అధికారంలోకి వస్తే రైతు ప్రభుత్వాన్ని స్థాపించి, సంక్షేమ పాలనను అందిస్తామని పాదయాత్రలో వాగ్ధానం చేసిన ముఖ్యమంత్రి ఇవాళ హెలికాప్టర్ పర్యటనలకే పరిమితమవ్వడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రైతాంగం పడుతున్న బాధలు, వారి ఆవేదన తెలియాలంటే క్షేత్రస్థాయిలో పర్యటించాలని హితవు పలికారు. అన్నం పెడుతున్న అన్నదాతకు అండగా నిలబడాల్సిన ముఖ్యమంత్రి రైతు వ్యతిరేకిగా మారిపోయారన్నారు. ఆదివారం ఉదయం రాజమండ్రిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి అండగా నిలబడాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేదు. ఒకే ఏడాదిలో మూడు ప్రకృతి విపత్తులు సంభవించి రైతాంగం పూర్తిగా నష్టపోయింది. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రైతులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం గురించి చేసిన డిమాండ్ హేతుబద్ధమైనదే. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పలువురు పెద్దలు 2020 సంవత్సరాన్ని 1977లో వచ్చిన తుపానుతో పోల్చుతున్నారు. ఆ ఏడాది ఏ విధంగా అయితే రైతులు, చిరు వ్యాపారులు నష్టపోయారో... ఈ ఏడాది కూడా అలాగే జరిగిందని చెబుతున్నారు.
4 లక్షల ఎకరాలు నష్టం తగ్గించి చూపారు
నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనేక గ్రామాలను సందర్శించారు. వందలాది మంది రైతులను పరామర్శించారు. పర్యటనలో భాగంగా కలిసిన ప్రతి రైతు ఈ ఏడాది ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు నష్టపోయామని చెప్పారు. ప్రభుత్వం నుంచి కనీసం రూ. 30 వేలు నష్టపరిహారం అందకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొనే ఎకరాకు రూ. 35 వేల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. అందులో భాగంగా తక్షణ సాయంగా రూ. 10 వేలు ఇవ్వాలని కోరాం. 48 గంటలు గడువు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సరైన స్పందన రాలేదు. ఆ తరవాత రైతులు, కౌలు రైతుల కోసం ఒక రోజు నిరసన దీక్షను రాష్ట్రవ్యాప్తంగా జనసేన చేపట్టింది.
నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగంలో భరోసా నింపాలన్న ఆలోచనే ప్రభుత్వంలో లేదు. మంత్రులు కాకిలెక్కలు చెబుతూ ప్రజలు, రైతులను మభ్యపెడుతున్నారు. శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ నివర్ తుపాన్ వల్ల 17 లక్షల 32 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రకటించారు. వారం తిరగక ముందే నిన్న జరిగిన కేబినేట్ భేటీలో మంత్రులు లెక్కలను సవరించి ఆ నష్టాన్ని 13 లక్షలకు తగ్గించారు. దాదాపు 4 లక్షల ఎకరాలను నష్టపోయిన జాబితా నుంచి ప్రభుత్వం తప్పించి, వేలాదిమంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 29న మూడో విడత రైతు భరోసా కింద రెండు వేలు వేస్తున్నాం అని ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.13,500 లో కేంద్రం 6 వేలు ఇస్తుంది. అలాగే ఇన్ ఫుట్ సబ్సిడి కింద 40 శాతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. రైతాంగానికి మీరేదో చేసేసినట్లు ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు.
* మద్యంపై ఆదాయం ఒక్క ఏడాది వదులుకోలేరా?
ఖరీఫ్ పూర్తిగా నష్టపోయిన రైతాంగం రబీకి సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా వేశారు. అధికార యంత్రాంగం, వ్యవసాయ యంత్రాంగం మధ్య సమన్వయం లోపించి ముందుకెళ్తున్న విషయం చాలా మంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. గోదావరి జిల్లాలకు రబీ అవసరాలకు 90 టీఎంసీల నీటి అవసరం ఉందని అంచనాలు వేస్తే.. 70 టీఎంసీల కంటే ఎక్కువ ఇవ్వలేమని ఇరిగేషన్ శాఖ అధికారులు లెక్క చూపిస్తున్నారు. ఇలాగైతే 25 శాతం మంది రైతులకు నష్టం కలుగుతుంది. ఎన్నికల ముందు పాదయాత్రలో చేసిన వాగ్ధానం సంపూర్ణ మద్యపాన నిషేధం. ఇప్పుడు చూస్తే మద్యం అమ్మకాల ద్వారా ప్రతి ఏడాది రూ. 17వేల 500 కోట్లు ఆదాయం వస్తోంది. వద్దనుకున్న లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయాన్నే వదులుకొని పంట నష్టపోయిన రైతులకు తక్షణం రూ. 10 వేలు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేసింది. ఒక్క ఏడాది మద్యం సంపాదన వదులుకోని పాలకులు తమది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడం ఎందుకు? 151 మంది ఎమ్మెల్యే ఎందుకు?
అందుకే నివర్ తుపాన్, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 28న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తాం. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. రైతులు, రైతు సంఘాలు, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు.
* సొంత పార్టీ నాయకుల లబ్ధి కోసమే నవరత్నాలు
నవరత్నాలతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధి పొందే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెల్లూరు వంటి ప్రాంతాల్లో చెరువులను చూపించి ఇవే ఇళ్ల స్థలాలు అంటున్నారు. రాజమండ్రిలో రూ. 10 లక్షలు విలువ చేసే భూములను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసి సొంత పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చుతున్నారు. నిజమైన పేదవాళ్లకు గూడు కల్పించే అంశంపై ఏ రాజకీయ పార్టీ రాజకీయం చేయదు. కానీ ఇలాంటి అవినీతికి పాల్పడితే తప్పకుండా వ్యతిరేకిస్తాం. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. పార్టీ పరంగా అన్ని ప్రాంతాల నాయకులతో మాట్లాడి తీసుకున్న నిర్ణయం ఇది. దానికే జనసేన పార్టీ కట్టుబడి ఉంద"ని అన్నారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్, ముత్తా శశిధర్, పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, పార్టీ నాయకులు మేడా గురుదత్ ప్రసాద్, డి.ఎమ్.అర్.శేఖర్, అత్తి సత్యనారాయణ, మర్రెడ్డి శ్రీనివాస్, వై.శ్రీను చెరుకూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.