6, మే 2020, బుధవారం

పెట్రోల్ మీద రూ. 10, డీజిల్ మీద రూ. 13 సుంకాలు పెంచిన కేంద్రం


కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ల మీద లీటరుకు 8 రూపాయల చెప్పున రోడ్డు సెస్ పెంచింది. అలాగే.. పెట్రోల్ మీద లీటరుకు 2 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం కూడా పెంచింది.
 మొత్తంగా డీజిల్ మీద లీటరుకు 13 రూపాయలు, పెట్రోల్ మీద లీటరుకు 10 రూపాయలు చొప్పున సుంకాలు పెంచింది. ఈ పెంపు బుధవారం రాత్రి నుంచి అమలులోకి వచ్చింది.
దీంతో ప్రపంచంలో ఇంధనాల మీద అత్యధిక పన్నులు ఉన్న దేశంగా భారత్ నిలిచింది. ఈ పెంపుతో లీటరు పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం 32.98 రూపాయలు, డీజిల్ మీద 31.83 రూపాయలకు పెరిగినట్లయింది.
పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌ల మీద వ్యాట్ పెంపు
నిజానికి తమిళనాడు ప్రభుత్వం మే 3వ తేదీనే.. పెట్రోలియం ఉత్పత్తుల మీద వ్యాట్ వ్యవస్థలో మార్పులు చేయటంతో.. పెట్రోల్ మీద లీటరుకు 3.25 రూపాయలు, డీజిల్ మీద రూ. 2.50 చొప్పున ధరలు పెరిగాయి.
అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గినందున కేంద్రం ఆమేరకు ధరలు తగ్గిస్తుందన్న అంచానాతో ఈ సవరణలు చేపట్టింది.
ఆ మరుసటి రోజు మే 4వ తేదీన దిల్లీ ప్రభుత్వం డీజిల్ మీద లీటరుకు రూ. 7.1 చొప్పున, పెట్రోల్ మీద లీటరుకు రూ. 1.6 చొప్పున వాల్యూ యాడెట్ ట్యాక్స్ పెంచింది. ఈ పెంచిన మొత్తం రాష్ట్ర ఖాతాకు జమ అవుతుంది.
అదే రోజు రాత్రి కేంద్ర ప్రభుత్వం కూడా.. రోడ్డు సెస్, ఎక్సైజ్ సుంకాలను భారీగా పెంచుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశంలో చమురు ధరల పెంపులో ఇదే అతి పెద్ద రికార్డు.
ఈ పెంపుతో దిల్లీలో ప్రస్తుతం లీటరు 71.26 రూపాయలకు విక్రయిస్తున్న ధరలో 49.42 రూపాయలు పన్నులే ఉంటాయి. అలాగే.. ప్రస్తుతం 69.39 రూపాయలకు అమ్ముతున్న డీజిల్ ధరలో 48.09 రూపాయలు పన్నులే.
తాజాగా గురువారం నాడు పంజాబ్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటరుకు 2 రూపాయలు చొప్పున వ్యాట్ పెంచింది.
హరియాణా ప్రభుత్వం కూడా కొద్ది రోజుల కిందట లీటరుకు 1 రూపాయి చొప్పున ధరలు పెంచింది.
మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలు ఏప్రిల్ 1వ తేదీన పెట్రోల్ ఉత్పత్తుల మీద వ్యాట్ పెంచాయి. నాగాలాండ్ అయితే.. పెట్రోల్ ఉత్పత్తుల మీద ‘కరోనా సెస్’ అంటూ పన్ను విధించింది.
పెట్రోల్ మీద ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు
తాజా సుంకాల పెంపుతో భారతదేశంలో పెట్రోల్, డీజిల్‌ల మీద పన్నులు మొత్తం 69 శాతానికి పెరిగాయి.
ఈ ఇంధనాల మీద 60 శాతం కన్నా ఎక్కువ పన్నులున్న ఇతర దేశాలు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్‌లు మాత్రమే. అవి కూడా ఇండియాలో కన్నా తక్కువే ఉన్నాయి.   
పెట్రోల్ మీద ఇటలీలో 64 శాతం పన్నులు వసూలు చేస్తోంటే.. ఫ్రాన్స్, జర్మనీల్లో పన్నులు 63 శాతం, బ్రిటన్‌లో 62 శాతం పన్నులు ఉన్నాయి.
ఇంధనాల మీద పన్నులు స్పెయిన్‌లో 53 శాతం, జపాన్‌లో 47 శాతం, కెనడాలో 33 శాతం, అమెరికాలో 19 శాతం ఉన్నాయి.
ఇండియాలో గత ఏడాది వరకూ పెట్రోల్, చమురు ధరల్లో పన్నుల భాగం 50 శాతంగా ఉండేది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి