21, డిసెంబర్ 2020, సోమవారం

Pawan Kalyan: తేడా వస్తే పవన్ కళ్యాణ్ వస్తారు - ముఖ్యమంత్రి జగన్‌కు నాదెండ్ల మనోహర్ హెచ్చరిక

pawan kalyan  Nadendla Manohar


మాట తప్పను... మడమ తిప్పనని గొప్పగా చెప్పుకొనే ముఖ్యమంత్రి గారు దివిస్ విషయంలో ఎందుకు మాట మార్చాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు డిమాండ్ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు బంగాళాఖాతంలో కలిపేస్తాం, గోడలు బద్దలుగొడతాం అని రెచ్చగొట్టి, ఇవాళ చేస్తున్నది ఏంటని ప్రశ్నించారు. దివీస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళలను దూషించడం, వారిపై కేసులు పెట్టి వేధించడం, అంబేద్కర్ విగ్రహానికి వేసిన పూలమాలలు లాగేయడం వంటి సంఘటనలు చూస్తుంటే ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని అనిపిస్తోందని అన్నారు. 10 రోజుల్లో దివిస్ అనుమతులు రద్దు చేయకపోతే బాధితుల తరపున పోరాటానికి జనసేన సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కాకినాడలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “విపక్షంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన మాటలు ఏంటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులేంటి అనేది ప్రజలు గమనిస్తున్నారు. 2016లో ఈ ప్రాంతంలో ప్రత్యేక సభ పెట్టి అప్పటి ముఖ్యమంత్రి చెంప పగలగొట్టండి అనే భావన వచ్చేలా మాట్లాడారు. అధికారంలోకి వస్తే దివిస్ ఫ్యాక్టరీని బంగాళఖాతంలో కలిపేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అవసరమైతే గోడలు బద్దలు కొడదాం అని ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టి ఈ ప్రాంతానికి మంచి పాలసీ తీసుకొస్తామని చెప్పి చేతులు దులుపుకొన్నారు.

* ప్రజల ప్రశ్నలకు జవాబు చెప్పండి

దివిస్ కంపెనీ అప్పటి ముఖ్యమంత్రి జేబు సంస్థ అని, అందులో మనుషులు ముఖ్యమంత్రికి సంబంధించిన వారని అన్న మీరు... ఇప్పుడు అవే ప్రశ్నలు ప్రజలు అడుగుతుంటే జవాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు. సంస్థ మారలేదు, యాజమాన్యం మారలేదు... మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే.

 * వ్యర్థాలను శుద్ధి చేయలేరు

పరిశ్రమ నెలకొల్పడానికి 489 ఎకరాలు కావాలని దివీస్ సంస్థ ప్రతిపాదనలు పంపిస్తే... కేంద్రానికి సిఫార్సు చేసి రాష్ట్ర ప్రభుత్వం 670 ఎకరాలు కేటాయించింది. వేల కోట్ల పెట్టుబడులు, వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రజలను మభ్యపెడుతున్నారు.

 నిజానికి ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన డాక్యుమెంట్లలో కేవలం రూ. 290 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు, 1200 ఉద్యోగాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. దివిస్ సంస్థతో సామరస్యంగా సమస్యను సెటిల్ చేసుకోవాలని, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర మంత్రిగారు చెబుతున్నారు. 75 శాతం అంటే దాదాపు 900 ఉద్యోగాలు. కేవలం 900 ఉద్యోగాల కోసం 700 ఎకరాల భూమిని ఆ సంస్థకు అప్పజెప్పాలా? అలాగే పరిశ్రమ మనుగడ కోసం రోజుకు 6,500 కిలో లీటర్ల నీరు అవసరం అవుతుంది. అలాగే రసాయన వ్యర్థాలుగా 5,600 కిలో లీటర్లు బయటకు వస్తాయి. ఆ నీటిని శుద్ధి చేస్తామని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. తయారు చేసిన మందుల వల్ల వచ్చే మొత్తాన్ని ఖర్చు చేసినా ఆ నీటిని శుద్ధి చేయడానికి చాలదు. వ్యర్థ రసాయనాలు సముద్రంలో చేరడంవల్ల మత్స్య సంపదకు, మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అలాగే ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల స్థానికులు వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.

* పుట్టిన రోజు నాడైనా మంచి జ్ఞానం ప్రసాదించాలి 

నేడు ముఖ్యమంత్రి గారి జన్మదినం. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు. మీడియాలో ఎక్కడ చూసినా ఇలాంటి నాయకుడు మళ్లీ పుట్టడు అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పుట్టిన రోజు నాడు అయినా భగవంతుడు ఆయనకు మంచి జ్ఞానం ప్రసాదించి, దివిస్ పై మంచి నిర్ణయం తీసుకునేలా చేయాలని కోరుకుంటున్నాం. ఆ సంస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న 160 మందిపై కేసులు పెట్టారు. 63 మందిని రిమాండ్ కు తరలించారు. వారందరిపై కేసులు ఉపసంహరించుకోవాలి. 10 రోజుల్లో దివిస్ సంస్థకు ఇచ్చిన అన్ని అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలి. లేని పక్షంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జనసేన పార్టీ ఉద్యమిస్తుంద"ని చెప్పారు.

 * సబ్ జైలులో పరామర్శ

దివిస్ సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కాకినాడ సబ్ జైలుకు తరలించారు. ఆదివారం నాడు కొత్త పాకలు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో బాధిత కుటుంబాలకు సబ్ జైల్లో ఉన్న వారిని పరామర్శించి, ధైర్యం చెబుతామని శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు ఆ మేరకు సోమవారం కాకినాడ సబ్ జైల్ కి వెళ్లి, అరెస్ట్ అయినవారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. దివిస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని, దివిస్ సంస్థను శాశ్వతంగా మూసి వేయాలని 10 రోజులు గడువు ప్రభుత్వానికి ఇచ్చామని.. ఈలోగా ఇటువంటి నిర్ణయం తీసుకోని పక్షంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడకు వస్తారని తెలిపారు. సబ్ జైల్లో ఉన్న వారికి అవసరమైన న్యాయ సహాయం చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్య పడవద్దని.. మీరు చేస్తున్న పోరాటం స్ఫూర్తిగా ఉంటుందని చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి