23, ఆగస్టు 2020, ఆదివారం

కరోనా వ్యాక్సిన్ కనుగొనడం కంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికే కష్టం

 

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ

సోనియా గాంధీ ఆరోగ్యం రాజకీయాలకు సహకరించడం లేదు.. 

రాహుల్ గాంధీ రాజకీయం ఈ దేశానికి సరిపోవడం లేదు... 

ప్రియాంకాగాంధీ ఇంకా నియోజకవర్గ స్థాయికి మించి ఎదగలేదు.. 

మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కయిన కుటుంబంలోని తలకాయలేవీ ఆ పార్టీని గాడిన పెట్టగలిగేలా కనిపించడం లేదు. 

రాజకీయాల్లో ఎంతో అనుభవించినందుకు ఇంకేముందిలే అనుకుంటూ.. అనుభవం ఉన్నందున మనకెందుకులే అనుకుంటూ ఈ చేతకానితనాన్నంతా భరిస్తూ పార్టీలో కొనసాగుతున్నారు నాయకులు. 

మూడు చేపల కథంలోని సుమతి వంటి నాయకులు ముందుచూపుతో బయటపడుతుంటే... కాలమతి టైపు నాయకులు అదను కోసం ఎదురుచూస్తున్నారు.. మందమతులు అడుగంటిన కాంగ్రెస్ చెరువులోని బురదలో ఆక్సిజన్ కోసం వెతుక్కుంటూ ఎగఊపిరి తీస్తున్నారు. 

కాంగ్రెస్ అనే ఆ చెరువును బతికించడం, అందులో చేపలు బయటకుపోకుండా, బతుకుపోకుండా చూడడం ఇక సోనియా, రాహుల్, ప్రియాంక వల్ల కాదని పార్టీ నాయకులందరికీ అర్థమైపోయి చాలాకాలం గడవడంతో ఇప్పుడు సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు ఒక 23 మంది సీనియర్లు నేరుగా సోనియాకే లేఖ రాశారు. 

నాయకత్వాన్ని మార్చి పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్టీకి పూర్తి కాల, క్రియాశీల అధ్యక్షుడు కావాలని కోరారు.

అంటే అవుట్ డేటెడ్ సోనియా, ఆన్ అండ్ ఆఫ్ రాహుల్, అప్ డేట్ కాని ప్రియాంకా కాకుండా ఇంకెవరైనా అధ్యక్ష స్థానంలోకి రావాలని నిర్మొహమాటంగా చెప్పేశారు. 

మరెవరు?

దీంతో.. సోనియా కుటుంబానికి చెందని నేతలు ఎవరున్నారనేదీ సందిగ్థంగానే ఉంది ఆ పార్టీలో. బీజేపీకి అంతగా పట్టులేని, ఆ పార్టీ సిద్ధాంతాల బలవంతపు రుద్దుడును వ్యతిరేకిస్తున్న దక్షిణాది నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న వాదన వినిపిస్తున్నా ఆ అవకాశమూ కనిపించడం లేదు. 

జాతీయ స్థాయి నేత చిదంబరం, శశి థరూర్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.. కానీ, చిదంబరం జైలులో పడడంతో ఆయన దూకుడు తగ్గిపోయింది. థరూర్‌‌కు నాయకుడిగా కంటే మేధావిగానే పేరుంది. 

పైగా ఆయన అప్పుడప్పుడూ బీజేపీ వాసన కొడుతున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి.

ఉత్తరాది నేతల విషయానికొస్తే జాబితా పెద్దగానే ఉన్నా అన్నీ గోడ మీద పిల్లులే. 

పార్టీ పరిస్థితి చూసి సగం మంది ఇప్పటికే బీజేపీతో రహస్య ప్రేమాయణాలు నడిపిస్తున్నారు.

కేవలం అధికార ప్రతినిధులే నోరు విప్పి రాహుల్ గాంధీకి సపోర్టుగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 

దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నారు సోనియా. 

పోనీ ఎవరో ఒకరిని నమ్మి అధ్యక్ష స్థానం కట్టబెడితే వారి మాట మిగతావారు ఎంతవరకు వింటారన్నదీ ప్రశ్నే. 

ఇక రాహుల్ గాంధీనే ఎలాగోలా బతిమాలుదామనుకున్నా ఆయన కుర్చీ ఎక్కడానికి మొరాయిస్తున్నాయి. 

ఒకవేళ ఆయన్నే మళ్లీ చేసినా ఆయన నాయకత్వంపై విశ్వాసం లేక చాలామంది పార్టీ నుంచి జారిపోయే ప్రమాదం ఉందని ఆ పార్టీలోనే డౌట్లు. 

 ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పగ్గాలు అందుకుని పార్టీలో దూకుడు నింపే నాయకుడి కోసం ఆ పార్టీ కరోనా వ్యాక్సిన్ కనుగొనడం కోసం ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాల కంటే కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోంది.

Read Our Exclusives:

21, ఆగస్టు 2020, శుక్రవారం

ఫోన్ ట్యాపింగ్: జగన్ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందా.. అలాంటి అధికారం దేశంలో ఎవరెవరికి ఉంది

చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ


ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకులు, జడ్జిలు, న్యాయవాదులు, మీడియాకు సంబంధించిన వ్యక్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు. 

పాలక వైసీపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణం రాజు సైతం తన రెండు ఫోన్‌ నంబర్లను ఏపీ నిఘా వర్గాలు కొన్ని నెలలుగా ట్యాపింగ్ చేస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తంచేశారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21ను ఉల్లంఘించడమేనని చెప్పిన ఆయన దీనిపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు.

ట్యాపింగ్ కోసం చట్టవిరుద్ధమైన సాఫ్ట్ వేర్‌లను వినియోగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అంతేకాదు.. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ చంద్రబాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలనీ డిమాండ్  చేశారు.

మ‌రోవైపు కొంద‌రు న్యాయ‌మూర్తుల ఫోన్ల‌ను ప్ర‌భుత్వం ట్యాప్ చేస్తోంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో విశాఖ‌ప‌ట్నానికి చెందిన న్యాయ‌వాది ఒకరు ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. దీనిపై టెలికాం స‌ర్వీసు ప్రొవైడ‌ర్లు, రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాల‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది.

ఇక రాజస్థాన్‌లోనూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసిందని దానిపై సీబీఐ విచారణ జరిపించాలని అక్కడి బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 

గతంలోనూ దేశవ్యాప్తంగా అనేక ఫోన్ ట్యాపింగ్ ఘటనను రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

మరి ఇంతకీ ప్రైవేటు వ్య‌క్తుల ఫోన్ల‌ను ప్ర‌భుత్వం ట్యాపింగ్ చేయొచ్చా? ఫోన్‌ ట్యాపింగ్ చేసే అధికారం ఏ ఏ సంస్థ‌ల‌కు ఉంటుంది? ఇంత‌కీ ఈ ట్యాపింగ్ ఎలా చేస్తారు?

ఇజ్రాయెల్ పేరు

గ‌తేడాది అక్టోబ‌రులో కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌లు దుమారం రేపాయి. పెగాసెస్ అనే ఇజ్రాయేల్ స్పైవేర్‌తో భార‌త్‌లోని మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, జ‌ర్న‌లిస్టుల‌పై నిఘా పెట్టార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ విష‌యాన్ని వాట్సాప్ కూడా ధ్రువీక‌రించింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని వాట్సాప్‌ను కేంద్ర‌ ప్ర‌భుత్వం కోరింది. అయితే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఈ నిఘా పెట్టింద‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన అధికార ప్ర‌తినిధి ర‌ణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు.

వివాదం న‌డుమ అస‌లు ఏ ఏ సంస్థ‌ల‌కు ఫోన్‌ ట్యాపింగ్‌చేసే అధికారం ఉంద‌ని లోక్‌స‌భ‌లో డీఎంకే నాయ‌కుడు ద‌యానిధి మార‌న్ ప్ర‌శ్నించారు. దీనిపై కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

ప్రైవేటు వ్య‌క్తుల ఫోన్ కాల్స్‌ను రికార్డుచేసే అధికారం కేంద్రం, లేదా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఫోన్ కాల్స్ ద్వారా నిఘా పెట్టొచ్చ‌ని ఆయ‌న చెప్పారు.

ఎప్పుడు నిఘా పెట్టొచ్చు?

ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం-2000లోని సెక్ష‌న్ 69తోపాటు ఇండియ‌న్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఫోన్ల‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ట్యాపింగ్ చేయొచ్చు. దేశ సార్వ‌భౌమ‌త్వం, స‌మ‌గ్ర‌త, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ, విదేశాల‌తో స‌త్సంబంధాల నిర్వ‌హ‌ణ‌తోపాటు ఏదైనా నేరాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం, లేదా కేంద్ర ప్ర‌భుత్వం కాల్స్‌ను ఇంట‌ర్‌సెప్ట్ చేయొచ్చు. లేదా ప‌ర్య‌వేక్షించొచ్చు. ఈ స‌మాచారాన్ని కావాలంటే ఏదైనా కంప్యూట‌ర్‌లో కూడా స్టోర్ చేయొచ్చు.

అంతేకానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు.

దేశ ప్రయోజనాల కోసం కాల్స్‌ను రికార్డు చేయాలంటే లేదా ఇంట‌ర్‌సెప్ట్ చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వ విష‌యంలో కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి, రాష్ట్ర ప్ర‌భుత్వం విష‌యంలో రాష్ట్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి.

అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో హోం శాఖ‌లోని జాయింట్ సెక్ర‌ట‌రీ స్థాయి లేదా ఆ పైస్థాయి అధికారి అనుమ‌తితో ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేయొచ్చు. ‌

ప్ర‌తి నెల ఫోన్ ట్యాపింగ్‌కు దాదాపు 9,000 ఆదేశాల‌ను ప్ర‌భుత్వం ఇస్తున్న‌ట్లు సాఫ్ట్‌వేర్ ఫ్రీడ‌మ్ అండ్ లా సెంట‌ర్ సంస్థ 2014లో తెలిపింది.


ఎవరికి అధికారం ఉంటుంది?

ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేసే లేదా ఇంట‌ర్‌సెప్ట్ చేసే అధికారం కేంద్ర ప్ర‌భుత్వం ప‌ది సంస్థ‌ల‌కు ఇచ్చింది. 

వీటిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ), డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), రీసెర్చ్ అండ్ అనాల‌సిస్ వింగ్ (ఆర్ఏడ‌బ్ల్యూ), డైరెక్ట‌రేట్ ఆఫ్ సిగ్న‌ల్ ఇంటెలిజెన్స్‌, దిల్లీ పోలీస్ క‌మిష‌న‌రేట్‌ ఉన్నాయి. 

రాష్ట్రాల విష‌యంలో రాష్ట్ర పోలీసు శాఖ‌కు ఫోన్ల‌ను ఇంటర్‌సెప్ట్ చేసే అధికారం ఉంటుంది.

ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలను హోం శాఖ‌ జారీచేసిన త‌ర్వాత ఒక వారంలోగా వాటిని సమీక్షా క‌మిటీకి పంపించాలి. కేంద్ర స్థాయిలో అయితే క్యాబినెట్ కార్య‌ద‌ర్శి, న్యాయ శాఖ కార్య‌ద‌ర్శి, టెలికాం శాఖ కార్య‌ద‌ర్శి ఈ క‌మిటీలో ఉంటారు. 

రాష్ట్రాల విష‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, న్యాయ శాఖ కార్య‌ద‌ర్శితోపాటు రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన మ‌రో వ్య‌క్తి స‌భ్యులుగా ఉంటారు.

ఈ క‌మిటీ రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో సంబంధిత ఆదేశాలపై విచార‌ణ చేప‌డ‌తుంది. ఒక‌వేళ ఆదేశాలు ఇవ్వ‌డంలో ఏదైనా త‌ప్పు జ‌రిగింద‌ని భావిస్తే.. రికార్డుచేసిన కాల్స్‌, స‌మాచారాన్ని డిలీట్ చేయాల‌ని లేదా రికార్డుల నుంచి తొల‌గించాల‌ని సూచిస్తారు.

అయితే, ప్ర‌స్తుతం ఎలాంటి ట్యాపింగ్ జ‌ర‌గ‌లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత చెబుతున్నారు. తాము ఎలాంటి విచార‌ణ‌కైనా సిద్ధంగా ఉన్నామ‌ని ఆమె వివ‌రించారు.


ప్రభుత్వాలే కాదు ప్రయివేటు వాళ్లూ 

అయితే, కొన్నిసార్లు ప్రైవేటు వ్య‌క్తులు, సంస్థ‌లు కూడా నిఘా పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను ఉప‌యోగిస్తుంటాయి.

2001 నుంచి 2006 మ‌ధ్య కాలంలో ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త‌లైన ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీల‌తోపాటు రాజ‌కీయ నాయ‌కులైన పీయూష్ గోయ‌ల్‌, ప్ర‌మోద్ మ‌హాజ‌న్ లాంటి ప్ర‌ముఖుల ఫోన్ల‌ను కార్పొరేట్ దిగ్గ‌జం ఎస్సార్ ట్యాప్ చేసిన‌ట్లు ఇటీవ‌ల ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

మ‌రోవైపు ఈ ట్యాపింగ్ 11ఏళ్ల‌పాటు కొన‌సాగింద‌ని అవుట్‌లుక్ కూడా ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

కొన్ని ప్రైవేటు సంస్థ‌లు, ప్రైవేటు డిటెక్టివ్‌లు, కంప్యూట‌ర్ హ్యాక‌ర్లూ.. స‌ర్వైలెన్స్ స‌ర్వీసుల‌ పేరుతో ఫోన్ ట్యాపింగ్‌లు చేస్తున్నారు. కొంద‌రైతే ఎన్‌క్రిప్టెడ్‌ వాట్సాప్ మెసేజ్‌ల‌నూ డీ కోడ్ చేయ‌గ‌ల‌మ‌ని చెబుతున్నారు

2013లో బెంగ‌ళూరుకు చెందిన ప్రైవేటు డిటెక్టివ్‌, సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఇలానే అరెస్టు అయ్యారు. ఆయ‌న ఓ ప్ర‌త్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో వంద‌ల మందిపై నిఘా పెట్టారు. ఫోన్‌కాల్స్‌తోపాటు వ్య‌క్తిగ‌త స‌మాచారం స‌ర్వ‌ర్ల‌కు ఈ సాఫ్ట్‌వేర్ చేర‌వేసేది.

ఆయ‌న సేవ‌లు వినియోగించుకున్న వారిలో పారిశ్రామిక వేత్త‌ల నుంచి సామాన్యుల వ‌ర‌కూ ఉన్న‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

ఇండియ‌న్ టెలిగ్రాఫ్ చ‌ట్టంలో సెక్ష‌న్ 26 (బి) ప్ర‌కారం.. ఫోన్ ట్యాపింగ్‌కు గ‌రిష్ఠంగా మూడేళ్ల వ‌ర‌కూ జైలు శిక్ష విధిస్తారు. అంతేకాదు త‌మ ప్రైవ‌సీ హ‌క్కును ఉల్లంఘించార‌ని కోరుతూ బాధితులు మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ను కూడా ఆశ్ర‌యించొచ్చు.


మీ ఫోన్ ట్యాప్ అయిందో లేదో స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా తెలుసుకోవచ్చు

మ‌రోవైపు మ‌న ఫోన్‌ను ఎవ‌రైనా ట్యాపింగ్ చేస్తున్నార‌ని అనుమానం వ‌స్తే టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌)ను అడిగి స‌మాచారం .

"ఈ విషంపై 2018లో ట్రాయ్‌కు దిల్లీ హైకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేసింది. ఏదైనా ప్ర‌భుత్వ సంస్థ అయినా స‌రే త‌మ కాల్స్‌ను ఇంట‌ర్‌సెప్ట్ చేస్తే.. ఆ విష‌యాన్ని అర్జీ పెట్టుకున్న వ్య‌క్తికి తెలియ‌జేయాల‌ని కోర్టు సూచించింది".

"దీని కోసం స‌మాచార హ‌క్కు కింద మనం ట్రాయ్‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. వెంట‌నే ట్రాయ్ సంబంధిత టెలికాం ఆప‌రేట‌ర్ నుంచి స‌మాచారాన్ని తీసుకుని మ‌న‌కు పంపిస్తుంది".

"ట్రాయ్ ఇచ్చిన స‌మాచారాన్ని విశ్లేషించి ఏమైనా త‌ప్పు జ‌రిగిన‌ట్లు అనిపిస్తే మ‌నం నేరుగా కోర్టును ఆశ్ర‌యించొచ్చు".

Read Our Exclusives:

ప్రణబ్ ముఖర్జీ: నేను ప్రధాన మంత్రి ఎందుకు కాలేకపోయానంటే

ప్రణబ్ ముఖర్జీ Pranab Mukherji Pranab Mukherjee


* ప్రణబ్ ముఖర్జీకి హిందీ రాకపోవడం వల్లే ప్రధాన మంత్రి పదవి ఇవ్వలేదా

ప్రణబ్ ముఖర్జీ.. నిజంగానే మేన్ ఆఫ్ ఆల్ సీజన్స్. భారతదేశంలోని అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా ఆయన పనిచేశారు. కానీ, అత్యంత శక్తిమంతమైన, ఆకర్షణీయమైన పదవైన ప్రధానమంత్రి పదవి మాత్రం ఆయన్ను వరించలేదు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన పార్టీలో ఉండి ఆర్థిక మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి వంటి కీలక పదవులు చేపట్టిన ఆయన ప్రధాన మంత్రి మాత్రం కాలేకపోయారు.

కుటుంబ పార్టీ అయిన కాంగ్రెస్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబేతరులు ప్రధాన మంత్రి కావడం అసాధ్యమే అయినా రాజీవ్ గాంధీ మరణానంతరం సోనియా గాంధీ ప్రధాని పదవి చేపట్టకపోవడంతో ప్రణబ్‌కు అవకాశం వచ్చినట్లే వచ్చి ఉసూరనిపించింది.

ప్రధాని పదవి వద్దని త్యాగం చేసినా ప్రధానిని నిర్ణయించే శక్తి తానే అయిన సోనియా ఆ అవకాశాన్ని నోరు లేని మన్మోహన్ సింగ్‌కు ఇచ్చి రాజకీయ చాణక్యుడైన ప్రణబ్‌కు మొండిచేయి చూపించింది.

మన్మోహన్ సింగ్ అయితే చెప్పినట్లు వింటూ చెప్పుచేతల్లో ఉంటారన్న కారణం ఒకటి కాగా ప్రణబ్ రాజకీయ చతురత, పరపతి వల్ల తమ మాట వినకపోవచ్చన్న జ్ఞానం, ప్రధానిగా అధికారం దక్కితే పార్టీనే చేతుల్లోకి తీసుకుంటారన్న భయంతో సోనియా అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు.

అలా ప్రధాని రేసు నుంచి తప్పించారు

అయితే.. కాంగ్రెస్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని కాదని అవకాశం రావడమే అరుదు.. అలాంటి అవకాశం వచ్చినట్లే వచ్చి పోవడంతో ఆయనలో ఆ అసంతృప్తి ఉండేది. అయితే.. సోనియా కుమారుడు రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి ప్రణబ్ వంటి సీనియర్ల నుంచి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆయన్ను తరువాత కాలంలో రాష్ట్రపతిని చేశారు. దాంతో ప్రధాని రేసు నుంచి ఆయన్ను పూర్తిగా తప్పించింది కాంగ్రెస్ పార్టీ. 

అయితే, రాష్ట్రపతి అయిన ప్రణబ్‌లో మాత్రం ప్రధాని కోరిక మాత్రం పోలేదు. తనకెందుకు ప్రధాని పదవి రాలేదనే విషయంలో ఆయన పార్టీని ఎన్నడూ బహిరంగంగా తప్పు పట్టకపోయినప్పటికీ ఇతరత్రా కారణాలు చెప్పేవారు. 

అందులో ప్రధానమైనది భాషా సమస్య. అవును.. తనకు హిందీ రాకపోవడం వల్లే ప్రధానిని కాలేకపోయానని ప్రణబ్ ఓ సందర్భంలో చెప్పారు.

2017 అక్టోబరులో ప్రణబ్ తాను రాసిన ‘ది కొయిలేషన్ యియర్స్ 1996-2012’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఈ మాట చెప్పారు.

ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రధానిగా తన కంటే ప్రణబ్ అన్ని అర్హతలు ఉన్న వ్యక్తని అన్నారు. 

తాను సుదీర్ఘ కాలం రాజ్యసభలోనే ఉండడం వల్ల.. అలాగే హిందీ రాకపోవడం వల్ల తనకు అవకాశం రాకపోయి ఉండొచ్చన్నారు.

అసంతృప్తి లేదు కానీ అసలు కారణం అదీ

అలాగే ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన ఇదే చెప్పారు. తనకు కాకుండా మన్మోహన్ సింగ్‌కు ప్రధాని పదవి ఇచ్చారన్న అసంతృప్తి తనకేమీ లేదని.. తనకు ఆ అర్హత లేదని తాను భావిస్తానని అన్నారు.

ఒక్క 2004లో లోక్ సభకు ఎంపిక కావడం తప్ప తన మిగతా పార్లమెంటు కెరీర్ అంతా రాజ్యసభలో సాగడం.. హిందీ రాకపోవడం తన అనర్హతలని అభిప్రాయపడ్డారు.

‘‘హిందీ రాకుండా ఈ దేశంలో ఎవరూ ప్రధాని కాలేరు. కామరాజ్ నాడార్ కూడా ఒక సందర్భంలో ‘నో హిందీ, నో ప్రైమ్ మినిష్టర్‌షిప్’ అని అన్నార’’ని ప్రణబ్ చెప్పారు. 

Read Our Exclusives:

20, ఆగస్టు 2020, గురువారం

కరోనా వైరస్ వచ్చినా సింపుల్‌గా తగ్గిపోవాలంటే ఏం చేయాలి

కరోనావైరస్ coronavirus


క‌రోనావైర‌స్ సోకిన త‌ర్వాత ఇంటిలో ఉండేట‌ప్పుడు ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దు? ఐసోలేష‌న్‌లో ఉండ‌టం ఎలా? వీధిలో క‌రోనా రోగులు ఉండే ఏం చేయాలి?.

హోమ్ ఐసోలేష‌న్‌పై తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల‌తోపాటు కేంద్ర ప్ర‌భుత్వ‌మూ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. వాటిలోని వివ‌రాల ప్ర‌కారం..

చ‌క్క‌గా వెలుతురు, గాలి వ‌చ్చే గ‌దిలో క‌రోనావైర‌స్ సోకిన‌వారిని ఉంచాలి. వారికి ఉప‌యోగించే మ‌రుగుదొడ్డిని వేరెవ‌రూ వాడ‌కూడ‌దు.

రోగుల‌ను చూసుకోవ‌డానికి ఒక స‌హాయ‌కుడు వారికి ఎప్పుడూ అందుబాటు ఉండాలి. లేని ప‌క్షంలో సాయం కోసం 18005994455 (తెలంగాణ‌), 104 (ఆంధ్ర‌ప్ర‌దేశ్) నంబ‌రును సంప్ర‌దించాలి.

55ఏళ్లు పైబ‌డిన‌వారు, గ‌ర్భిణులు, తీవ్ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌లుండేవారు, క్యాన్స‌ర్‌, ఆస్థ‌మా, శ్వాస సంబంధిత వ్యాధులు, ర‌క్త‌పోటు, గుండె, కిడ్నీ స‌మ‌స్య‌లు ఉండేవారిని వేరే ఇంటికి పంపించాలి.

ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంట‌ర్నెట్‌, బ్లూటూత్‌ల‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోవాలి. ప్ర‌భుత్వ ఆరోగ్య సిబ్బంది రోజూ ఫోన్ చేస్తారు. వారికి పూర్తి స‌హ‌కారం అందించాలి.


రోగుల‌కు సూచన‌లు ఇవీ..

* నీళ్లు ఎక్కువ‌గా తాగాలి.

* గోరు వెచ్చ‌టి నీరు మంచిది.గ‌ది నుంచి బ‌య‌ట‌కు ఎప్పుడు వ‌చ్చిన మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి.

* ద‌గ్గేట‌ప్పుడు, తుమ్మే ట‌ప్పుడు హ్యాండ్ క‌ర్చీఫ్ లేదా టిష్యూ ఎప్పుడూ ఉప‌యోగించాలి.

* వాడిన క‌ర్చీఫ్‌, టిష్యూ, బ‌ట్ట‌ల‌ను గాలి చొర‌బ‌డ‌లేని క‌వ‌ర్లు, చెత్త బుట్ట‌ల్లో వేయాలి. వీలైతే ఇంటిబ‌య‌ట వీటిని కాల్చేయాలి. ఇత‌ర చెత్త‌లో వీటిని క‌ల‌ప‌కూడ‌దు.

* మ‌రుగుదొడ్డికి వెళ్లే ముందు, వెళ్లిన త‌ర్వాత చేతులను 40 నుంచి 60 సెక‌న్ల‌పాటు క‌డుక్కోవాలి. త‌డి చేతుల్ని తుడుచుకోవ‌డానికి క్లాత్ ఉప‌యోగించొద్దు.

* ఐసోలేష‌న్ గ‌దిని రోగులే శుభ్రం చేసుకోవాలి. వారికి క‌ష్ట‌మైతే.. దాన్ని తుడిచేవారు మూడు లేయ‌ర్ల వైద్య మాస్కులు, గ్ల‌వ్స్‌, ఫేస్ షీల్డ్ అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకోవాలి. ఇంటికి శుభ్రం చేసేందుకు బ్లీచింగ్ పౌడ‌ర్ లేదా డిస్ ఇన్ఫెక్టెంట్‌ల‌ను ఉప‌యోగించాలి. రోజుకు రెండు సార్లు గ‌దిని శుభ్రం చేయాలి.

* ఇంట్లో వ‌య‌సు పైబ‌డిన‌వారు, గ‌ర్భిణులు, పిల్ల‌లు, ఇత‌ర జ‌బ్బులు ఉండేవారి నుంచి ఆరు అడుగులు లేదా రెండు మీట‌ర్ల దూరాన్ని పాటించాలి.

* ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొగ తాగ‌కూడ‌దు. ఎందుకంటే వైర‌స్ శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీస్తుంది.వాడిన బ‌ట్ట‌లను 30 నిమిషాల‌పాటు వేడినీళ్ల‌లో పెట్టి త‌ర్వాత ఉత‌కాలి.


డాక్టరును ఎప్పుడు సంప్ర‌దించాలి?

* ద‌గ్గు, తుమ్ములు ఎక్కువ‌గా వ‌చ్చేట‌ప్పుడు

* బాగా బ‌ల‌హీనంగా అయిన‌ప్పుడు

* రొమ్ములో ఎడ‌తెగ‌ని నొప్పి వ‌చ్చిన‌ప్పుడు

* గంద‌రగోళంగా అనిపిస్తున్న‌ప్పుడు

* శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది త‌లెత్తిన‌ప్పుడు

* విప‌రీతంగా జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు

* పెద‌వులు, ముఖం లేదా నిలం రంగులో క‌నిపించేట‌ప్పుడు


రోగులు ఏం చేయాలి?

* రోజూ రెండు పుట‌లా థెర్మామీట‌ర్‌తో శ‌రీర ఉష్ణోగ్రత చూసుకోవాలి. రీడింగ్‌ వంద‌కుపై ఉంటే వెంట‌నే కోవిడ్‌-19 హెల్ప్ లైన్‌కు సంప్ర‌దించాలి.

* ప‌ల్స్ రేటును రెండు పూట‌లా చూసుకోవాలి. మ‌ణిక‌ట్టుపై చూపుడు, మ‌ధ్య వేళ్ల‌ను పెట్టి బొట‌న వెలును ద‌న్నుగా పెట్టి 60 సెన్ల‌పాటు నాడి కొట్టుకోవ‌డాన్ని లెక్క‌పెట్టాలి. అది వంద దాటితే వెంట‌నే హెల్ప్‌లైన్‌ను సంప్ర‌దించాలి.

* 17 రోజుల‌పాటు ఐసోలేష‌న్‌లో ఉండాలి. ప‌ది రోజుల పాటు జ్వ‌రం లేక‌పోతే అప్పుడు సెల్ఫ్ ఐసోలేష‌న్ నుంచి బ‌య‌ట‌కు రావొచ్చు.


ఏం తినొచ్చు? ఏం తిన‌కూడ‌దు?

* బ్రౌన్ రైస్‌, మిల్లెట్స్‌, గోధుమ‌, ఓట్స్‌, బీన్స్, పప్పులు ఒంటికి మంచిది.

* తాజా ప‌ళ్లు, కూర‌గాయ‌లు ఎక్కువ‌గా తీసుకోవాలి.

* ఎర్ర క్యాప్సిక‌మ్, క్యారెట్‌, బీట్‌రూట్‌, ఆకుకూర‌లు ఎక్కువ తీసుకోవాలి.

* రోజుకు ఎనిమిది నుంచి ప‌ది గ్లాస్‌ల నీళ్లు తీసుకోవాలి.

* సిట్ర‌స్ ప‌ళ్లు.. ఆరెంజ్‌, బ‌త్తాయి, నిమ్మ‌కాయ ర‌సాల‌ను తీసుకోవాలి.

* అల్లం, వెళ్లుల్లి, ప‌సుపును వాడాలి.

* ఇంటిలో వండిన ఆహార‌మే మంచిది.

* కొవ్వు త‌క్కువ‌గా ఉండే ప‌దార్థాలు తీసుకోవాలి.పాలు, పెరుగు తీసుకోవ‌చ్చు.

* చికెన్‌, చేప‌, ఎగ్ వైట్‌లు తీసుకోవాలి.

* మైదా, డీప్ ఫ్రైడ్ జంక్ ఫుడ్స్‌ను తీసుకోకూడ‌దు.

* చ‌క్కెర ఎక్కువ‌గా ఉండేవి, కూల్ డ్రింక్స్ ను దూరం పెట్టాలి.

* చీజ్‌, కొబ్బ‌రి, పామ్ ఆయిల్‌, బ‌ట‌ర్ వ‌ద్దు.

* మట‌న్‌, లివ‌ర్‌, ప్రాసెస్డ్‌ మీట్ దూరం పెట్టాలి.

* మాంసాహారం వారానికి రెండు, మూడు సార్ల‌కు మించి తీసుకోవ‌ద్దు.


ఇరుగుపొరుగు వారు ఏం చేయాలి?

* మీ చుట్టుప‌క్క‌ల‌ ఎవ‌రికైనా ‌క‌రోనావైర‌స్ సోకితే ఆందోళ‌న ప‌డొద్దు.

* మీ ఇంటి ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకోవాలి.

* అపార్ట్‌మెంట్లో ఉండే లిఫ్ట్‌, మెట్లు త‌దిత‌ర ఎక్కువ మంది ఉప‌యోగించే ప్రాంగ‌ణాల‌ను డిస్ఇన్ఫెక్టెంట్‌ల‌తో క‌డ‌గాలి.

* రోగులు, రోగుల కుటుంబ స‌భ్యులకు ఎలాంటి ఇబ్బంది పెట్ట‌కూడ‌దు.

* ఐసోలేష‌న్ ఉండేవారు బ‌య‌ట తిరిగితే వెంట‌నే కోవిడ్‌-19 హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయాలి.

* బ‌య‌ట‌కు వెళ్లిన ప్రతిసారీ స‌బ్బునీళ్ల‌తో చేతిని 60 సెక‌న్ల‌పాటు క‌డుక్కోవాలి.

* వీలైతో రోగుల‌కు సాయం చేయాలి. వారికి అవ‌స‌ర‌మైన ఔష‌ధాలు, కుర‌గాయ‌లు, రేష‌న్ స‌ర‌కులు అందించేందుకు ప్ర‌య‌త్నించండి.

రోగులు కోలుకునేవ‌ర‌కూ వారి నుంచి డ‌బ్బులు తీసుకోవ‌డం, వారికి డబ్బులు ఇవ్వ‌డం త‌గ్గించాలి.

18, ఆగస్టు 2020, మంగళవారం

అమిత్ షా: కరోనా వైరస్ అనంతర చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోం మంత్రి

 

amit shah అమిత్ షా

అమిత్ షా దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం వేకువన ఆయన్ను అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం.

అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆసుపత్రి నుంచే తన విధులు నిర్వహిస్తున్నారని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర హోం మంత్రిగా ఉండడంతో పాటు పార్టీలోనూ నంబర్ 2 అయిన ఆయన నిత్యం బిజీగా ఉండే మనిషి కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరినప్పటికీ అక్కడి నుంచీ కూడా తన దైనందిన రాజకీయ, హోంశాఖకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు. 

ఇటీవల కరోనావైరస్ బారిన పడిన ఆయన గురుగావ్‌లోని వేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

ప్రస్తుతం ఆయనకు కోవిడ్-19 టెస్టులో నెగటివ్ వచ్చిందని తాజాగా ఎయిమ్స్ వర్గాలు ధ్రువీకరించాయి.

అయితే.. విపరీతమైన అలసట, ఒళ్లు నొప్పుల కారణంగా కోవిడ్ అనంతర చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని ఎయిమ్స్ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.

ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో అమిత్ షాకు చికిత్స అందిస్తున్నారు. 

అమిత్ షా ఆరోగ్యంపై ఎయిమ్స్ బులెటిన్


15, ఆగస్టు 2020, శనివారం

బాజీ రౌత్ : స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అత్యంత పిన్న వయస్కుడు

బాజీ రౌత్ విగ్రహం. ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లా డొంగొపొలాలో బాజీ రౌత్ విగ్రహం

Baji Rout : The youngest martyr of India

బాజీ రౌత్.. భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చాలామంది వినని పేరిది. కానీ, ఇప్పటికైనా తెలుసుకుని గుర్తుంచుకోవాల్సిన స్ఫూర్తిదాత బాజీ రౌత్.

కేవలం పన్నెండేళ్ల వయసులోనే బ్రిటిష్ వాళ్లను ఎదిరించి తెల్ల తూటాలకు బలైపోయిన బాల యోధుడు బాజీ.

భారత స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల్లో అత్యంత పిన్నవయస్కుడు బాజీ. 

The Youngest Martyr of India ఎవరంటే ఖుదీరాం బోస్ పేరు కూడా కొందరు చెబుతారు కానీ, ఖుదీరాం కంటే బాజీ రౌత్ చిన్నవారని చరిత్ర తేల్చింది.

ఇంతకీ బాజీ రౌత్ ఎక్కడివారు?.. ఆయన ఎలా చనిపోయారు? బ్రిటిషర్లు అంత చిన్న పిల్లాడిని ఎందుకు చంపారో తెలుసుకుందాం..


బాజీ రౌత్

ఒడిశా రాష్ట్రం ఢెంకనాల్‌లోని నీలకంఠాపురం బాజీ రౌత్‌ది. 1926 అక్టోబరు 5న జన్మించాడు. తండ్రి నీలకంఠాపురానికి సమీపంలో ఉన్న బ్రహ్మణి నదిలో పడవ నడిపేవారు. 

బాజీ పెరిగి పెద్దవాడవుతున్న సమయంలో తండ్రితో పాటే వెళ్తూ పడవ నడపడం నేర్చుకున్నాడు. 

ఆ రోజుల్లో స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఢెంకనాల్‌లో వైష్ణవ్ చరణ్ పట్నాయిక్ ప్రజామండల్ పేరుతో ప్రజలను సమీకరించి స్థానిక సంస్థానాధిపతి శంకర్ ప్రతాప్ సింగ్‌దేవ్ ప్రజాకంటక పాలన, అధిక పన్నులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తున్నారు. 

ఆ పోరాటాన్ని అణచివేయడానికి సింగ్ దేవ్ బ్రిటిష్ వారి సాయం తీసుకున్నారు. 

దాంతో పట్నాయక్‌ను పట్టుకోవడానికి ఆయన ఉండే భువన్ గ్రామంపై సింగ్‌దేవ్ మనుషులు, ఢెంకనాల్ స్టేట్ పోలీస్ తరచూ దాడి చేసేవారు.

అలా 1938అక్టోబరు 10న కూడా రాజు సింగ్‌దేవ్ మనుషులు, బ్రిటిష్ సైనికులు కలిసి  పట్నాయిక్ ఉండే భువన్ గ్రామంలో బీభత్సం సృష్టించారు. వైష్ణవ్ చరణ్ పట్నాయక్, ఆయన అనుచరుల కోసం ఇల్లిల్లూ వెతుకుతూ ప్రజలను హింసించారు. ఎంతో మందిని అరెస్టు చేశారు. ఆ అరాచకలను ప్రజలు ప్రతిఘటించడంతో బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రఘు నాయక్, ఖురీ నాయక్ అనే ఇద్దరు చనిపోయారు.

దీంతో ప్రజలు తిరగబడ్డారు. ఆగ్రహంతో ఉన్న ప్రజలకు ఎదురు నిలవలేక అదే రాత్రి సింగ్‌దేవ్, బ్రిటిష్ సైనికులు భువన్ నుంచి ఢెంకనాల్ పారిపోయే ప్రయత్నం చేయగా ప్రజలు వారిని వెంటాడారు.

ఆ క్రమంలో అక్టోబరు 11 వేకువజామున ఢెంకనాల్ వెళ్లే మార్గంలో నీలకంఠాపురం రేవు వద్ద బ్రహ్మణి నదిని దాటేందుకు 20 మందికి పైగా సైనికులు చేరుకున్నారు. 

కానీ, అప్పటికీ వారిని ప్రజలు తరుముతున్నారు.

నీలకంఠాపురం రేవులో పడవ వద్ద బాజీ రౌత్ ఉన్నాడు. బాజీ వయసు అప్పుడు పన్నెండేళ్లే. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న సైనికులు తమ అందరినీ పడవలో నది అవతలికి దాటించాలని బాజీని బెదిరించారు.

కానీ, పట్నాయిక్ చేస్తున్న ఉద్యమం.. బ్రిటిష్ సేనల అరాచకాల గురించి తెలిసిన బాజీ అందుకు అంగీకరించలేదు. అంతేకాదు... ప్రజామండల్‌కు అనుబంధంగా ఉన్న పిల్లల బృందం వానరసేనలో బాజీ సభ్యుడు కూడా. దీంతో ఆయన వారిని నదిని దాటించేందుకు అంగీకరించలేదు.

బాజీని కొట్టారు.. అయినా, ఆ పిల్లాడు ఏమాత్రం భయపడకుండా వారిని పడవలో ఎక్కించుకునే ప్రసక్తే లేదని చెప్పాడు.

ఇంతలో తమను తరుముతున్న ప్రజలు దగ్గరకు వచ్చేస్తుండడంతో బ్రిటిష్ అధికారులు తుపాకీతో బాజీని, ఆయనకు అండగా నిలిచిన మరో నలుగురిని కాల్చేశారు.  


బాజీ రౌత్ ది ఇమ్మోర్టల్ బోట్ బాయ్ సినిమా


బాజీ రౌత్‌పై సినిమా

బాజీ రౌత్ వీరత్వానికి గుర్తుగా 2016 నుంచి ఏటా ఉత్కల్ దివస్ రోజున ఉత్కళ్ కల్చరల్ అసోసియేషన్, ఐఐటీ బాంబే కలిసి ‘బాజీ రౌత్ సమ్మాన్’ అవార్డును ఆ రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులైన యువతకు అందిస్తున్నాయి.

2018లో భువనేశ్వర్‌కు చెందిన మీడియా కంపెనీ ప్రిలూడ్ నావెల్ వెంచర్స్ బాజీ రౌత్‌పై 27 నిమిషాల నిడివి ఉన్న ‘బాజీ: ది ఇమ్మోర్టల్ బోట్ బోయ్’ అనే చిత్రాన్ని తీసింది.



వైష్ణవ్ చరణ పట్నాయక్ Baishnab Charan Patnaik

వైష్ణవ్ చరణ్ పట్నాయక్ ఏమయ్యారు?

ఢెంకనాల్ రాజుకు, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ప్రజామండల్‌ను స్థాపించి ఉద్యమం చేసిన వైష్ణవ్ చరణ్ పట్నాయక్ స్వాతంత్ర్యం వచ్చేవరకు తన పోరాటాలను కొనసాగించారు.

బాజీ రౌత్ మరణం తరువాత బాజీ శవాన్ని మోసుకుంటూ ఉద్యమించిన ఆయన ఆ తరువాత తన ఉద్యమాన్ని మరింత ముమ్మరం చేశారు. 1939లో ఆయన్ను బ్రిటిష్ పాలకులు అరెస్టు చేశారు. ఆరు నెలలు జైలులో ఉన్న ఆయన అక్కడి నుంచి బయటపడ్డారు. 

కానీ, 1940లో మళ్లీ ఆయన్ను అరెస్టు చేశారు. 1942లో విడిచిపెట్టారు. అయితే, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో మళ్లీ ఆయన్ను పట్టుకుని ఉరి తీసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించగా ఆయన వారికి చిక్కకుండా అండర్‌గ్రౌండ్‌లో ఉంటూ ఉద్యమానికి సహకరించారు.

విద్యార్థి దశ నుంచే రైతులను, కార్మికులను కూడగట్టి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన స్వాతంత్ర్యానంతరం కూడా ప్రజల మనిషిగానే బతికారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయన ఢెంకనాల్ సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో కలపాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించారు. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగిన ఆయన 1947లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 

జైలు నుంచే ఎన్నికల్లో విజయం

తనను తాను కమ్యూనిస్టుగా ప్రకటించుకోవడంతో 1948లో ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. 1952 వరకు ఆయన జైలులోనే ఉన్నారు.

1952లో జరిగిన ఎన్నికల్లో ఆయన కమ్యూనిస్టు పార్టీ తరఫున జైలు నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించి 1952-57 మధ్య ఢెంకనాల్ ఎమ్మెల్యేగా పనిచేశారు.

అనంతరం 1962లో లోక్‌సభకు ఎన్నికూ 1967 వరకు ఎంపీగా పనిచేశారు.

2013లో 99 ఏళ్ల వయసులో పట్నాయిక్ మరణించారు.

ఒడిశాలో ‘వీర్ వైష్ణవ్’గా ప్రజలు పిలుచుకునే ఆయన జీవిత కథను ‘వీర్ వైష్ణవ్ జీవన్ గాథా’ పేరిట నిత్యానంద మిశ్రా ఒరియాలో పుస్తకంగా తీసుకొచ్చారు. 

(ఆధారం: డి.పి.మిశ్రా రాసిన పీపుల్స్ రివోల్ట్ ఇన్ ఒరిస్సా పుస్తకం, లోక్ సభ వెబ్ సైట్, ఒరిస్సా స్టేట్ ఆర్కైవ్స్, వీర్ వైష్ణవ్ జీవన్ గాథా)

30, జులై 2020, గురువారం

Shakuntala Devi : హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి మెదక్ నుంచి పోటీచేశారు తెలుసా

శకుంతలా దేవి హ్యూమన్ కంప్యూటర్

Shakuntala Devi, Vidya Balan, Human Computer, Shakuntala Devi Review
శకుంతలా దేవి.. విద్యాబాలన్ నటిస్తున్న ఈ సినిమాతో మరోసారి అసలైన శకుంతలా దేవిని భారతీయులు గుర్తు చేసుకుంటున్నారు. శకుంతలా దేవి గురించి తెలిసినవారు ఆమె గొప్పదనాన్ని మననం చేసుకుంటుంటే.. తెలియని వారు గూగుల్‌లో వెతికి మరీ తెలుసుకుని అవునా అని ఆశ్చర్యపోతున్నారు.
హ్యూమన్ కంప్యూటర్ అనిపించుకున్న శకుంతలాదేవి గణిత ప్రతిభ గురించి తెలుసుకుని ఈ తరం నోరెళ్లబెడుతోంది. 
అయితే, చాలామందికి తెలియని విషయం ఒకటుంది. శకుంతలా దేవి ఒకప్పుడు తెలుగు నేల నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు. 
అవును.. ఇందిరాగాంధీపై ఆమె పోటీ చేశారు. అయితే, గణితంలో ఎదురులేని ఆమెకు ఎన్నికల రాజకీయాల లెక్క మాత్రం అర్థం కాలేదు.

మెదక్ నుంచి ఇందిరాగాంధీపై పోటీ..

మానవ కంప్యూటర్ శకుంతలా దేవి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. 
ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన తరువాత  ప్రతిష్ఠ కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో (1977) కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ఇందిర కూడా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తొలిసారి జనతా పార్టీ నేతృత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, అది ఎంతో కాలం కొనసాగలేదు.
ఆ తరువాత 1980లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పుడు రాయ్‌బరేలీతో పాటు మరో సురక్షిత ప్రాంతం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం ఇందిరకు సూచించింది.
ఉత్తర భారతదేశంలో అప్పుడు జనతా పార్టీ ప్రభావం బాగా కనిపిస్తుండటంతో ఇందిరాగాంధీకి గెలుపుపై అనుమానం కలిగింది. దాంతో దక్షిణ భారతదేశంలోనూ ఎక్కడైనా పోటీ చేయాలని అనుకున్నారు.
పార్టీలో దీనిపై చర్చ జరగడంతో అప్పటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి, ఇతర ముఖ్య నేతలు మెదక్ నుంచి పోటీ చేయాలని ఇందిరకు సూచించారు. దాంతో ఇందిరాగాంధీ మెదక్ నుంచి బరిలో దిగారు.
అయితే.. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని అప్పట్లో రాజకీయ నాయకులే కాకుండా దేశంలోని మేధావులూ వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించినవారిలో శకుంతలా దేవి కూడా ఒకరు. 
ఇందిర గాంధీ ఎమర్జెన్సీ విధించడానికి నిరసనగా శకుంతల దేవి ఆమెపై పోటీ చేస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే ఆమె మెదక్‌లో ఇందిర పోటీ చేయడంతో తానూ అక్కడి నుంచి నామినేషన్ వేశారు.
పీవీ నరసింహారావు తనయుడు పీవీ రాజేశ్వరావు, తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకుడు కేశవ్ రావు జాదవ్, జైపాల్ రెడ్డి తదితరులు కూడా ఆ ఎన్నికల్లో ఇందిరపై పోటీకి దిగారు. 
అయితే, ఆ ఎన్నికల్లో జనం ఇందిరాగాంధీకే ఓటేశారు. 
ఇందిరకు ఈ ఎన్నికల్లో 3,01,577 ఓట్లు రాగా, జైపాల్ రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి. కేశవ్‌రావుజాదవ్‌కు 26,149 ఓట్లు పడ్డాయి. స్వతంత్రంగా పోటీ చేసిన శకుంతలాదేవి 6,514 ఓట్లతో డిపాజిట్ కోల్పోయి 9వ స్థానంలో నిలిచారు. 
ఆ తరువాత మళ్లీ ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు.

శకుంతలాదేవిలో విద్యాబాలన్

ఇకపోతే.. శకుంతలా దేవి చిన్న వయసులోనే యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌, అన్నామలై వర్సిటీలో గణితంలోని తన ప్రతిభను ఆవిష్కరించారు.
201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గాన్ని మనసులోనే గుణించి 50 సెకన్లలో సమాధానం చెప్పి ఓ సరికొత్త రికార్డు సృష్టించారు. గణితంపై అనేక పుస్తకాలూ రాశారు. ఖగోళ, జ్యోతిష శాస్త్రాలలోనూ ఆమెకు ప్రవేశం ఉంది.

27, జులై 2020, సోమవారం

సోము వీర్రాజు: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులయ్యారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం రాత్రి ఈ మేరకు నియామకం చేపట్టగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పేరిట ప్రకటన వెలువడింది.
సోము వీర్రాజు నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఆ నియామక పత్రంలో పేర్కొన్నారు.
వీర్రాజు ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ, సోము వీర్రాజు

సోము వీర్రాజుది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కత్తెరు గ్రామం. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన మొదటి నుంచి బీజేపీ భావజాలంతో పార్టీలో ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు. భారతీయ యువమోర్చా రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు.