7, జనవరి 2021, గురువారం

పవన్ కళ్యాణ్: ఆలయాల రక్షణపై ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలి

చినజీయర్ స్వామి, పవన్ కళ్యాణ్

 

కమీషన్లు వచ్చే కాంట్రాక్ట్ పనులపైనే కాదు.. సి.సి.కెమెరాల ఏర్పాటుపైనా దృష్టిపెట్టాలి

లయాల ఆస్తులు, విగ్రహాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వ వైఖరి... తీసుకొనే చర్యల గురించి ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన సమయంలోనే అన్ని ఆలయాలలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు రామతీర్థంలో శ్రీ కోదండరామ స్వామి విగ్రహం తల నరికిన దుస్సంఘటన తరవాత అదే మాట చెబుతున్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో సుమారు 26వేల ఆలయాలు ఉన్నాయి. అందులో ఎన్ని ఆలయాలకు సి.సి.కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు? అనేది ప్రశ్నార్థకమే. ఆలయాలే ఆ కెమెరాలను, పర్యవేక్షణను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుండటం సరికాదు. ధూప దీప నైవేద్యాలకు కూడా నిధులు సమకూర్చని ప్రభుత్వం ఇప్పుడు సి.సి. కెమెరాలను ఆలయాలే ఏర్పాటు చేసుకోవాలనడం బాధ్యతను విస్మరించడమే. 

గత ప్రభుత్వ కాలంలో కూల్చినవాటిని కడుతున్నామని చెబుతున్న ఈ పాలక పక్షం గత 18 నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు. విగ్రహాల ధ్వంసం ఘటనల క్రమంలోనే ప్రభుత్వం విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణం అంటోంది.  విజయవాడ దుర్గ గుడి అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించి పనులు మొదలుపెడతామన్నారు. ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు ప్రభుత్వ విధి నిర్వహణలో భాగమే. వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చేస్తున్న పనులుగా వాటిని చూడలేము. కాంట్రాక్టుల్లో వచ్చే కమీషన్ల మీదపెట్టే శ్రద్ధ రాష్ట్రవ్యాప్తంగా 26వేల ఆలయాలకు సి.సి.కెమెరాలు ఏర్పాటు మీదా దృష్టిపెట్టాలి. ఉత్సవ విగ్రహాల్లా ఉండే కెమెరాలు కాకుండా ఆధునిక సాంకేతికత ఉన్న కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను సిద్ధం చేయాలి. లేదంటే ఈ ప్రభుత్వం కేవలం ప్రకటనలకు, ప్రచారానికి మాత్రమే సి.సి. కెమెరాలు అనే మాట చెబుతుందని భావించాల్సి వస్తుంది.

 

(పవన్ కల్యాణ్)

అధ్యక్షులు, జనసేన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి