28, డిసెంబర్ 2020, సోమవారం

పవన్ కళ్యాణ్: ‘ప్రజా ప్రతినిధులకు పేకాట క్లబులపై ఉన్న శ్రద్ధ... ప్రజా సేవపై లేదు’

పవన్ కళ్యాణ్


 బాధ్యతగా వ్యవహరించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు

నోటి దురుసుతో మాట్లాడితే బలంగా ఎదుర్కొంటాం

సిమెంట్, మైనింగ్, మీడియా సంస్థలు నడుపుతూ మీరు రాజకీయాలు చేయొచ్చు..

మేము మాత్రం సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా?

గుడివాడలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

పేకాట క్లబులు నడుపుతున్నంత సమర్ధవంతంగా ప్రజల అవసరాలను తీర్చడంలో వైసీపీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. ఓడిపోయాక భయపడిపోతాం, పారిపోతాం అని కొందరు భ్రమ పడుతున్నారు... ఆశయం ఉన్నవాడికి ఓటమి ఉండదు, ముందడుగే ఉంటుందని అన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా బాధ్యతగా వ్యవహరించకపోతే, వాళ్లు ఏ స్థాయి వ్యక్తులైనా రోడ్ల మీదకు తీసుకురాగల సత్తా జనానికి ఉందని స్పష్టం చేశారు. ప్రజలను భయపెట్టి పాలిద్దాం అంటే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. సోమవారం ఉదయం గుడివాడలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తుపాన్ మూలంగా నష్టపోయిన రైతాంగానికి హేతుబద్ధమైన పరిహారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం వెళ్తూ మార్గమధ్యంలో గుడివాడ సభలో ప్రసంగించారు. గుడివాడలో జనసైనికులు ఘన స్వాగతం పలికారు. అత్యంత భారీ పూలమాలను క్రేన్ సహాయంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు.

 ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... "నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి న్యాయం జరగాలని కృష్ణాజిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని మచిలీపట్నం వెళ్తున్నాను. అందులో భాగంగా మొదటసారి గుడివాడ వచ్చాను. జీవితంలో మరిచిపోలేని ఘనస్వాగతం పలికారు. ఈ అనుభూతిని చివరి శ్వాస వరకు గుర్తు పెట్టుకుంటాను.  అన్ని కులాలు, అన్ని మతాలకు సమ న్యాయం జరగాలనే జనసేన పార్టీ స్థాపించాను.

* రహదారుల దుస్థితిపై ప్రజాప్రతినిధులను నిలదీయాలి

కంకిపాడు నుంచి గుడివాడ వచ్చే దారిలో రోడ్లు అస్తవ్యవస్థగా ఉన్నాయి. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులను ప్రజలు ప్రశ్నించాలి. నిలదీయాలి. దాష్టీకానికి పాల్పడుతూ, నోటి దురుసుతో మాట్లాడే ఏ ప్రజాప్రతినిధినైనా జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుంది. గుడివాడ నడిబొడ్డున నిలబడి చెబుతున్నాను... అంతిమ శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండగా నిలబడతాను. 

 సినిమాలు చేస్తూ ఏం రాజకీయాలు చేస్తారని కొందరు మాట్లాడుతున్నారు.. పేకాట క్లబులు నడిపి మీరు రాజకీయం చేయగా లేనిది నిజాయితీగా సినిమాలు చేసుకుంటూ నేను రాజకీయాలు చేయకూడదా? సిమెంటు ఫ్యాక్టరీలు, మైనింగ్ సంస్థలు, మీడియా సంస్థలు నడిపి మీరు రాజకీయం చేస్తుంటే... సినిమాలు చేసుకుంటూ మేమెందుకు రాజకీయాలు చేయకూడదు? ఎంతసేపూ మీరంటున్న మాటలు పడుతూ, మీ కిందే ఊడిగం చేయాలా? ఆ రోజులు పోయాయి. ఎదురు తిరిగే రోజులు వచ్చాయి.  చొక్కా పట్టుకొని నిలదీసే రోజులివి జాగ్రత్తగా ఉండండ"ని హెచ్చరించారు. ఈ పర్యటనలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.

* పెడన నియోజకవర్గంలో ఘన స్వాగతం

పెడన  నియోజకవర్గం లోకి అడుగుపెట్టగానే జనసేన అభిమానులు ఘన స్వాగతం పలికారు. రైతులు ట్రాక్టర్లు ఎడ్ల బళ్ళల్లో వచ్చి జేజేలు పలికారు. కైకలూరు నియోజకవర్గం నుంచి రైతాంగం ఈ ప్రాంతానికి చేరుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. రైతులు తమ సమస్యలు వివరించారు. గుడివాడ, పెడన నియోజక వర్గాల్లో కృష్ణాజిల్లా నాయకులు శ్రీ బూరగడ్డ శ్రీకాంత్, శ్రీ పోతిన మహేష్, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ అక్కల గాంధీ, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ ఆకుల కిరణ్ కుమార్, శ్రీ తాడిసెట్టి నరేష్, శ్రీ పులిపాక ప్రకాష్, శ్రీ బత్తిన హరిరాం, శ్రీ వై.రామ్ సుధీర్, శ్రీమతి వరుదు రమాదేవి, శ్రీ చలపతి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి