16, మే 2020, శనివారం

నిర్మలాసీతారామన్: బొగ్గురంగంలో ప్రయివేట్‌కు ప్రోత్సాహం, రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్



బొగ్గు వెలికితీతలో ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యం తగ్గిస్తున్నట్లు తెలిపారు. అలాగే రక్షణ ఉత్పత్తుల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 నుంచి 79 శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు.
ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా నాలుగో విడత ప్యాకేజీ వివరాలను వెల్లడించిన ఆమె బొగ్గు, ఖనిజాలు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్ మేనేజ్ మెంట్, పవర్ డిస్ట్రిబ్యూషన్, స్పేస్, ఆటమిక్ ఎనర్జీ వంటి రంగాల్లో సంస్కరణలు తెస్తున్నట్లు ప్రకటించారు. ఆరు విమానాశ్రయాలను ప్రయివేటుకు అప్పగిస్తున్నట్లు కూడా చెప్పారు.

* బొగ్గురంగంలో 

ప్రభుత్వ గుత్తాధిపత్యం తగ్గించి ప్రయివేటు రంగానికి ప్రోత్సాహం అందించనున్నట్లు మంత్రి చెప్పారు.
ప్రస్తుతం ప్రతి టన్నుకూ ఇంతని స్థిర ధర ఉందని.. అలా కాకుండా రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేస్తామని చెప్పారు. అలాగే బొగ్గు వేలంలో ఎవరైనా పాల్గొనేలా నిబంధనలు సడలిస్తున్నట్లు చెప్పారు.
తక్షణం 50 బొగ్గు బ్లాకులు కేటాయిస్తున్నామని.. మౌలిక వసతుల కల్పనకు రూ. 50 వేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.

* ఖనిజ రంగం విషయానికొస్తే 

500 మైనింగ్ బ్లాకులను వేలం ద్వారా కేటాయించనున్నట్లు ప్రకటించారు. అల్యూమినియం పరిశ్రమలో కాంపిటీటివ్‌నెస్ కోసం ఇకపై బాక్సైట్, బొగ్గు బ్లాకులకు సంయుక్త వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు.

* రక్షణ రంగంలో 

కొన్ని ఆయుధాలను ఇకపై దిగుమతి చేయడం మానేసి దేశీయంగా తయారుచేసుకోనున్నట్లు చెప్పారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును కార్పొరేట్ చేసి రక్షణ సరఫరాలో స్వయంప్రతిపత్తి, సామర్థ్యం పెంచుతామని మంత్రి చెప్పారు.

* విమానయాన రంగానికొస్తే 

కొత్తగా 6 విమానాశ్రయాలను ప్రయివేటుకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 12 ఎయిర్పోర్టులను ప్రయివేటుకు అప్పగించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 2300 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. కొత్తగా 12 విమానాశ్రయాల నిర్మాణానికి రూ. 13 వేలు కేటాయిస్తామన్నారు.

* విద్యుత్ రంగంలో 

పంపిణీ సంస్థలు మనుగడ సాధించడానికి వీలుగా సంస్కరణలు చేపడుతున్నట్లు చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిస్కమ్ లను ప్రయివేటీకరిస్తున్నట్లు చెప్పారు.

* అంతరిక్ష రంగంలో 

ప్రయివేటు భాగస్వామ్యం కల్పిస్తామని.. ప్రయివేటు సంస్థలు ఇస్రో సౌకర్యాలను వాడుకునే అవకాశమిస్తామని చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి