ఆంధ్రప్రదేశ్, నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం, టీడీపీ, వైసీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి
..............
ప్రతిపక్షంలో ఉండడమంటే రాజకీయంతో పాటు ప్రజా సేవ చేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కూడా.
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్థిరమైన ప్రభుత్వ పాలనలోనే ఉన్నప్పటికీ సంఖ్యాబలమిచ్చిన అపరిమిత అధికారాల వల్ల గాడి తప్పే ప్రమాదముంది.
ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష పాత్ర పోషించడమంటే అత్యంత బాధ్యతాయుతంగా నాయకత్వం వహించడమే.
రాష్ట్రంలోని ఇతర పార్టీలో నోరెత్తలేని స్థితిలో ఉండడం.. నోరెత్తినా వాటి స్వరం బిగ్గరగా వినిపించని పరిస్థితిలో ఉండడంతో ఎమ్మెల్యేల బలం పరంగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం బలహీన ప్రతిపక్షమే అయినప్పటికీ గ్రామగ్రామానా విస్తరించిన అసంఖ్యాకమైన క్యాడర్ పరంగా బాహుబలిలాంటి ఆ పార్టీ సమర్థమైన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంది.
సమర్థమైన ప్రతిపక్ష నాయకుడి పాత్ర అంటే ఒక అసాధారణమైన, అతి క్లిష్టమైన పని.
కనీసం నాలుగు వేర్వేరు పనులు ఒకేసారి చేయాల్సి ఉంటుంది. పైగా ప్రతి పనికీ దేనికదే ప్రత్యేకమైన నైపుణ్యం కావాలి.
1) తక్షణం, నిత్యం చేయాల్సిన పని
ప్రభుత్వం చేసే తప్పులను దొరకబట్టుకుంటూ ఎప్పటికప్పుడు సవాల్ చేయడం. ప్రభుత్వాన్ని బాధ్యత వహించేలా చేయడం.
ప్రభుత్వం చేసే చట్టాలను నిశితంగా పరిశీలించి లోపాలు లేకుండా నిలదీయడం.
కోవిడ్ వంటి సంక్షోభం ఉన్న సమయంలో ఇది చాలా సున్నితమైనది.. సంక్లిష్టమైనది కూడా.
మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉండడంతో ఎదురు నిలవడమూ కష్టమే. తిరుగులేని మెజారిటీ తమకు అపరిమిత అధికారాలు కట్టబెట్టిందని భావించి ప్రభుత్వం, అందులోని వ్యక్తులు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటప్పుడు ఆ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి.
2) పార్టీని నడిపించడం, కాపాడుకోవడం
అధికారంలో ఉన్నప్పుడు అంతా సాఫీగా సాగిపోతుంది. పార్టీ నాయకుడి నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించరు. నాయకుడి నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తారు. చెప్పిన పనిని గొప్పగా చేస్తారు. నాయకుడి దృష్టిలో పడి పదవో, పనో సంపాదించుకుని లబ్ధి పొందాలన్న కోరిక చిన్నస్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుడి వరకు అందరిలో ఉంటుంది. అందుకే నాయకుడి దృష్టిలో పడేందుకు కష్టపడి పనిచేస్తారు.. అవసరమైతే సొంత డబ్బును పార్టీ కోసం ఖర్చు చేస్తారు. నాయకుడి మాటను వేదవాక్కుగా భావిస్తారు. నాయకుడిపై ఈగ వాలకుండా చూసుకుంటారు.
కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా కాదు. అధికార పక్షం ధాటిని ఎదుర్కొంటుండాలి. తమ ఆర్థిక, వ్యాపార ప్రయోజనాలు, మూలాలు కాపాడుకుంటుండాలి. అందుకోసం అధికార పార్టీతో పెద్దగా వివాదాలు కొనితెచ్చుకోకుండా తెలివిగా మసలుకుంటుంటారు ఎక్కువ మంది నేతలు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోరు. తమ నాయకుడి మాటను లెక్క చేయని వారూ ఉంటారు. అధికార పక్షంతో కుమ్మక్కయ్యేవారు... అధికార పార్టీలోకి ఫిరాయించేవారూ అన్ని రకాలూ ఉంటారు.
ఇలాంటివారందినీ దారిలో పెట్టుకుంటూ, అదుపులో పెడుతూ, చేజారిపోకుండా చూస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేలా చేయాలి ప్రతిపక్ష నాయకుడు.
ప్రతి కార్యక్రమాన్నీ ముందుండి నడిపించాలి. తన తరువాత శ్రేణి, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలతోనూ నిత్యం ఇంటరాక్ట్ అవుతుండాలి.
అధికార పక్షం నుంచి వారిపై ఉండే ఒత్తిళ్లు, కేసులు వంటిని ఎదుర్కొనేలా భరోసా ఇవ్వాలి.
3) వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండడం
ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడూ తరువాత ఎన్నికలకు సిద్ధమవుతూ ఉండాలి. ప్రభుత్వంలో లేం కదా అని ఊరుకోకుండా ప్రజల మద్దతును పొందే కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి. ప్రజలు కష్టాలలో ఉంటే ఆదుకోవాలి. పార్టీకి శక్తినిస్తుండాలి.
ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటుండాలి.
తదుపరి ఎన్నికల్లో గెలిచేది మనమే అనే నమ్మకం పార్టీలో కలిగించాలి.
అంతేకానీ ప్రభుత్వం వ్యతిరేకత వచ్చేవరకు వెయిట్ చేద్దాం అనే వైఖరి కనబరచకూడదు.
4) ఏ క్షణాన అధికారం దొరికినా తక్షణం రాష్ట్రం అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధంగా ఉంచడం.. ప్రజాసమస్యలపై నిర్మాణాత్మక హామీలివ్వడం
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికారం తమకే ఉంటే ఏం చేస్తాం, ఏం చేయాలనే విషయంలో క్లారిటీతో ఉంటూ పాలనకు సిద్ధంగా ఉండడం. మళ్లీ ఎన్నికలు జరిగే వరకు కానీ, ఈలోగా రాజకీయ మార్పులు జరిగి కానీ తమకు అధికారం వస్తే తక్షణం రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలనే విషయంలో పక్కా ప్రణాళికతో ఉండాలి.
అలాగే, ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి తాము అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతుండాలి.
ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలని చెప్పే చంద్రబాబు ఆ పని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది.
Read Our Exclusives:
- Kim Jong Un: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నారా? అసలు రహస్యం ఏమిటి?
- కరోనా వ్యాక్సిన్ కనుగొనడం కంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికే కష్టం
- ఫోన్ ట్యాపింగ్: జగన్ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందా.. అలాంటి అధికారం దేశంలో ఎవరెవరికి ఉంది
- ప్రణబ్ ముఖర్జీ: నేను ప్రధాన మంత్రి ఎందుకు కాలేకపోయానంటే
- బాజీ రౌత్ : స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అత్యంత పిన్న వయస్కుడు
- కరోనా వైరస్ వచ్చినా సింపుల్‌గా తగ్గిపోవాలంటే ఏం చేయాలి