విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ గ్యాస్ లీకవడం.. 12 మంది మరణించడం.. వందలాది మంది ఆసుపత్రుల పాలవడం.. లక్షల మంది ప్రాణభయంతో విశాఖపట్నం వదిలి వెళ్లడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారతదేశంలో అత్యంత భయానకమైన అయిదు పారిశ్రామిక ప్రమాదాలు(ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్) ఏంటో చూద్దాం.
1) భోపాల్ గ్యాస్ ట్రాజెడీ
ప్రపంచంలోనే అత్యంత విషాద పారిశ్రామిక ప్రమాదంగా దీన్ని చెబుతారు.1984 డిసెంబరు 2 అర్ధరాత్రి దాటాక ఈ దుర్ఘటన జరిగింది. భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) పెస్టిసైడ్ ప్లాంట్ నుంచి మిథైల్ ఐసోసైనేట్(ఎంఐసీ) వాయువు లీవకవడంతో 5 లక్షల మందికి పైగా దీని ప్రభావానికి గురయ్యారు.
ఈ దుర్ఘటనలో చనిపోయినవారి సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ 2,259 మంది మరణించారని దుర్ఘటన జరిగిన వెంటనే అధికారికంగా ప్రకటించినప్పటికీ 1991లో అనేక అధ్యయనాల తరువాత ఆ సంఖ్యను 3,928కి పెంచారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3,787 మంది చనిపోయినట్లు ప్రకటించింది.
2006లో ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్ ప్రకారం ఈ దుర్ఘటన వల్ల 5,58,125 మంది గాయపడ్డారు.
వీరిలో 38,478 మంది పాక్షికంగా గాయపడగా 3,900 మంది శాశ్వత వైకల్యానికి గురయ్యారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎన్విరానమెంటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇండియా సంయుక్త అధ్యయనం ప్రకారం భోపాల్ విషవాయు దుర్ఘటన బాధితుల్లో 2 లక్షల మంది 15 ఏళ్ల లోపువారు కాగా.. 3,000 మంది గర్భిణులు ఉన్నారు.
2) చస్నాలా గని ప్రమాదం
ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఉన్న ధన్‌బాద్‌లో బొగ్గు గనిలో 1975లో జరిగిన పేలుడులో 372 మంది చనిపోయారు.భారతదేశ చరిత్రలో జరిగిన భారీ పారిశ్రామిక ప్రమాదాలలో దీన్ని కూడా చెబుతారు.
1975 డిసెంబరు 27 సాయంత్రం మీథేన్ గ్యాస్‌కు మంటలు అంటుకుని పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది.
పేలుడు జరిగింది బొగ్గు గనిలో కావడంతో మంటలు భారీగా వ్యాపించి ప్రాణనష్టం పెరిగింది.
అంతేకాదు.. ఈ ప్రమాదం వల్ల గని కూలిపోయి పక్కనే ఉన్న రిజర్వాయర్ నుంచి నిమిషానికి 70 లక్షల గ్యాలన్న పరిమాణంలో నీరు నిండడంతో పేలుడు ప్రాంతానికి దూరంగా ఉన్న కార్మికులూ చనిపోయారు.
1976 జనవరి 19 వరకు గనిలో గాలించినా ఒక్కరు కూడా ప్రాణాలతో కనిపించలేదు.. మృతుల్లోనూ ఎందరివో శవాలు దొరకలేదు.
372 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ స్థానిక కార్మిక సంఘాలు 700 మందికిపైగా చనిపోయారని చెబుతాయి.
ఈ ఘటన నేపథ్యంలో బాలీవుడ్‌లో కాలాపత్తర్ అనే సినిమా తీశారు.
3) బాంబే రేవులో పేలుడు
1944 ఏప్రిల్ 14న ముంబయి(అప్పట్లో బొంబాయి) రేవులోని విక్టోరియా డాక్‌లో పత్తి బేళ్లు, బంగారం, మందుగుండు, 1400 టన్నుల పేలు పదార్థాలతో ఉన్న ఓడలో మంటలు చెలరేగి రెండు భారీ పేలుళ్లు సంభవించాయి.మంటలకు భారీ నిప్పు కణికలు ఎగసిపడి రెండు కిలోమీటర్ల దూరం వరకు జనావాసాలు కూడా తగలబడిపోయాయి.
ఈ ప్రమాదంలో 800 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారన్నవాదనలూ ఉన్నాయి.
231 మంది నౌకాశ్రయ సిబ్బంది, 66 మంది అగ్నిమాపక సిబ్బంది, 500 మంది సాధారణ ప్రజలు చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2500 మంది గాయపడ్డారు.13 ఓడలు నాశనమయ్యయి. అపారమైన ఆస్తి నష్టం సంభవించింది.
ఈ పేలుడు కారణంగా ఓడ శకలాలు 12 కిలోమీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి.
పేలుడు తీవ్రతకు బొంబాయికి 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి.
4) జైపూర్ చమురు డిపో అగ్ని ప్రమాదం
2009లో రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ శివారులోని సీతాపూర్ పారిశ్రామికవాడలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) డిపోలో 8 వేల కిలోలీటర్ల సామర్థ్యం(2,80,000 ఘనపుటడుగులు) గల చమురు ట్యాంకర్ పేలిపోవడంతో 12 మంది మరణించారు.200 మందికిపైగా తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.5 లక్షల మంది ప్రజలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు.
వారం రోజుల వరకు మంటలు అదుపులోకి రాలేదు. ట్యాంకర్ నుంచి పైప్‌లైన్లోకి పెట్రోలు విడిచిపెడుతుండగా పేలుడు సంభవించి మంటలు చెలరేగినట్లు నిర్ధరించారు.ఈ పేలుడు వల్ల రిక్టర్ స్టేల్‌పై 2.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.
3 కిలోమీటర్ల దూరం వరకు ఇళ్ల కిటికీలు విరిగిపోయాయి.120 అడుగుల ఎత్తు వరకు మంటలు వ్యాపించడంతో 30 కిలోమీటర్ల దూరంలోని ప్రజలు కూడా ఈ మంటలను చూశారు.
జాతీయ రహదారి పక్కనే ఈ ప్లాంట్ ఉండడంతో 20 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. చుట్టుపక్కల ప్రాంతాలను ప్రజలను ఖాళీ చేయించడానికి సైన్యాన్ని దించాల్సి వచ్చింది.
5) కోర్బాలో కూలిన చిమ్నీ - 2009
చత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో 2009 సెప్టెంబరు 23న భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(బాల్కో)లో నిర్మాణంలో ఉన్న చిమ్నీ కూలిపోవడంతో 45 మందికిపైగా చనిపోయారు.790 అడుగుల ఎత్తు వరకు నిర్మించిన చిమ్నీ కూలిపోయినప్పటికీ అక్కడ 100 మందికిపైగా ఉన్నారు.
ఆ సమయంలో మెరుపులతో వర్షం, భారీ గాలి దుమారం రావడంతో దాన్నుంచి తప్పించుకోవడానికి వీరంతా చిమ్నీ పక్కకు చేరగా అది కూలిపోవడంతో దాని కింద నలిగిపోయారు.
వేదాంత రిసోర్సెస్ నిర్వహణలోని బాల్కోలో 902 అడుగుల ఎత్తున ఈ నిర్మాణం చేపట్టగా మధ్యలోనే అది కూలిపోయి కార్మికుల ప్రాణాలు తీసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి