26, డిసెంబర్ 2020, శనివారం

జనసేన: ‘సీఎం హెలికాప్టర్లలో తిరుగుతుంటే... మంత్రులు పత్రికా సమావేశాలకే పరిమితమవుతున్నారు’

నాదెండ్ల మనోహర్


ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే పాదయాత్ర చేశానని చెప్పిన ముఖ్యమంత్రి గారు... ఇవాళ రైతు కష్టాలను తెలుసుకోవడానికి కేవలం హెలికాప్టర్ల పర్యటనలకు మాత్రమే పరిమితమవ్వడం దురదృష్టకరమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. కష్టకాలంలో అన్నదాతకు అండగా నిలబడాల్సిన ముఖ్యమంత్రి ఆకాశంలో పర్యటిస్తూ ఓదార్పు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం పత్రికా సమావేశాలకే తప్ప క్షేత్రస్థాయిలో పర్యటించి రైతాంగానికి భరోసా కల్పించలేకపోయారన్నారు. ఈ నెల 28వ తేదీన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి శనివారం సాయంత్రం కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నప్పుడు వేలాది మంది రైతులు ఆయన దగ్గరకు వచ్చి వారు పడుతున్న కష్టాలను చెప్పుకున్నారు. ఒకే ఏడాదిలో మూడు ప్రకృతి విపత్తులు సంభవించడం వల్ల సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా పెద్దలు రెడ్డయ్య గారు లాంటి వారు కూడా 1977లో వచ్చిన దివిసీమ ఉప్పెన తర్వాత ... ఇంత పెద్ద నష్టం రైతాంగానికి వాటిల్లడం ఈ ఏడాదే చూశానని చెప్పారు. మీలాంటి వాళ్లు దీని గురించి మాట్లాడాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన కోరారు. కృష్ణా జిల్లాలోనే దాదాపు 2 లక్షల 40వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. వేలాది మంది రైతులు నష్టపోయారు. కొంతమంది కౌలు రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. రైతుల ఆత్మహత్యలు నివారించి, వారికి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే

  శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎకరాకు రూ. 35 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా తక్షణమే రూ. 10 వేలు విడుదల చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం మొండి వైఖరితో ఇప్పటి వరకు స్పందించలేదు. రైతులకు అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి, ఏదో తూతూ మంత్రంగా పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. 



 * రైతులను మభ్యపెడుతున్నారు

నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగంలో భరోసా నింపాలన్న ఆలోచనే ప్రభుత్వంలో లేదు. మంత్రులు తప్పుడు లెక్కలతో   ప్రజలు, రైతులను మభ్యపెడుతున్నారు. శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ నివర్ తుపాన్ వల్ల 17 లక్షల 32 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రకటించారు. తరవాత జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆ లెక్కలను సవరించి ఆ నష్టాన్ని 13 లక్షలకు తగ్గించారు. దాదాపు 4 లక్షల ఎకరాలను నష్టపోయిన జాబితా నుంచి ప్రభుత్వం తప్పించి, వేలాదిమంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. మరో వైపు డిసెంబర్ 29న మూడో విడత రైతు భరోసా కింద రూ.2 వేలు వేస్తున్నాం అని ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.13,500 లో కేంద్రం 6 వేలు ఇస్తుందని ఎక్కడా చెప్పడం లేదు.

కృష్ణా జిల్లాలో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం ఆ లెక్కలను బయటకు చెప్పడం లేదు. రైతుల ఆత్మహత్యలను నివారించాలనే ఈ నెల 28న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలనే కార్యక్రమాన్ని జనసేన పార్టీ చేపడుతుంది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులతో కలిసి వెళ్లి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నాయకులు చాలా శ్రమిస్తున్నారు. వారికి నా అభినందనలు. భవిష్యత్తులో కూడా రైతులకు అండగా ఉండేందుకు జనసేన పార్టీ జై కిసాన్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. త్వరలోనే అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాం. సమాజంలో రైతాంగం సగర్వంగా నిలబెట్టేలా మనందరం బాధ్యత తీసుకొని పోరాడాలని” కోరారు.



ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీ పోతిన వెంకట మహేష్ , శ్రీ అక్కల గాంధీ, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ అమ్మిశెట్టి వాసు,  శ్రీ బండి రామకృష్ణ , శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి