• తక్షణ సాయం రూ.10వేలు... పరిహారం రూ.35 వేలు ఎప్పుడిస్తారో చెప్పాలి
• అసెంబ్లీ ముట్టడి పిలుపుతో కేబినెట్ లో అలజడి
• జనాన్ని దోచుకోవడానికే వాలంటీర్ల వ్యవస్థ
• ఖైదీ సాబ్ పాలనలో రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది
• పదవి పోతుందనే మంత్రి పేర్ని నాని చిడతల సౌండ్ పెంచారు
• కోట్లు దోచుకుంటున్న మంత్రులు కొడాలి, పేర్ని, వెల్లంపల్లి బోడిలింగాలే
• విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస యాదవ్, పోతిన వెంకట మహేష్
మంత్రులకు ప్రజా సమస్యలపై పట్టింపు లేదు... పదవులు కాపాడుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంటే... మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడటం పాలకపక్షం చేతగానితనాన్ని తెలుపుతోంది అన్నారు. మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే క్యాబినెట్ లో ఏదో అలజడి మొదలైందని అర్థమవుతోంది అని చెప్పారు. పదవులు కాపాడుకోవడం కోసం మంత్రులు ముఖ్యమంత్రి చుట్టూ చేరి భజన చేస్తున్నారన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ తో కలిసి బుధవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ “తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రజలు మరిచిపోతున్న సమయంలో మంత్రి కొడాలి నాని మాత్రం పదే పదే ఆయన పేరు తలుస్తూ గుర్తు చేస్తున్నారు. మేము రైతుల గురించి మాట్లాడితే సమయం, సందర్భం లేకపోయినా చంద్రబాబుతో మా పార్టీకి లింకుపెట్టి ఆయన మాట్లాడతారు. కొడాలి నాని వ్యవహారశైలి చూస్తుంటే ఆయనకు చంద్రబాబు గారికి ఏదో రహస్య ఒప్పందం ఉందనే అనుమానం కలుగుతోంది. మరో మంత్రి పేర్ని నాని గారు తాము సీఎంకు చిడతలు కొడతాం అని గొప్పగా చెప్పుకొంటున్నారు తప్ప రైతులకు న్యాయం చేస్తామని చెప్పడం లేదు. వైసీపీ పార్టీ అవినీతిని కచ్చితంగా ప్రజలు ముందుకు తీసుకొస్తాం. పవన్ కళ్యాణ్ గారిపై నోళ్లేసుకుని పడటమే తప్ప.. రైతుల గురించి మాత్రం ఒక్కరూ మాట్లాడలేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. మీకు తగిన బుద్ధి చెబుతారు. వైసిపి నాయకులు ప్రజాసేవపై దృష్టిపెట్టాలి.. ప్రతిపక్షాలపై కాదు.
• అప్పుడు జన్మభూమి కమిటీలు... ఇప్పుడు వాలంటీర్లు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను దోచుకోవడానికే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవడానికి వీలుగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాలంటీర్లు ప్రజల దగ్గర పదో పరకో తీసుకొని పనిచేస్తున్నారు తప్పితే... ఫ్రీగా ఎవరూ పని చేయడం లేదు. తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు చేసిన తప్పులే వైసీపీ హయాంలో వాలంటీర్లు చేస్తున్నారు. చంద్రబాబు గారు గ్రామానికి నలుగురిని పెడితే... జగన్మోహన్ రెడ్డి గారు వంద మందిని పెట్టి దోచుకుంటున్నారు. రైతు భరోసా పథకంలో సగం మంది రైతులను తప్పించారు. ఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అది జనం సొమ్ముతోనే తప్ప సొంత జేబుల నుంచి తీసి ఎవరూ కార్యక్రమాలు చేపట్టరు. నవరత్నాలు అని పెట్టినా, 99 రత్నాలు అని పెట్టిన అది ప్రజల సొమ్మే. చంద్రబాబు పసుపు, కుంకుమ ఎలా అయితే మూల చేరిపోయాయో... నవరత్నాలు కూడా మూలన చేరిపోతాయి.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్తున్నాం. ఇసుక పాలసీ, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, ఇప్పుడు రైతు సమస్యలపై ఎలా అయితే మాట్లాడామో... భవిష్యత్తులో ఏ వర్గానికి ఇబ్బందులు ఎదురైనా మాట్లాడతాం. అందులో రాజీపడే ప్రసక్తే లేదు. తుపాన్ బాధిత రైతులకు జనసేన పార్టీ డిమాండ్ చేసినట్లు రూ. 35వేలు నష్టపరిహారం చెల్లించాలి, అలాగే తక్షణమే రూ. 10 వేలు ఇవ్వాలి. లేని పక్షంలో అధ్యక్షులు వారు చెప్పినట్లు అసెంబ్లీని ముట్టడించి తీరుతామ”ని హెచ్చరించారు.
• బూతులు మీద ఉన్న శ్రద్ధ గుడివాడ గోతుల మీద లేదు: పోతిన వెంకట మహేష్
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ “”నోరుంది కదా అని బూతులు మంత్రి కొడాలి నాని గారు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పేద ప్రజలకు సన్న బియ్యం సరఫరా చేయలేని సన్నాసి మంత్రి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేని దద్దమ్మ మంత్రి. కొడాలి నాని శివలింగం ఏంటి.... కచ్చితంగా బోడి లింగమే. నీకు కోట్లు అప్పిచ్చిన పాపానికి వంక విజయ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం కాదా? అమెరికాలో వ్యాపారం చేసుకొనే వ్యక్తిని తీసుకొచ్చి గన్నవరంలో నిలబెట్టి నీ పబ్బం గడుపుకున్న మాట వాస్తవం కాదా? ఆయన ఓడిపోయిన తర్వాత వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేను మీ పార్టీలోకి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఎన్నికల ముందు రంగా గారి ఫోటోలకు పూలమాలలు వేసి జయంతి, వర్థంతిలకు హాజరైన నాని... మొన్న జరిగిన వర్థంతికి ఆహ్వానించినా ఎందుకు వెళ్లలేదో సమాధానం చెప్పాలి. మల్లవరం భూముల్లో 15 ఎకరాలు నీ అనుచరులతో కబ్జా చేయించి రూ. 150 కోట్లు కాజేశారు. కె. కన్వెన్షన్ లో పేకాట క్లబులు నడుపుతున్న మాట వాస్తవం కాదా.? ఇతర దేశాలకు రేషన్ బియ్యాన్ని అమ్ముకొని వందల కోట్లు సంపాదిస్తుంది నిజం కాదా? ఆయనకు బూతులు మీదున్న శ్రద్ధ గుడివాడ గోతులు మీద లేదు. కనీసం బూతులైనా తగ్గిస్తే గోతులైన పూడుకునేవి.
ఓ లారీ క్లీనర్ రాష్ట్ర మంత్రి అయ్యాడని మేము ఆనందిస్తుంటే.. ఆయన వ్యవహారం మాత్రం ఇంకా దాబాల దగ్గర సిగరెట్ పీకలు ఏరుకునే వ్యవహారం లాగే ఉంది. కొడాలి నాని రాజీనామా చేసి ఎన్నికలకు వస్తే ఆయన శివ లింగమో బోడి లింగమో ప్రజలే నిర్ణయిస్తారు. పవన్ కల్యాణ్ అనే సింహం రైతుల సమస్యపై గర్జించింది... ఈ బులుగు గ్రామ సింహాలన్నీ భౌభౌ అంటూ మొరుగుతున్నాయి
మా అధినేతపై ఇష్టానుసారం మాట్లాడితే మేము మీ అధ్యక్షుడిని ఖైదీ సాబ్ అని పిలవాల్సి ఉంటుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులు, రైతుకూలీలతో అసెంబ్లీని ముట్టడిస్తే అడ్రస్ ఎక్కడ గల్లంతవుతుందనే భయంతోనే తాడేపల్లి ప్యాలస్ నుంచి ఖైదీ సాబ్ స్పందించారు. ఈ ఖైదీ సాబ్ పాలనలో రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతోంది. ఈ ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ అన్నీ రాజకీయ విమర్శలే తప్ప ఒక్కటి కూడా రైతుకు మేలు చేసే మాట మాట్లాడలేదు.
• కాపుల సంక్షేమం మీద చిత్తశుద్ధి లేదు :
ఆరు నెలల్లో మంత్రి పదవి పోతుందని తెలిసే మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేద్దాం అని చిడతల సౌండ్ బాగా పెంచారు. నేను కాపుని.. కాపుని అని పదే పదే చెప్పుకునే ఆయన... కాపులకి ఈబీసీ కోటాలో ఎందుకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదని ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించరు. కాపు సంక్షేమం కోసం ఉపయోగించవలసిన కార్పొరేషన్ నిధులు మళ్లిస్తే దాని గురించి మాట్లాడరు. నీకు నిజంగా కాపుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు వీటిపై ప్రశ్నించాలి. ఈ రాష్ట్రానికి పట్టిన మరో దరిద్రం.. అరిష్టం దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయన మైల పడిన మంత్రి. హిందూ సంప్రదాయల ప్రకారం విధులు నిర్వర్తించడానికి అనర్హుడు. వక్ఫ్ బోర్డు ఆస్తులను దోచేయడానికి నకిలీ దస్తావేజులను సృష్టిస్తున్నారు. దుర్గ గుడిలో కోటి రూపాయిలు విలువ చేసే ఇనుమును తన మనుషులతో రూ. 50 లక్షలకే కొనిపించారు. ఎన్నికలకు ముందు అప్పుల్లో ఉన్న ఆయన... ఇవాళ వందల కోట్ల రూపాయలకు పడగలెత్తి.. చీమకుర్తి గనుల్లో పెట్టుబడులు పెట్టారు. రాజకీయ భిక్షపెట్టి ఎమ్మెల్యేగా గెలిపించిన కుటుంబంపైనే విమర్శలు చేస్తున్నాడు. ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ గారి కాళ్లు పట్టుకున్న మాట వాస్తవం కాదా?
రాజకీయ విమర్శలు చేసే ముందు రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పండి. తుపాన్ ప్రభావిత ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 35వేలు ఇవ్వాలని, తక్షణమే రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు కనుకే ఇవాళ ఉద్యమాన్ని వేరే దశకు తీసుకెళ్లాం. గడుపులోపు రైతులకు న్యాయం చేయకపోతే కచ్చితంగా అసెంబ్లీని ముట్టడించి తీరుతామ”ని హెచ్చరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి