* అప్పుడు బంగాళాఖాతంలో కలిపేస్తా అన్నారు... ఇప్పుడు అనుమతినిచ్చారు
* ఇదేం రాజకీయం – ఇవేం విలువలు
* జగన్ రెడ్డిని ప్రశ్నించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
* అక్రమంగా అరెస్టు చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలి
* దివిస్ వల్ల కాలుష్యం ఉండదని శాస్త్రీయంగా నిరూపించండి
* పిల్లికి ఎలుక సాక్ష్యం లాంటి నివేదిక చూపిస్తున్నారు
* కొత్తపాకల బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
పాదయాత్ర సమయంలో దివిస్ పరిశ్రమను బంగాళాఖాతంలో కలిపేస్తాం అని చెప్పి... అధికారంలోకి రాగానే పరిశ్రమ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం ఏం విలువలతో కూడిన రాజకీయమో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారే చెప్పాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఈ ప్రాంతంలో రానివ్వమని జగన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాదుకూడదు పరిశ్రమను ఏర్పాటు చేస్తాం, ఎవరడ్డొస్తారో చూస్తామని ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తారా.. అలా చెబితే ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసని అన్నారు. మరోసారి ఈ ప్రాంతానికి వస్తాను అన్నారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలలో దివీస్ ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి మద్ధతుగా శనివారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ... “ఎన్నో ఏళ్లు మధించి, దేశ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని, వర్తమాన కాల పరిస్థితులను అర్ధం చేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే సిద్ధాంతాన్ని జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో పెట్టాం. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తిని నేను. తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 50 లక్షల మంది వరకు జనాభా ఉంది. ఈ ప్రాంతంలో చాలా పరిశ్రమలు రావాలని కోరుకుంటాం. పర్యావరణానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే అది ఏ స్థాయిలో అన్నదే మనం ఇక్కడ ప్రశ్నించుకోవాలి.
* ఆస్తులు ఇవ్వొచ్చు ఆరోగ్యాన్ని వారసత్వంగా ఇవ్వలేం
మన బిడ్డలకు వారసత్వంగా ఆస్తులు, పొలాలు, బంగారం ఇవ్వగలం. కానీ ఆరోగ్యాన్ని ఆస్తిగా ఇవ్వలేం. పీల్చే గాలి, తాగే నీరు కలుషితమై అనారోగ్యానికి గురైతే... మనం ఎన్ని ఆస్తులు ఇచ్చినా వాళ్లు అనుభవించలేరు. ఈ భూమి ఎవరి సొంతం కాదు. సగటు మనిషి జీవిత కాలం 64 ఏళ్లు. ఈ 64 ఏళ్లు ఈ భూమి మీద సక్రమంగా జీవించి, భావితరాలకు పదిలంగా అప్పగించాలి. వేల కోట్లు, వందల ఎకరాలు, ఖరీదైన ప్రాంతంలో ఇళ్లు కట్టి పిల్లలకు ఇస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని వైసీపీ నాయకులు అనుకుంటే పొరపాటే. విశాఖపట్నంలో స్టరీన్ గ్యాస్ లీక్ అయినపుడు డబ్బున్నవాడి మీద, పేదవాడి మీద ఒకేలా పనిచేసిందని గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, వైసీపీ ప్రజాప్రతినిధులు నాకు శత్రువులు కాదు. విధానాలు సరిగా లేనప్పుడు కచ్చితంగా బయటకు వచ్చి ప్రశ్నిస్తాం.
* ఆ మాత్రం స్పృహ మంత్రులకు లేదు
వాయు, జల కాలుష్యాలు ఎంత ప్రమాదకరమో ఏలూరు దుర్ఘటన ద్వారా అందరికీ అవగతమైంది. ఎంతో మంది పిల్లలు, పెద్దవారు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి రావడం చూశాం. ఈ రోజుకీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎందుకు అస్వస్థతకు గురయ్యారో గుర్తించలేక పోయింది. రాత్ గయే... బాత్ గయే అని వదిలేశారు. జనసేన మాత్రం అలా వదిలేయదు. ఈ ప్రాంతంలో దివీస్ పరిశ్రమ ఏర్పాటు అయితే అది రోజుకు 65 లక్షల లీటర్ల మంచినీటిని వినియోగించి 55 లక్షల లీటర్ల నీటిని కలుషితం చేసి సముద్రంలో కలుపుతుంది. తుని పట్టణ అవసరాలకు రోజుకు 45 లక్షల లీటర్ల నీరు అవసరమవుతాయి. అంటే దీనికంటే 10 లక్షల లీటర్ల నీటిని దివీస్ ఫార్మా కలుషితం చేస్తుందన్న మాట. జల కాలుష్యం కంటికి కనిపించడం లేదని నిర్లక్ష్యం చేస్తే వాయు కాలుష్యంలానే ప్రాణం తీస్తుంది. సముద్రంలో జలచరాలను చంపేస్తుంది. మత్స్యకారులు ఉపాధి కోల్పోతారు. సముద్రంలో మత్స్య సంపద పెరగాలని వేట నిషేధ సమయంలో కడుపుకాల్చుకొని మరీ ఉంటారు మత్స్యకారులు. ప్రకృతిని అర్థం చేసుకొని జీవనం సాగిస్తారు. వాళ్లకు ఉన్న పర్యావరణ స్పృహ కూడా మన ప్రజాప్రతినిధులకు, మంత్రులకు లేకుండా పోయింది. లోక జ్ఞానం అంటే డిగ్రీలు, పీజీలు, అవార్డులు తీసుకుంటే వచ్చేది కాదు. ప్రకృతిని అర్ధం చేసుకుంటే వచ్చేది.
ఆకాశానికి రాకెట్లు పంపిస్తున్నాం. మార్సులో అడుగు పెట్టాలని చూస్తున్నాం. భారతదేశం నుంచి సున్నాను ఇచ్చామని, ఖగోళ శాస్ర్తం గురించి ముందే తెలుసని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ రసాయన వ్యర్థాలను వంద శాతం శుద్ధి చేసే టెక్నాలజీని మాత్రం మన దేశంలో తీసుకురాలేక పోతున్నాం. గొప్ప గొప్ప మేధావులు మన దగ్గర ఉన్నారు. వారి సేవలను వినియోగించుకోలేకపోతున్నాం. పాశ్చత్య దేశాల్లో వ్యర్ధజలాలను శుద్ధి చేసే టెక్నాలజీ ఉంది. భారీ ఖర్చుతో కూడుకున్నది కనుక మన దగ్గర వాడటానికి సిద్ధంగా లేరు. ఇక్కడ రాబోతున్న పరిశ్రమ షేర్ వాల్యూ రూ. 3 వేలకు పైమాటే. ప్రజల కన్నీరుపై తమ ఎదుగుదల ఉండకూడదని ప్రతి పరిశ్రమ గుర్తించాలి. లాభాల వేటలో పడి అన్ని పరిశ్రమలు విలువలను వదిలేస్తున్నాయి. రసాయన వ్యర్ధాలను సముద్రంలో కలిపేస్తాం, భూమిలో కలిపేస్తాం అంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. కచ్చితంగా వారికి విలువలు నేర్పిస్తాం.
* పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి
ఈ ప్రాంతంలో పరిశ్రమ పెట్టడానికి దివీస్ పరిశ్రమ 489 ఎకరాలు కావాలని ప్రభుత్వాన్ని కోరింది. అందులో 150 ఎకరాల్లో ప్లాంటు ఏర్పాటు చేస్తాం. మిగిలిన 350 ఎకరాలు భవిష్యత్తులో విస్తరణకు అని చెప్పారు. ఇప్పుడు 489 ఎకరాలు కాస్త 690 ఎకరాలు అయ్యింది. పరిశ్రమ రూ. 600 కోట్లు పెట్టుబడి పెడితే ప్రభుత్వం 690 ఎకరాలు కేటాయించింది. పోనీ వేలకొలది ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే అది పొరపాటే. 15 వందల శాశ్వత ఉద్యోగాలు, ఇంకో 15 వందలు టెంపరరీ ఉద్యోగాలు. మొత్తం తిప్పికొడితే 3వేల ఉద్యోగాలు కూడా లేవు. కేవలం 15 వందల ఉద్యోగాల కోసం భూమి ఫ్రీగా ఇచ్చి, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి ఇచ్చేటట్లు ఒప్పందాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 200కు పైగా ఉన్న హేచరీస్ పై 45 వేల మంది ఉపాధి పొందుతున్నారు. నెలకు రూ. 20 వేలకు పైగా సంపాదిస్తున్నారు. అలాంటి హేచరీస్ ను ధ్వంసం చేసి ఇలాంటి పరిశ్రమలకు పర్మిషన్ ఇవ్వడం ఎంత వరకు సబబో ప్రభుత్వమే ఆలోచించుకోవాలి.
* ప్రజల ఆరోగ్యంతో ఆటలొద్దు
పరిశ్రమ కోసం భూములు కావాలంటే ముందు సామాజిక ప్రభావం అంచనా వేయాలి. ఈ ప్రాంతంలో ఏ ఏ కులాలు ఉన్నాయి. ఎలాంటి ఉపాధి పొందుతున్నారు. ఎంత సంపాదిస్తారు. భూములు లాక్కుంటే ఎంత ఇవ్వాలి అని ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్లు లెక్కకడతారు. దివీస్ కంపెనీకి వైసీపీ నాయకులకు చెందిన రాంకీ కంపెనీ వాళ్లే ఈ నివేదిక ఇచ్చారు. ఇది పిల్లికి ఎలుక సాక్ష్యం లాంటిదే ఇలాంటి కంపెనీలు మన దేశంలోనే పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది పర్యావరణ చట్టాలు కఠినంగా లేకపోవడం. 1984లో భోపాల్ గ్యాస్ విధ్వంసం జరిగింది. ముక్కుపచ్చలారని ఎందరో పసిపిల్లలు చనిపోయారు. దాని తర్వాత 1994 వరకు పర్యావరణ చట్టాలు తీసుకు రాలేదు. పర్యావరణ శాఖ ఏం చేస్తుందో, పొల్యూషన్ బోర్డు ఏం చేస్తుందో సమాధానం చెప్పాలి. పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం. ఈ పరిశ్రమ నుంచి ఎలాంటి కాలుష్యం బయటకు రాదని సైంటిఫిక్ గా నిరూపిస్తే పరిశ్రమ ఏర్పాటుకు జనసేన అడ్డురాదు. అలాగే సర్టిఫికేట్లు ఇచ్చిన రాంకీ ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్లు గర్భిణులకు గర్భస్రావం కాదని, ఎవరికీ చర్మవాధులు, శ్వాసకోశ వ్యాధులు రావని సైంటిఫిక్ గా నిరూపించే బాధ్యత తీసుకోవాలి. పరిశ్రమల్లో వాటాలు పెట్టుకొని వాటికి పర్మిషన్లు ఇచ్చి ప్రజారోగ్యంతో చెలగాటం ఆడాలని చూస్తే మాత్రం జనసేన దానికి వ్యతిరేకం.
* కోడి కత్తితో పొడిచిన వాళ్ళు... పొడిపించుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు
తమ పొలాల్లోకి వెళ్లినందుకు 160 మందిపై కేసులు పెట్టారు. 36 మంది ఇప్పటికీ జైల్లో మగ్గిపోతున్నారు. ఈ గ్రామీణులు సూట్ కేసు కంపెనీలు పెట్టి అవినీతికి పాల్పడలేదు. హ్యతలు, దోపిడీలు చేయలేదు. కోడి కత్తితో పొడవలేదు. కోడి కత్తితో పొడిచినోళ్లు, పొడిపించుకున్నోళ్లు బాగానే ఉన్నారు. కానీ భూమి కోసం పోరాటం చేసినోళ్లు మాత్రం జైల్లో మగ్గిపోతున్నారు. గౌతమ్ రెడ్డిగారు పెద్ద మనసు చేసుకొని వారిని బేషరతుగా విడుదల చేయాలి. వైసీపీ నాయకుల్లాగా దిగజారి మాట్లాడటం మనకు రాదు. తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు. మనం గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అని పిలిస్తే.. వాళ్లు మనల్ని ఎలా తిడతారో కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే మాటలు వింటే తెలుస్తుంది. మనం తిరిగి ఒక మాట అనడానికి ఎంతోసేపు పట్టదు. రోడ్ల మీదకు వచ్చి ఎదురుదాడి చేయలేక కాదు. గొడవలు, దౌర్జన్యాల కోసం రాజకీయాల్లోకి రాలేదు. మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి వచ్చాం.
పోలీసుల మీద కాదు వ్యవస్థల్ని శాసించే వారి మీదే కోపం
సభకు పర్మిషన్ ఇచ్చే విషయంలో చాలా హైడ్రామా నడిచింది. వారం ముందు పర్మిషన్ ఇచ్చాం అని చెప్పి, నిన్న సాయంత్రం అనుమతులు లేవని చెప్పారు. నాకు పోలీసుల మీద కోపం లేదు. వాళ్ల బాసులు ఏం చెబుతారో వాళ్లు అదే చేస్తారు. నన్ను అమరావతిలో నెట్టేసే పరిస్థితి వచ్చినా నాకు వారి మీద కోపం రాలేదు. నా కోపం వ్యవస్థల్ని శాసించే వ్యక్తుల మీద తప్ప పోలీసుల మీద కాదు. పర్మిషన్ ఇవ్వకపోయినా నడుచుకుంటూ అయినా వస్తాం. పదవిలోకి వస్తే బంగాళాఖాతంలో కలిసేస్తాం.... పదవిలోకి వచ్చాక పర్మిషన్లు ఇస్తాం అనే మాయ మాటలు జనసేన చెప్పదు. ఒక పరిశ్రమ ఉండాలంటే ఎలాంటి విధానాలు ఉండాలి, కాలుష్యం ఎంత వెదజల్లుతుంది వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని పర్మిషన్ ఇస్తాం. విధ్వంసం స్థాయి ఎక్కువగా ఉంటే మాత్రం పరిశ్రమ మాకు వద్దు వెళ్లిపోండని మొహమాటం లేకుండా చెప్పేస్తాం. ఏ పరిశ్రమ అయినా చట్టాలకు లోబడే ఉండాలి. దివీస్ పరిశ్రమపై నాకు ఎలాంటి కోపం లేదు. ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలగదని ఆ పరిశ్రమ నిరూపించుకోవాలని అన్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమను ఇక్కడ నుంచి తరలించాలి. లేనిపక్షంలో బాధితుల తరఫున పోరాటం చేయడానికి జనసేన వెనుకాడద"ని జనసేనాని హెచ్చరించారు.
జగన్ రెడ్డి గారిది రెండు నాల్కల ధోరణి: నాదెండ్ల మనోహర్
ఎన్నికలకు ముందు దివీస్ ఫార్మా ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన శ్రీ జగన్ రెడ్డి గారు తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు వెనక్కు తగ్గారో ప్రజలు ఒకసారి ఆలోచించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కోరారు. ఆనాడు ఓట్ల కోసం మభ్యపెట్టి పదవి వచ్చిన తరువాత మారిపోయిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. ఆ రోజు దివీస్ పై నిప్పులు చెరిగిన వ్యక్తి ఈ రోజు ఇంతగా ఏ కారణాల వల్ల మారిపోయారు? ఈయనేనా ప్రజానేత అంటూ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులంటే నిజాయతీ, నిలకడ ఉండాలి. ఈ ముఖ్యమంత్రికి నిలకడ లేదు. ఉన్నదంతా రెండు నాల్కల ధోరణే. ఆనాటి శ్రీ జగన్ రెడ్డి ప్రసంగాన్ని అవలోకం చేసుకుంటే ఆయన ఉపన్యాసం అభివృద్ధి కోసమా....ఓట్ల కోసమా అనేది ఇట్టే అర్ధమవుతుంది. అభివృద్ధిని అందరం ఆహ్వానించాల్సిందే....కాని పర్యావరణాన్ని ధ్వంసం చేసి కాదు. ఇదే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్మే సిద్ధాంతం. కాలుష్యం నుంచి కాపాడంటూ ఉద్యమం చేస్తున్న వారిలో 160 మందిపై కేసులు పెట్టారు. ఇంకా 36 మంది జైలులోనే మగ్గుతున్నారు. మహిళలపై లాఠీచార్జీ చేశారు. ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఇక్కడ ఈ సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసింది. జిల్లా ఎస్పీపై విపరీతమైన వత్తిడి తెచ్చింది. అయినా అనుమతులిచ్చిన ఎస్పీ గారికి, పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు. ఆరంభంలో రూ.390 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ప్రారంభిస్తున్నామని 1300 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పిన దివీస్ ఇప్పటి లెక్కలు వేరేగా ఉన్నాయి. రూ.1500 కోట్ల పెట్టుబడి, 6000 మందికి ఉపాధి అంటున్నారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని కొత్త ప్రచారం మొదలు పెట్టారు. విచిత్రమేమిటంటే ఇక్కడ చదువుకున్న వారి శాతం 12కి మించి లేదు. పైపెచ్చు ఆ పరిశ్రమకు అవసరమైన మెకానికల్ ఇంజినీర్లు, కెమిస్టులు, ఫార్మాసిస్టులు ఇక్కడ ఉన్నారా? ఎందుకీ మభ్య పెట్టే మాటలు? వీటన్నింటిపై పాలకులను నిలదీయాల్సిన బాధ్యత మీతోపాటు మా మీద కూడా ఉంది. అందుకే ఇక్కడకు వచ్చాం. రెచ్చగొట్టడానికో....ఓట్ల కోసమో కాదు. ముఖ్యమంత్రి స్పందించేవరకు ఉద్యమిద్దాం. మీకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ మీ వెంట నిలబడుతుంద"ని శ్రీ మనోహర్ గారు హామీ ఇచ్చారు.
ఇలాంటి అభివృద్ధి మాకొద్దు....
అంతకు ముందు పలువురు రైతులు, మత్స్యకారులు, హేచరీస్ వారు మాట్లాడుతూ శ్రీ జగన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇక్కడకు వచ్చి చేసిన ప్రసంగాన్ని నమ్మి ఆ పార్టీకి మెజార్జీ ఇచ్చాం. ఇప్పుడు మడమ తిప్పి మమ్మల్ని ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇక్కడ 220 హేచరీలు ఉన్నాయి. దాదాపు 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ఇప్పుడిప్పుడే పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నాం. మాకు ఇది చాలు. మా బతుకు మమ్మల్ని బతకనీయండి. కాలుష్యం బారిన పడేసే అభివృద్ధి మాకు వద్దు అంటూ కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. జైలులో ఉన్న 36 మంది విడుదలకు కృషి చేయాలని కోరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి