30, మే 2020, శనివారం

Lockdown : లాక్ డౌన్ జూన్ 30 వరకు పొడిగింపు.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం


మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మళ్లీ పొడిగించింది. దేశవ్యాప్తంగా జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించింది. అయితే ఈసారి కేవలం కంటైన్మెంట్‌ జోన్లకే లాక్‌డౌన్‌ పరిమితం చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది.  తాజాగా మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ 5.0  మార్గదర్శకాలను  కూడా కేంద్రం విడుదల చేసింది. 

రాత్రి  9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.  జూన్‌ 8 నుంచి ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతించింది. విద్యాసంస్థలపై జులైలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.  ఆంక్షల సడలింపులతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని కేంద్రాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు కోరాయి. 

లాక్‌డౌన్ 5.0లో దేనికి అనుమతులున్నాయి..

మొదటి దశలో..
* జూన్ 8 నుంచి ఆలయాలు, మసీదులు, చర్చిలు తెరవొచ్చు.
* జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జింగులు, షాపింగ్ మాల్స్ తెరవొచ్చు.
రెండో దశలో..
* పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు.
* విద్యాసంస్థలు ఎప్పుడు తెరవాలనేది జులైలో నిర్ణయిస్తారు.
* కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల మేరకు విద్యాసంస్థల విషయంలో నిర్ణయం తీసుకుంటారు.

వీటికి అనుమతి లేదు..

* మెట్రో రైళ్లకు నో చాన్స్
* ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌కు నో చాన్స్
* సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమింగ్ పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ఆటల పోటీలకు అనుమతి లేదు.

21, మే 2020, గురువారం

Anti-Terrorism Day Rajiv Gandhi : రాజీవ్ గాంధీ విశాఖపట్నం నుంచి వెళ్లిన గంటల్లోనే ఎలా హత్యకు గురయ్యారు

రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ


సరిగ్గా 29 సంవత్సరాల కిందట.. భారతదేశం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యింది.
అవును.. 1991 మే 21న రాత్రి పది గంటల 21 నిమిషాలకు జరిగిన ఆ హత్య దేశాన్ని కుదిపేసింది.
మాజీ ప్రధానమంత్రినే బాంబులు పేల్చి చంపేశారు. రాజీవ్ గాంధీ శరీరం తునాతునకలైపోయింది.

వైజాగ్‌లో ఉమాగజపతిరాజు తరఫున ప్రచారం.. అక్కడి నుంచి తమిళనాడుకు..

రాజీవ్ గాంధీ, ఉమా గజపతి రాజు(ఫొటో క్రెడిట్: సంచయిత గజపతిరాజు)

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉమా గజపతి రాజు తరఫున ఎన్నికల ప్రచారం ముగించి అక్కడి నుంచి తమిళనాడులోని శ్రీపెరంబదూరులో  ఎన్నికల సభకు వెళ్లారు రాజీవ్ గాంధీ.
సుమారు 30 ఏళ్లుంటాయేమో.. ఒక నల్లని యువతి పూల మాల తీసుకుని రాజీవ్ గాంధీ వైపు వచ్చింది. ఆయన పాదాలకు నమస్కరించడానికి వంగింది. అంతే... చెవులు దద్దరిల్లిపోయే శబ్దంతో ఆ ప్రాంతంమంతా పొగ, ధూళి కమ్మేసింది.
ఒక్కొక్కరి శరీరభాగాలు గాల్లోకి ఎగిరాయి.. ఎటుచూసినా రక్తం, మాంసపు ముద్దలే. పూలమాల వేయడానికి వచ్చిన 30 ఏళ్ల మానవ బాంబు  థాను రాజీవ్ పాదాలకు నమస్కరించేలా చేస్తూ తన నడుముకు కట్టుకుని వచ్చిన బాంబును పేల్చడంతో ఆమెతో పాటు రాజీవ్ కూడా చనిపోయారు. 
ఆ భయంకరమై పేలుడు సమయంలో తమిళనాడు కాంగ్రెస్‌ నేతలు మూపనార్, జయంతి నటరాజన్, రామమూర్తి వేదికపై రాజీవ్ గాంధీకి సమీపంలోనే ఉన్నారు. మూపనార్ ఎగిరి అల్లంత దూరంలో పడ్డారు.
తేరుకున్న నేతలంతా ఆ పొగలోనే రాజీవ్ గాంధీ కోసం వెతకడం ప్రారంభించారు. ఆయన శరీరంలో ఒక భాగం, సగం తల కనిపించింది. ఆయన తల ఛిద్రమైంది. దాని నుంచి బయటికొచ్చిన మెదడు, ఆయన సెక్యూరిటీ అధికారి పీకే గుప్తా కాళ్లపై పడి ఉంది. గుప్తా కూడా చావు బతుకుల్లో ఉన్నారు.
పేలుడుకు ప్రత్యక్ష సాక్షి అయిన మూపనార్ ఆ తరువాత ఆ భయంకర ఘటన గురించి వివరిస్తూ " పేలుడు జరగగానే నేను పరుగులు తీశాను. నా ముందు శవాల భాగాలు పడి ఉన్నాయి. రాజీవ్ సెక్యూరిటీ అధికారి ప్రదీప్ గుప్తా అప్పటికి బతికే ఉన్నారు. నా కళ్ల ముందే ప్రాణాలు వదిలారు’’ అని చెప్పారు.
జయంతి నటరాజన్ అయితే ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయారు.
రాజీవ్ గాంధీ కోసం వెతికితే ముఖం, తల పగిలిపోయి కనిపించడంతో ఆమె భీతిల్లిపోయారు.
రాత్రి 10.50 నిమిషాలకు దిల్లీలోని జనపథ్‌లో రాజీవ్ నివాసంలో ఉన్న ఆయన భార్య సోనియా గాంధీకి విషయం చెప్పారు. ఆమె దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చారని రషీద్ కిద్వాయ్ తన పుస్తకంలో రాశారు ఆ తరువాత.
‘‘ఆ సమయంలో సోనియాకు ఆస్తమా అటాక్ చాలా తీవ్రంగా వచ్చింది. ఆమె దాదాపు స్పృహతప్పిపోయారు’’ అని రషీద్ రాశారు.
ఆ తరువాత ఎల్టీటీఈ ఈ దాడి చేసిందని తేల్చారు. ఎల్టీటీఈకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు శివరసన్, ఆయన సహచరులు అరెస్ట్ కావడానికి ముందు సైనైడ్ తిని చనిపోయారు.

ఈడీ అమీన్: శత్రువుల రక్తం తాగి, మర్మావయవాలనూ తినేసిన నియంత.. ఆయన దారుణాలు చదివితేనే వణుకు పుడుతుంది

ఈడీ అమీన్


ఆరు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తు.. 135 కేజీల బరువు ఉండే ఆయన ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత.
అవును.. ప్రపంచ చరిత్రలో మరెందరో నియంతలు ఉన్నా వారంతా వేలు, లక్షల మందిని చంపి మారణహోమం సృష్టించినా కూడా క్రూరత్వంలో ఈయన కాలిగోటికి కూడా చాలరు.
ఎందుకంటే ఈ నియంత మనుషులను చంపడమే కాదు వారిని వండుకుని తినేసేవాడు కూడా.
అలాంటి క్రూరమైన నియంత పేరే ఈడీ అమీన్. ఉగాండాను చాలాకాలం ఏలాడు. ఆయన దెబ్బకు మన భారతీయులు కూడా చాలామంది అష్టకష్టాలు పడ్డారు.
ఉగాండాను వదిలి బతుకుజీవుడా అంటూ వేల మంది భారత్‌కు పారిపోయి వచ్చారు. మరికొందరు అక్కడే బలైపోయారు.

ఒకప్పుడు యుగాండా హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ అయిన ఈదీ అమీన్ 1971లో మిల్టన్ ఒబోటే ప్రభుత్వాన్ని కూలదోసి బలవంతంగా అధికారంలోకి వచ్చాడు.
అమీన్ ఉగాండాను పాలించిన ఎనిమిదేళ్లు అక్కడ రక్తపాతమే సాగింది. భయంకరమైన క్రూర ఘటనలకు సాక్ష్యంగా నిలిచిపోయింది. 
ఆధునిక ప్రపంచ చరిత్రలో అమీన్ వంటి పాలకుడు ఇంకెవరూ లేరనే చెబుతారు చరిత్రకారులు.

మామూలోడు కాదు


ఈడీ అమీన్
ఈడీ అమీన్ Idi Amin

ఈడీ అమీన్ ఉగాండాలోని కాక్వా తెగకు చెందినవారు. ఆయన ఎప్పుడు పుట్టారన్నది కచ్చితమైన తేదీ ఇంతవరకు తెలియకపోయినా 1925లో పుట్టారని చెబుతారు.
తండ్రి వదిలేయడంతో తల్లి పోషణలోనే పెరిగిన అమీన్ 1946లో బ్రిటిష్ కొలోనియల్ ఆర్మీలో అసిస్టెంట్ కుక్‌గా చేరారు.
చాలా చురుకైనవాడు కావడంతో మిలటరీలో త్వరత్వరగా పైకెదిగాడు అమీన్. ఆరున్నర అడుగుల ఆజానుబాహుడైన అమీన్ 1951 నుంచి 1960 వరకు ఉగాండా లైట్-హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌గా ఉన్నాడు. మాంచి ఈతగాడు కూడా. అయితే.. తన డామినేటింగ్ నేచర్ వల్ల మిగతా సైనికులను వేధించేవాడు.
బ్రిటిష్ ఆర్మీలో ఒక బ్లాక్ ఆఫ్రికన్ చేరుకోగల అతిపెద్ద ర్యాంకును ఆయన సాధించాడు. కెన్యాలో 1952-56 మధ్య సాగిన తిరుగుబాటును అణచివేసే పనిలో బ్రిటిష్ ఆర్మీలో ఆయన పనిచేశాడు.
1962లో ఉగాండాకు స్వాతంత్ర్యం రావడానికి ముందు అప్పటి ప్రైమ్ మినిష్టర్ కమ్ ప్రెసిడెంట్ మిల్టన్ ఒబొటెకు సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి కాంగో నుంచి బంగారం, ఏనుగు దంతాల స్మగ్లింగ్ చేసేవారు. అయితే, తొందరలోనే ఇద్దరి మధ్యా విభేదాలు మొదలయ్యాయి.
ఇలాంటి సమయంలో 1971 జనవరి 25న ఒబొటె సింగపూర్‌లో ఒక మీటింగుకు వెళ్లగా అమీన్ సైనిక తిరుగుబాటు చేసి తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. 1976లో ఆయన ఉగాండాను తానే శాశ్వత అధ్యక్షుడిగా ఉండేలా చట్టాలను మార్చుకున్నారు.
1971లో తిరుగుబాటు చేసి అధికారం చేపట్టిన తరువాత అమీన్ కిల్లర్ స్క్వాడ్స్ ఒబొటె మద్దతుదారులు లక్షలాది మందిని వెంటాడివేటాడి చంపేశాయి. వారంతా ఎక్కువగా అకోలీ, లాంగో తెగలకు చెందినవారే. సైన్యంలో ఒబోటెకు అనుకూలంగా ఉన్నవారు, ప్రజలను కూడా అమీన్ మనుషులు దారుణంగా చంపేశారు.
లాయర్లు, జర్నలిస్టులు, విద్యార్థులు, హోమో సెక్సువల్స్‌ను కూడా చంపించాడు అమీన్.
దారుణాతి దారుణంగా సుమారు 3 లక్షల మందిని చంపించిన అమీన్‌న్ ‘ఉగాండా కసాయి’ అంటారు. 
1976లో తానే స్వయంగా ఒక ఫ్రెంచ్ విమానాన్ని హైజాక్ చేశాడు అమీన్.

ఆసియా ప్రజలపై హఠాత్తుగా ఆగ్రహం

1972 ఆగస్టు 4న ఈదీ అమీన్‌ ఆ దేశంలో ఉన్న ఆసియా ప్రజల విషయంలో పిడుగులాంటి నిర్ణయం తీసుకున్నాడు. 
ఉగాండాలోని టొరోరో నగరంలో తన సైనికాధికారులతో సమావేశమైన ఆయన అక్కడి ఆసియా ప్రజలందరినీ దేశం నుంచి వెంటనే పంపించివేయమని అల్లా తనను ఆదేశించాడని వారితో చెప్పారు.
అల్లా తనకు కలలో కనిపించి ఆ మాట చెప్పాడంటూ అమీన్ ఆదేశాలు జారీ చేశాడు.
ఆసియా ప్రజలు ఉగాండాను దోచుకోవాలని చూస్తున్నారు.. వారందరినీ 90 రోజుల్లో పంపించేయాలని సైనికాధికారులను ఆదేశించాడు.
నిజానికి 60 వేల మంది ఆసియా వాసులను అప్పటికప్పుడే దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాడు అమీన్. ఆ తరువాత వారికి 90 రోజుల గడువు ఇచ్చాడు.
అయితే.. అమీన్ ప్రకటనను ఆసియా ప్రజలు మొదట పెద్దగా పట్టించుకోలేదు. ఏదో ఆగ్రహంలో అలా అన్నాడు కానీ తరువాత సర్దుకుంటుందని అనుకున్నారు. కానీ, వారం రోజుల్లోనే వారికి అర్థమైపోయింది. ఉగాండాను వదిలి వెంటనే వెళ్లకపోతే ప్రాణాలు దక్కవని.

ఆస్తులు కూడా వదిలేసి వెళ్లాలని ఆర్డర్స్

అమీన్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఆయన నిర్ణయం మార్చుకునేలా చేయడానికి బ్రిటన్ రంగంలోకి దిగింది. ఆ దేశ మంత్రిని ఉగాండా రాజధాని కంపాలకు పంపించింది. కానీ, అమీన్ ఆ మంత్రిని వారం రోజులు వెయిట్ చేయించాడు కానీ కలవలేదు. 
ఆ తరువాత కలిసినా బ్రిటన్ మాటను ఏమాత్రం లెక్క చేయలేదు.
భారత ప్రభుత్వం కూడా అక్కడి భారతీయులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా దౌత్యం చేయడానికి విదేశాంగ శాఖ అధికారులను పంపించింది. అందులో నిరంజన్ దేశాయ్ ప్రధానమైనవారు. 
ఆయన ఉగాండా వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయారు.
అక్కడి పరిస్థితులను ఆయన తరువాత వివిధ సందర్భాల్లో వెల్లడించారు.
ఆసియా ప్రజలకు తమతో 250 కేజీల సామాగ్రి, 55 పౌండ్ల డబ్బుమాత్రమే తీసుకెళ్లడానికి అనుమతించారని.. మిగతాదంతా వదిలి వెళ్లాలని కఠినంగా చెప్పారని దేశాయ్ అప్పటి పరిస్థితులను చెప్పారు.

కొందరు డబ్బు ఖర్చు పెట్టేశారు.. కొందరు మళ్లీ రావొచ్చని బంగారం పాతిపెట్టారు
అమీన్ దెబ్బకు ఉగాండా వదిలివెళ్లక తప్పదని అర్థమైన ఆసియన్లు తమ డబ్బును కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు. అమీన్ నిర్ణయాన్ని అమలు చేయడంలో అధికారులు విఫలం కావడంతో కొందరు తెలివిగా తమ డబ్బును దేశం దాటించగలిగారు. 
కొందరు తెలివిగా ప్రపంచమంతా తిరగడానికి మొత్తం కుటుంబానికి ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కోని... మిస్లీయస్ చార్జ్ ఆర్డర్ల ద్వారా  ఈ బుకింగ్స్ చేశారు. ఉగాండా నుంచి బయటకు వెళ్లాక ఈ మిస్లీనియస్ చార్జ్ ఆర్డర్లను క్యాష్ చేసుకోగలిగారు.
మరికొందరు కార్లలో కార్పెట్ల కింద డబ్బు దాచి పొరుగు దేశం కెన్యా పారిపోయారు.
కొంతమంది పార్శిల్ ద్వారా తమ బంగారం స్వదేశాలకు పంపించేశారు.
మళ్లీ ఉగాండా రాగలమని ఆశ పెట్టుకున్నవారు తమ ఇళ్ల పెరళ్లో.. తోటల్లో బంగారాన్ని పాతి పెట్టారు.
కొందరు భారతీయులు అక్కడున్న బ్యాంక్ ఆఫ్ బరోడాలో లాకర్లలో డబ్బు, బంగారం దాచి పదిహేనేల్ల తరువాత ఉగాండా వెళ్లి తమ డబ్బు తాము తీసుకోగలిగారు.

ఆసియన్ల సంపదను దోచుకున్నారు

చాలా మంది ఆసియా ప్రజలు తమ షాపులు, ఇళ్లు అలా ఉంచేసి వచ్చేశారు. ఇంట్లో సామాను  అమ్ముకునే చాన్సు కూడా వారికివ్వలేదు. 

తమతో పాటు బయటికి తీసుకెళ్లే సామాన్లను కకూడా ఉగాండా సైనికులు లాక్కున్నారని చాలామంది చెబుతారు.
ప్రజలు వదిలేసి వెళ్లిన సంపదను స్థానికులు కొందరు చేజిక్కించుకోగా మరికొంత సైనికాధికారులు, ప్రభుత్వంలో ఉన్నవారు దోచుకున్నారు.
సాధారణ ప్రజలకు దొరికింది తక్కువే.
ఆసియన్ల దుకాణాలు, హోటళ్లు, ఇల్లు, ఆస్తులను అమీన్ తన సైనికాధికారులకు ఇష్టమొచ్చినట్లు పంచిపెట్టారు.

నరరూప రాక్షసుడు

ఈడీ అమీన్‌కు నరరూప రాక్షసుడనే పేరు స్థిరపడిపోయింది. అతడి క్రూరత్వం గురించి ప్రపంచమంతా కథలు కథలుగా చెప్పుకునేవారు.
అమీన్ హయాంలో ఆరోగ్య మంత్రిగా ఉన్న హెన్రీ కెయెంబా 'ఎ స్టేట్ ఆఫ్ బ్లడ్: ద ఇన్‌సైడ్ స్టోరీ ఆఫ్ ఈదీ అమీన్' అనే ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన అమీన్ క్రూరత్వం గురించి రాశారు. అది చదివిన ప్రపంచం భయంతో వణికిపోయింది.

శత్రువులను చంపి మర్మాంగాలు తినేసేవాడు

ఈడీ అమీన్


ఈదీ అమీన్ తన శత్రువులను చంపడమే కాదు, వారు చనిపోయిన తర్వాత వారి శవాలను కూడా వదిలేవాడు కాడు. మార్చురీలో శవాలు తెరిచి ఉండేవని, వాటి మూత్రపిండాలు, కాలేయం, ముక్కు, పెదవులు, మర్మాంగాలు మాయమయ్యేవని ఉగాండా మెడికల్ ఉద్యోగులు ఎప్పుడూ చెప్పుకునేవారు. 
1974 జూన్‌లో ఫారిన్ సర్వీస్ అధికారి గాడ్‌ఫ్రీ కిగాలాను కాల్చి చంపినప్పుడు అతడి కళ్లు పీకి శవాన్ని కంపాలా బయట అడవుల్లో పడేశారు.
చనిపోయిన వ్యక్తుల మధ్య ఒంటరిగా గడపడం తనకు ఇష్టమని అమీన్ తన వద్ద పనిచేసేవారితో చెప్పేవాడు. 
1974 మార్చిలో కార్యనిర్వాహక సైన్యాధ్యక్షుడు బ్రిగేడియర్ చార్లెస్ అరూబే హత్య జరిగినపుడు, అమీన్ ఆయన శవాన్ని చూడడానికి ములాగో ఆస్పత్రిలోని మార్చురీకి కూడా వెళ్లాడు. 
శవంతోపాటూ తను అక్కడే కాసేపు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నానని.. అందరూ వెళ్లిపోవాలని అమీన్ ఆదేశించడంతో ఆసుపత్రి మొత్తం ఖాళీ చేస్తారు.
అమీన్ కాక్వా జాతి సంప్రదాయం ప్రకారం తన శత్రువు రక్తం తాగారని ఉగాండా ప్రజలు చెబుతారు. అమీన్ కూడా కాక్వా జాతికి చెందినవాడే.
మనిషి మాంసం తిన్నానని అమీన్ అనేకసార్లు చెప్పినట్లు ఆయన వద్ద పనిచేసేవారు తరువాత కాలంలో చెప్పారు.
1975 ఆగస్టులో అమీన్ కొంతమంది సీనియర్ అధికారులకు తన జయీర్ పర్యటన గురించి అమీన్ చెబుతూ.. అక్కడ తనకు కోతి మాంసం వడ్డించారని.. కానీ, అది మనిషి మాంసం అంత రుచిగా లేదని అమీన్ చెప్పారట.
అంతేకాదు.. యుద్ధ సమయంలో తిండి దొరక్కపోతే గాయపడిన తోటి సైనికులను చంపి తినేయమని కూడా అమీన్ చెప్పేవారట.

ఫ్రిజ్‌లో మనిషి తలలు

అమీన్ దగ్గర అప్పట్లో నౌకరుగా పనిచేసిన మోజెజ్ అలోగా, కెన్యా పారిపోయి వచ్చాక ఆయన గురించి ఒక కథ చెప్పారు. దానిని ఈ కాలంలో నమ్మాలంటే చాలా కష్టం.
అమీన్ పాత ఇంట్లోని కమాండ్ పోస్ట్‌లో ఒక గది ఎప్పుడూ మూసి ఉండేది, దాని లోపలికి వెళ్లడానికి అలోగాకు మాత్రమే అనుమతి ఉండేది. అలోగాను కూడా ఆ గదిని శుభ్రం చేయడానికి మాత్రమే వెళ్లనిచ్చేవారు.
అమీన్ ఐదో భార్య సారా క్యోలాబాకు ఆ గది గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉండేది. ఆమె అలోగాను ఆ గదిని తెరవమని చెప్పారు. అమీన్ చంపేస్తాడని చెప్పినా వినకుండా ఆమె ఒత్తిడి చేయడంతో అలోగా ఆ గది తాళం సారాకు ఇస్తాడు. 
ఆ గది లోపల ఉన్నరెండు ఫ్రిజ్‌లలో ఒక ఫ్రిజ్ తలుపు తెరిచిన ఆమె గట్టిగా అరిచి స్పృహతప్పి పడిపోయంది. అందులో ఆమె మాజీ ప్రియుడు జీజ్ గిటా తల కనిపిస్తుంది.
సారా ప్రియుడిలాగే, అమీన్ చాలా మంది మహిళల ప్రియుల తలలు కూడా నరికించారు. ఇండస్ట్రియల్ కోర్ట్ చీఫ్ మైకేల్ కబాలీ కాగ్వా ప్రియురాలు హెలన్ ఓగ్వాంగ్‌పై అమీన్ కన్నుపడడంతో, ఆయన బాడీగార్డ్స్ కంపాలా ఇంటర్నేషనల్ హోటల్లో స్విమ్మింగ్ పూల్లో ఉన్న కబాలీని కాల్చిచంపారు. తర్వాత హెలెన్‌ను పారిస్‌లో ఉన్న ఉగాండా రాయబార కార్యాలయంలో వేశారు. ఆమె అక్కడ్నుంచి పారిపోయి తప్పించుకుంది.
మకెరేరే యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్, తొరోరోలోని రాక్ హోటల్ మేనేజర్ భార్యలపై కూడా మనసుపడ్డ అమీన్ వారి భర్తలను పక్కా ప్లాన్ ప్రకారం చంపించారు.
అమీన్ ప్రియరాళ్ల సంఖ్యను లెక్కపెట్టడం కూడా కష్టం. ఒకప్పుడు ఆయన కనీసం 30 మంది మహిళలతో సంబంధాలు నడిపేవారని, వారికోసం ఆయన మొత్తం ఉగాండా తిరిగేవారని చెబుతారు. ఆ మహిళలు ఎక్కువగా హోటళ్లు, ఆఫీసులు, ఆస్పత్రుల్లో నర్సులుగా పనిచేస్తూ ఉండేవారని చెబుతారు.

11 వేల మంది భారత్ వచ్చారు

మళ్లీ ఆసియన్లను పంపించేయడందగ్గరకు వస్తే... ఉగాండా నుంచి ఆసియా వాసులను తరిమేసిన తర్వాత ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది.
ఉత్పత్తుల లోటు ఊహించలేనంతగా పెరిగింది. హోటళ్లలో బ్రెడ్ లాంటివి కూడా దొంగిలించేవారు.
ఉగాండా నుంచి బయటపడ్డ 60 వేల మందిలో 29 వేల మంది బ్రిటన్ చేరారు. 
11 వేల మంది భారత్ వెళ్లారు. 5 వేల మంది కెనడాకు, మిగతా వారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు.
కట్టుబట్టలతో వచ్చిన వారందరినీ బ్రిటన్ రిటైల్ పరిశ్రమ ఆదుకుంది. బ్రిటన్‌లోని ప్రతి నగరంలో కూడళ్లలో పటేల్ దుకాణాలు తెరుచుకున్నాయి. వాళ్లు పాలు, వార్తా పత్రికలు అమ్మేవారు.
ఆరోజు ఉగాండా నుంచి బ్రిటన్ వెళ్లిన కుటుంబాలన్నీ ఇప్పుడు బాగా స్థిరపడ్డాయి. ప్రాణాలతో బయటపడ్డ ఆసియ వాసులు బ్రిటన్ సంస్కృతికి అలవాటు పడడంతోపాటు ఆ దేశ ఆర్థికాభివృద్ధిలో కూడా భాగమయ్యారు.

8 ఏళ్ల అమీన్ క్రూర పాలన ముగిసిందిలా..

8 ఏళ్లు పాలించిన ఈదీ అమీన్, తను ఎలా అధికారం చేజిక్కించుకున్నాడో, అలాగే అధికారం కోల్పోయాడు.
1971లో సైనిక తిరుగుబాటు చేసి అధికారంలోకొచ్చిన సంగతి తెలిసిందే.
1978లో పొరుగున ఉన్న టాంజేనియాపై దాడికి ఆదేశించాడు అమీన్. కొన్నాళ్లపాటు ఈ యుద్దంసాగింది. అయితే.. ఉగాండా నేషనలిస్టుల సహాయంతో టాంజేనియా ఆర్మీ ఈ దాడిని తిప్పికొట్టింది. 
అదే సమయంలో 1979లో అప్పటి ఉపాధ్యక్షుడు జనరల్ ముస్తఫా అద్రసీ తిరుగుబాటు చేశారు. మరోవైపు టాంజేనియా బలగాలు ఉగాండా రాజధాని కంపాలా వరకు వచ్చేశాయి.
దీంతో అమీన్ అక్కడి నుంచి పారిపోయి లిబియాలో తలదాచుకున్నాడు. 
అసలు లిబియా అధినేత కల్నల్ గడాఫీ స్ఫూర్తితోనే అమీన్ ఇదంతా చేశారని చెబుతారు.. గడాఫీ, అమీన్‌లు మంచి స్నేహితులు.
అలా లిబియా చేరుకున్న అమీన్ ఆ తరువాత సౌదీ అరేబియా పారిపోయి అక్కడే చరమాంకం గడిపాడు.
2003లో 78 ఏళ్ల వయసులో సౌదీలోని జెడ్డాలో కిడ్నీలు విఫలం, ఇతర అనారోగ్య సమస్యలతో కోమాలోకి వెళ్లి చనిపోయాడు.

20, మే 2020, బుధవారం

Amphan తుపానుకు అర్థమేంటి.. తుపాన్లకు పేరెలా పెడతారు? ఎవరు పెడతారు?



Amphan తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను భయం గుప్పిట నెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉత్తరకోస్తా ప్రాంతంలో సముద్రంలో అలు ఎగసిపడుతున్నాయి.
బుధవారం ఇది పశ్చిమబెంగాల్‌లో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Amphan అనే పేరు ఎవరు పెట్టారు?

అంఫాన్ లేదా అంఫన్ అని అంతా దీన్ని పలుకుతున్నప్పటికీ దీన్ని పలికే విధానం మాత్రం వేరు. Amphan ను ఉమ్‌పున్(Um-pun) అని పలకాలి. 
ఇది థాయిలాండ్ దేశానికి చెందిన పదం.
Amphan అనే పేరును థాయిలాండ్ పెట్టింది 2004లోనే థాయిలాండ్ పెట్టిన పేరిది.  

Amphan అంటే ఏమిటి?

Amphan అంటే థాయ్ భాషలో ఆకాశం అని అర్థం.

తుపాన్లకు పేర్లు ఎలా పెడతారు? ఎవరు నిర్ణయిస్తారు?
వరల్డ్ మెటిరియలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా పసిఫిక్... భారత్, బంగ్లాదేశ్, మియన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్‌లు సభ్య దేశాలుగా ఉన్న ఒక కూటమి కలిపి ఈ పేర్లను నిర్ణయిస్తాయి. 
కొన్ని పేర్లతో ఒక జాబితాను తయారుచేస్తాయి. 
2004లో ఇలా ఈ 8 దేశాలు ఒక్కో దేశం 8 చొప్పున పేర్లు నిర్ణయించి మొత్తం 64 పేర్లతో జాబితా రూపొందించాయి.
ఏటా వచ్చే తుపాన్లకు ఈ జాబితాలోని పేర్లను వరుసగా పెడుతుంటాయి.
అంఫాన్ తుపాను కంటే ముందు వచ్చిన తుపాను పేరు ఫొని(Fani).. బంగ్లాదేశ్ ఆ పేరు పెట్టింది.

Amphan చివరి పేరా?

అవును... 2004లో రూపొందించిన జాబితాలోని 64 పేర్లలో చిట్టచివరి పేరు Amphan. ఆ జాబితా ప్రకారం ఇదే చివరి పేరు.
అయితే, 2018లో వరల్డ్ మెటిరియలాజికల్ ఆర్గనైజేషన్ మొదట ఉన్న 8 దేశాలకు కూటమిలో మరో 5 దేశాలను చేర్చింది. అవి ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్.
వాటిని జోడించాక కూటమిలో మొత్తం 13 దేశలయ్యాయి.
దాంతో ప్రతి దేశం 13 చొప్పున 13 దేశాలు కలిపి 169 పేర్లతో కొత్త జాబితా రూపొందించారు.

కొత్త జాబితాలో ఉన్న తుపాను పేర్లేమిటి?

కొత్త జాబితా ప్రకారం 169 పేర్లున్నాయి.
అయితే.. అందులో మొదటిది నిసర్గ (Nisarga). బంగ్లాదేశ్ ఈ పేరు పెట్టింది.
దాని తరువాత గతి(Gati) భారత్ ప్రతిపాదించిన పేరిది.
ఆ తరువాత నివార్ (Nivar) అనేది ఇరాన్ పెట్టిన పేరు.
నెక్స్ట్ బురేవి (Burevi) అని మాల్దీవులు ప్రతిపాదించిన పేరు, తౌక్టే(Tauktae) అని మయన్మార్ ప్రతిపాదించిన పేరు ఉన్నాయి.

కొత్త జాబితాలో తొలి అయిదు పేర్లు

గతి(Gati)
నిసర్గ(Nisarga)
గతి(Gati)
నివార్(Nivar)
బురేవి(Burevi)
తౌక్టే(Tauktae)

ఇండియా పెట్టిన పేర్లేమిటి?

కొత్త జాబితాలో ఇండియా పెట్టిన పేర్లు కూడా 13 ఉన్నాయి.
Tej(తేజ్)
Murasu(మురసు)
Aag(ఆగ్)
Vyom(వ్యోమ్)
Jhar(ఝర్)
Probaho(ప్రొబాహో లేదా ప్రవాహ)
Neer(నీర్)
Prabhanjan(ప్రభంజన్)
Ghurni(ఘుర్ని)
Ambud(అంబుధ్)
Jaladhi(జలధి)
Vega(వేగ)

తుపాన్లకు అసలు పేర్లెందుకు పెడతారు?

ఒక్కో సముద్రంలో జనించే తుపాన్ల విషయంలో కన్ఫ్యూజన్ తగ్గించడానికి ఇలా పేర్లు పెట్టడం ప్రారంభించారు. 
ప్రతి మహాసముద్ర పరిధిలో ఏర్పడే తుపాన్లకు అక్కడి ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు, ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్లు పేర్లు పెడుతుంటాయి.

తుఫాన్లకు పేర్లు పెట్టడానికి ఉన్న రూల్సేమిటి?

* తుపాన్లకు పెట్టే పేర్లకు రాజకీయాలతో సంబంధం ఉండకూదు.
* ఏ ఒక్క జెండర్‌నో , ఏ ఒక్క కల్చర్‌నో, ఏ ఒక్క మతాన్నో సూచించేలా ఉండకూడదు. వీటన్నిటికీ అతీతమైన పదం అయ్యుండాలి.
* ఎవరి సెంటిమెంట్లను బాధపెట్టేలా ఉండకూడదు.
* తీవ్రమైన, క్రూరమైన పదజాలం కాకూడదు.
* చిన్న పదాలు, సులభంగా పలికేవి అయ్యుండాలి.
* ఇంగ్లిష్‌లో 8 అక్షరాలు కంటే ఎక్కువ ఉండకూడదు.

17, మే 2020, ఆదివారం

నిర్మలాసీతారామన్ : రాష్ట్రాలు మరో రూ.4.28 లక్షల కోట్ల అప్పు తీసుకోవచ్చు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో చివరి విడతగా మరికొన్ని వివరాలను ప్రకటించారు. లాక్‌డౌన్ ప్రకటించిన వెంటనే ఆహారం అవసరం ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని గరీబ్ కల్యాణ్ యోజన ప్రారంభించామన్నారు. మూడు నెలలకు సరిపడా ఆహార గింజలు అందించామని వెల్లడించారు.
వలస కూలీల తరలింపులో 85 శాతం ఖర్చును కేంద్రమే భరిస్తోందని నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు.
మే 16వ తేదీ వరకు 8.19 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. మొత్తం రూ. 16,394 కోట్లు ఇస్తామన్నారు.
ఎన్‌ఎస్ఏపీ లబ్ధిదారులకు రూ.2807 కోట్లు రెండు విడతల్లో అందజేసినట్లు చెప్పారు.
20 కోట్ల జన్‌ధన్ ఖాతాలకు రూ. 10,025 కోట్లు జమ చేసినట్లు తెలిపారు
భవన నిర్మాణ కార్మికులకు రూ. 3950 కోట్లు ఇచ్చామని.. 6.81 కోట్ల మంది ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించామని వెల్లడించారు.
శ్రామిక్ రైళ్లు వేసి వలస కార్మికులను తరలిస్తున్నట్లు చెప్పారు. వారిని స్టేషన్లకు చేర్చే బాధ్యత తీసుకోవాలని రాష్ట్రాలను కోరుతున్నామని.. మిగతా 85 శాతం ఖర్చు కేంద్రమే భరిస్తుందని అన్నారు.

ఏడు అంశాల్లో సంస్కరణలను ఆమె ప్రకటించారు

1. గ్రామీణ ఉపాధి హామీ

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పన మరింత పెంచేందుకు గాను రూ.40 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

2. వైద్యం- విద్య

కోవిడ్-19 కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. టెస్టింగ్ ల్యాబ్స్, కిట్లు, ఇతర అత్యవసర పరికరాల కోసం రూ.15,000 కోట్లు రాష్ట్రాలకు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు.
టెలికన్సల్టేషనన్ సర్వీసెస్, ఆరోగ్య సేతు యాప్ వంటివి ప్రారంభించినట్లు చెప్పారు.
హెల్త్ కేర్ వర్కర్స్‌కు రూ. 50 లక్షల చొప్పున బీమా ప్రకటించామని.. రాష్ట్రాలకు రూ. 4113 కోట్లకు పైగా నిధులు విడుదల చేశామని చెప్పారు.
* ఆరోగ్యంపై ప్రభుత్వం చేసే ఖర్చు పెంచుతామని చెప్పారు.
* పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెంచుతాం.
* ప్రతి జిల్లాలో సాంక్రమిక వ్యాధుల ఆసుపత్రుల ఏర్పాటు
* దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత ప్రజారోగ్య పరీక్ష కేంద్రాల ఏర్పాటు
* నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభిస్తాం.
- విద్యారంగం విషయానికొస్తే మే 30 నాటికి దేశంలో టాప్ 100 యూనివర్సిటీలు ఆన్ లైన్ కోర్సులు ప్రారంభిస్తాయని చెప్పారు. 
- పాడ్‌కాస్ట్, రేడియో కార్యక్రమాలు ఉంటాయి. అంధ, బధిర విద్యార్థుల కోసం ప్రత్యేక ఈ-కంటెంట్ అందుబాటులోకి తెస్తాం.
- ‘పీఎం ఈ-విద్య’ పేరుతో డిజిటల్ ఎడ్యుకేషన్ కార్యక్రమం వెంటనే ప్రారంభిస్తాం.
- ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రతి క్లాస్‌కు ఒక టీవీ చానల్
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘దీక్ష’ ఏర్పాటు. ఇందులో ఈ-కంటెంట్, క్యూఆర్ కోడెడ్ టెక్స్ట్ బుక్స్ వంటివన్నీ అందుబాటులో ఉంటాయి.
- మనోదర్పన్: విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సైకలాజికల్ సపోర్ట్ అందించే కార్యక్రమం.

3. వ్యాపారం-కోవిడ్

* దివాలా ప్రక్రియ ప్రారంభానికి పరిమితి రూ. కోటికి పెంపు
* ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక దివాలా ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణ పథకాన్ని ప్రకటిస్తాం.

4. డీక్రిమినలైజేషన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్

* చిన్నపాటి సాంకేతిక పొరపాట్లు, ప్రక్రియాపరమైన పొరపాట్లకు కంపెనీల చట్టం ఉల్లంఘనల నేరాల నుంచి మినహాయింపు
* కాంపౌండబుల్ అఫెన్సెస్‌లో చాలా సెక్షన్లను అంతర్గత న్యాయనిర్ణయ వ్యవస్థలోకి(ఐఏఎం) మార్చడం. ఇప్పటివరకు 18 సెక్షన్లు ఐఏఎం పరిధిలో ఉండగా ఇప్పుడవి 58 సెక్షన్లకు పెంచుతున్నారు.
5. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
* అనుమతించదగ్గ విదేశీ చట్టపరిధుల్లో ఉన్న భారతీయ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు సెక్యూరిటీస్‌లో డైరెక్ట్ లిస్టింగ్
* స్టాక్ ఎక్స్చేంజ్‌లలో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు లిస్ట్ చేసే ప్రయివేట్ కంపెనీలను లిస్టెడ్ కంపెనీలుగా పరిగణించరు.
* నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్ఏటీ)‌లకు అదనపు, ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటుచేసుకునే అధికారం 
* చిన్నకంపెనీలు, ఏక వ్యక్తి కంపెనీలు, ప్రొడ్యూసర్ కంపెనీలు, స్టార్టప్‌లు చెల్లింపులు చేయకపోతే వాటిపై జరిమానాల తగ్గింపు

6. ప్రభుత్వ రంగ సంస్థలు

* అన్ని రంగాల్లో ప్రయివేటుకు అవకాశం.
* వ్యూహాత్మక రంగాల్లో కనీసం ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంటుంది. ప్రయివేటుకూ అనుమతులు ఇస్తారు.
* మిగతా రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను దశలవారీగా ప్రయివేటీకరిస్తారు.
* నిర్వహణ, పాలనావ్యయాల నియంత్రణకు గాను వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను 1 నుంచి 4 వరకు పరిమితం చేస్తారు. 
మిగతావాటిని విలీనం చేయడమో, హోల్డింగ్ కంపెనీలుగా మార్చడమో, ప్రయివేటీకరించడమో చేస్తారు.

7. రాష్ట్రాలకు వరాలు

2020-21కి గాను రాష్ట్రాల రుణ పరిమితిని జీఎస్‌డీపీలో 5 శాతానికి పెంచారు. ప్రస్తుతం ఇది 3 శాతంగా ఉంది.
3 శాతం లెక్కన ప్రస్తుతం రూ.6.41 లక్షల కోట్లకు పరిమితి ఉండగా ఇప్పుడు అదనంగా మరో రూ.4.28 లక్షల కోట్ల వరకు రుణం తెచ్చుకునే వీలు కల్పించారు.
ఇప్పటికే రాష్ట్రాలకు అందించిన సహాయం..
* ఏప్రిల్‌లో రూ.46,038 కోట్లు పన్నుల ఆదాయం బదిలీ
* రాష్ట్రాలకు రెవెన్యూ లోటు రూ.12,390 కోట్లు భర్తీ
* ఎస్డీఆర్ఎఫ్ నిధుల కోసం ఏప్రిల్ మొదటివారంలో రూ.11,092 కోట్ల అడ్వాన్స్ చెల్లింపు
* కోవిడ్ నివారణ చర్యల కోసం నేరుగా కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రూ.4,114 కోట్లు విడుదల
* కేంద్రం వినతి మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల విషయంలో మద్దతుగా నిలిచింది. 
- రాష్ట్రాల వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితిని 60 శాతానికి పెంచింది.
- రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ వరుస రోజుల పరిమితిని 14 నుంచి 21 రోజులకు పెంచింది.
- త్రైమాసికంలో ఓవర్ డ్రాఫ్ట్ రోజుల పరిమితిని 32 నుంచి 50 రోజులకు పెంచింది.

16, మే 2020, శనివారం

నిర్మలాసీతారామన్: బొగ్గురంగంలో ప్రయివేట్‌కు ప్రోత్సాహం, రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్



బొగ్గు వెలికితీతలో ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యం తగ్గిస్తున్నట్లు తెలిపారు. అలాగే రక్షణ ఉత్పత్తుల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 నుంచి 79 శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు.
ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా నాలుగో విడత ప్యాకేజీ వివరాలను వెల్లడించిన ఆమె బొగ్గు, ఖనిజాలు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్ మేనేజ్ మెంట్, పవర్ డిస్ట్రిబ్యూషన్, స్పేస్, ఆటమిక్ ఎనర్జీ వంటి రంగాల్లో సంస్కరణలు తెస్తున్నట్లు ప్రకటించారు. ఆరు విమానాశ్రయాలను ప్రయివేటుకు అప్పగిస్తున్నట్లు కూడా చెప్పారు.

* బొగ్గురంగంలో 

ప్రభుత్వ గుత్తాధిపత్యం తగ్గించి ప్రయివేటు రంగానికి ప్రోత్సాహం అందించనున్నట్లు మంత్రి చెప్పారు.
ప్రస్తుతం ప్రతి టన్నుకూ ఇంతని స్థిర ధర ఉందని.. అలా కాకుండా రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేస్తామని చెప్పారు. అలాగే బొగ్గు వేలంలో ఎవరైనా పాల్గొనేలా నిబంధనలు సడలిస్తున్నట్లు చెప్పారు.
తక్షణం 50 బొగ్గు బ్లాకులు కేటాయిస్తున్నామని.. మౌలిక వసతుల కల్పనకు రూ. 50 వేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.

* ఖనిజ రంగం విషయానికొస్తే 

500 మైనింగ్ బ్లాకులను వేలం ద్వారా కేటాయించనున్నట్లు ప్రకటించారు. అల్యూమినియం పరిశ్రమలో కాంపిటీటివ్‌నెస్ కోసం ఇకపై బాక్సైట్, బొగ్గు బ్లాకులకు సంయుక్త వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు.

* రక్షణ రంగంలో 

కొన్ని ఆయుధాలను ఇకపై దిగుమతి చేయడం మానేసి దేశీయంగా తయారుచేసుకోనున్నట్లు చెప్పారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును కార్పొరేట్ చేసి రక్షణ సరఫరాలో స్వయంప్రతిపత్తి, సామర్థ్యం పెంచుతామని మంత్రి చెప్పారు.

* విమానయాన రంగానికొస్తే 

కొత్తగా 6 విమానాశ్రయాలను ప్రయివేటుకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 12 ఎయిర్పోర్టులను ప్రయివేటుకు అప్పగించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 2300 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. కొత్తగా 12 విమానాశ్రయాల నిర్మాణానికి రూ. 13 వేలు కేటాయిస్తామన్నారు.

* విద్యుత్ రంగంలో 

పంపిణీ సంస్థలు మనుగడ సాధించడానికి వీలుగా సంస్కరణలు చేపడుతున్నట్లు చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిస్కమ్ లను ప్రయివేటీకరిస్తున్నట్లు చెప్పారు.

* అంతరిక్ష రంగంలో 

ప్రయివేటు భాగస్వామ్యం కల్పిస్తామని.. ప్రయివేటు సంస్థలు ఇస్రో సౌకర్యాలను వాడుకునే అవకాశమిస్తామని చెప్పారు.

9, మే 2020, శనివారం

విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్: భారతదేశంలో 5 అత్యంత భారీ పారిశ్రామిక ప్రమాదాలు


విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ గ్యాస్ లీకవడం.. 12 మంది మరణించడం.. వందలాది మంది ఆసుపత్రుల పాలవడం.. లక్షల మంది ప్రాణభయంతో విశాఖపట్నం వదిలి వెళ్లడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారతదేశంలో అత్యంత భయానకమైన అయిదు పారిశ్రామిక ప్రమాదాలు(ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్) ఏంటో చూద్దాం.

1) భోపాల్ గ్యాస్ ట్రాజెడీ

ప్రపంచంలోనే అత్యంత విషాద పారిశ్రామిక ప్రమాదంగా దీన్ని చెబుతారు.
1984 డిసెంబరు 2 అర్ధరాత్రి దాటాక ఈ దుర్ఘటన జరిగింది. భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) పెస్టిసైడ్ ప్లాంట్ నుంచి మిథైల్ ఐసోసైనేట్(ఎంఐసీ) వాయువు లీవకవడంతో 5 లక్షల మందికి పైగా దీని ప్రభావానికి గురయ్యారు.
ఈ దుర్ఘటనలో చనిపోయినవారి సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ 2,259 మంది మరణించారని దుర్ఘటన జరిగిన వెంటనే అధికారికంగా ప్రకటించినప్పటికీ 1991లో అనేక అధ్యయనాల తరువాత ఆ సంఖ్యను 3,928కి పెంచారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3,787 మంది చనిపోయినట్లు ప్రకటించింది.
2006లో ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్ ప్రకారం ఈ దుర్ఘటన వల్ల 5,58,125 మంది గాయపడ్డారు.
వీరిలో 38,478 మంది పాక్షికంగా గాయపడగా 3,900 మంది శాశ్వత వైకల్యానికి గురయ్యారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎన్విరానమెంటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇండియా సంయుక్త అధ్యయనం ప్రకారం భోపాల్ విషవాయు దుర్ఘటన బాధితుల్లో 2 లక్షల మంది 15 ఏళ్ల లోపువారు కాగా.. 3,000 మంది గర్భిణులు ఉన్నారు.

2) చస్నాలా గని ప్రమాదం

ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఉన్న ధన్‌బాద్‌లో బొగ్గు గనిలో 1975లో జరిగిన పేలుడులో 372 మంది చనిపోయారు.
భారతదేశ చరిత్రలో జరిగిన భారీ పారిశ్రామిక ప్రమాదాలలో దీన్ని కూడా చెబుతారు.
1975 డిసెంబరు 27 సాయంత్రం మీథేన్ గ్యాస్‌కు మంటలు అంటుకుని పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది.
పేలుడు జరిగింది బొగ్గు గనిలో కావడంతో మంటలు భారీగా వ్యాపించి ప్రాణనష్టం పెరిగింది.
అంతేకాదు.. ఈ ప్రమాదం వల్ల గని కూలిపోయి పక్కనే ఉన్న రిజర్వాయర్ నుంచి నిమిషానికి 70 లక్షల గ్యాలన్న పరిమాణంలో నీరు నిండడంతో పేలుడు ప్రాంతానికి దూరంగా ఉన్న కార్మికులూ చనిపోయారు.
1976 జనవరి 19 వరకు గనిలో గాలించినా ఒక్కరు కూడా ప్రాణాలతో కనిపించలేదు.. మృతుల్లోనూ ఎందరివో శవాలు దొరకలేదు.
372 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ స్థానిక కార్మిక సంఘాలు 700 మందికిపైగా చనిపోయారని చెబుతాయి.
ఈ ఘటన నేపథ్యంలో బాలీవుడ్‌లో కాలాపత్తర్ అనే సినిమా తీశారు.

3) బాంబే రేవులో పేలుడు

1944 ఏప్రిల్ 14న ముంబయి(అప్పట్లో బొంబాయి) రేవులోని విక్టోరియా డాక్‌లో పత్తి బేళ్లు, బంగారం, మందుగుండు, 1400 టన్నుల పేలు పదార్థాలతో ఉన్న ఓడలో మంటలు చెలరేగి రెండు భారీ పేలుళ్లు సంభవించాయి.
మంటలకు భారీ నిప్పు కణికలు ఎగసిపడి రెండు కిలోమీటర్ల దూరం వరకు జనావాసాలు కూడా తగలబడిపోయాయి.
ఈ ప్రమాదంలో 800 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారన్నవాదనలూ ఉన్నాయి.
231 మంది నౌకాశ్రయ సిబ్బంది, 66 మంది అగ్నిమాపక సిబ్బంది, 500 మంది సాధారణ ప్రజలు చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2500 మంది గాయపడ్డారు.13 ఓడలు నాశనమయ్యయి. అపారమైన ఆస్తి నష్టం సంభవించింది.
ఈ పేలుడు కారణంగా ఓడ శకలాలు 12 కిలోమీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి.
పేలుడు తీవ్రతకు బొంబాయికి 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి.

