ప్రపంచాన్ని ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాల్లోకి నెట్టేసిన కరోనావైరస్ దెబ్బకు ఎన్నడూ లేనంతగా చమురు ధరలు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర 244 శాతం పడిపోవడంతో భారీ కుదుపు ఏర్పడింది.
భారతీయ కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి 12.10 గంటలకు... మే నెలకు సంబంధించి వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ-నైమెక్స్) రకం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్ ప్రైస్ - 26.24 డాలర్లకు పడిపోయింది.
డిమాండ్ తగ్గడంతోనే..
లాక్‌డౌన్లు, రవాణా ఆంక్షలు, విమాన, నౌకారంగమూ నిలిచిపోవడంతో చమురు వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్ల మంది ప్రజలు లాక్ డౌన్ కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.దీంతో గ్లోబల్ ఆయిల్ డిమాండ్ మూడో వంతుకు పడిపోయింది.
10 శాతం ఉత్పత్తి తగ్గించినా
ఉత్పత్తిలో కోత విధించే విషయంలో ఒపెక్ ప్లస్ దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో మార్చి నెలలో ఆయిల్ ధరలు 18 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి.దీంతో ఒపెక్ దేశాలు ఒప్పందానికి వచ్చి.. ధరల పతనాన్ని ఆపడానికి గాను ఉత్పత్తి తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి అయితే, వారు 10 శాతం ఉత్పత్తి తగ్గిస్తున్నా ధరల పతనం మాత్రం ఆగలేదు.
భారత్‌కు లాభమే
అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పతనమవుతుండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. కారణం.. భారత్ తన అవసరాల్లో 80 శాతానికి పైగా ముడి చమురు బయట నుంచే కొనుగోలు చేయాల్సిరావడమే.
గత ఆర్థిక సంవత్సరం అంటే 2018-19లో భారత్ 112 బిలియన్ డాలర్ల ముడి చమురు దిగుమతి చేసుకుంది.
ప్రస్తుత సంవత్సరంలో జనవరి నాటికే 87.7 బిలియన్ డాలర్ల ముడి చమురు కొనుగోళ్లు జరిగాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్ రిపోర్ట్ ప్రకారం ముడి చమురు ధరల్లో ఒక డాలర్ తగ్గితే, భారత్ ఇంపోర్ట్ బిల్‌లో 10,700 కోట్ల రూపాయలు తగ్గుతుంది.
అంటే, సుమారు 30 డాలర్ల పతనం అంటే భారత ప్రభుత్వానికి దాదాపు 3 లక్షల కోట్ల మిగులు అని అర్థం.
మరో రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం చమురు ధరల్లో 10 డాలర్ల పతనం వల్ల భారత జీడీపీపై సగం శాతం ప్రభావం ఉండవచ్చు.
అంటే, దేశ ఆర్థికవ్యవస్థలో సుమారు 15 బిలియన్ డాలర్ల వృద్ధి జరుగుతుంది.
మరోవైపు ఇదే 10 డాలర్ల పతనం వల్ల భారత్‌లో ద్రోవ్యోల్బణం రేటు 0.3 శాతం తగ్గవచ్చు.
1 శాతం తగ్గాలంటే 33 డాలర్ల పతనం కావాలి. ఈ లెక్కన భారత్‌కు ఈ కష్టకాలంలో చమురు ధరల పతనం లాభించే అంశమే కానుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి