30, సెప్టెంబర్ 2020, బుధవారం

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు ఫుల్ డీటెయిల్స్



ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని బాబ్రీ మసీదును 1992 డిసెంబరు 6న కరసేవకులు కూల్చివేశారు. ఈ ఘటన తరువాత దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి హింస చెలరేగింది. పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. కూల్చివేతకు గురైన మసీదును మళ్లీ నిర్మిస్తామని అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహరావు ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తు కోసం డిసెంబర్ 16న ఎంఎస్ లిబర్హాన్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం 2009లో కమిషన్ తమ నివేదికను సమర్పించింది.

మరోవైపు మసీదు స్థలంలో రామమందిరం నిర్మించాలని సుప్రీంకోర్టు కొద్దికాలం కిందట తీర్పు ఇచ్చింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఆలయానికి భూమి పూజ చేశారు.. ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు సాగుతున్నాయి. 

అయితే, కరసేవకులు 1992 డిసెంబర్ 6న పూర్తిగా కూల్చివేయడానికి ముందే అది కొంతవరకు ధ్వంసమవడంతో అక్కడ తాత్కాలిక రామ మందిరం ఏర్పాటు చేశారు.

డిసెంబరు 6న కూల్చివేత రోజున పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదుచేశారు. ప్రార్థనా స్థలాన్ని ధ్వంసం చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, లూటీ వంటి నేరారోపణలతో కర సేవకులపై ఒక కేసు... విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ బీజేపీ నేత ఎల్‌కే అడ్వాణీ, విశ్వ హిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్, బజరంగ్ దళ్ నాయకుడు వినయ్ కతియార్, ఉమా భారతి, సాధ్వీ రితంభర, మురళీ మనోహర్ జోషి, గిరిరాజ్ కిశోర్, విష్ణు హరి దాల్మియాలపై రెండో కేసు నమోదు చేశారు. 

మొదటి ఎఫ్ఐఆర్‌లో నమోదుచేసిన కేసును సీబీఐకి అప్పగించగా.. రెండో ఎఫ్ఐఆర్‌లో నమోదైన కేసును ఉత్తర ప్రదేశ్ సీఐడీకి అప్పగించారు.


రెండు ప్రత్యేక కోర్టులు..

కరసేవకులపై కేసు విచారణకు లలిత్‌పూర్‌లో ఒక స్పెషల్ కోర్టు, రెండో ఎఫ్ఐఆర్ విచారణకు రాయ్‌బరేలీలో మరో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేశారు.

బాబ్రీ మసీదు కూల్చివేతపై దర్యాప్తు కోసం డిసెంబర్ 16న ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్‌కు మూడు నెలల గడువు ఇవ్వగా ఆ గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే వచ్చారు. 17 సంవత్సరాల కాలంలో 48 సార్లు ఈ గడువును పొడిగించారు. ఎట్టకేలకు 2009 జూన్‌లో ఈ విచారణ కమిషన్ తన దర్యాప్తు నివేదికను హోం మంత్రిత్వ శాఖకు సమర్పించింది.

మసీదు కూల్చివేత వెనక కుట్ర ఉందని.. దీనిపై విచారణ జరిపించాలని లిబర్హాన్ కమిషన్ నివేదిక ఇచ్చింది.

రెండు కేసులేనా..?

మసీదు కూల్చివేసిన రోజు నమోదైన రెండు ప్రధాన కేసులతోపాటూ మరో 47 కేసులు కూడా నమోదయ్యాయి. ఇందులో విలేకరులపై దాడి, దోపిడీ మొదలైన ఆరోపణలున్నాయి. తరువాత ఈ కేసులన్నిటినీ సీబీఐకు అప్పగించారు.

అనంతరం అలహాబాద్ హైకోర్టు సూచన మేరకు లఖ్‌నవూలో అయోధ్య కేసుల విచారణ కోసం ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. కానీ ఆ నోటిఫికేషన్‌లో రెండో కేసు సంఖ్య 198ను జత చేయలేదు. ఈ కేసు విచారణ రాయ్‌బరేలీలోనే జరుగుతూ వచ్చింది. అయితే, మొదటి కేసు సంఖ్య 197ను సెక్షన్ 120 బీ కింద క్రిమినల్ కేసుగా మార్చారు.

తరువాత, 1993 అక్టోబర్ 5న రెండో కేసు 198ని కూడా జత చేస్తూ సీబీఐ ఉమ్మడి చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీట్‌లో బాల్ ఠాక్రే, కల్యాణ్ సింగ్, చంపత్ రాయ్, ధరందాస్, మహంత్ నృత్య గోపాల్ దాస్‌తో సహా మరి కొందరి పేర్లు జత చేసింది.

1993 అక్టోబర్ 8న యూపీ ప్రభుత్వం, కేసుల బదిలీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రెండో కేసు 198తో సహా బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసులన్నీ లఖ్‌నవూ ప్రత్యేక కోర్టులోనే విచారణకు వస్తాయని తేలింది.

1996లో లఖ్‌నవూ కోర్టు, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులన్నిటినీ నేరపూరిత కుట్ర (క్రిమినల్ కేసు) విభాగంలో చేర్చాలని ఆదేశించింది. ఈ కేసుల విషయంలో సీబీఐ దాఖలు చేసిన ఒక అనుబంధ చార్జ్‌షీట్‌ ఆధారంగా ఎల్‌కే అడ్వాణీతో సహా నిందితులందరిపై నేరపూరిత కుట్ర కేసును దాఖలు చేసేందుకు వీలుగా సాక్ష్యాలు ఉన్నాయంటూ లఖ్‌నవూ ప్రత్యేక కోర్టు ఈ నిర్ణయానికొచ్చింది.

ఈ కేసులన్నీ ఒకే ఘటనకు సంబంధించినవి కాబట్టి ఉమ్మడి విచారణ చేపట్టాలని లఖ్‌నవూ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. అయితే అడ్వాణీతో సహా పలువురు నిందితులు ఈ ఉత్తర్వును హైకోర్టులో సవాలు చేశారు.

2001 ఫిబ్రవరి 12న ఉమ్మడి చార్జ్‌షీట్‌కు హైకోర్టు అంగీకరించింది. కానీ రెండో కేసు 198ని లఖ్‌నవూ ప్రత్యేక కోర్టు నోటిఫికేషన్లో చేర్చలేదు కాబట్టి ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది నిందితులపై విచారణ చేయడానికి లఖ్‌నవూ ప్రత్యేక కోర్టుకు అనుమతి లేదని కూడా తెలిపింది. దీంతో అడ్వాణీతో సహా 8 మందిపై వేసిన రెండో క్రిమినల్ కేసు సాంకేతికపరమైన చిక్కుల్లో పడింది.

మరోవైపు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా పరమైన లోపాల వల్ల నిందితులపై తప్పుడు అభియోగాలు మోపారని నిందితుల తరఫు లాయర్ వాదించారు.

ఈ సాంకేతిక కారణాలను అడ్డు పెట్టుకుని ఎల్‌కే అడ్వాణీ తదితరులు తమపై ఉన్న క్రిమినల్ కేసును తొలగించాలని కోరారు.

రెండో కేసులో 8 మంది నిందితులపై నేరపూరిత కుట్ర కేసుకు సంబంధించిన సాక్ష్యాలను జత చేస్తూ రాయ్‌బరేలీ కోర్టులో అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేయవలసిందిగా హైకోర్టు, సీబీఐని 

2003లో కేసు సంఖ్య 198లో 8 మంది నిందితులపై సీబీఐ అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కానీ కేసు సంఖ్య 198ను నేరపూరిత కుట్ర విభాగంలో జోడించలేకపోయింది ఎందుకంటే మొదట్లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కేసు నంబర్ 197ను నేరపూరిత కుట్ర విభాగంలోనూ, 198ని రెచ్చగొట్టే ప్రసంగాలుగానూ వేరు వేరుగా ఎఫైఆర్ నమోదు చేశారు కాబట్టి.

ఈలోగా, రాయ్‌బరేలీ కోర్టు.. అడ్వాణీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి, ఆయనపై ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవని తెలుపుతూ ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.

అయితే, 2005లో అలహాబాద్ హైకోర్టు, రాయ్‌బరేలీ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అడ్వాణీ తదితరులపై కేసులు కొనసాగుతాయని చెప్పింది. అయితే అప్పటికి కూడా కేసు సంఖ్య 198ని నేరపూరిత కుట్రగా గుర్తించలేదు.

2005లో రాయ్‌బరేలీ కోర్టు ఈ కేసును మళ్లీ స్వీకరించింది. 2007లో ఈ కేసు మొదటి విచారణ జరిగింది.

తరవాత రెండు సంవత్సరాలకు 2009లో లిబర్హాన్ కమిషన్ బాబ్రీ మసీదు కూల్చివేతపై దర్యాప్తు నివేదికను సమర్పించింది. సంఘ్ పరివార్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీకి చెందిన నాయకులు బాబ్రీ కూల్చివేతకు దారితీసిన సంఘటనలకు బాధ్యులని ఈ నివేదికలో పేర్కొన్నారు.

2010లో ఈ రెండు కేసులను వేరు చేయాలని, కేసు సంఖ్య 198ని క్రిమినల్ కేసుగా చూడకూడదని వేసిన రివిజన్ పిటీషన్‌ను అలహాబాద్ హై కోర్టు తిరస్కరించింది.

అయోధ్య వివాదంలో సెప్టంబర్ 24న తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. తరువాత తీర్పును ఆపాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది.

2010 సెప్టెంబర్ 30న అయోధ్య వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్ట్ చారిత్రక తీర్పు ఇచ్చింది.

2011లో సుప్రీంకోర్టు.. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.

2012లో రెండు కేసులపై ఉమ్మడి విచారణ జరపాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

2015లో కేసు సంఖ్య 198ని క్రిమినల్ కేసుగా చూడాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌పై స్పందించాలని కోరుతూ ఎల్‌కే అడ్వాణీ, ఉమా భారతి, మురళి మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్‌తో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నాయకులందరికీ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

2017లో సుప్రీం కోర్టు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఆరోపణలను పునరుద్ధరించింది. రెండు కేసుల విచారణలూ ఒకేసారి జరపాలంటూ తీర్పునిచ్చింది. ఈ గందరగోళానికి ముగింపు పలికేందుకు అడ్వాణీతో సహా 20 మంది నిందితులపై మళ్లీ క్రిమినల్ కేసు వేయమని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు ఆదేశాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది...రెండేళ్లలోపు బాబ్రీ మసీదు కేసులో విచారణ పూర్తి చేయాలని గడువు విధించడం.

గత ఏడాది ఏప్రిల్‌లో ఈ గడువు ముగిసింది. అయితే గడువును మరో 9 నెలలకు పొడిగించారు.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఈ గడువును మరింత పొడిగించారు. రోజూ విచారణ జరుపుతూ ఆగస్ట్ 31లోగా విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మళ్లీ మరో నెల రోజులు వ్యవధి ఇస్తూ సెప్టెంబర్ 30న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులపై తీర్పును వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తీర్పు రోజున నిందితులందరూ హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

