26, డిసెంబర్ 2020, శనివారం

జనసేన: ఆరు నెలల తర్వాత అధికారులే ముఖ్యమంత్రి మాట వినరు.. ఇప్పటికే ఉపాధ్యాయులు దూరమయ్యారు

నాదెండ్ల మనోహర్


రాష్ట్ర రైతాంగానికి మచిలీపట్నం నుంచి ఒక భరోసా వెళ్లాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ కోరారు. రాజకీయంగా కృష్ణా జిల్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా రాష్ట్రం మొత్తం చూస్తుందనీ, అలాంటి కృష్ణా జిల్లా రైతే ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్రం మొత్తం రైతులు ఇబ్బందుల్లో ఉన్నట్టేనన్నారు. రైతుల కష్టం గుర్తించలేని ముఖ్యమంత్రి మనకి ఉండడం దురదృష్టకరమని తెలిపారు. శనివారం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పార్టీ క్రియాశీలక సభ్యుల తో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీ జనసేన పార్టీ తరఫున నిర్వహించ తలపెట్టిన రైతులకు వినతిపత్రం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ.. "పార్టీ అధ్యక్షుల వారు ఒకే జిల్లాకి మూడుసార్లు వస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు. అదేదో ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసింది కాదు. రైతాంగానికి అండగా నిలబడేందుకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలి అని నిర్ణయించినప్పుడు. శ్రీ పవన్ కల్యాణ్ గారు మచిలీపట్నం వెళ్దాం అన్నారు. కారణ ఇక్కడ రైతులు భారీ ఎత్తున నష్టపోయారు. వారిని ఆదుకునే కార్యక్రమం చేయాలన్న ఆలోచనతోనే ఇక్కడ కలెక్టర్ గారికి ఆయన స్వయంగా వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ నెల 28వ తేదీన శ్రీ పవన్ కల్యాణ్ గారు కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించేందుకు ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి గుడివాడ, పెడన మీదుగా మచిలీపట్నం చేరుకుంటారు. ఇది రైతుల కార్యక్రమం.

ఇన్ పుట్ సబ్సిడీ రూ. 900 కోట్లు ఇస్తున్నామని మంత్రులు ప్రకటించారు. ఒక్కో రైతుకీ అదీ వెయ్యి రూపాయిలు వస్తోంది. అది ఎందుకు సరిపోతుంది. ఎకరాకి రూ. 35 వేల నుంచి రూ. 40 వేల వరకు ఖర్చు అయితే ఈ వెయ్యి రూపాయలు ఎందుకు పనికి వస్తుంది.

ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అంటే వారు మద్యం ద్వారానే రూ. 17, 500 కోట్లు సంపాదిస్తున్నారు. 151 సీట్లు మెజారిటీ వచ్చినప్పుడు సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. ఇప్పుడు వేల కోట్లు సంపాదిస్తున్నారు. అదీ విచిత్రమైన బ్రాండ్లు అమ్మి మరీ. అందుకే వైసీపీ పేరుతో బ్రాండ్లు అమ్మి మరికొంత సంపాదించుకోమని శ్రీ పవన్ కల్యాణ్ గారు సలహా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నివర్ తుపాను దాటికి 17.32 లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లింది. జనసేన పార్టీ తక్షణ సాయం అడిగిన రూ. 10 వేలు రైతు వారీగానే చేయమన్నాం. ఈ ప్రభుత్వం అది ఎప్పుడు ఇస్తుంది. ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందిస్తారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత స్పందిస్తారా? అని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం.

 * పథకాల అమలుకు పార్టీ లెక్కలు

ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని సొంత ఆస్తిగా వాడుకుందామన్న భావన వచ్చినప్పుడే పరిస్థితులు చేయి దాటిపోయాయి. ప్రభుత్వ పథకాలు వర్తింప చేసేందుకు కూడా ఎవరికి ఓటు వేశావు అని అడిగి మరీ ఏరివేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు వచ్చాయి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే, మన కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే ధైర్యంగా నిలబడదాం.

ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. ఆరు నెలల తర్వాత అధికారులే ముఖ్యమంత్రి మాట వినరు. ఏడాదిన్నర పాలనలోనే టీచర్లు దూరమయ్యారు. ఉద్యోగులు దూరమయ్యారు. ఇప్పుడు రైతాంగం దూరమయ్యారు. ప్రతి ఒక్కరిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడుతోంది. రహదారులు దారుణంగా ఉన్నాయి. రహదారులు ఇలా ఉంటే మనకు మంత్రులు ఉండి ఉపయోగం ఏంటి? ఈ ప్రభుత్వం ఎన్నికయిన తర్వాత తట్టెడు మట్టి కూడా రోడ్డు మీద వెయ్య లేదు. శ్రీ పవన్ కల్యాణ్ గారు పర్యటిస్తుంటే యువత రోడ్డు మీదకు వచ్చి ఈ రోడ్ల దుస్థితి గురించి మాట్లాడమని అడుగుతున్నారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలన నడుస్తోంది.

* పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల కోసం...

పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టాం. భారత దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల గురించి ఈ విధంగా ఆలోచించ లేదు. మన నాయకుడి కోరిక మేరకు ప్రతి ఒక్కరినీ సమంగా చూడాలన్న ఉద్దేశంతో పార్టీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తకు రూ. 5 లక్షల యాక్సిడెంట్ ఇన్పురెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. రూ. 50 వేల మెడికల్ పాలసీ తీసుకువచ్చాం. ఇలాంటి పాలసీ  భారత దేశంలో ఏ రాజకీయ పార్టీ తీసుకురాలేదు.. అధికారంలో ఉన్న పార్టీ సైతం ఇస్తోంది రెండు లక్షలే. క్రియాశీలక సభ్యత్వం అంటే వేల సంఖ్యలో చేపట్టాలన్నది పార్టీ ఉద్దేశం కాదు. ప్రతి నియోజకవర్గంలో బూత్ కి ఇద్దరు చొప్పున కనీసం 500 మందిని తయారు చేయాలి. పార్టీ భావజాలాన్ని వారి ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి. అలా ఒకొక్కరు కనీసం 100 మందిని ప్రభావితం చేస్తారన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం" అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీ బండి రామకృష్ణ, శ్రీ పోతిన వెంకట మహేష్, శ్రీ అక్కల రామ్మోహన్ రావు(గాంధీ), శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ కమతం సాంబశివరావు, శ్రీ బూరగడ్డ శ్రీకాంత్శ్రీ తాడిశెట్టి నరేష్శ్రీ శింగలూరి శాంతిప్రసాదు, శ్రీ ప్రకాష్, శ్రీ బత్తిన హరిరామ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి