* తూ.గో జిల్లా ఎస్పీ వైఖరి గర్హనీయం
* వైఎస్సార్సీపీ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది
* జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని కొత్తపాకల గ్రామంలో 9వ తేదీన ఏర్పాటు చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభకు అనుమతులు లేవని చివరి నిమిషంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ప్రకటించడం అప్రజాస్వామికం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
‘‘పోలీసు వ్యవస్థకే తలవంపులు. తొండంగి మండలం కొత్తపాకల గ్రామంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ ల్యాబరేటరీస్ పై అక్కడ సమీప గ్రామస్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సభ నిర్వహిస్తున్నట్లు ముందుగానే జనసేన నాయకులు ఎస్పీకి తెలియజేశారు.
సభకు అనుమతి కావాలని, పవన్ కళ్యాణ్ గారికి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని కోరినప్పుడు ఆయన సుముఖుత వ్యక్తం చేసి, సభ నిర్వహించడానికి ఆమోదం తెలిపారు.
అయితే ఈ రోజు సాయంత్రం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సభకు అనుమతులు రద్దు చేసుకుంటున్నామని, 144 సెక్షన్ విధిస్తున్నామని ఎస్పీ చెప్పడం వైఎస్ఆర్సీపీ ఆదేశాలను అమలు చేయడంగానే భావిస్తున్నాం.
దివీస్ కంపెనీ వల్ల కాలుష్యం బారిన పడుతున్నామని వేలాదిమంది ప్రజలు ఆవేదన, ఆక్రోశం, నిస్సహాయత వ్యక్తం చేస్తున్న తరుణంలో శాంతియుతంగా వారి మనోభావాలను అర్ధం చేసుకోవడానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమానికి పోలీసుల ద్వారా అవరోధాలు సృష్టించడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నాం.
ఏదీఏమైనప్పటికీ కార్యక్రమాన్ని యధావిధిగా 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజా గళాన్ని వినిపిస్తాం. పోలీసులను అడ్డుపెట్టుకొని జనసేన కార్యక్రమాలని అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే అందుకు జగన్ రెడ్డిగారి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసులు ప్రజల పక్షాన ప్రజాస్వామ్య వ్యవస్థలో పని చేస్తున్నామన్న విషయాన్ని గుర్తెరగాలి’’ అని నాదెండ్ల ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి