ఉగాండా నేషనలిస్టుల సహాయంతో టాంజేనియా ఆర్మీ ఈ దాడిని తిప్పికొట్టింది.
అదే సమయంలో 1979లో అప్పటి ఉపాధ్యక్షుడు జనరల్ ముస్తఫా అద్రసీ తిరుగుబాటు చేశారు. మరోవైపు టాంజేనియా బలగాలు ఉగాండా రాజధాని కంపాలా వరకు వచ్చేశాయి.
దీంతో అమీన్ అక్కడి నుంచి పారిపోయి లిబియాలో తలదాచుకున్నాడు.
అసలు లిబియా అధినేత కల్నల్ గడాఫీ స్ఫూర్తితోనే అమీన్ ఇదంతా చేశారని చెబుతారు.. గడాఫీ, అమీన్లు మంచి స్నేహితులు.
అలా లిబియా చేరుకున్న అమీన్ ఆ తరువాత సౌదీ అరేబియా పారిపోయి అక్కడే చరమాంకం గడిపాడు.
2003లో 78 ఏళ్ల వయసులో సౌదీలోని జెడ్డాలో కిడ్నీలు విఫలం, ఇతర అనారోగ్య సమస్యలతో కోమాలోకి వెళ్లి చనిపోయాడు.