28, సెప్టెంబర్ 2020, సోమవారం

రాహుల్ తివాతియా: అప్పటివరకు తిట్టిన నోళ్లే పొగిడాయి

Rahul Tewatia రాహుల్ తివాతియా


 అప్పటివరకు కామెంటరేటర్లు ఆ బ్యాట్స్‌మన్‌ను వెటకారమాడుతున్నారు. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సిన జట్టు మాంచి హిట్టర్లను కాదని ఆయన్ను పంపించి పెద్ద తప్పు చేసిందని ఓపెన్‌గానే విమర్శిస్తున్నారు. రిక్వైర్డ్ రన్‌రేట్ కొండలా పెరిగిపోతున్న సమయంలో తడబడుతూ ఒకటీ అరా పరుగులు తీస్తూ ఎక్కువ బంతులను వదిలేస్తున్న ఆయన్ను చూసి ఆ టీం అభిమానులూ తిడుతున్నారు.. అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ అప్పటికే దూకుడుగా ఆడుతున్నాడు.. షాట్లతో హోరెత్తిస్తున్నాడు. మరోవైపు ఈయన టిక్కుటిక్కుమని ఆడుతున్నాడు.. అందుకే అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ సింగిల్ తీసే అవకాశం వచ్చిన వెళ్లకుండా స్ట్రైక్ తన దగ్గర ఉంచుకుంటున్నాడు.. కానీ, అనుకోకుండా అవుటైపోయాడు. అంతవరకు కామెంటరేటర్లు కోరుకున్న హిట్టర్ క్రీజులో అడుగుపెట్టాడు.. ఒకట్రెండు షాట్లు కొట్టాడు.. ఇంతలో అంతవరకు జిడ్డులా ఆడిన బ్యాట్స్‌మన్ ఒక్కసారిగా గేరు మార్చాడు.. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఒకటా రెండా ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టేశాడు.. ఒకటైతే ఏకంగా స్టేడియం బయట రోడ్డు దాటి పడింది.. దాంతో అంతవరకు తిట్టిన కామెంటరేటర్లు ప్లేటు మార్చేశారు.. మరోవైపు 19 ఉన్న రిక్వైర్డ్ రన్ రేట్ ఒక్కసారి నార్మల్ రేంజ్‌కు పడిపోయింది. అంతలో హిట్టింగ్ చేస్తాడనుకున్న బ్యాట్స్‌మన్ అవుటయ్యాడు.. ఆయన స్థానంలో వచ్చిన మరో బ్యాట్స్‌మన్ కూడా రెండు సిక్సర్లు బాదాడు.. మళ్లీ మన జిడ్డు అనిపించుకున్న బ్యాట్స్‌మన్‌కు స్ట్రైక్ వచ్చింది.. మరో సిక్సర్ బాదాడు.. దాంతో అంతవరకు అసాధ్యమనుకున్న గెలుపు ఈజీ అయిపోయింది.. 6 బంతుల్లో 2 పరుగులు చేస్తే చాలనే స్టేజికి వచ్చేసింది.. మరో సిక్సర్‌కి ట్రై చేశాడు కానీ, అవుటైపోయాడు.. ఆ రెండు పరుగులు తరువాత వచ్చినవారు పూర్తి చేసి గెలిపించారు.

ఇదీ కింగ్స్ లెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్. ఇందులో చెప్పుకొన్న జిడ్డు బ్యాట్స్‌మన్ రాహుల్ తివాతియా... కామెంటరేటర్లు పరిహాసమాడిన ఆయనే మ్యాచ్‌ను మలుపు తిప్పి రాజస్థాన్ రాయల్స్‌ను గెలిపించాడు. వరుస సిక్సర్లతో వావ్ అనిపించాడు.

అప్పటివరకు వీడెప్పుడు అవుటవుతాడా అని రాజస్థాన్ రాయల్స్ అభిమానులే చూశారు.. కానీ, ఆ తరువాత కింగ్స్ లెవన్ ఆటగాళ్లు, అభిమానులు ఆయన అవుట్ కోసం ఎదురుచూశారు.

మొత్తానికి ఒక్కసారి మ్యాచ్ టర్న్ చేశావు తివాతియా..


24, సెప్టెంబర్ 2020, గురువారం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత విషమించింది


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం


 ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాగా క్షీణించిందని ఆయనకు చికిత్స చేస్తున్న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్యం గురించి విడుదల చేసిన బులెటిన్‌లో ఆయన ఆరోగ్యం గత 24 గంటల్లో మరింతగా క్షీణించిందని ఆసుపత్రి తెలిపింది.

కరోనా సోకడంతో బాలసుబ్రహ్మణ్యం ఆగస్ట్ 5న ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ సహా ఇతర పద్ధతుల్లో చికిత్స అందిస్తున్నారు. 

సుదీర్ఘ చికిత్స అనంతరం ఆయనకు కరోనా నెగటివ్ రావడంతో కుటుంబసభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.


ఆసుపత్రిలోనే ఆయన పెళ్లి రోజు జరుపుకొన్నారంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో రావడంతో ఆయన ఆరోగ్యం కుదుటపడిందని అంతా సంతోషించారు.

అయితే, ఇటీవల బాలు తనయుడు చరణ్ తన తండ్రికి ఇంకా ఎక్మో సాయంతో చికిత్స జరుగుతోందని చెప్పారు. ద్రవాహారం తీసుకుంటున్నారనీ చెప్పారు. ఇంతలోనే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించినట్లు ఆసుపత్రి వెల్లడించింది.


జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు

 

పవన్ కల్యాణ్ Pawan Kalyan

పార్టీలో నిబద్దతతో చురుకుగా పనిచేస్తున్న కార్యకర్తలను ప్రోత్సహించడానికి క్రియాశీలక సభ్యులను గుర్తించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని ఆదేశించారు. ఇందులో భాగంగా గురువారం నాడు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు టెలీకాన్ఫరెన్సులో పాల్గొన్నారు. క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి తమ అభిప్రాయాలు, సూచనలు అందచేశారు. 



సాధారణ సభ్యత్వం యధా విధిగా కొనసాగుతుంది. తొలుత పైలట్ ప్రాజెక్ట్ గా ఈ కార్యక్రమాన్ని అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలలో నిర్వహించి, అక్కడి అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని  కమిటీ చేసిన సూచనలను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదించారు. 

జనసేన టీ షర్ట్

పైలట్ ప్రాజెక్ట్ ను ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాలలో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26 న ప్రారంభించి పది రోజులలో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. క్రియాశీలక సభ్యులకు ఇన్సూరెన్సును కూడా  వర్తింప చేయాలని  శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరిపాలన విభాగాన్ని ఆదేశించారు.

జనసేన మాస్కులు

ఈ రోజు జరిగిన కాల్ కాన్ఫరెన్స్ కు పి.ఏ.సి.చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శులు శ్రీ తోట చంద్రశేఖర్ గారు, శ్రీ టి.శివశంకర్ గారు, శ్రీ బొలిశెట్టి సత్య గారు, పార్టీ ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షకులు శ్రీ రత్నం గారు ఇతర పి.ఏ.సి. సభ్యులు పాల్గొన్నారు.

జనసేన janasena a new way of politics


17, సెప్టెంబర్ 2020, గురువారం

అమిత్ షా నుంచి నితిన్ గడ్కరీ వరకు.. కోవిడ్ బారిన పడిన కేంద్ర మంత్రులు వీరే

amit shah అమిత్ షా


కరోనావైరస్ భారత్‌లో ఎవరినీ విడిచిపెట్టడం లేదు. సాధారణ ప్రజల నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. 

తాజాగా కేంద్ర సాంస్కృతిక, పర్యటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధరణైంది.

ఇందుకు ఒక రోజు ముందు బుధవారం(సెప్టెంబరు 16న) మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కరోనావైరస్ బారిన పడ్డారు.

మోదీ మంత్రివర్గంలో కోవిడ్ బారిన పడిన తొలి మంత్రి హోం మంత్రి అమిత్ షా. 55 ఏళ్ల అమిత్ షాకు ఆగస్టు 2న కరోనా పాజిటివ్ నిర్ధరణైంది. గుర్‌గావ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొంది రెండు వారాల తరువాత డిశ్చార్జయ్యారు.

అయితే, కొద్దిరోజలు తరువాత మళ్లీ అనారోగ్యంగా ఉండడంతో ఆగస్టు 18న దిల్లీ ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జయ్యారు.

అనంతరం కొద్దిరోజులకే అంటే సెప్టెంబరు 13న మళ్లీ ఆయన ఎయిమ్స్‌లో చేరారు. గురువారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు... సోమవారం నుంచి పార్లమెంటుకు హాజరవుతారని చెబుతున్నారు.

వీరే కాకుండా మరికొందరు కేంద్ర మంత్రులూ కోవిడ్ బారిన పడ్డారు.

కోవిడ్ బారిన పడిన కేంద్రమంత్రులు వీరే

1) ప్రహ్లాద్ పటేల్ - సాంస్కృతిక, పర్యటక మంత్రి

2) ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజవాయు మంత్రి. ఆగస్టు 4న ఈయనకు కోవిడ్ నిర్ధరణైంది. ధర్మేంద్ర ప్రధాన్ కూడా అమిత్ షా చికిత్స పొందిన మేదాంత ఆసుపత్రిలోనే చికిత్స పొందారు.

3) అర్జున్ రామ్ మేఘ్వాల్ - పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి. ఆగస్టు 9న ఈయనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.

జులైలో మేఘ్వాల్ ఒక రకం అప్పడాలు తింటే ఇమ్యూనిటీ పెరిగి కరోనా రాదని చెప్పిన కొద్దిరోజులకే దాని బారినపడ్డారు.

4) గజేంద్ర సింగ్ షెకావత్ - కేంద్ర జలవనరుల మంత్రి. ఆగస్టు 20న కరోనా బారినపడ్డారు.

5) శ్రీపాద యశోనాయక్ - ఆయుష్ శాఖ మంత్రి. ఆగస్ట్ 13న కరోనా బారినపడ్డారు.

6) కైలాశ్ చౌదరి- వ్యవసాయ శాఖ సహాయ మంత్రి.. ఆగస్టు 8న కరోనాబారినపడ్డారు.

7) అమిత్ షా - హోం మంత్రి

8) నితిన్ గడ్కరీ - ఉపరితల రవాణా మంత్రి

14, సెప్టెంబర్ 2020, సోమవారం

పార్లమెంటు సమావేశాలకు వచ్చిన 17 మంది ఎంపీలకు కరోనా.. వారిలో ఇద్దరు వైసీపీ ఎంపీలు కూడా ఉన్నారు

 

పార్లమెంటు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ప్రపంచం, దేశం కరోనాతో విలవిలలాడుతున్న వేళ పాలన ప్రక్రియలో భాగంగా కోవిడ్ ప్రోటోకాల్స్, జాగ్రత్తలు పాటిస్తూ పార్లమెంటు ఈ రోజు(14.09.2020) నుంచి సమావేశమతున్న సంగతి తెలిసిందే.

తొలి రోజైన ఈ రోజు సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఎంపీల్లో 17 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణైంది. 

కోవిడ్ జాగ్రత్తల్లో భాగంగా సమావేశాల ప్రారంభానికి ఒక రోజుముందే అంటే.. 13.09.2020న లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు కోవిడ్ టెస్టులు చేయించగా ఆ నివేదికల్లో 17 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది.

కరోనావైరస్ బారిన పడిన 17 మందిలో 12 మంది బీజేపీ సభ్యులు కాగా ఇద్దరు వైసీపీ సభ్యులు, శివసేన, డీఎంకే, ఆర్ఎల్‌పీలకు చెందిన ఒక్కొక్కరికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.

కరోనా సోకిన ఇద్దరు వైసీపీ ఎంపీల్లో ఒకరు అరకు సభ్యురాలు గొడ్డేటి మాధవి కాగా మరొకరు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. 

కరోనా సోకిన బీజేపీ ఎంపీల్లో అనంత్ కుమార్ హెగ్డే, మీనాక్షి లేఖీ ఉన్నారు. 

పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభ్యులంతా కోవిడ్ తనిఖీలు చేయించుకోవాలని తప్పనిసరి నిబంధన పెట్టారు.. పార్లమెంటు రిసెప్షన్ వద్ద కరోనా పరీక్షలు నిర్వహించగా 17 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు.

12, సెప్టెంబర్ 2020, శనివారం

రకుల్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ కేసులో బయటపెట్టిన రియా చక్రవర్తి? తెలుగు సినీ, రాజకీయ స్నేహితుల పేర్లూ బయటకొస్తాయా


రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet singh

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.. అందులో నెపోటిజం, మానవ సంబంధాలు, డ్రగ్స్, హవాలా వంటి ఎన్నో అంశాలు చర్చనీయమవుతున్నాయి. సెలబ్రిటీలు, మీడియా, సాధారణ ప్రజలు కూడా దీనిపై ప్రతి రోజూ మాట్లాడుకుంటున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కారణం ఆయన ప్రియురాలు రియా చక్రవర్తేనన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. దానిపై విచారణా జరుగుతోంది. సుశాంత్, రియాల కుటుంబాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

రియా, ఆమె సోదరుడిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ఇప్పటికే అరెస్ట్ చేసి విచారణ జరుపుతోంది. ఈ విచారణలో రియా తాను సుశాంత్‌కు మాదక ద్రవ్యాలు అందజేసినట్లు అంగీకరించింది.

అంతేకాదు.. సినీ రంగంలో ఈ డ్రగ్స్ వినియోగం, సరఫరాల్లో ఎవరెవరు ఉన్నారో వారి పేర్లు కూడా బయటపెట్టిందని తెలుస్తోంది.

అలా రియా బయటపెట్టిన పేర్లలో తెలుగు సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉందని చెబుతున్నారు.

రియా మొత్తం 25 మంది సెలబ్రిటీల పేర్లు చెప్పిందని.. అందులో రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు సారా అలీ ఖాన్, ప్రముఖ డిజైనర్ సిమోనీ ఖంబట్టా, నిర్మాత ముకేశ్ ఛాబ్రా, సుశాంత్ మాజీ మేనేజర్ రోహిణీ అయ్యర్ తదితరుల పేర్లు బయటపెట్టినట్లు తెలుస్తోంది.

దీంతో వారంతా ఇప్పుడు ఎన్‌సీబీ రాడార్‌లో ఉన్నారు.


టాలీవుడ్‌లో కలకలం

రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకొచ్చిందని తెలియడంతో టాలీవుడ్‌లో కలకలం మొదలైంది. ఇంతకుముందే టాలీవుడ్‌లో డ్రగ్స్ ఆరోపణలు ఉండడం.. చాలాకాలం విచారణలు సాగడం.. ఇప్పుడు కూడా కన్నడ సహా దక్షిణాది సినీ పరిశ్రమల్లో డ్రగ్స్ వివాదం నడుస్తుండడం, అరెస్టులు జరుగుతుండడంతో ఇది మరింత ముదురుతుందని భావిస్తున్నారు.

రకుల్‌తో స్నేహం ఉన్న సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకొస్తాయన్న ప్రచారం జరుగుతోంది.

Read Also:

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

అయినా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ?

Pregnancy


సుమారు 45 ఏళ్లుంటాయి ఆమెకు. బాగా సిగ్గు పడుతోంది.. అంతకుమించి భయపడుతోంది.

అన్ని రకాల కేసులు వస్తుంటాయి కాబట్టి డాక్టరుకు ఇలాంటివి కొత్తేమీ కావు. ఆమెలో కనిపిస్తున్న సిగ్గు, భయం రెండింటినీ చూసినప్పటికీ ఏమీ తెలియనట్లే పోయి బెడ్ మీద పడుకోమని చెప్పారు డాక్టర్.

తనిఖీ చేశాక.. గర్భం ఉందని చెప్పింది డాక్టర్.

అంతే.. అంతవరకు కనిపించిన భయం ఏకంగా ఏడుపుగా మారిపోయింది.. వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టిందామె.

మా ఆయనకు తెలిస్తే ఏమంటాడో ఏమో? అంటూ ఏడుస్తోంది.

అదేంటమ్మా.. అలా అంటావు.. గర్భం వద్దనుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలి కానీ, ఇంతవరకు వచ్చాక ఇప్పుడు ఏడిస్తే ఎలా? అన్నారు డాక్టర్.

ఎంతమంది పిల్లలు? అడిగారు డాక్టర్.

ఇద్దరండీ.. చెప్పిందామె.

ఎంత వయసు?

పెద్దోడు డిగ్రీ అయిపోయింది పాప ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చెప్పిందామె.

అంత పెద్ద పిల్లలున్న తరువాత ఇప్పుడు మళ్లీ కడుపంటే అందరూ ఏమనుకుంటారో ఏమో? పైగా మా ఆయన కూడా ఊరుకోడు అంటూ మళ్లీ ఏడుపు లంఖించుకుంది.

బయట ఒకరిద్దరు పేషెంట్లే ఉండడంతో కాస్త ఆమెకు కౌన్సెలింగ్ చేయాలని నిర్ణయించుకుంది డాక్టర్.

మరి గర్భం వద్దనుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలి కదమ్మా.. అంది డాక్టర్.

జాగ్రత్తలు తీసుకున్నామండీ.. అయినా ఎలా వచ్చిందో తెలీడం లేదు.. చెప్పిందామె.

బహుశా నిరోధ్ ఫెయిలై ఉంటుంది అంది డాక్టర్.

నిరోధ్ వాడలేదండీ.. మా ఆయనకు నచ్చదు.. చెప్పిందామె.

అయితే, మాత్రలు వాడారా? 

ఊహూ...

మరైతే ఇంకేంటి.. లూప్ కూడా లేదు కదా? డాక్టరు ఆమె వంక చూస్తూ అడిగింది.

ఆమె సమాధానం చెప్పలేదు.. సిగ్గుపడిపోతోంది.

ఇంకేం జాగ్రత్తలు తీసుకున్నారమ్మా.. ఇవేం కాకుండా.. డాక్టరు రెట్టించింది.

అదేనండీ.. ఆయన జాగ్రత్తపడతారు చెప్పిందామె.

ఆయన జాగ్రత్తపడడమంటే నిరోధ్ వాడడమే కదా.. మరి వాడలేదంటున్నారు కదా.. డాక్టరు అడిగింది.

నిరోధ్ వాడకపోయినా జాగ్రత్త తీసుకుంటారండీ..

అదెలా? డాక్టర్ అడిగింది.

ఆ టైంకి.. అని సిగ్గుపడిపోతుందామె.

ఓహో... ఆ టైంకి బయటకు తీసేస్తారా? 

అవునన్నట్లుగా తలూపిందామె.

దాన్ని జాగ్రత్త అనరమ్మా... అది అజాగ్రత్త. ఆ అజాగ్రత్త వల్లే నీకిప్పుడు కడుపొచ్చింది... చెప్పింది డాక్టర్.

అవునా అన్నట్లుగా ఆశ్చర్యంగా చూసిందామె..

డాక్టరుకు విషయం అర్థమైంది.. ఆమె ఒక్కరికే కౌన్సెలింగ్ చేస్తే చాలదని అర్థమై రిసెప్షన్లో కూర్చున్న ఆమె భర్తను కూడా పిలిచింది.

మీ ఆవిడకు ప్రెగ్నెన్సీ ఉందండీ.. చెప్పింది డాక్టర్.

భర్త ఏమీ మాట్లాడలేదు.. తన భార్యవైపు కొరకొరా చూస్తున్నాడు అక్కడే.

మీరలా చూడనవసరం లేదు.. జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వయసులోనైనా గర్భం వస్తుంది.. అన్నది డాక్టర్.

జాగ్రత్తలు తీసుకున్నామండీ ఎందుకు తీసుకోలేదు.. అచ్చం తన భార్య చెప్పినట్లే చెప్పాడాయనే.

మీరు తీసుకున్న జాగ్రత్తేమిటో ఆవిడ చెప్పారు.. దాన్ని జాగ్రత్త అనరు. అజాగ్రత్త అంటారు అంది డాక్టర్.

నిరోధ్, పిల్స్, కాపర్ టీ లాంటి సంతాన నిరోధక పద్ధతుల్లోనే ఫెయిల్యూర్లు ఉంటాయి.. అలాంటి మీరు పాటించే ఈ విధానంలో ఇంకా ఎక్కువ ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఉంటుంది.

గర్భ నిరోధక మాత్రలు వాడే వెయ్యి మందిలో ఒకరికి ఫెయిల్ అయితే, మీరు పాటించే ఈ విత్ డ్రా పద్ధతిలో 20 శాతం ఫెయిల్యూర్ ఉంటుంది.. డాక్టరు చెప్పింది.

వీర్యం బయటే ఉండిపోతే గర్భం ఎలా వస్తుంది.. అడిగాడాయన.

వీర్యం బయటే ఉండిపోతుందని మీరనుకుంటారు కానీ స్ఖలనానికి ముందు కొన్ని ద్రవాలు విడుదలవుతాయి.. అందులోనూ కొన్ని శుక్రకణాలుంటాయి.. అవి గర్భాశయంలోకి చేరితే గర్భం వస్తుంది. మీకు ఇలాగే జరిగింది.. డాక్టరు వివరించి చెప్పింది.

భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.

ముఖాలు చూసుకుని ఇప్పుడేం చేయలేరు.. ఆర్థికంగా స్థిరంగానే ఉన్నారు కదా.. ఏం ఫరవాలేదు.. మీ పిల్లలు పెద్దోళ్లయినా ఇప్పుడీ బేబీని కనండి అని చెప్పి పంపించింది డాక్టర్.

Read Also: