• 75శాతం ఉద్యోగాలు గురించి ఇప్పుడే ఎందుకు
మాట్లాడుతున్నారు ?
• రివర్స్ టెండరింగ్ తరహాలోనే దివిస్ పరిశ్రమపై
నిర్ణయం తీసుకోవచ్చుగా
• 36మంది స్థానికులను విడుదల చేయమని మీరు
చెబుతున్నా
ఎవరూ మీ మాట
పట్టించుకోవడం లేదు
దివిస్ లాబోరేటరీస్ బాధితుల కన్నీళ్లు తుడవమని అడుగుతుంటే పంచాయితీ ఎన్నికలు నిర్వహించడంపై మాట్లాడమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అడుగుతున్నారంటే ఆయన విజ్ఞతపై సందేహాలు కలుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
‘‘ఆయన చెబుతున్న మాటలు సమస్యను ఏమార్చేదిగా బోడిగుండుకీ బొటన వేలుకీ
ముడిపెట్టినట్టు ఉంది. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకల గ్రామంలో
ఏర్పాటవుతున్న దివిస్ లాబొరేటరీస్ కర్మాగారం కారణంగా అక్కడి 15
గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు చేస్తున్న ఆక్రందనలు మీ చెవులకు సోకడం లేదా
గౌతంరెడ్డి గారు? ఆ కర్మాగారానికి అనుమతులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
అని మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించడం ఎంత వరకు సబబో మరోసారి ఆలోచించండి.
చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇస్తే మీరు ఆపరా? ఆపలేరా? ఆయన
ప్రారంభించిన అన్నిటినీ ఒక్కొక్కటిగా రద్దు చేశారు కదా.. రాజధాని అమరావతిని ఆపారు.
పోలవరం ప్రాజెక్టును రివర్స్ లో తీసుకువెళ్తున్నారు. మరి అదే విధంగా దివిస్
కర్మాగారంపై అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకొని.. ఆ పరిశ్రమపై ఓ
నిర్ణయం తీసుకోవచ్చుగా. కనీసం అరెస్టు చేసిన 36 మందిని సైతం
విడిచిపెట్టలేరా? ఆ 36మంది సూటు కేసు కంపెనీలు పెట్టి మోసాలు చేశారా? లేదా
ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి నీకింత... నాకింత అని కిక్ బ్యాక్స్ తీసుకున్నారా? లేదా
ప్రత్యర్ధులను పథకం ప్రకారం హతమార్చారా? కేవలం ఫ్యాక్టరీ వద్దన్నందుకు అమాయకులను
అరెస్టులు చేసి జైళ్లలో పెడతారా?
వారి కుటుంబాల శోకం మీ ప్రభుత్వానికి తప్పక
తగులుతుంది. ఆ 36మందిని విడిచిపెట్టమని మీరు రివ్యూల్లో చెబుతున్నారని వార్తల్లో
చదివాం. ఆ అమాయకులు మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నారు. అంటే మీ మాటను ఎవరూ
పట్టించుకోవడం లేదు అని అర్థం చేసుకోవాలా?
దివిస్
ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసింది ఎవరు? మీ
పార్టీ నాయకుడు, మీ పార్టీ వారు కాదా? ఎన్నికల ముందు మీరు పలికిన ప్రగల్భాల గురించి
తొండంగి మండలంలోని రాళ్లు రప్పలు కూడా చెబుతాయి. ఎన్నికలకు ముందు ఆ ప్రాంతానికి
వెళ్ళిన మీ నాయకుడు జగన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వస్తే దివిస్ ను బంగళా
ఖాతంలో కలిపేస్తాను అని స్థానికులను రెచ్చగొట్టినందువల్లే కదా.. ఇప్పుడు ఆ అమాయక
ప్రజలు దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా రోడ్ల పైకి వస్తోంది. 151 స్థానాలను ప్రజలు మీకు అప్పగించింది
తప్పుఒప్పులను సరిచేసి సమన్యాయం అందించమనే కదా? మరి
మీరిప్పుడు ఏం చేస్తున్నారు? ఆ
తప్పుల నుంచి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది
ఏమీ లేదు. ముందుగా 36
మందిని బేషరతుగా విడుదల చేసి అక్కడ ప్రజలు ఏం కోరుతున్నారో అది చేయడానికి
ప్రయత్నించండి.
నేను 10వ తరగతి నెల్లూరులో చదివిన విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసినందుకు సంతోషం. యూకేలో ఎమ్.ఎస్. చదివిన మీరు ఆ 36 మంది బాధితులను విడుదల చేయించి ఆ విషయం కూడా ప్రపంచానికి తెలియజేయండి. సంతోషిస్తాం’’ అని పవన్ అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి