20, డిసెంబర్ 2020, ఆదివారం

బిగ్ బాస్: అభిజిత్ విన్నర్

 




బిగ్ ‌బాస్-4 విజేతగా అభిజిత్ నిలిచారు.

విజేత ఎవరవుతారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మొదటి నుంచి ఎవరి అంచనాలు వారికి ఉన్నప్పటికీ గ్రాండ్ ఫినాలె మొదలైపోవడం.. ఫైనల్‌కు చేరినవారిలో దేత్తడి హారిక, ఆరియానా గ్లోరీ, సోహైల్ ఎలిమినేట్ కావడంతో చివరకు అభిజిత్, అఖిల్ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ట్రెండింగుగా మారింది.

అయితే... చాలామంది ఊహించినట్లే అభిజిత్ విజేతయ్యాడు.

ఇద్దరూ బలమైన కంటెస్టెంట్లే కావడంతో ఇద్దరికీ సమాన అవకాశాలున్నాయని భావించారు.

అయితే, అదేసమయంలో అభిజిత్‌కు భారీగా ఓటింగ్ ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతుండడంతో ఆయనే విజేత కావొచ్చేనే అంచనాలూ వచ్చాయి.

ఆ ప్రకారమే అభిజిత్ విజేతయ్యాడు.

ఇవి కూడా చదవండి:

పవన్ కల్యాణ్: అసెంబ్లీలో చెప్పిన నివర్ నష్టాలకు క్యాబినెట్ లెక్కలకీ పొంతన లేదు 

ఈడీ అమీన్: శత్రువుల రక్తం తాగి, మర్మావయవాలనూ తినేసిన నియంత.. ఆయన దారుణాలు చదివితేనే వణుకు పుడుతుంది 

 రకుల్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ కేసులో బయటపెట్టిన రియా చక్రవర్తి? తెలుగు సినీ, రాజకీయ స్నేహితుల పేర్లూ బయటకొస్తాయా

పవన్ కల్యాణ్: అసెంబ్లీలో చెప్పిన నివర్ నష్టాలకు క్యాబినెట్ లెక్కలకీ పొంతన లేదు

 

పవన్ కల్యాణ్






అధికారంలోకి వస్తే రైతు ప్రభుత్వాన్ని స్థాపించి, సంక్షేమ పాలనను అందిస్తామని పాదయాత్రలో వాగ్ధానం చేసిన  ముఖ్యమంత్రి ఇవాళ హెలికాప్టర్ పర్యటనలకే పరిమితమవ్వడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్   నాదెండ్ల మనోహర్  అన్నారు. రైతాంగం పడుతున్న బాధలు, వారి ఆవేదన తెలియాలంటే క్షేత్రస్థాయిలో పర్యటించాలని హితవు పలికారు. అన్నం పెడుతున్న అన్నదాతకు అండగా నిలబడాల్సిన ముఖ్యమంత్రి రైతు వ్యతిరేకిగా మారిపోయారన్నారు. ఆదివారం ఉదయం రాజమండ్రిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా  నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ “నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి అండగా నిలబడాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేదు. ఒకే ఏడాదిలో మూడు ప్రకృతి విపత్తులు సంభవించి రైతాంగం పూర్తిగా నష్టపోయింది. మా పార్టీ అధ్యక్షులు    పవన్ కళ్యాణ్  రైతులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం గురించి చేసిన డిమాండ్ హేతుబద్ధమైనదే. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పలువురు పెద్దలు 2020 సంవత్సరాన్ని 1977లో వచ్చిన తుపానుతో పోల్చుతున్నారు. ఆ ఏడాది ఏ విధంగా అయితే రైతులు, చిరు వ్యాపారులు నష్టపోయారో... ఈ ఏడాది కూడా అలాగే జరిగిందని చెబుతున్నారు.

4 లక్షల ఎకరాలు నష్టం తగ్గించి చూపారు

నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా అధ్యక్షులు పవన్  కళ్యాణ్ అనేక గ్రామాలను సందర్శించారు. వందలాది మంది రైతులను పరామర్శించారు. పర్యటనలో భాగంగా కలిసిన ప్రతి రైతు ఈ ఏడాది ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు నష్టపోయామని చెప్పారు. ప్రభుత్వం నుంచి కనీసం రూ. 30 వేలు నష్టపరిహారం అందకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొనే ఎకరాకు రూ. 35 వేల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. అందులో భాగంగా తక్షణ సాయంగా రూ. 10 వేలు ఇవ్వాలని కోరాం. 48 గంటలు గడువు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సరైన స్పందన రాలేదు. ఆ తరవాత రైతులు, కౌలు రైతుల కోసం ఒక రోజు నిరసన దీక్షను రాష్ట్రవ్యాప్తంగా జనసేన చేపట్టింది.

 * తప్పుడు లెక్కలతో మభ్యపెట్టారు

నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగంలో భరోసా నింపాలన్న ఆలోచనే ప్రభుత్వంలో లేదు. మంత్రులు కాకిలెక్కలు చెబుతూ ప్రజలు, రైతులను మభ్యపెడుతున్నారు. శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ నివర్ తుపాన్ వల్ల 17 లక్షల 32 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రకటించారు. వారం తిరగక ముందే నిన్న జరిగిన కేబినేట్ భేటీలో మంత్రులు లెక్కలను సవరించి ఆ నష్టాన్ని 13 లక్షలకు తగ్గించారు. దాదాపు 4 లక్షల ఎకరాలను నష్టపోయిన జాబితా నుంచి ప్రభుత్వం తప్పించి, వేలాదిమంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 29న మూడో విడత రైతు భరోసా కింద రెండు వేలు వేస్తున్నాం అని ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.13,500 లో కేంద్రం 6 వేలు ఇస్తుంది. అలాగే ఇన్ ఫుట్ సబ్సిడి కింద 40 శాతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. రైతాంగానికి మీరేదో చేసేసినట్లు ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు.

* మద్యంపై ఆదాయం ఒక్క ఏడాది వదులుకోలేరా?

ఖరీఫ్ పూర్తిగా నష్టపోయిన రైతాంగం రబీకి సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా వేశారు. అధికార యంత్రాంగం, వ్యవసాయ యంత్రాంగం మధ్య సమన్వయం లోపించి ముందుకెళ్తున్న విషయం చాలా మంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. గోదావరి జిల్లాలకు రబీ అవసరాలకు 90 టీఎంసీల నీటి అవసరం ఉందని అంచనాలు వేస్తే.. 70 టీఎంసీల కంటే ఎక్కువ ఇవ్వలేమని ఇరిగేషన్ శాఖ అధికారులు లెక్క చూపిస్తున్నారు. ఇలాగైతే 25 శాతం మంది రైతులకు నష్టం కలుగుతుంది. ఎన్నికల ముందు పాదయాత్రలో చేసిన వాగ్ధానం సంపూర్ణ మద్యపాన నిషేధం. ఇప్పుడు చూస్తే మద్యం అమ్మకాల ద్వారా ప్రతి ఏడాది రూ. 17వేల 500 కోట్లు ఆదాయం వస్తోంది. వద్దనుకున్న లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయాన్నే వదులుకొని పంట నష్టపోయిన రైతులకు తక్షణం రూ. 10 వేలు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేసింది. ఒక్క ఏడాది మద్యం సంపాదన వదులుకోని పాలకులు తమది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడం ఎందుకు? 151 మంది ఎమ్మెల్యే ఎందుకు?

అందుకే నివర్ తుపాన్, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 28న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తాం. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. రైతులు, రైతు సంఘాలు, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  కూడా పాల్గొంటారు.

* సొంత పార్టీ నాయకుల లబ్ధి కోసమే నవరత్నాలు

నవరత్నాలతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధి పొందే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెల్లూరు వంటి ప్రాంతాల్లో చెరువులను చూపించి ఇవే ఇళ్ల స్థలాలు అంటున్నారు. రాజమండ్రిలో రూ. 10 లక్షలు విలువ చేసే భూములను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసి సొంత పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చుతున్నారు. నిజమైన పేదవాళ్లకు గూడు కల్పించే అంశంపై ఏ రాజకీయ పార్టీ రాజకీయం చేయదు. కానీ ఇలాంటి అవినీతికి పాల్పడితే తప్పకుండా వ్యతిరేకిస్తాం. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. పార్టీ పరంగా అన్ని ప్రాంతాల నాయకులతో మాట్లాడి తీసుకున్న నిర్ణయం ఇది. దానికే జనసేన పార్టీ కట్టుబడి ఉంద"ని అన్నారు.

ఈ సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు  కందుల దుర్గేష్,  ముత్తా శశిధర్,  పంతం నానాజీ,  పితాని బాలకృష్ణ, పార్టీ నాయకులు మేడా గురుదత్ ప్రసాద్,  డి.ఎమ్.అర్.శేఖర్,   అత్తి సత్యనారాయణ,  మర్రెడ్డి శ్రీనివాస్,  వై.శ్రీను చెరుకూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.

18, డిసెంబర్ 2020, శుక్రవారం

‘యంగ్ టైగర్’ కింజరాపు రామ్మోహన నాయుడు పొలిటికల్ జర్నీ

కింజరాపు రామ్మోహననాయుడు అచ్చెన్నాయుడు ఎర్రన్నాయుడు


శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన నాయుడిని ఆయన అభిమానులు, శ్రీకాకుళం ప్రజలు యంగ్ టైగర్‌గా పిలుచుకుంటారు. చిన్న వయసులోనే లోక్‌సభలో అడుగుపెట్టిన అతి కొద్ది మందిలో ఒకరైన రామ్మోహన్ నాయుడు వడివడిగా రాజకీయాలను, ప్రజల నాడిని, ప్రజల అవసరాలను, దేశ స్థితిగతులను అర్థం చేసుకుని ప్రజల నాయకుడిగా ఎదిగారు. 

కింజరాపు రామ్మోహననాయుడు 1987 డిసెంబరు 18న శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మాడలో జన్మించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ తెలుగుదేశం నాయకుడు కింజరాపు ఎర్రంనాయుడు కుమారుడైన రామ్మోహననాయుడు తండ్రిని మించిన నేతగా ఎదుగుతున్నారని శ్రీకాకుళం ప్రజలు చెబుతుంటారు. 


26 ఏళ్ల వయసులో రాజకీయ ప్రవేశం

తండ్రి ఎర్నన్నాయుడు మరణించడంతో 26 ఏళ్ల వయసులో రాజకీయ ప్రవేశం చేశారు రామ్మోహననాయుడు. తండ్రి ఎర్రన్నాయుడు, బాబాయి అచ్చెన్నాయుడు కూడా అదే వయసులో రాజకీయాల్లోకి వచ్చారు.

రామ్మోహననాయుడు 1 నుంచి 3 తరగతులు శ్రీకాకుళం జిల్లాలోనే చదువుకున్నారు. అనంతరం తండ్రి ఎర్రన్నాయుడు చీఫ్ విప్ కావడంతో ఆ కుటుంబం హైదరాబాద్‌కు తరలిపోయింది. దీంతో ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది.

4, 5 తరగతులు హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో చదివారు. ఆ తరువాత తండ్రి ఎర్రన్నాయుడు ఎంపీగా ఎన్నికవడంతో కుటుంబం దిల్లీకి మారింది. దీంతో రామ్మోహననాయుడు విద్యాభ్యాసం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు దిల్లీలో సాగింది.

ఇంటర్మీడియట్ తరువాత అమెరికాలో ఎలక్ట్రిల్ ఇంజినీరింగ్, ఎంబీయే పూర్తిచేశారు.

అమెరికా నుంచి తిరిగి వచ్చి దిల్లీలో ఓ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలో మార్కెటింగ్ రంగంలో పనిచేశారు.

ఆ సమయంలోనే తండ్రి మరణించడంతో రాజకీయాల్లోకి వచ్చారు.

2014లో తొలిసారి శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 

అనంతరం 2019 ఎన్నికల్లోనూ వైసీపీ ఎదురుగాలిని తట్టుకుని నిలిచి మరీ ఎంపీగా విజయం సాధించారు.

రామ్మోహననాయుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తెను వివాహం చేసుకున్నారు.

కింజరాపు రామ్మోహన నాయుడు


కింజరాపు రామ్మోహన్ నాయుడు


15, డిసెంబర్ 2020, మంగళవారం

ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 1 నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే జరిమానాలు ఇలా..

bike riding, traffic rules, traffic challan online

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మోటార్ వాహనాల చట్టం-2021 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. 

ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా భారీగా పెరగనుంది. 

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణ చేసింది.

నూతన చట్టం ప్రకారం విధించే జరిమానాలు ఇలా..

* హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,035 జరిమానా. రెండోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే రెట్టింపు జరిమానా విధించనున్నారు.

* చరవాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ.5,035 జరిమానా. ఇదే కేసులో రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా.

* డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా.

* అధిక వేగంతో వాహనం నడిపితే రూ.1,035 జరిమానా.

* రెడ్​ సిగ్నల్ పడిన తరువాత నిబంధన అతిక్రమిస్తే రూ.1,035 జరిమానా.

* మైనర్లకు వాహనం ఇస్తే రూ. 5,035 జరిమానా.

* వాహనానికి సరైన ధ్రువపత్రాలు లేకుంటే రూ. 2వేలు, రెండోసారి పట్టుబడితే రూ. ఐదు వేలు జరిమానా.

* పర్మిట్ లేని వాహనానికి రూ.10,000, ఓవర్ లోడ్​కు రూ.20,000 జరిమానా.

* పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు.

* అంబులెన్స్, ఫైరింజన్లకు దారి ఇవ్వకపోతే రూ.పదివేలు జరిమానా.

15, అక్టోబర్ 2020, గురువారం

Flipkart Big Billion Day ప్రారంభం.. Flipkart plus మెంబర్స్ early access

 

flipkart big billion day flipkart  plus early access

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌ ఎర్లీ యాక్సెస్


ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అక్టోబర్ 16 నుంచి 21వ తేదీ వరకు ఉంటాయి. ఈ తేదీల్లో లక్షలాది వస్తువులపై తగ్గింపు ధరలు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్.
నిజానికి అక్టోబరు 16 నుంచి ఇది మొదలవుతున్నప్పటికీ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు మాత్రం అక్టోబరు 15 మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ఆఫర్లకు యాక్సెస్ వస్తుంది. అంటే మిగతా సాధారణ కస్టమర్ల కంటే 12 గంటల ముందుగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లు అందుతాయన్నమాట.
ఏటా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు పేటీఎం, మింత్ర, అజియో లైఫ్, టాటా క్లిక్, స్నాప్ డీల్ వంటి ఈకామర్స్ సంస్థలు ఇలాంటి భారీ ఆఫర్ సీజన్ కోసం వినియోగదారులు ఎదురుచూస్తుంటారు.

ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు ఉంటే మరో 10 శాతం ఇనిస్టెంట్ డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో వస్తువులు కొనేవారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డుతో కానీ క్రెడిట్ కార్డుతో కానీ వస్తువులు కొంటే వారికి అప్పటికే ఉన్న తగ్గింపు ధరలపై అదనంగా మరో 10 శాతం తగ్గింపు వస్తుంది.

దీంతో మొబైల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, దుస్తులు, షూస్, గృహోపకరణాలు వంటి ఎన్నో వస్తువులు కొనాలనుకుని ఈ బిగ్ బిలియన్ డేస్ కోసం ఎదురుచూస్తున్నవారు కొనుగోళ్లు ప్రారంభించారు.

మా ఇతర కథనాలు:

30, సెప్టెంబర్ 2020, బుధవారం

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు ఫుల్ డీటెయిల్స్



ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని బాబ్రీ మసీదును 1992 డిసెంబరు 6న కరసేవకులు కూల్చివేశారు. ఈ ఘటన తరువాత దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి హింస చెలరేగింది. పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. కూల్చివేతకు గురైన మసీదును మళ్లీ నిర్మిస్తామని అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహరావు ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తు కోసం డిసెంబర్ 16న ఎంఎస్ లిబర్హాన్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం 2009లో కమిషన్ తమ నివేదికను సమర్పించింది.

మరోవైపు మసీదు స్థలంలో రామమందిరం నిర్మించాలని సుప్రీంకోర్టు కొద్దికాలం కిందట తీర్పు ఇచ్చింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఆలయానికి భూమి పూజ చేశారు.. ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు సాగుతున్నాయి. 

అయితే, కరసేవకులు 1992 డిసెంబర్ 6న పూర్తిగా కూల్చివేయడానికి ముందే అది కొంతవరకు ధ్వంసమవడంతో అక్కడ తాత్కాలిక రామ మందిరం ఏర్పాటు చేశారు.

డిసెంబరు 6న కూల్చివేత రోజున పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదుచేశారు. ప్రార్థనా స్థలాన్ని ధ్వంసం చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, లూటీ వంటి నేరారోపణలతో కర సేవకులపై ఒక కేసు... విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ బీజేపీ నేత ఎల్‌కే అడ్వాణీ, విశ్వ హిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్, బజరంగ్ దళ్ నాయకుడు వినయ్ కతియార్, ఉమా భారతి, సాధ్వీ రితంభర, మురళీ మనోహర్ జోషి, గిరిరాజ్ కిశోర్, విష్ణు హరి దాల్మియాలపై రెండో కేసు నమోదు చేశారు. 

మొదటి ఎఫ్ఐఆర్‌లో నమోదుచేసిన కేసును సీబీఐకి అప్పగించగా.. రెండో ఎఫ్ఐఆర్‌లో నమోదైన కేసును ఉత్తర ప్రదేశ్ సీఐడీకి అప్పగించారు.


రెండు ప్రత్యేక కోర్టులు..

కరసేవకులపై కేసు విచారణకు లలిత్‌పూర్‌లో ఒక స్పెషల్ కోర్టు, రెండో ఎఫ్ఐఆర్ విచారణకు రాయ్‌బరేలీలో మరో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేశారు.

బాబ్రీ మసీదు కూల్చివేతపై దర్యాప్తు కోసం డిసెంబర్ 16న ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్‌కు మూడు నెలల గడువు ఇవ్వగా ఆ గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే వచ్చారు. 17 సంవత్సరాల కాలంలో 48 సార్లు ఈ గడువును పొడిగించారు. ఎట్టకేలకు 2009 జూన్‌లో ఈ విచారణ కమిషన్ తన దర్యాప్తు నివేదికను హోం మంత్రిత్వ శాఖకు సమర్పించింది.

మసీదు కూల్చివేత వెనక కుట్ర ఉందని.. దీనిపై విచారణ జరిపించాలని లిబర్హాన్ కమిషన్ నివేదిక ఇచ్చింది.

రెండు కేసులేనా..?

మసీదు కూల్చివేసిన రోజు నమోదైన రెండు ప్రధాన కేసులతోపాటూ మరో 47 కేసులు కూడా నమోదయ్యాయి. ఇందులో విలేకరులపై దాడి, దోపిడీ మొదలైన ఆరోపణలున్నాయి. తరువాత ఈ కేసులన్నిటినీ సీబీఐకు అప్పగించారు.

అనంతరం అలహాబాద్ హైకోర్టు సూచన మేరకు లఖ్‌నవూలో అయోధ్య కేసుల విచారణ కోసం ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. కానీ ఆ నోటిఫికేషన్‌లో రెండో కేసు సంఖ్య 198ను జత చేయలేదు. ఈ కేసు విచారణ రాయ్‌బరేలీలోనే జరుగుతూ వచ్చింది. అయితే, మొదటి కేసు సంఖ్య 197ను సెక్షన్ 120 బీ కింద క్రిమినల్ కేసుగా మార్చారు.

తరువాత, 1993 అక్టోబర్ 5న రెండో కేసు 198ని కూడా జత చేస్తూ సీబీఐ ఉమ్మడి చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీట్‌లో బాల్ ఠాక్రే, కల్యాణ్ సింగ్, చంపత్ రాయ్, ధరందాస్, మహంత్ నృత్య గోపాల్ దాస్‌తో సహా మరి కొందరి పేర్లు జత చేసింది.

1993 అక్టోబర్ 8న యూపీ ప్రభుత్వం, కేసుల బదిలీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రెండో కేసు 198తో సహా బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసులన్నీ లఖ్‌నవూ ప్రత్యేక కోర్టులోనే విచారణకు వస్తాయని తేలింది.

1996లో లఖ్‌నవూ కోర్టు, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులన్నిటినీ నేరపూరిత కుట్ర (క్రిమినల్ కేసు) విభాగంలో చేర్చాలని ఆదేశించింది. ఈ కేసుల విషయంలో సీబీఐ దాఖలు చేసిన ఒక అనుబంధ చార్జ్‌షీట్‌ ఆధారంగా ఎల్‌కే అడ్వాణీతో సహా నిందితులందరిపై నేరపూరిత కుట్ర కేసును దాఖలు చేసేందుకు వీలుగా సాక్ష్యాలు ఉన్నాయంటూ లఖ్‌నవూ ప్రత్యేక కోర్టు ఈ నిర్ణయానికొచ్చింది.

ఈ కేసులన్నీ ఒకే ఘటనకు సంబంధించినవి కాబట్టి ఉమ్మడి విచారణ చేపట్టాలని లఖ్‌నవూ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. అయితే అడ్వాణీతో సహా పలువురు నిందితులు ఈ ఉత్తర్వును హైకోర్టులో సవాలు చేశారు.

2001 ఫిబ్రవరి 12న ఉమ్మడి చార్జ్‌షీట్‌కు హైకోర్టు అంగీకరించింది. కానీ రెండో కేసు 198ని లఖ్‌నవూ ప్రత్యేక కోర్టు నోటిఫికేషన్లో చేర్చలేదు కాబట్టి ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది నిందితులపై విచారణ చేయడానికి లఖ్‌నవూ ప్రత్యేక కోర్టుకు అనుమతి లేదని కూడా తెలిపింది. దీంతో అడ్వాణీతో సహా 8 మందిపై వేసిన రెండో క్రిమినల్ కేసు సాంకేతికపరమైన చిక్కుల్లో పడింది.

మరోవైపు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా పరమైన లోపాల వల్ల నిందితులపై తప్పుడు అభియోగాలు మోపారని నిందితుల తరఫు లాయర్ వాదించారు.

ఈ సాంకేతిక కారణాలను అడ్డు పెట్టుకుని ఎల్‌కే అడ్వాణీ తదితరులు తమపై ఉన్న క్రిమినల్ కేసును తొలగించాలని కోరారు.

రెండో కేసులో 8 మంది నిందితులపై నేరపూరిత కుట్ర కేసుకు సంబంధించిన సాక్ష్యాలను జత చేస్తూ రాయ్‌బరేలీ కోర్టులో అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేయవలసిందిగా హైకోర్టు, సీబీఐని 

2003లో కేసు సంఖ్య 198లో 8 మంది నిందితులపై సీబీఐ అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కానీ కేసు సంఖ్య 198ను నేరపూరిత కుట్ర విభాగంలో జోడించలేకపోయింది ఎందుకంటే మొదట్లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కేసు నంబర్ 197ను నేరపూరిత కుట్ర విభాగంలోనూ, 198ని రెచ్చగొట్టే ప్రసంగాలుగానూ వేరు వేరుగా ఎఫైఆర్ నమోదు చేశారు కాబట్టి.

ఈలోగా, రాయ్‌బరేలీ కోర్టు.. అడ్వాణీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి, ఆయనపై ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవని తెలుపుతూ ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.

అయితే, 2005లో అలహాబాద్ హైకోర్టు, రాయ్‌బరేలీ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అడ్వాణీ తదితరులపై కేసులు కొనసాగుతాయని చెప్పింది. అయితే అప్పటికి కూడా కేసు సంఖ్య 198ని నేరపూరిత కుట్రగా గుర్తించలేదు.

2005లో రాయ్‌బరేలీ కోర్టు ఈ కేసును మళ్లీ స్వీకరించింది. 2007లో ఈ కేసు మొదటి విచారణ జరిగింది.

తరవాత రెండు సంవత్సరాలకు 2009లో లిబర్హాన్ కమిషన్ బాబ్రీ మసీదు కూల్చివేతపై దర్యాప్తు నివేదికను సమర్పించింది. సంఘ్ పరివార్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీకి చెందిన నాయకులు బాబ్రీ కూల్చివేతకు దారితీసిన సంఘటనలకు బాధ్యులని ఈ నివేదికలో పేర్కొన్నారు.

2010లో ఈ రెండు కేసులను వేరు చేయాలని, కేసు సంఖ్య 198ని క్రిమినల్ కేసుగా చూడకూడదని వేసిన రివిజన్ పిటీషన్‌ను అలహాబాద్ హై కోర్టు తిరస్కరించింది.

అయోధ్య వివాదంలో సెప్టంబర్ 24న తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. తరువాత తీర్పును ఆపాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది.

2010 సెప్టెంబర్ 30న అయోధ్య వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్ట్ చారిత్రక తీర్పు ఇచ్చింది.

2011లో సుప్రీంకోర్టు.. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.

2012లో రెండు కేసులపై ఉమ్మడి విచారణ జరపాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

2015లో కేసు సంఖ్య 198ని క్రిమినల్ కేసుగా చూడాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌పై స్పందించాలని కోరుతూ ఎల్‌కే అడ్వాణీ, ఉమా భారతి, మురళి మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్‌తో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నాయకులందరికీ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

2017లో సుప్రీం కోర్టు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఆరోపణలను పునరుద్ధరించింది. రెండు కేసుల విచారణలూ ఒకేసారి జరపాలంటూ తీర్పునిచ్చింది. ఈ గందరగోళానికి ముగింపు పలికేందుకు అడ్వాణీతో సహా 20 మంది నిందితులపై మళ్లీ క్రిమినల్ కేసు వేయమని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు ఆదేశాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది...రెండేళ్లలోపు బాబ్రీ మసీదు కేసులో విచారణ పూర్తి చేయాలని గడువు విధించడం.

గత ఏడాది ఏప్రిల్‌లో ఈ గడువు ముగిసింది. అయితే గడువును మరో 9 నెలలకు పొడిగించారు.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఈ గడువును మరింత పొడిగించారు. రోజూ విచారణ జరుపుతూ ఆగస్ట్ 31లోగా విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మళ్లీ మరో నెల రోజులు వ్యవధి ఇస్తూ సెప్టెంబర్ 30న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులపై తీర్పును వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తీర్పు రోజున నిందితులందరూ హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

28, సెప్టెంబర్ 2020, సోమవారం

రాహుల్ తివాతియా: అప్పటివరకు తిట్టిన నోళ్లే పొగిడాయి

Rahul Tewatia రాహుల్ తివాతియా


 అప్పటివరకు కామెంటరేటర్లు ఆ బ్యాట్స్‌మన్‌ను వెటకారమాడుతున్నారు. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సిన జట్టు మాంచి హిట్టర్లను కాదని ఆయన్ను పంపించి పెద్ద తప్పు చేసిందని ఓపెన్‌గానే విమర్శిస్తున్నారు. రిక్వైర్డ్ రన్‌రేట్ కొండలా పెరిగిపోతున్న సమయంలో తడబడుతూ ఒకటీ అరా పరుగులు తీస్తూ ఎక్కువ బంతులను వదిలేస్తున్న ఆయన్ను చూసి ఆ టీం అభిమానులూ తిడుతున్నారు.. అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ అప్పటికే దూకుడుగా ఆడుతున్నాడు.. షాట్లతో హోరెత్తిస్తున్నాడు. మరోవైపు ఈయన టిక్కుటిక్కుమని ఆడుతున్నాడు.. అందుకే అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ సింగిల్ తీసే అవకాశం వచ్చిన వెళ్లకుండా స్ట్రైక్ తన దగ్గర ఉంచుకుంటున్నాడు.. కానీ, అనుకోకుండా అవుటైపోయాడు. అంతవరకు కామెంటరేటర్లు కోరుకున్న హిట్టర్ క్రీజులో అడుగుపెట్టాడు.. ఒకట్రెండు షాట్లు కొట్టాడు.. ఇంతలో అంతవరకు జిడ్డులా ఆడిన బ్యాట్స్‌మన్ ఒక్కసారిగా గేరు మార్చాడు.. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఒకటా రెండా ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టేశాడు.. ఒకటైతే ఏకంగా స్టేడియం బయట రోడ్డు దాటి పడింది.. దాంతో అంతవరకు తిట్టిన కామెంటరేటర్లు ప్లేటు మార్చేశారు.. మరోవైపు 19 ఉన్న రిక్వైర్డ్ రన్ రేట్ ఒక్కసారి నార్మల్ రేంజ్‌కు పడిపోయింది. అంతలో హిట్టింగ్ చేస్తాడనుకున్న బ్యాట్స్‌మన్ అవుటయ్యాడు.. ఆయన స్థానంలో వచ్చిన మరో బ్యాట్స్‌మన్ కూడా రెండు సిక్సర్లు బాదాడు.. మళ్లీ మన జిడ్డు అనిపించుకున్న బ్యాట్స్‌మన్‌కు స్ట్రైక్ వచ్చింది.. మరో సిక్సర్ బాదాడు.. దాంతో అంతవరకు అసాధ్యమనుకున్న గెలుపు ఈజీ అయిపోయింది.. 6 బంతుల్లో 2 పరుగులు చేస్తే చాలనే స్టేజికి వచ్చేసింది.. మరో సిక్సర్‌కి ట్రై చేశాడు కానీ, అవుటైపోయాడు.. ఆ రెండు పరుగులు తరువాత వచ్చినవారు పూర్తి చేసి గెలిపించారు.

ఇదీ కింగ్స్ లెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్. ఇందులో చెప్పుకొన్న జిడ్డు బ్యాట్స్‌మన్ రాహుల్ తివాతియా... కామెంటరేటర్లు పరిహాసమాడిన ఆయనే మ్యాచ్‌ను మలుపు తిప్పి రాజస్థాన్ రాయల్స్‌ను గెలిపించాడు. వరుస సిక్సర్లతో వావ్ అనిపించాడు.

అప్పటివరకు వీడెప్పుడు అవుటవుతాడా అని రాజస్థాన్ రాయల్స్ అభిమానులే చూశారు.. కానీ, ఆ తరువాత కింగ్స్ లెవన్ ఆటగాళ్లు, అభిమానులు ఆయన అవుట్ కోసం ఎదురుచూశారు.

మొత్తానికి ఒక్కసారి మ్యాచ్ టర్న్ చేశావు తివాతియా..


24, సెప్టెంబర్ 2020, గురువారం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత విషమించింది


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం


 ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాగా క్షీణించిందని ఆయనకు చికిత్స చేస్తున్న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్యం గురించి విడుదల చేసిన బులెటిన్‌లో ఆయన ఆరోగ్యం గత 24 గంటల్లో మరింతగా క్షీణించిందని ఆసుపత్రి తెలిపింది.

కరోనా సోకడంతో బాలసుబ్రహ్మణ్యం ఆగస్ట్ 5న ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ సహా ఇతర పద్ధతుల్లో చికిత్స అందిస్తున్నారు. 

సుదీర్ఘ చికిత్స అనంతరం ఆయనకు కరోనా నెగటివ్ రావడంతో కుటుంబసభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.


ఆసుపత్రిలోనే ఆయన పెళ్లి రోజు జరుపుకొన్నారంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో రావడంతో ఆయన ఆరోగ్యం కుదుటపడిందని అంతా సంతోషించారు.

అయితే, ఇటీవల బాలు తనయుడు చరణ్ తన తండ్రికి ఇంకా ఎక్మో సాయంతో చికిత్స జరుగుతోందని చెప్పారు. ద్రవాహారం తీసుకుంటున్నారనీ చెప్పారు. ఇంతలోనే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించినట్లు ఆసుపత్రి వెల్లడించింది.