6, సెప్టెంబర్ 2020, ఆదివారం

Big boss4: యూట్యూబ్ గంగవ్వ ఇప్పుడు బిగ్‌బాస్ గంగవ్వ

గంగవ్వ

గంగవ్వ.. తెలుగు రాష్ట్రాల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న చాలామందికి తెలిసిన పేరది. ఇప్పుడు టీవీ ఉన్న అందరికీ తెలిసే టైమొచ్చేసింది. అవును.. గంగవ్వ టాలెంట్ అలాంటిది. 

టెక్నాలజీ తెలియకపోయితే తన సింపుల్ స్టైల్‌తో యూట్యూబ్‌లో పాపులర్ అయిన గంగవ్వ ఇప్పుడు మొబైల్ స్క్రీన్ నుంచి టీవీ స్క్రీన్‌కు వచ్చేశారు. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు.

గంగవ్వ పూర్తి పేరు మిల్కూరి గంగవ్వ.  తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి ఆమె స్వగ్రామం. ఎనిమిది మంది మనవలు, మనవరాళ్లు ఉన్న గంగవ్వ వయసెంతో ఎవరికీ కచ్చితంగా తెలియదు. బర్త్ రికార్డులు వంటివి ఏమీ లేకపోవడమే దానికి కారణం. 

‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ చానల్‌ వీడియోల్లో ఆమె కనిపిస్తారు. 2012లో ఆమె అల్లుడు శ్రీకాంత్ శ్రీరామ్ ఈ చానల్ ప్రారంభించారు. సినిమా రంగంలో అనుభవం ఉన్న శ్రీకాంత్ 9 మంది టీంతో కలిసి ఈ చానల్‌కు వీడియోలు చేస్తూ తన అత్తగారైన గంగవ్వను అందులో భాగస్వామిని చేశారు. క్రమంగా ఆమె వీడియోలకు పాపులారిటీ పెరగడంతో ఆ చానల్‌కు ఇప్పుడు మిలియన్లలో ఫాలోవర్లు వచ్చారు.

గ్రామీణ జీవితాలు, సంస్కృతిపై వీరు వీడియోలు చేస్తారు. 


2012లోనే మై విలేజ్ షో చానల్ మొదలైనా పెద్దగా పాపులర్ కాలేదు. 2017 నుంచి ఆ చానల్ వీడియోల్లో గంగవ్వ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చేవారు. వాటికి మాంచి స్పందన రావడంతో ఎక్కువ వీడియోల్లో ఆమెను ఇన్వాల్వ్ చేసేవారు. దాంతో ఆ చానల్, గంగవ్వ ఇద్దరూ ఫేమస్ అయ్యారు.

అత్యంత సహజమైన నటనే గంగవ్వను యూట్యూబ్ స్టార్‌ను చేసింది. 


‘‘నాకు చదువు రాదు.. ఈ ఫోన్లు, కెమేరాలు ఏవీ తెలిసేవి కాదు.. నా మాట తీరే జనానికి నచ్చినట్లుంది’’ అంటారు గంగవ్వ.

గంగవ్వ యూట్యూబ్ స్టార్ కావడానికి ముందు పొలం పనులు చేసుకునేవారు. బీడీలు చుట్టేవారు. 

యూట్యూబ్‌లోనే కాదు గంగవ్వకు ఇన్‌స్టాగ్రామ్‌‌లో కూడా పాపులారిటీ ఉంది. ఆమెకు ఇన్‌స్టాలో 50 వేల మందికి పైగా ఫాలోవర్లున్నారు. 

ఈ పాపులారిటీయే ఆమెను సినిమాల్లో నటించేలా చేసింది. ఇస్మార్ట్ శంకర్, మల్లేశం వంటి సినిమాల్లో ఆమె నటించారు.

ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 4లో ఆమె కూడా ఒక కంటెస్టెంట్ కావడంతో ఆమె స్టార్‌డమ్ మరింత పెరిగింది.

3, సెప్టెంబర్ 2020, గురువారం

నరేంద్ర మోదీ ట్విటర్ అకౌంట్ హ్యాక్

 

Narendra Modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్, యాప్‌కు చెందిన ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ట్విటర్ ప్రకటించింది.

ఆ అకౌంట్‌ను హ్యాకర్లు తమ అధీనంలోకి తీసుకుని.. క్రిప్టో కరెన్సీ ద్వారా డిజాస్టర్ రిలీఫ్ ఫండ్‌కు నిధులు సాయం చేయాలంటూ వరుస ట్వీట్లు చేశారు.

దీంతో ట్విటర్ అప్రమత్తమైంది. హ్యాకింగ్ జరిగినట్లు ఆ సంస్థ నిర్ధరించింది. ముందుముందు ఇలాంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ట్విటర్ తెలిపింది. 

నరేంద్ర మోదీ: ఏ పొలిటికల్ బయోగ్రఫీ


కొద్దిరోజుల కిందట అమెరికాలో హైప్రొఫైల్ ట్విటర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. హ్యాకయిన అకౌంట్లలో అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అకౌంట్లూ ఉన్నాయి.

ఆ తరువాత హ్యాకింగుకు గురయిన అత్యంత ప్రముఖుడి అకౌంట్ మోదీదే. కాగా హ్యాకింగ్ తరువాత మోదీ ఖాతా నుంచి వచ్చిన ట్వీట్లను ట్విటర్ డిలీట్ చేసింది. 


2, సెప్టెంబర్ 2020, బుధవారం

పబ్‌జీ సహా 118 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించిన భారత్

 

పబ్‌జీ

దేశంలో యువత విస్తృతంగా ఉపయోగిస్తున్న పబ్‌జీ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దానితో పాటు దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు విఘాతకరమైన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం ఉన్న 118 మొబైల్ యాప్‌లను బ్లాక్ చేయాలని నిర్ణయించినట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ బుధవారం సాయంత్రం ప్రకటించింది. దేశ భద్రత, రక్షణ, శాంతిభద్రతలకు అవి విఘాతకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమకు అందుబాటులో ఉన్న సమాచారం చెప్తోందని పేర్కొంది. 

భారత్ - చైనా సరిహద్దులో లదాఖ్ వద్ద ఇరు దేశాల మధ్య తాజా ఉద్రిక్తతలు తలెత్తిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.

ఇంతకు ముందు కూడా.. లద్ధాఖ్‌లో సరిహద్దు వద్ద గాల్వన్ లోయలో ఘర్షణలు చెలరేగినపుడు.. టిక్‌టాక్ సహా పలు చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే.

భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ టిక్‌టాక్, షేరిట్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ జూన్ 29 రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009 లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు చెప్పింది. అప్పుడు నిషేధించిన 59 యాప్‌ల జాబితాలో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, బైడూ మ్యాప్, షేరిట్ వంటి చైనా యాప్‌లు అధికంగా ఉన్నాయి. తాజా ఆదేశాల్లో.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫారంలలో కొన్ని మొబైల్ అనువర్తనాల దుర్వినియోగంపై తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ తెలిపింది.

ఈ యాప్‌ల సహాయంతో డాటాను దొంగిలించి భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు అందజేస్తున్నట్లు తమకు ఫిర్యాదులొచ్చాయని తెలిపారు. ఇది భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగిస్తుందని, ఈ అంశంలో తక్షణ చర్యలు చేపట్టడం అవసరమని వివరించారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ కూడా ఈ యాప్‌లను నిషేధించమంటూ అనేకసార్లు కోరిందనీ...అలాగే, అనేకమంది ప్రజా ప్రతినిధులు కూడా ఈ యాప్‌ల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తపరిచినట్లు సమాచారం. భారత సార్వభౌమత్వానికి నష్టం కలిగిస్తూ, భారత ప్రజల గోప్యతకు భంగం కలిగించే యాప్‌లను నిషేధించవలసిందేనని అనేకమంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు. వీటన్నిటి ఆధారంగా, దేశ శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఈ యాప్‌లను నిషేధించిందని తెలిపారు.


31, ఆగస్టు 2020, సోమవారం

ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

ప్రణబ్ ముఖర్జీ


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్దిసేపటి కిందట మృతి చెందారు.

ప్రణబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం సాయంత్రం ట్విటర్‌లో వెల్లడించారు.

సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈమేరకు ఆయనకు చికిత్స అందిస్తున్న దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ హాస్పిటల్(ఆర్&ఆర్) సోమవారం వెల్లడించింది.

ఆయన డీప్ కోమాలో ఉన్నారని.. వెంటిలేటర్‌పై ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సాయంత్రానికి ఆయన మరణించారు.

ప్రణబ్ ముఖర్జీ దిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న తన ఇంట్లో పడిపోయిన తరువాత మెదడులో రక్తం గడ్డకట్టగా ఆపరేషన్ కోసం ఆగస్టు 10న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు.

ఆ శస్త్రచికిత్స తరువాత ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ కోమాలోకి వెళ్లారు.

2012-17 మధ్య దేశానికి 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలందించారు.

ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగానూ పనిచేశారు.


భారత రత్న పురస్కారం ప్రదానం చేసిన మోదీ ప్రభుత్వం

ప్రణబ్ కుమార్ ముఖర్జీ 1935, డిసెంబరు 11న బెంగాల్ (ప్రస్తుత పశ్చిమ బెంగాల్)లోని మిరాఠీ గ్రామంలో జన్మించారు. 2012 నుంచి 2017 వరకు భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నారు. రాష్ట్రపతి పదవి చేపట్టకముందు 2009 నుంచి 2012 వరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

2012లో ప్రతిభా పాటిల్ పదవీ విరమణ తరువాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టి 2017 వరకు కొనసాగారు. 2019లో ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు.

చిరు దివ్వెల నుంచి షాండ్లియర్స్ వరకు

"బెంగాల్‌లోని ఒక చిన్న దీపపు వెలుగు నుంచి దిల్లీ షాండ్లియర్ వెలుగు జిలుగులను చేరుకునే క్రమంలో నేను అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను" అని తన జీవన ప్రయాణాన్ని ఆయన ఓ సందర్భంలో వివరించారు.

కాంగ్రెస్ హయాంలో సంక్షోభ పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులను చేపట్టారు. రాజకీయల్లో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రణబ్ ముఖర్జీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ప్రణబ్ తండ్రి కమద్ కింకర్ ముఖర్జీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేక సంవత్సరాలు జైల్లో గడిపారు. స్వాతంత్ర్యం తరువాత 1952 నుంచి 1964 వరకూ పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సభ్యుడిగా ఉన్నారు. ఆయన తల్లి పేరు రాజ్యలక్ష్మి ముఖర్జి

ప్రణబ్ ముఖర్జీ చదువు, ఉద్యోగం కోల్‌కతాలో సాగింది. చదువు ముగిసిన తరువాత అధ్యాపకుడిగా, విలేకరిగా పనిచేసిన తరువాత 1969లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడంతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.

తరువాత నాలుగుసార్లు 1975, 1981, 1993, 1999 లలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.

2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేవరకూ లోక్‌సభలో కొనసాగారు.

గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ ‘‘మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్" గా గుర్తింపు పొందారు.

కేబినెటెలో 1993-95 వరకూ వాణిజ్య మంత్రిగా, 1995-96, 2006-09 ల లో విదేశీ వ్యవహరాల మంత్రిగా, 2004-06 వరకు రక్షణ మంత్రిగా, 2009-12 వరకూ ఆర్థిక మంత్రిగా పదవులు నిర్వహించారు.

ఇండియన్ ఎకానమీకి మొదటి రిఫార్మర్

భారత ఆర్థిక వ్యవస్థకు మొదటి సంస్కర్తగా ముఖర్జీ గుర్తింపు పొందారు.

1982-84 మధ్య బాలన్స్ ఆఫ్ పేమెంట్ తరుగుదలను అదుపులో పెట్టి, కేంద్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే విధానాలను తీసుకురావడంలో ముఖర్జీ ప్రముఖ పాత్ర వహించారు.

అంతేకాకుండా ఐఎంఎఫ్ చివరి విడత రుణ సహాయాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయడం ద్వారా ఆర్థిక మంత్రిగా తన సమర్థతను చాటుకున్నారు.

ఇందిరాగాంధీ మరణానంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పశ్చిమ బెంగాల్లో రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ (ఆర్ఎస్సీ)ను స్థాపించారు. మూడేళ్ల తరువాత ఈ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

1991-96 వరకూ ప్రధాని పీవీ నరసింహరావు అధ్యక్షతన ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఈ కాలంలోనే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, ప్రధాని పీవీ నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు.

2008లో పద్మ విభూషణ్ పురస్కరాన్ని గ్రహించారు.

మళ్లీ 2009 లో ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టారు. 2010-11 బడ్జెట్ ప్రసంగంలో మొట్టమొదటిసారిగా ప్రజా రుణాన్ని తగ్గించే లక్ష్యాన్ని ప్రకటించారు. ద్యవ్యలోటును తగ్గిస్తూ, వృద్ధిరేటుని పెంచే వివిధ ఆర్థిక విధానాలను రూపొందించారు.

ప్రణబ్ ముఖర్జీ దేశప్రభుత్వంలోనే కాకుండా అంతర్జాతీయ సంస్థల్లో కూడా ముఖ్యమైన స్థానాలను అధిష్టించారు.

భారత ఆర్థికమంత్రిగా ఉన్న కాలంలోనే ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్ (ఐఎంఎఫ్), వరల్డ్ బ్యాంకులలో బోర్డ్ ఆఫ్ గవర్నర్లలో ఒకరిగా వ్యవహరించారు.

కుమారుడు, కుమార్తె రాజకీయాల్లోనే..

ప్రణబ్ ముఖర్జీ 1957లో సువ్రా ముఖర్జీని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

పెద్ద కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అభిజిత్ ఓటమి పాలయ్యారు.

కుమార్తె శర్మిష్ఠ కాంగ్రెస్ పార్టీ నేత. ప్రణబ్ ముఖర్జీ చాలా పుస్తకాలు కూడా రాశారు. వాటిల్లో "థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ (2014), ద టర్బులెంట్ ఇయర్స్ (2016), కొయిలేషన్ యియర్స్ (2017) విమర్శకుల ప్రశంసలు పొందాయి.



చైనా, భారత్ ఘర్షణ: మళ్లీ ఆక్రమణలకు తెగబడిన చైనా.. తిప్పికొట్టిన భారత్

 

చైనా సైన్యం (ఇమేజ్ క్రెడిట్ గ్లోబల్ టైమ్స్)

చైనా మరోసారి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వింది. రెండు నెలల కిందట గల్వాన్ లోయలో ఘర్షణ తరువాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడినా వివిధ స్థాయిల్లో చర్చలు జరగడంతో బలగాల ఉపసంహరణ, కొన్ని కొత్త ఒప్పందాలు జరిగాయి.

అయితే.. ఈ ఒప్పందాలను పక్కనపెడుతూ చైనా మరోసారి భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో ఇండియన్ ఆర్మీ ఆ యత్నాలను అడ్డుకుంది. 

పాంగాంగ్ సో సరస్సు వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆర్మీ మళ్లీ యాక్టివిటీ పెంచి సరిహద్దులను అతిక్రమించే చర్యలతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించగా ఇండియన్ ఆర్మీ దాన్ని తిప్పికొట్టింది.

ఇంతకుముందు పాంగాగ్ సరస్సుకు ఉత్తర వైపు గడబిడ సృష్టించి చైనా ఈసారి భారత సైన్యం దృష్టి మళ్లిస్తూ సరస్సు దక్షిణ వైపు ఆక్రమణలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్ తీవ్రంగా ప్రతిస్పందించడంతో మరోసారి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే, ఇండియన్ ఆర్మీ ఘర్షణ జరిగినట్లు ప్రకటించలేదు.. చైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినట్లు మాత్రమే తెలిపింది.

గత గల్వాన్ ఘర్షణ కానీ ప్రస్తుత ఘర్షణ కానీ అంతా పాంగాంగ్ సో సరస్సు ప్రాంతంలోనే చోటుచేసుకున్నాయి.

పాంగాంగ్ సో సరస్సు Pangong Tso


పాంగాంగ్ సరస్సు కథేంటి?

భారత్, చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌లో పాంగాంగ్ సరస్సు ఉంది. టిబెట్‌లో దీన్ని సో న్యాక్ అని.. చైనాలో సోమో గాంగ్లా రింగ్పో అంటారు.

5 కిలోమీటర్ల వెడల్పు  134 కిలోమీటర్ల పొడవు ఉన్న దీని విస్తీర్ణం సుమారు 650 చదరపు కిలోమీటర్లు ఉంది.

అయితే, ఇందులో సుమారు 60 శాతం సరస్సు ప్రాంతం టిబెట్ భూభాగంలో ఉంది. 

శీతాకాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది.

చుట్టూ భూభాగమే ఉండి, సముద్రంతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఇది ఉప్పు నీటి సరస్సు. అయితే, ఇందులో తూర్పు ప్రాంతం చాలా తక్కువ లవణత కలిగి ఉంటుంది.. దాదాపు మంచినీరులాగే ఉంది. కానీ, సరస్సులో పశ్చిమ ప్రాంతాన మాత్రం లవణ గాఢత ఎక్కువగా ఉంటుంది. 

భారత్ వైపు ఉన్న ప్రాంతంలో చేపలు వంటి నీటి జీవులు చాలా తక్కువ.. టిబెట్ వైపు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అయితే, ఈ సరస్సు కేంద్రంగా అనేక పక్షి జాతులు ఉన్నాయి. 

సింధునది ఉపనది అయిన శ్యోక్ నది ఒకప్పుడు ఈ సరస్సుకు నీరందించేది కానీ కాలక్రమేణా సరస్సుకు, శ్యోక్ నదికి లింక్ తెగిపోయింది. ప్రస్తుతం భారత్ వైపు నుంచి రెండు సెలయేర్లు ఈ సరస్సులోకి ప్రవహిస్తుంటాయి.


ఎవరికి ఎంతవరకు పట్టుంది

భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ కొంత భాగం ఈ సరస్సు మీదుగా వెళ్తుంది. అయితే, ఇక్కడ రెండు దేశాల మధ్య సరిహద్దులు కచ్చితంగా నిర్ణయించుకోకపోవడంతో ఎవరికివారు తమదంటే తమదంటూ కొంత ప్రాంతం విషయంలో వాదిస్తుంటారు. పాంగాంగ్ సో సరస్సు తీరం వెంబడి ఉన్న పర్వత బంజర్లు ఉంటాయి. వీటిని ఫింగర్లు అంటారు. భారత వాదన ప్రకారం ఫింగర్ 8 వరకు మన భూభాగమే. కానీ, చైనా కూడా ఫింగర్ 2 వరకు తమదే అంటుంది.

అయితే, భారత్ ఫింగర్ 8 వరకు తమదే అంటున్నా ఫింగర్ 4 వరకు మాత్రమే సైనిక నియంత్రణ ఉంది. అటు చైనా కూడా ఫింగర్ 2 వరకు తమదే అంటున్నా పింగర్ 4 వరకు సైనిక నియంత్రణ ఉంది. 

చాలాకాలంగా ఫింగర్ 4 వరకు ఇటు భారత్, అటు చైనా సైన్యాల సంచారం ఉన్నా ఇప్పుడు చైనా ఫింగర్ 2 దాటి భారత్ సైన్యం రాకుండా అడ్డుపడుతుండడంతో ఘర్షణలు పెరుగుతున్నాయి.

కార్గిల్ యుద్ధం సమయంలో భారత్ పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని బలగాలను కొంత పాక్ సరిహద్దుకు తీసుకెళ్లినప్పుడు అదే అదనుగా చైనా ఫింగర్ 4 దాటి రోడ్డు నిర్మాణాలకు ప్రయత్నించింది. ఇప్పుడు ఫింగర్ 2 వరకు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది.

Read Our Exclusives:

ప్రణబ్ ముఖర్జీ: మరింత క్షీణించిన మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం

ప్రణబ్ ముఖర్జీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఆయనకు చికిత్స అందిస్తున్న దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ హాస్పిటల్(ఆర్&ఆర్) సోమవారం వెల్లడించింది.

ఆయన డీప్ కోమాలో ఉన్నారని.. వెంటిలేటర్‌పై ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ప్రణబ్ ముఖర్జీ దిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న తన ఇంట్లో పడిపోయిన తరువాత మెదడులో రక్తం గడ్డకట్టగా ఆపరేషన్ కోసం ఆగస్టు 10న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు.

ఆ శస్త్రచికిత్స తరువాత ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ కోమాలోకి వెళ్లారు.

2012-17 మధ్య దేశానికి 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలందించారు.

ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగానూ పనిచేశారు.

Read Our Exclusives:

28, ఆగస్టు 2020, శుక్రవారం

లాక్‌డౌన్: ముంబయి ప్రజలపై ఒత్తిడి విపరీతం.. చెన్నైలో కొంత నయం.. విద్యార్థులకు సంతోషం తగ్గిపోయింది.. ప్రజలకు నిద్ర పట్టలేదు

ఒత్తిడి, స్ట్రెస్

ముంబయి, చెన్నై, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, సైకాలజీ, స్ట్రెస్, నీట్, ఎగ్జామ్స్

కరోనావైరస్, లాక్‌డౌన్ కాలంలో మనుషులపై ఒత్తిడి ఏ స్థాయిలో పెరిగిందనేది తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ముంబయి ప్రజలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. అందుకు భిన్నంగా చెన్నై ప్రజలు తక్కువ ఒత్తిడికి గురయ్యారట.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మద్య 8,396 మందిపై ఈ సర్వే చేశారు. యువర్ దోస్త్ అనే ఆన్‌లైన్ మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫాం ఈ సర్వే చేపట్టింది. ఇందులో ముంబయి ప్రజానీకంలో ఒత్తిడి స్థాయి 48 శాతం పెరిగినట్లు గుర్తించారు. దేశంలో మరే నగరంలోనూ ప్రజలు ఈ స్థాయిలో ఒత్తిడికి గురి కావడం లేదు.

బెంగళూరులో 37 శాతం, దిల్లీలో 35 శాతం, చెన్నైలో 23 శాతం ఒత్తిడి స్థాయి పెరిగినట్లు గుర్తించారు.

దేశవ్యాప్తంగా చూసుకుంటే లాక్ డౌన్ కారణంగా 65 శాతం మందిపై ఒక మాదిరి నుంచి తీవ్ర స్థాయి వరకు ఒత్తిడి ఉందని గుర్తించారు.

లాక్ డౌన్ కాలంలో జనాల్లో ఒత్తిడి ఒక్కటే కాదు కోపం కూడా బాగా పెరిగిపోయిందట. అదే సమయంలో సంతోషం తగ్గిందని తేలింది.

ప్రజల్లో కోపం 33 శాతం పెరిగిందని.. సంతోషం 6 శాతం తగ్గిందని గుర్తించారు. 

59 శాతం మందిలో వర్క్, లైఫ్ బ్యాలన్స్ కూడా తప్పినట్లు గుర్తించారు.


విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి 

ఎక్కువగా విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగినట్లు ఈ సర్వే గుర్తించింది. వారిలో  అంతకు ముందు కంటే 39 శాతం ఒత్తిడి స్థాయి పెరగ్గా ఉద్యోగుల్లో 35 శాతం ఒత్తిడి స్థాయి పెరిగిందట. 

లాక్ డౌన్ పొడిగిస్తున్నకొద్దీ విద్యార్థుల్లో కోపం, యాంగ్జైటీ ఎక్కువైందని.. అదే సమయంలో వారిలో ఆనందం తగ్గిపోయిందని సర్వేలో గుర్తించారు.

లాక్ డౌన్ కాలంలో ప్రజల్లో ఉద్వేగం వల్ల ఆవేశం 22 శాతం పెరిగిందని.. నిద్ర 11 శాతం తగ్గిపోయిందని సర్వే గుర్తించింది. 

Read Our Exclusives:

27, ఆగస్టు 2020, గురువారం

నరేంద్రమోదీకి చైనాలో భారీగా ఫ్యాన్స్... చైనా సొంత మీడియా సర్వేలో వెల్లడైన నిజం

 

ఇండియా, చైనా జెండాలు

‘ది గ్లోబల్ టైమ్స్’.. చైనాలోని పాలక కమ్యూనిస్ట్ పార్టీ కనుసన్నల్లో నడిచే పత్రిక. ఆ పత్రిక తాజాగా భారత్-చైనాల సంబంధాలపై చేపట్టిన ఓ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 

భారత్, నరేంద్ర మోదీ గురించి చైనా ప్రజలు ఏమనుకుంటున్నారో సర్వే చేయగా 50 శాతం కంటే ఎక్కువ మంది సానుకూలత చూపారు.

భారత్, చైనాల మధ్య సరిహద్దు ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ‘ది గ్లోబల్ టైమ్స్’, చైనా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్(సీఐసీఐఆర్)లు చైనాలో 1960 మందితో మాట్లాడి చేపట్టిన అభిప్రాయ సేకరణలో సగానికంటే ఎక్కువ మంది భారత్, భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే మంచి అభిప్రాయమే వ్యక్తం చేశారు.

సర్వేల్లో పాల్గొన్న చైనీయుల్లో 53.5 శాతం మంది భారత్ అంటే తమకు సానుకూల అభిప్రాయం ఉందని చెప్పగా, భారత ప్రధాని నరేంద్రమోదీపై 50.7 శాతం మంది సానుకూలత వ్యక్తంచేశారు.

లద్దాఖ్ వద్ద సరిహద్దుల్లో రెండు దేశాల సైనికులు మధ్య ఘర్షణ జరగగా, ఆ తరువాత రెండు దేశాల సైనికాధికారులు, విదేశాంగ మంత్రుల స్థాయిలో సమావేశాలు జరిగాయి. 

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారినా ప్రతిష్టంబన కొనసాగుతున్న తరుణంలో ‘ది గ్లోబల్ టైమ్స్’ అనేక అంశాలపై సర్వే చేసింది. భారత్‌లో చైనా వ్యతిరేక సెంటిమెంట్, భారత్ సైనిక సామర్థ్యం వంటి అంశాలపైనా ఈ సర్వేలో చైనీయులు తమ అభిప్రాయాలు తెలిపారు.

వీటన్నిటినీ క్రోడీకరించి గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. అయితే, ట్విటర్‌లో ఆ పత్రిక పోస్ట్ చేసిన ఇన్ఫోగ్రాఫిక్‌లో భారత్, మోదీ పట్ల చైనీయుల సానుకూలతకు సంబంధించిన డాటాను చూపించినప్పటికీ కథనంలో మాత్రం ఆ విషయం ప్రస్తావించలేదు. 

గ్లోబల్ టైమ్స్‌లో వచ్చిన సర్వే రిపోర్ట్


చైనాపై కోపం ఏ రేంజ్‌లో ఉందనుకుంటున్నారు

భారత్ ఆర్థికపరంగా చైనాపై ఎక్కువగా ఆధారపడుతుందా అన్న ప్రశ్నకు 49.6 శాతం మంది అవునని చెప్పగా 27.1 శాతం మంది ఆ వాదనతో ఏకీభవించలేదు. 23.3 శాతం మంది దీనిపై స్పష్టమైన అభిప్రాయం చెప్పలేదు.

ప్రస్తుతం భారత్‌తో యాంటీ చైనా సెంటిమెంట్ రగులుతోందా అన్న ప్రశ్నకు సర్వేలో పాల్గొన్నవారిలో 70.8 శాతం మంది నుంచి అవునన్న సమాధానం వచ్చింది.

15.2 శాతం మంది మాత్రం అలాంటిదేమీ లేదన్నారు. 


ఇండియన్ ఆర్మీ అంటే చైనా భయపడుతోందా

ఇక భారత సైనిక బలగాల వల్ల చైనాకు ముప్పు ఉందా అన్న ప్రశ్నకు సర్వేలో పాల్గొన్నవారిలో 30.9 శాతం మంది అవుననే చెప్పారు. 

57.1 శాతం మంది అలాంటి ముప్పేమీ ఉండదన్నారు. 

12 శాతం మంది దీనిపై నిర్దిష్ట అభిప్రాయం వ్యక్తం చేయలేదు.


చైనా, భారత్ సంబంధాలకు అడ్డుగోడలేమిటి?

రెండు దేశాల మధ్య సంబంధాలలో అతి పెద్ద అవరోధమేంటన్న ప్రశ్నకు అత్యధికుల నుంచి వచ్చిన సమాధానం సరిహద్దు వివాదం. సరిహద్దు వివాదమే రెండు దేశాల మధ్య సంబంధాలకు అడ్డుగోడ అని 30 శాతం మంది అభిప్రాయపడ్డారు.

24.5 శాతం మంది అమెరికా జోక్యం వల్ల కూడా చైనా, భారత్‌ల సంబంధాలు దెబ్బతింటున్నాయన్నారు.

చైనా పట్ల భారత్ విద్వేషం చూపడం వల్లే సంబంధాలు దెబ్బతింటున్నాయని 22.7 శాతం మంది.. శత్రుదేశంగా భావించడం వల్ల అని 10.7 శాతం మంది చెప్పారు.

వాణిజ్య రక్షణాత్మకతను 4.8 శాతం.. టిబెట్ అంశాన్ని 4 శాతం మంది కారణంగా చెప్పారు.


చైనా వస్తువుల బహిష్కరణపై ఎలా ఫీలవుతున్నారు

చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు.. చైనా సంస్థలపై నిషేధంపై 35.3 శాతం మంది తీవ్రంగా స్పందించారు. చైనా ప్రతీకార చర్యలకు దిగాల్సిందేనన్నారు.

29.3 శాతం మంది మాత్రం భారత్ ఈ విషయంలో సీరియస్‌గా ఏమీ లేదని.. పెద్దగా పట్టించుకోనవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఇది పెద్ద సమస్యేనని.. దీనిపై దృష్టిపెట్టాలని 23.2 శాతం మంది చెప్పారు.


చైనాను దాటాలంటే భారత్ ఎన్నాళ్లు పడుతుంది..?

భారత్ అన్ని రంగాల్లో చైనాను అధిగమించాలంటే ఎంత కాలం పడుతుందని ఈ సర్వేలో పాల్గొన్నవారిని ప్రశ్నించారు.

భారత్ ఎన్నటికీ అధిగమించలేదని 54 శాతం మంది చెప్పగా.. వందేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుందని 10.4 శాతం మంది చెప్పారు.

పదేళ్లలోపేనని 3.9 శాతం మంది.. 20 ఏళ్లు చాలని 8.1 శాతం మంది, 50 ఏళ్లలో అధిగమించొచ్చని 8.7 శాతం మంది.. 100 ఏళ్లు పట్టొచ్చని 5.9 శాతం మంది అభిప్రాయపడ్డారు. 

Read Our Exclusives:

 ఆంధ్రప్రదేశ్: నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన ఆ 4 పనులు ఏమిటి 

Kim Jong Un: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నారా? అసలు రహస్యం ఏమిటి? 

కరోనా వ్యాక్సిన్ కనుగొనడం కంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికే కష్టం 

ఫోన్ ట్యాపింగ్: జగన్ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందా.. అలాంటి అధికారం దేశంలో ఎవరెవరికి ఉంది