4) జైపూర్ చమురు డిపో అగ్ని ప్రమాదం

2009లో రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌ శివారులోని సీతాపూర్ పారిశ్రామికవాడలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) డిపోలో 8 వేల కిలోలీటర్ల సామర్థ్యం(2,80,000 ఘనపుటడుగులు) గల చమురు ట్యాంకర్ పేలిపోవడంతో 12 మంది మరణించారు.
200 మందికిపైగా తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.5 లక్షల మంది ప్రజలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు.
వారం రోజుల వరకు మంటలు అదుపులోకి రాలేదు. ట్యాంకర్ నుంచి పైప్‌లైన్లోకి పెట్రోలు విడిచిపెడుతుండగా పేలుడు సంభవించి మంటలు చెలరేగినట్లు నిర్ధరించారు.ఈ పేలుడు వల్ల రిక్టర్ స్టేల్‌పై 2.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.
3 కిలోమీటర్ల దూరం వరకు ఇళ్ల కిటికీలు విరిగిపోయాయి.120 అడుగుల ఎత్తు వరకు మంటలు వ్యాపించడంతో 30 కిలోమీటర్ల దూరంలోని ప్రజలు కూడా ఈ మంటలను చూశారు.
జాతీయ రహదారి పక్కనే ఈ ప్లాంట్ ఉండడంతో 20 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. చుట్టుపక్కల ప్రాంతాలను ప్రజలను ఖాళీ చేయించడానికి సైన్యాన్ని దించాల్సి వచ్చింది.

5) కోర్బాలో కూలిన చిమ్నీ - 2009

చత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో 2009 సెప్టెంబరు 23న భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(బాల్కో)లో నిర్మాణంలో ఉన్న చిమ్నీ కూలిపోవడంతో 45 మందికిపైగా చనిపోయారు.
790 అడుగుల ఎత్తు వరకు నిర్మించిన చిమ్నీ కూలిపోయినప్పటికీ అక్కడ 100 మందికిపైగా ఉన్నారు.
ఆ సమయంలో మెరుపులతో వర్షం, భారీ గాలి దుమారం రావడంతో దాన్నుంచి తప్పించుకోవడానికి వీరంతా చిమ్నీ పక్కకు చేరగా అది కూలిపోవడంతో దాని కింద నలిగిపోయారు.
వేదాంత రిసోర్సెస్ నిర్వహణలోని బాల్కోలో 902 అడుగుల ఎత్తున ఈ నిర్మాణం చేపట్టగా మధ్యలోనే అది కూలిపోయి కార్మికుల ప్రాణాలు తీసింది.

6, మే 2020, బుధవారం

Super Flower Moon 2020: సూపర్ ఫ్లవర్ మూన్ అంటే ఏమిటి? మే 7న ఎన్ని గంటలకు కనిపిస్తుంది.. ఫుల్ డీటెయిల్స్ చదవండి



సూపర్ ఫ్లవర్ మూన్ 2020లో మే 7న కనిపించనుంది. సూపర్ ఫ్లవర్ మూన్ అంటే భూమికి అత్యంత సమీపంగా కనిపించే పున్నమి చంద్రుడు.
భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు భూకక్షలో అత్యంత సమీపంగా వచ్చిన రోజుల్లో పౌర్ణమి రోజున కనిపించే చందమామే ఈ సూపర్ ఫ్లవర్ మూన్.

ఎన్ని గంటలకు కనిపిస్తుంది

ఇది మే 7న బుద్ధ పూర్ణిమ రోజున కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.15 గంటలకు భూమికి అత్యంత సమీపంలోకి వస్తుంది. అయితే.. రాత్రి 10.30 నుంచి 11.30 గంటల(మన కాలమానం ప్రకారం) మధ్య పూర్తిస్థాయిలో ప్రకాశవంతంగా దర్శనమిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పేరెలా వచ్చింది

అయితే.. దీనికి ఫ్లవర్ మూన్ అనే పేరు రావడానికి కారణం ఉంది. ఉత్తరార్థ గోళంలో వసంత కాలం ప్రారంభమయ్యే సమయంలో ఏర్పడుతుంది కాబట్టి నాసా దీనికి సూపర్ ఫ్లవర్ మూన్ అని పేరు పెట్టింది.
దీనికి కార్న్‌ ప్లాంటింగ్‌ మూన్‌, మిల్క్‌ మూన్‌, ది వేశాక్‌ ఫెస్టివల్‌ మూన్‌ అనే పేర్లూ ఉన్నాయి.

ఈ ఏడాది ఇదే చివరిది

2020లో ఇదే చివరి సూపర్ మూన్ ఈ ఏడాదికి ఇక ఉండదు.
అంతేకాదు.. మళ్లీ సూపర్ మూన్ చూడాలంటే దాదాపు ఏడాది వెయిట్ చేయాలి.
2021 ఏప్రిల్ చివరి వారంలో మళ్లీ సూపర్ మూన్ కనిపించనుంది. దాన్ని సూపర్ పింక్ మూన్ అంటారు.
సో.. మిస్ కాకుండా గురువారం రాత్రి సూపర్ ఫ్లవర్ మూన్‌ను చూసేయండి.

2020లో నాలుగో సూపర్ మూన్

2020లో ఇప్పటికే మూడు సార్లు దర్శనమిచ్చిన ‘సూపర్‌ మూన్‌’ ఇప్పుడు నాలుగోసారి దర్శనమిస్తోంది. ఈ ఏడాదిలో ఇదే చివరి సూపర్‌ మూన్‌ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

పెట్రోల్ మీద రూ. 10, డీజిల్ మీద రూ. 13 సుంకాలు పెంచిన కేంద్రం


కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ల మీద లీటరుకు 8 రూపాయల చెప్పున రోడ్డు సెస్ పెంచింది. అలాగే.. పెట్రోల్ మీద లీటరుకు 2 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం కూడా పెంచింది.
 మొత్తంగా డీజిల్ మీద లీటరుకు 13 రూపాయలు, పెట్రోల్ మీద లీటరుకు 10 రూపాయలు చొప్పున సుంకాలు పెంచింది. ఈ పెంపు బుధవారం రాత్రి నుంచి అమలులోకి వచ్చింది.
దీంతో ప్రపంచంలో ఇంధనాల మీద అత్యధిక పన్నులు ఉన్న దేశంగా భారత్ నిలిచింది. ఈ పెంపుతో లీటరు పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం 32.98 రూపాయలు, డీజిల్ మీద 31.83 రూపాయలకు పెరిగినట్లయింది.
పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌ల మీద వ్యాట్ పెంపు
నిజానికి తమిళనాడు ప్రభుత్వం మే 3వ తేదీనే.. పెట్రోలియం ఉత్పత్తుల మీద వ్యాట్ వ్యవస్థలో మార్పులు చేయటంతో.. పెట్రోల్ మీద లీటరుకు 3.25 రూపాయలు, డీజిల్ మీద రూ. 2.50 చొప్పున ధరలు పెరిగాయి.
అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గినందున కేంద్రం ఆమేరకు ధరలు తగ్గిస్తుందన్న అంచానాతో ఈ సవరణలు చేపట్టింది.
ఆ మరుసటి రోజు మే 4వ తేదీన దిల్లీ ప్రభుత్వం డీజిల్ మీద లీటరుకు రూ. 7.1 చొప్పున, పెట్రోల్ మీద లీటరుకు రూ. 1.6 చొప్పున వాల్యూ యాడెట్ ట్యాక్స్ పెంచింది. ఈ పెంచిన మొత్తం రాష్ట్ర ఖాతాకు జమ అవుతుంది.
అదే రోజు రాత్రి కేంద్ర ప్రభుత్వం కూడా.. రోడ్డు సెస్, ఎక్సైజ్ సుంకాలను భారీగా పెంచుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశంలో చమురు ధరల పెంపులో ఇదే అతి పెద్ద రికార్డు.
ఈ పెంపుతో దిల్లీలో ప్రస్తుతం లీటరు 71.26 రూపాయలకు విక్రయిస్తున్న ధరలో 49.42 రూపాయలు పన్నులే ఉంటాయి. అలాగే.. ప్రస్తుతం 69.39 రూపాయలకు అమ్ముతున్న డీజిల్ ధరలో 48.09 రూపాయలు పన్నులే.
తాజాగా గురువారం నాడు పంజాబ్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటరుకు 2 రూపాయలు చొప్పున వ్యాట్ పెంచింది.
హరియాణా ప్రభుత్వం కూడా కొద్ది రోజుల కిందట లీటరుకు 1 రూపాయి చొప్పున ధరలు పెంచింది.
మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలు ఏప్రిల్ 1వ తేదీన పెట్రోల్ ఉత్పత్తుల మీద వ్యాట్ పెంచాయి. నాగాలాండ్ అయితే.. పెట్రోల్ ఉత్పత్తుల మీద ‘కరోనా సెస్’ అంటూ పన్ను విధించింది.
పెట్రోల్ మీద ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు
తాజా సుంకాల పెంపుతో భారతదేశంలో పెట్రోల్, డీజిల్‌ల మీద పన్నులు మొత్తం 69 శాతానికి పెరిగాయి.
ఈ ఇంధనాల మీద 60 శాతం కన్నా ఎక్కువ పన్నులున్న ఇతర దేశాలు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్‌లు మాత్రమే. అవి కూడా ఇండియాలో కన్నా తక్కువే ఉన్నాయి.   
పెట్రోల్ మీద ఇటలీలో 64 శాతం పన్నులు వసూలు చేస్తోంటే.. ఫ్రాన్స్, జర్మనీల్లో పన్నులు 63 శాతం, బ్రిటన్‌లో 62 శాతం పన్నులు ఉన్నాయి.
ఇంధనాల మీద పన్నులు స్పెయిన్‌లో 53 శాతం, జపాన్‌లో 47 శాతం, కెనడాలో 33 శాతం, అమెరికాలో 19 శాతం ఉన్నాయి.
ఇండియాలో గత ఏడాది వరకూ పెట్రోల్, చమురు ధరల్లో పన్నుల భాగం 50 శాతంగా ఉండేది.

COVID-19 Vaccine: ఇటలీ వ్యాక్సిన్ తయారుచేసేసిందా


కోవిడ్19 COVID-19 ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ అన్ని దేశాలూ దీనికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
భారత్‌లోనూ వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దేశంలోని ప్రధాన ఔషధ కంపెనీలన్నీ ఇప్పటికే ఈ రేసులో ఉన్నాయి.
 మరోవైపు హైదరాబాద్‌లోని మూడు బయోటెక్ కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేస్తున్నాయని.. జులై, ఆగస్టు నాటికి వ్యాక్సిన్ సిద్ధం కావొచ్చని తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
అయితే, ఇప్పుడు కరోనావైరస్ కారణంగా భీకరంగా ప్రభావితమైన ఇటలీలో దీనికి వ్యాక్సిన్ సిద్ధం చేశారన్న వార్త వినిపిస్తోంది.
మనుషులపై పనిచేసే COVID-19 VACCINE అభివృద్ధి చేసినట్లు ఇటలీ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఇటలీలోని టకీస్ అనే సంస్థ ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చినట్లు అక్కడి వార్తాసంస్థలు వెల్లడించాయి.
రోమ్‌లోని Spallanzani Institute స్పల్లంజానీ ఇనిస్టిట్యూట్‌లో ఎలుకలపై చేసిన ప్రయోగాలు ఫలించినట్లు టకీస్ సీఈవో లూయిగీ ఆరిషియో Luigi Aurisicchio చెబుతున్నారు.
కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షల మందికిపైగా మరణించారు. ఇటలీలో సుమారు 30 వేల మంది మరణించారు.
ఇటలీలో ప్రజలు మొదట్లో పెద్దగా పట్టించుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించారంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటలీ కనుక దీనికి వ్యాక్సిన్ కనుక్కుంటే ఆ దేశమే ప్రపంచాన్ని కాపాడిన ఘనత సొంతం చేసుకుంటుంది.

Cyclone Amphan: ఏపీకి ఎంఫాన్‌‌ తుఫాను ముప్పు




కరోనావైరస్‌ ధాటికి విలవిలలాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి దూసుకొస్తోంది. ఆ తుపాను పేరు ఎంఫాన్.
అండమాన్‌కు దక్షిణ దిశగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతుంది. ఈ నెల 8వ తేదీ నాటికి ఆ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్‌గా (Cyclone) మారుతున్న ఈ తుఫాన్‌కి ఎంఫాన్‌ (Cyclone Amphan) అనే పేరు దీనికి పెట్టారు. 
ఈ నెల 13వ తేదీ నాటికి మయన్మార్ వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఓడిస్సా తీర ప్రాంతాల్లో దీని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (ECMWF) ప్రకారం.. ఈ నెల 13వ తేదీ నాటికి మయన్మార్ వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా మత్స్యకారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిసా తీర ప్రాంత జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొన్నారు.
మే9 నుండి మే11 తేదీ లోపు అంఫాన్ తుఫాను ఆంధ్రప్రదేశ్ పై పెద్ద ఎత్తున విరుచుకు పడనున్నట్లు వాతావరణ శాఖ నుండి వార్తలు వస్తున్నాయి. మే 9 తర్వాత ఏ సమయంలో అయినా ఈ తుఫాను రాష్ట్రాన్ని బలంగా తాకే ప్రమాదం ఉండటంతో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు అటు బోర్డర్ లో ఉన్న ఒరిస్సా రాష్ట్రం కూడా ఈ తుఫాను పై ముందుగానే దీని భారినుండి తప్పించుకోవడానికి ప్రణాలికలు సిద్దం చేస్తున్నాయి.

ఆరోగ్యసేతు AAROGYA SETU యాప్ పూర్తిగా సురక్షితం.. యూజర్ల డేటాకు ఎలాంటి ఇబ్బందీ లేదు



ఆరోగ్య సేతు యాప్‌‌‌లో డేటా సెక్యూరిటీ పరంగా లోపాలున్నాయంటూ ఒక ఎథికల్ హ్యాకర్ హెచ్చరించడంతో ఆ యాప్ బృందం స్పందించింది.
సదరు హ్యాకర్‌ను సంప్రదించామని చెబుతూ.. హ్యాకర్ లేవనెత్తిన అంశాలు, వాటికి సమాధానాలను ఒక ప్రకటన రూపంలో విడుదల చేసింది.
ఆరోగ్యసేతు యాప్ కొన్ని సందర్భాలలో యూజర్ లొకేషన్‌ డేటాను తీసుకుంటుందన్న హ్యాకర్ క్లెయిమ్‌కు.. ‘‘ఈ యాప్ డిజైన్‌లోనే అది ఉంది. అందుకే ప్రైవసీ పాలసీలోనూ స్పష్టంగా ఆ విషయం పేర్కొన్నాం.
యూజర్ లొకేషన్ డేటాను తీసుకుని మా సర్వర్‌లో భద్రంగా, ఎన్‌క్రిప్టెడ్‌గా, అనామకంగా ఉంచుతాం’’ అని సమాధానం ఇచ్చింది.
పరిధి, అక్షాంశరేఖాంశాలను మార్చుతూ యూజర్ తన చుట్టూ ఉన్న కేసుల వివరాలను తెలుసుకోగలుగుతాడన్న క్లెయిమ్‌కు సమాధానమిస్తూ.. 500 మీటర్లు, 1 కిలోమీటర్, 2 కి.మీ., 5 కి.మీ., 10 కి.మీ. పరిధి స్థిర పరామితులు యాప్‌లోనే ఉన్నాయని.. వాటినే యూజర్ మార్చి గణాంకాలు తెలుసుకోగలరని.. ఇది కాకుండా ఇంకే పరిధిలో సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నించినా అది ఒక కిలోమీటరు పరిధిలో సమాచారం మాత్రమే అందించేలా యాప్ డిజైన్ ఉందని వివరించింది.
ఎవరి వ్యక్తిగత డేటాకైనా ముప్పు ఉందని ఈ హ్యాకర్ నిరూపించలేదని.. తాము నిరంతరం ఈ యాప్‌ను పరీక్షిస్తూ అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఆరోగ్యసేతు టీం చెప్పింది.
ఇంకెవరైనా ఇందులో లోపాలను గుర్తిస్తే తమ దృష్టికి తేవాలంటూ support.aarogyasetu@gov.inకు మెయిల్ చేయాలని కోరారు.