6, మే 2020, బుధవారం

పెట్రోల్ మీద రూ. 10, డీజిల్ మీద రూ. 13 సుంకాలు పెంచిన కేంద్రం


కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ల మీద లీటరుకు 8 రూపాయల చెప్పున రోడ్డు సెస్ పెంచింది. అలాగే.. పెట్రోల్ మీద లీటరుకు 2 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం కూడా పెంచింది.
 మొత్తంగా డీజిల్ మీద లీటరుకు 13 రూపాయలు, పెట్రోల్ మీద లీటరుకు 10 రూపాయలు చొప్పున సుంకాలు పెంచింది. ఈ పెంపు బుధవారం రాత్రి నుంచి అమలులోకి వచ్చింది.
దీంతో ప్రపంచంలో ఇంధనాల మీద అత్యధిక పన్నులు ఉన్న దేశంగా భారత్ నిలిచింది. ఈ పెంపుతో లీటరు పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం 32.98 రూపాయలు, డీజిల్ మీద 31.83 రూపాయలకు పెరిగినట్లయింది.
పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌ల మీద వ్యాట్ పెంపు
నిజానికి తమిళనాడు ప్రభుత్వం మే 3వ తేదీనే.. పెట్రోలియం ఉత్పత్తుల మీద వ్యాట్ వ్యవస్థలో మార్పులు చేయటంతో.. పెట్రోల్ మీద లీటరుకు 3.25 రూపాయలు, డీజిల్ మీద రూ. 2.50 చొప్పున ధరలు పెరిగాయి.
అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గినందున కేంద్రం ఆమేరకు ధరలు తగ్గిస్తుందన్న అంచానాతో ఈ సవరణలు చేపట్టింది.
ఆ మరుసటి రోజు మే 4వ తేదీన దిల్లీ ప్రభుత్వం డీజిల్ మీద లీటరుకు రూ. 7.1 చొప్పున, పెట్రోల్ మీద లీటరుకు రూ. 1.6 చొప్పున వాల్యూ యాడెట్ ట్యాక్స్ పెంచింది. ఈ పెంచిన మొత్తం రాష్ట్ర ఖాతాకు జమ అవుతుంది.
అదే రోజు రాత్రి కేంద్ర ప్రభుత్వం కూడా.. రోడ్డు సెస్, ఎక్సైజ్ సుంకాలను భారీగా పెంచుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశంలో చమురు ధరల పెంపులో ఇదే అతి పెద్ద రికార్డు.
ఈ పెంపుతో దిల్లీలో ప్రస్తుతం లీటరు 71.26 రూపాయలకు విక్రయిస్తున్న ధరలో 49.42 రూపాయలు పన్నులే ఉంటాయి. అలాగే.. ప్రస్తుతం 69.39 రూపాయలకు అమ్ముతున్న డీజిల్ ధరలో 48.09 రూపాయలు పన్నులే.
తాజాగా గురువారం నాడు పంజాబ్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటరుకు 2 రూపాయలు చొప్పున వ్యాట్ పెంచింది.
హరియాణా ప్రభుత్వం కూడా కొద్ది రోజుల కిందట లీటరుకు 1 రూపాయి చొప్పున ధరలు పెంచింది.
మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలు ఏప్రిల్ 1వ తేదీన పెట్రోల్ ఉత్పత్తుల మీద వ్యాట్ పెంచాయి. నాగాలాండ్ అయితే.. పెట్రోల్ ఉత్పత్తుల మీద ‘కరోనా సెస్’ అంటూ పన్ను విధించింది.
పెట్రోల్ మీద ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు
తాజా సుంకాల పెంపుతో భారతదేశంలో పెట్రోల్, డీజిల్‌ల మీద పన్నులు మొత్తం 69 శాతానికి పెరిగాయి.
ఈ ఇంధనాల మీద 60 శాతం కన్నా ఎక్కువ పన్నులున్న ఇతర దేశాలు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్‌లు మాత్రమే. అవి కూడా ఇండియాలో కన్నా తక్కువే ఉన్నాయి.   
పెట్రోల్ మీద ఇటలీలో 64 శాతం పన్నులు వసూలు చేస్తోంటే.. ఫ్రాన్స్, జర్మనీల్లో పన్నులు 63 శాతం, బ్రిటన్‌లో 62 శాతం పన్నులు ఉన్నాయి.
ఇంధనాల మీద పన్నులు స్పెయిన్‌లో 53 శాతం, జపాన్‌లో 47 శాతం, కెనడాలో 33 శాతం, అమెరికాలో 19 శాతం ఉన్నాయి.
ఇండియాలో గత ఏడాది వరకూ పెట్రోల్, చమురు ధరల్లో పన్నుల భాగం 50 శాతంగా ఉండేది.

COVID-19 Vaccine: ఇటలీ వ్యాక్సిన్ తయారుచేసేసిందా


కోవిడ్19 COVID-19 ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ అన్ని దేశాలూ దీనికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
భారత్‌లోనూ వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దేశంలోని ప్రధాన ఔషధ కంపెనీలన్నీ ఇప్పటికే ఈ రేసులో ఉన్నాయి.
 మరోవైపు హైదరాబాద్‌లోని మూడు బయోటెక్ కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేస్తున్నాయని.. జులై, ఆగస్టు నాటికి వ్యాక్సిన్ సిద్ధం కావొచ్చని తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
అయితే, ఇప్పుడు కరోనావైరస్ కారణంగా భీకరంగా ప్రభావితమైన ఇటలీలో దీనికి వ్యాక్సిన్ సిద్ధం చేశారన్న వార్త వినిపిస్తోంది.
మనుషులపై పనిచేసే COVID-19 VACCINE అభివృద్ధి చేసినట్లు ఇటలీ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఇటలీలోని టకీస్ అనే సంస్థ ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చినట్లు అక్కడి వార్తాసంస్థలు వెల్లడించాయి.
రోమ్‌లోని Spallanzani Institute స్పల్లంజానీ ఇనిస్టిట్యూట్‌లో ఎలుకలపై చేసిన ప్రయోగాలు ఫలించినట్లు టకీస్ సీఈవో లూయిగీ ఆరిషియో Luigi Aurisicchio చెబుతున్నారు.
కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షల మందికిపైగా మరణించారు. ఇటలీలో సుమారు 30 వేల మంది మరణించారు.
ఇటలీలో ప్రజలు మొదట్లో పెద్దగా పట్టించుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించారంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటలీ కనుక దీనికి వ్యాక్సిన్ కనుక్కుంటే ఆ దేశమే ప్రపంచాన్ని కాపాడిన ఘనత సొంతం చేసుకుంటుంది.

Cyclone Amphan: ఏపీకి ఎంఫాన్‌‌ తుఫాను ముప్పు




కరోనావైరస్‌ ధాటికి విలవిలలాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి దూసుకొస్తోంది. ఆ తుపాను పేరు ఎంఫాన్.
అండమాన్‌కు దక్షిణ దిశగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతుంది. ఈ నెల 8వ తేదీ నాటికి ఆ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్‌గా (Cyclone) మారుతున్న ఈ తుఫాన్‌కి ఎంఫాన్‌ (Cyclone Amphan) అనే పేరు దీనికి పెట్టారు. 
ఈ నెల 13వ తేదీ నాటికి మయన్మార్ వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఓడిస్సా తీర ప్రాంతాల్లో దీని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (ECMWF) ప్రకారం.. ఈ నెల 13వ తేదీ నాటికి మయన్మార్ వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా మత్స్యకారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిసా తీర ప్రాంత జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొన్నారు.
మే9 నుండి మే11 తేదీ లోపు అంఫాన్ తుఫాను ఆంధ్రప్రదేశ్ పై పెద్ద ఎత్తున విరుచుకు పడనున్నట్లు వాతావరణ శాఖ నుండి వార్తలు వస్తున్నాయి. మే 9 తర్వాత ఏ సమయంలో అయినా ఈ తుఫాను రాష్ట్రాన్ని బలంగా తాకే ప్రమాదం ఉండటంతో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు అటు బోర్డర్ లో ఉన్న ఒరిస్సా రాష్ట్రం కూడా ఈ తుఫాను పై ముందుగానే దీని భారినుండి తప్పించుకోవడానికి ప్రణాలికలు సిద్దం చేస్తున్నాయి.

ఆరోగ్యసేతు AAROGYA SETU యాప్ పూర్తిగా సురక్షితం.. యూజర్ల డేటాకు ఎలాంటి ఇబ్బందీ లేదు



ఆరోగ్య సేతు యాప్‌‌‌లో డేటా సెక్యూరిటీ పరంగా లోపాలున్నాయంటూ ఒక ఎథికల్ హ్యాకర్ హెచ్చరించడంతో ఆ యాప్ బృందం స్పందించింది.
సదరు హ్యాకర్‌ను సంప్రదించామని చెబుతూ.. హ్యాకర్ లేవనెత్తిన అంశాలు, వాటికి సమాధానాలను ఒక ప్రకటన రూపంలో విడుదల చేసింది.
ఆరోగ్యసేతు యాప్ కొన్ని సందర్భాలలో యూజర్ లొకేషన్‌ డేటాను తీసుకుంటుందన్న హ్యాకర్ క్లెయిమ్‌కు.. ‘‘ఈ యాప్ డిజైన్‌లోనే అది ఉంది. అందుకే ప్రైవసీ పాలసీలోనూ స్పష్టంగా ఆ విషయం పేర్కొన్నాం.
యూజర్ లొకేషన్ డేటాను తీసుకుని మా సర్వర్‌లో భద్రంగా, ఎన్‌క్రిప్టెడ్‌గా, అనామకంగా ఉంచుతాం’’ అని సమాధానం ఇచ్చింది.
పరిధి, అక్షాంశరేఖాంశాలను మార్చుతూ యూజర్ తన చుట్టూ ఉన్న కేసుల వివరాలను తెలుసుకోగలుగుతాడన్న క్లెయిమ్‌కు సమాధానమిస్తూ.. 500 మీటర్లు, 1 కిలోమీటర్, 2 కి.మీ., 5 కి.మీ., 10 కి.మీ. పరిధి స్థిర పరామితులు యాప్‌లోనే ఉన్నాయని.. వాటినే యూజర్ మార్చి గణాంకాలు తెలుసుకోగలరని.. ఇది కాకుండా ఇంకే పరిధిలో సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నించినా అది ఒక కిలోమీటరు పరిధిలో సమాచారం మాత్రమే అందించేలా యాప్ డిజైన్ ఉందని వివరించింది.
ఎవరి వ్యక్తిగత డేటాకైనా ముప్పు ఉందని ఈ హ్యాకర్ నిరూపించలేదని.. తాము నిరంతరం ఈ యాప్‌ను పరీక్షిస్తూ అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఆరోగ్యసేతు టీం చెప్పింది.
ఇంకెవరైనా ఇందులో లోపాలను గుర్తిస్తే తమ దృష్టికి తేవాలంటూ support.aarogyasetu@gov.inకు మెయిల్ చేయాలని కోరారు.

21, ఏప్రిల్ 2020, మంగళవారం

Coronvirus కరోనా వైరస్ : దేశంలో 18 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. 600కి చేరువలో మరణాలు



భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం దేశంలో కరోనాపాజిటివ్ కేసుల సంఖ్య 18,601కి చేరింది.
వీరిలో 3,251 మంది ఇప్పటికే కోలుకోగా 590 మంది మరణించారు.
ప్రస్తుతం 14,759 మంది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు..

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రంగానే ఉన్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఆ ఒక్క రాష్ట్రంలోనే 4,666 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర తరువాత 2081 కేసులతో దిల్లీ రెండో స్థానంలో ఉంది.
గుజరాత్‌లో 1939 కేసులు నమోదయ్యాయి.

మరణాలూ అక్కడే ఎక్కువ..

ఇక మరణాల్లోనూ మహారాష్ట్రే ముందుంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 232 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో 74 మంది, గుజరాత్‌లో 71, దిల్లీలో 47, తెలంగాణలో 23, ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది మరణించారు.

కేసులున్నా మరణాలు లేవు

అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, చత్తీస్‌గఢ్, గోవా, లద్దాఖ్, మణిపుర్, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రల్లో పాజిటివ్ కేసులున్నా మరణాలు లేవు.

మైనస్‌లోకి చమురు ధరలు.. లక్షల కోట్లు లాభపడనున్న భారత్


ప్రపంచాన్ని ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాల్లోకి నెట్టేసిన కరోనావైరస్ దెబ్బకు ఎన్నడూ లేనంతగా చమురు ధరలు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర 244 శాతం పడిపోవడంతో భారీ కుదుపు ఏర్పడింది.
 భారతీయ కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి 12.10 గంటలకు... మే నెలకు సంబంధించి వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ-నైమెక్స్) రకం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్ ప్రైస్ - 26.24 డాలర్లకు పడిపోయింది.

డిమాండ్ తగ్గడంతోనే..

లాక్‌డౌన్లు, రవాణా ఆంక్షలు, విమాన, నౌకారంగమూ నిలిచిపోవడంతో చమురు వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్ల మంది ప్రజలు లాక్ డౌన్ కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.
దీంతో గ్లోబల్ ఆయిల్ డిమాండ్ మూడో వంతుకు పడిపోయింది.

10 శాతం ఉత్పత్తి తగ్గించినా

ఉత్పత్తిలో కోత విధించే విషయంలో ఒపెక్ ప్లస్ దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో మార్చి నెలలో ఆయిల్ ధరలు 18 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి.
దీంతో ఒపెక్ దేశాలు ఒప్పందానికి వచ్చి.. ధరల పతనాన్ని ఆపడానికి గాను ఉత్పత్తి తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి అయితే, వారు 10 శాతం ఉత్పత్తి తగ్గిస్తున్నా ధరల పతనం మాత్రం ఆగలేదు.

భారత్‌కు లాభమే

అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పతనమవుతుండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. కారణం.. భారత్ తన అవసరాల్లో 80 శాతానికి పైగా ముడి చమురు బయట నుంచే కొనుగోలు చేయాల్సిరావడమే. 
గత ఆర్థిక సంవత్సరం అంటే 2018-19లో భారత్ 112 బిలియన్ డాలర్ల ముడి చమురు దిగుమతి చేసుకుంది.
ప్రస్తుత సంవత్సరంలో జనవరి నాటికే 87.7 బిలియన్ డాలర్ల ముడి చమురు కొనుగోళ్లు జరిగాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్ రిపోర్ట్ ప్రకారం ముడి చమురు ధరల్లో ఒక డాలర్ తగ్గితే, భారత్ ఇంపోర్ట్ బిల్‌లో 10,700 కోట్ల రూపాయలు తగ్గుతుంది. 
అంటే, సుమారు 30 డాలర్ల పతనం అంటే భారత ప్రభుత్వానికి దాదాపు 3 లక్షల కోట్ల మిగులు అని అర్థం.
మరో రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం చమురు ధరల్లో 10 డాలర్ల పతనం వల్ల భారత జీడీపీపై సగం శాతం ప్రభావం ఉండవచ్చు. 
అంటే, దేశ ఆర్థికవ్యవస్థలో సుమారు 15 బిలియన్ డాలర్ల వృద్ధి జరుగుతుంది.
మరోవైపు ఇదే 10 డాలర్ల పతనం వల్ల భారత్‌లో ద్రోవ్యోల్బణం రేటు 0.3 శాతం తగ్గవచ్చు. 
1 శాతం తగ్గాలంటే 33 డాలర్ల పతనం కావాలి. ఈ లెక్కన భారత్‌కు ఈ కష్టకాలంలో చమురు ధరల పతనం లాభించే అంశమే కానుంది.

20, ఏప్రిల్ 2020, సోమవారం

రంజాన్-జగన్: ఉగాది, శ్రీరామ నవమి, గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ అన్నీ ఇళ్లలోనే జరుపుకొన్నారు.. రంజాన్ కూడా ఇళ్లలోనే జరుపుకోవాలి- ఏపీ సీఎం జగన్

రంజాన నెలలో ముస్లింలంతా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్లు, ముస్లిం మతపెద్దలతో వీడియో కాన్ఫరెస్స్‌ నిర్వహించిన ఆయన ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని ముస్లింలకు విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్‌ను అధిగమించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు.
కరోనా కారణంగా ఉగాది, శ్రీరామనవమి, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ పండగలను ఇళ్లలోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని గుర్తుచేశారు. ఇప్పుడు రంజాన్‌ సమయంలో కూడా ఇళ్లలో ఉండి ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.
ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించి ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని అందరికి తెలియజేయాలని చెప్పారు. ఇది మనసుకు కష్టమైన మాట అయినా చెప్పక తప్పని పరిస్థితి అని సీఎం వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. 

కరోనా వైరస్: లాక్‌డౌన్ ఉన్నా ఇవన్నీ చేయొచ్చు




కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌లో కొన్ని నిబంధనల్ని ఏప్రిల్ 20వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం సడలించింది. అయితే, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు మినహా కొత్తగా మరే రంగానికీ సడలింపులు ఇవ్వడంలేదని తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి.
మిగతా రాష్ట్రాల విషయానికొస్తే, తాజా సడలింపులు చాలా వరకు దేశంలో సగం జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగానికి వర్తిస్తాయి.
దేశంలో ఆహార ధాన్యాలకు కొరత రాకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ ఉపశమనం కల్పిస్తున్నట్లు అనిపిస్తోంది.
అయితే గత వారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సడలింపులన్నీ అమలులో ఉండవు.
ఈ-కామర్స్ సంస్థలు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, రిఫ్రిజిరేటర్లు డెలివరీ చేయడానికి ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఆదివారం రద్దు చేసింది.
దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో హాట్ స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాలలో ఎటువంటి సడలింపులు వర్తించవు.

జాతీయ, అంతర్జాతీయ విమాన సేవలు, రాష్ట్రాల మధ్య రవాణాకు కూడా అనుమతి ఉండదు.
సడలించిన నిబంధనలు ఏమిటి?
సడలించిన నిబంధనల ప్రకారం వ్యవసాయం, మత్స్య పరిశ్రమకు సంబంధించిన పనులు ప్రారంభించవచ్చు. దీంతో పండిన పంట సేకరించడానికి వీలవుతుంది. వ్యవసాయ రంగంలో పని చేస్తున్న రోజు కూలీలకు పని దొరుకుతుంది.
రాష్ట్రాల మధ్య ధాన్యం, ఆహార ఉత్పత్తుల రవాణాకు అనుమతి ఉంటుంది.
సామాజిక దూరాన్ని పాటిస్తూ గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం, నీటి పుంపులు వేయడం లాంటి అత్యవసర పనులు కూడా తిరిగి ప్రారంభిస్తారు.
ఇలాంటి చోట కొన్ని వేల మంది రోజు కూలీలకు పని దొరుకుతుంది.
బ్యాంకులు, ఏటీఎంలు , ఆస్పత్రులు, మందుల షాపులు, ప్రభుత్వ కార్యాలయాలు తెరుస్తారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు కూడా పనులు మొదలుపెట్టవచ్చు.
హాట్‌స్పాట్‌లుగా గుర్తించని కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా తెరవవచ్చు.
అయితే, వీరంతా సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి.
ఏయే సేవలు పని చేయాలని ఎవరు నిర్ణయిస్తారు?
నిబంధనల సడలింపు విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చు.
అందుకే, తెలంగాణలో ఎలాంటి సడలింపులు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
దిల్లీలోనూ ఎటువంటి నిబంధనలు సడలించే ప్రసక్తి లేదని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
దేశ రాజధానిలో పరిస్థితి ఇంకా ఆందోళనకంగానే ఉందని, వారం రోజుల తర్వాత లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో కూడా నిర్బంధం అమలులోనే ఉంటుంది.
కేరళలో మాత్రం రాష్ట్రంలో గ్రీన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలలో నిబంధనలను సడలించింది.
ప్రైవేట్ వాహనాలు తిరగడానికి, రెస్టారెంట్లు తెరవడానికి అనుమతి ఉండదు. అయితే, దీనికి కేరళ ప్రభుత్వం సరి- బేసి విధానాన్ని అమలు చేయనుంది. సరి సంఖ్య కలిగిన వాహనాలకు ఒక రోజు అనుమతి ఇస్తే, మిగిలిన వాటికి ఇంకొక రోజు అనుమతి లభిస్తుంది. దీంతో, రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్యను నియంత్రించవచ్చన్నది అక్కడి ప్రభుత్వ ఆలోచన.