21, మే 2020, గురువారం

Anti-Terrorism Day Rajiv Gandhi : రాజీవ్ గాంధీ విశాఖపట్నం నుంచి వెళ్లిన గంటల్లోనే ఎలా హత్యకు గురయ్యారు

రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ


సరిగ్గా 29 సంవత్సరాల కిందట.. భారతదేశం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యింది.
అవును.. 1991 మే 21న రాత్రి పది గంటల 21 నిమిషాలకు జరిగిన ఆ హత్య దేశాన్ని కుదిపేసింది.
మాజీ ప్రధానమంత్రినే బాంబులు పేల్చి చంపేశారు. రాజీవ్ గాంధీ శరీరం తునాతునకలైపోయింది.

వైజాగ్‌లో ఉమాగజపతిరాజు తరఫున ప్రచారం.. అక్కడి నుంచి తమిళనాడుకు..

రాజీవ్ గాంధీ, ఉమా గజపతి రాజు(ఫొటో క్రెడిట్: సంచయిత గజపతిరాజు)

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉమా గజపతి రాజు తరఫున ఎన్నికల ప్రచారం ముగించి అక్కడి నుంచి తమిళనాడులోని శ్రీపెరంబదూరులో  ఎన్నికల సభకు వెళ్లారు రాజీవ్ గాంధీ.
సుమారు 30 ఏళ్లుంటాయేమో.. ఒక నల్లని యువతి పూల మాల తీసుకుని రాజీవ్ గాంధీ వైపు వచ్చింది. ఆయన పాదాలకు నమస్కరించడానికి వంగింది. అంతే... చెవులు దద్దరిల్లిపోయే శబ్దంతో ఆ ప్రాంతంమంతా పొగ, ధూళి కమ్మేసింది.
ఒక్కొక్కరి శరీరభాగాలు గాల్లోకి ఎగిరాయి.. ఎటుచూసినా రక్తం, మాంసపు ముద్దలే. పూలమాల వేయడానికి వచ్చిన 30 ఏళ్ల మానవ బాంబు  థాను రాజీవ్ పాదాలకు నమస్కరించేలా చేస్తూ తన నడుముకు కట్టుకుని వచ్చిన బాంబును పేల్చడంతో ఆమెతో పాటు రాజీవ్ కూడా చనిపోయారు. 
ఆ భయంకరమై పేలుడు సమయంలో తమిళనాడు కాంగ్రెస్‌ నేతలు మూపనార్, జయంతి నటరాజన్, రామమూర్తి వేదికపై రాజీవ్ గాంధీకి సమీపంలోనే ఉన్నారు. మూపనార్ ఎగిరి అల్లంత దూరంలో పడ్డారు.
తేరుకున్న నేతలంతా ఆ పొగలోనే రాజీవ్ గాంధీ కోసం వెతకడం ప్రారంభించారు. ఆయన శరీరంలో ఒక భాగం, సగం తల కనిపించింది. ఆయన తల ఛిద్రమైంది. దాని నుంచి బయటికొచ్చిన మెదడు, ఆయన సెక్యూరిటీ అధికారి పీకే గుప్తా కాళ్లపై పడి ఉంది. గుప్తా కూడా చావు బతుకుల్లో ఉన్నారు.
పేలుడుకు ప్రత్యక్ష సాక్షి అయిన మూపనార్ ఆ తరువాత ఆ భయంకర ఘటన గురించి వివరిస్తూ " పేలుడు జరగగానే నేను పరుగులు తీశాను. నా ముందు శవాల భాగాలు పడి ఉన్నాయి. రాజీవ్ సెక్యూరిటీ అధికారి ప్రదీప్ గుప్తా అప్పటికి బతికే ఉన్నారు. నా కళ్ల ముందే ప్రాణాలు వదిలారు’’ అని చెప్పారు.
జయంతి నటరాజన్ అయితే ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయారు.
రాజీవ్ గాంధీ కోసం వెతికితే ముఖం, తల పగిలిపోయి కనిపించడంతో ఆమె భీతిల్లిపోయారు.
రాత్రి 10.50 నిమిషాలకు దిల్లీలోని జనపథ్‌లో రాజీవ్ నివాసంలో ఉన్న ఆయన భార్య సోనియా గాంధీకి విషయం చెప్పారు. ఆమె దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చారని రషీద్ కిద్వాయ్ తన పుస్తకంలో రాశారు ఆ తరువాత.
‘‘ఆ సమయంలో సోనియాకు ఆస్తమా అటాక్ చాలా తీవ్రంగా వచ్చింది. ఆమె దాదాపు స్పృహతప్పిపోయారు’’ అని రషీద్ రాశారు.
ఆ తరువాత ఎల్టీటీఈ ఈ దాడి చేసిందని తేల్చారు. ఎల్టీటీఈకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు శివరసన్, ఆయన సహచరులు అరెస్ట్ కావడానికి ముందు సైనైడ్ తిని చనిపోయారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి