16, మే 2021, ఆదివారం

Tauktae: కేరళను వణికిస్తున్న తౌక్టే తుపానుకు Myanmar Gecko తొండలకు సంబంధం ఏమిటి.. ఆ పేరెవరు పెట్టారు

cyclone Tauktae

తౌక్టే.. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుపాను కేరళను కకావికలం చేస్తోంది. ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు.

మల్లాపురం, కోళీకోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్‌, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిసూర్, పాలక్కాడ్ జిల్లాల్లో తౌక్టే ప్రభావం తీవ్రంగా ఉంది.

దీని ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలలోనూ వర్షాలు కురుస్తున్నాయి. తౌక్టే తుపాను గుజరాత్‌లో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.

తౌక్టే అంటే అర్థమేమిటి.. ఈ పేరెవరు పెట్టారు

తౌక్టే అనే పేరు మయన్మార్ పెట్టింది. బర్మా భాషలో తౌక్టే అంటే ఒక రకమైన చిన్న తొండ (Gecko) . ఈ రకం తొండలు చూడ్డానికి బాగా చిన్నగా ఉంటాయి కానీ పెద్ద శబ్దం చేస్తాయి.

తౌక్టే మగ తొండలు జత కూడే కాలంలో పెద్ద శబ్దం చేస్తూ ఆడ తొండలను ఆకర్షిస్తాయి.

తుపాన్లకు పేర్లు ఎలా పెడతారు? ఎవరు నిర్ణయిస్తారు?

వరల్డ్ మెటిరియలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా పసిఫిక్... భారత్, బంగ్లాదేశ్, మియన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్‌లు సభ్య దేశాలుగా ఉన్న ఒక కూటమి కలిపి ఈ పేర్లను నిర్ణయిస్తాయి. 

కొన్ని పేర్లతో ఒక జాబితాను తయారుచేస్తాయి. 

2004లో ఇలా ఈ 8 దేశాలు ఒక్కో దేశం 8 చొప్పున పేర్లు నిర్ణయించి మొత్తం 64 పేర్లతో జాబితా రూపొందించాయి.

ఏటా వచ్చే తుపాన్లకు ఈ జాబితాలోని పేర్లను వరుసగా పెడుతుంటాయి.

2004లో రూపొందించిన జాబితాలోని 64 పేర్లలో చిట్టచివరి పేరు Amphan. 

అయితే, 2018లో వరల్డ్ మెటిరియలాజికల్ ఆర్గనైజేషన్ మొదట ఉన్న 8 దేశాలకు కూటమిలో మరో 5 దేశాలను చేర్చింది. అవి ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్.

వాటిని జోడించాక కూటమిలో మొత్తం 13 దేశలయ్యాయి.

దాంతో ప్రతి దేశం 13 చొప్పున 13 దేశాలు కలిపి 169 పేర్లతో కొత్త జాబితా రూపొందించారు.



తుపాన్లకు అసలు పేర్లెందుకు పెడతారు?

ఒక్కో సముద్రంలో జనించే తుపాన్ల విషయంలో కన్ఫ్యూజన్ తగ్గించడానికి ఇలా పేర్లు పెట్టడం ప్రారంభించారు. 

ప్రతి మహాసముద్ర పరిధిలో ఏర్పడే తుపాన్లకు అక్కడి ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు, ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్లు పేర్లు పెడుతుంటాయి.

తుఫాన్లకు పేర్లు పెట్టడానికి ఉన్న రూల్సేమిటి?

* తుపాన్లకు పెట్టే పేర్లకు రాజకీయాలతో సంబంధం ఉండకూదు.

* ఏ ఒక్క జెండర్‌నో , ఏ ఒక్క కల్చర్‌నో, ఏ ఒక్క మతాన్నో సూచించేలా ఉండకూడదు. వీటన్నిటికీ అతీతమైన పదం అయ్యుండాలి.

* ఎవరి సెంటిమెంట్లను బాధపెట్టేలా ఉండకూడదు.

* తీవ్రమైన, క్రూరమైన పదజాలం కాకూడదు.

* చిన్న పదాలు, సులభంగా పలికేవి అయ్యుండాలి.

* ఇంగ్లిష్‌లో 8 అక్షరాలు కంటే ఎక్కువ ఉండకూడదు.

ఇండియా పెట్టిన పేర్లేమిటి?

కొత్త జాబితాలో ఇండియా పెట్టిన పేర్లు కూడా 13 ఉన్నాయి.

Tej(తేజ్)

Murasu(మురసు)

Aag(ఆగ్)

Vyom(వ్యోమ్)

Jhar(ఝర్)

Probaho(ప్రొబాహో లేదా ప్రవాహ)

Neer(నీర్)

Prabhanjan(ప్రభంజన్)

Ghurni(ఘుర్ని)

Ambud(అంబుధ్)

Jaladhi(జలధి)

Vega(వేగ)



8, మే 2021, శనివారం

పవన్: కరోనా నుంచి కోలుకున్న ‘వకీల్ సాబ్’

 

పవన్

నసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడిన పవన్ కల్యాణ్‌కు వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలు నిర్వహించారు. 

ఆ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. కరోనా అనంతరం వచ్చే నిస్త్రాణం వంటివి మాత్రం ఉన్నాయని... ఆరోగ్యపరంగా పవన్ కల్యాణ్ గారికి ఇబ్బందులు లేవని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలియచేశారు. 

తన ఆరోగ్యక్షేమాల కోసం ఆకాంక్షించినవారికి, పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, నాయకులు, అభిమానులకు శ్రీ పవన్ కల్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియచేశారు. 

ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

Mother's Day: మదర్స్ డే మొదలుపెట్టిన మహిళే వద్దని కూడా ప్రచారం చేశారు.. ఎందుకో తెలుసా

Anna Jarvis  Mother's day


మదర్స్ డే Mother's day ప్రతి సంవత్సరం మే నెలలో రెండో ఆదివారం జరుపుకొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో మదర్స్ డే పాటిస్తారు.

సుమారు వందేళ్ల కిందట అమెరికాలో మొట్టమొదటిసారి ఈ మదర్స్ డే కాన్సెప్ట్‌ను మొదలుపెట్టిన మహిళ అన్నా జార్విస్. అయితే, ఇది క్రమేపీ ఆడంబరమైన కార్యక్రమంగా మారిపోవడంతో తరువాత కాలంలో ఆమె మదర్స్ డే వేడుకలు రద్దు చేయాలంటూ ఉద్యమం కూడా చేశారు.

ఎలా మొదలైంది..

అన్నా జార్విస్ తల్లిదండ్రులకు 13 మంది పిల్లలు. వారిలో 9 మంది చనిపోయారు. అప్పట్లో రకరకాల జబ్బుల కారణంగా పిల్లలు చనిపోతుండేవారు.

అమ్మ కోసం ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలన్న ఆలోచన అన్నా జార్విస్‌కు ఆమె తల్లి నుంచే వచ్చింది. 

జార్విస్ తల్లి తనలాంటి మిగతా అమ్మలను అనేక విషయాలపై చైతన్యం చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి ఆమె మిగతా తల్లులకూ నిత్యం జాగ్రత్తలు చెబుతుండేవారు. 

అంతేకాదు.. అమ్మలు చేసేపనికి గుర్తింపు ఉండాలని ఆమె భావించేవారు. 

1858లో ఆమె మదర్స్ డే వర్క్ క్లబ్ ప్రారంభించారు. ఈ మదర్స్ డే వర్క్ క్లబ్బులు శిశుమరణాల రేటు తగ్గించడం కోసం పనిచేసేవి.

అప్పటికి పశ్చిమ వర్జీనియాలోని గ్రాఫ్టన్ ప్రాంతంలో శిశుమరణాలు అధికంగా ఉండేవి. ప్లేగు, ఇతర అంటువ్యాధుల కారణంగా పిల్లలు చనిపోతుండేవారు. ఆమెకు కూడా 13 మంది సంతానమైనప్పటికీ అందులో 9 మంది శిశుప్రాయంలోనే చనిపోవడానికి కారణం ఇలాంటి వ్యాధులే.

1905లో అన్నా జార్విస్ తల్లి మరణించారు. అప్పుడు ఆమె చుట్టూ ఉన్న నలుగురు పిల్లల్లో అన్నా జార్విస్ తన తల్లికి ఒక మాటిచ్చారు.

అమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తానని ఆమె మాటిచ్చారు.

ఆ క్రమంలోనే ఆమె ప్రపంచంలోనే గొప్ప అమ్మ అంటే ఎవరు..? ఎవరి అమ్మ వారికి ప్రపంచంలోనే గొప్ప అమ్మ అనే కాన్సెప్ట్‌తో మదర్స్ డే జరపడం ప్రారంభించారు.

అందుకే ఇది Mothers Day అని బహువచనంతో కాకుండా Mother's Day అని ఏకవచనంలో ఉంటుంది.


మొట్టమొదటిసారి మదర్స్ డే ఎప్పుడు జరిపారంటే..

1905లో అన్నా జార్విస్ తల్లి మరణించిన తరువాత మూడేళ్లకు అంటే 1908లో తొలిసారి గ్రాఫ్టన్ మెథడిస్ట్ చర్చిలో మే రెండో ఆదివారాన మదర్స్ డే నిర్వహించారు.

అన్నా జార్విస్ రెండో ఆదివారాన్ని ఎంచుకోవడానికి కారణం ఆమె తల్లి మరణించిన మే 9వ తేదీకి రెండో ఆదివారం సమీపంలో ఉండడమే కారణం.

ఆ తరువాత మదర్స్ డే ప్రాచుర్యం విపరీతంగా పెరిగింది. 1910లో వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలో మదర్స్ డేకు సెలవు ఇచ్చారు.

1914కి వచ్చేసరికి ఏకంగా అమెరికా వ్యాప్తంగా ఆ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించారు అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్.

కానీ, అన్నా జార్విస్ కోరుకున్నది ఇది కాదు. వేడుకలు పూర్తిగా వాణిజ్య రూపంలోకి మారడంతో ఆమె ఆవేదన చెందారు. మదర్స్ డే వేడుకలను ఇలా మార్చేయొద్దంటూ ఆమె పత్రికా ప్రకటనలిచ్చారు.

కానీ, ఆమె గోడు ఎవరూ పట్టించుకోలేదు.

1920 నాటికి మదర్స్ డే రోజు పువ్వులు కొనడం, బొకేలు కొనడం మానుకోవాలంటూ ఆమె ప్రజలను కూడా అర్థించారు. తాను కోరుకున్న స్ఫూర్తిని మరచి వివిధ సంస్థలు కూడా దీన్ని పూర్తిగా మార్చేయడంపై ఆమె బాధపడేవారు. 

ఆమె ఇలా మదర్స్ డేకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించడంతో ఆమె చేస్తున్న ఆ వ్యతిరేక ప్రచారం ఎలాగైనా ఆపించాలని బొకేలు, గ్రీటింగ్ కార్డుల వ్యాపారులు ఆమెకు డబ్బు ఇవ్వజూపారు. కానీ ,ఆమె అందుకు లొంగలేదు. 

మదర్స్ డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించడానికి ముందు ఆమె ‘మే రెండో ఆదివారం, మదర్స్ డే’ అనేదానికి కాపీరైట్ తీసుకున్నారు. మదర్స్ డేను వాణిజ్యపరంగా నిర్వహించేవారిపై ఆమె కేసులు వేసేవారు.

దీంతో కొన్ని సంస్థలు ఈ వేడుకలను జరిపేటప్పుడు మదర్స్ డేను బహువచనం(Mothers Day)గా వాడుతూ కాపీరైట్ నుంచి తప్పించుకునేవారు.

80 ఏళ్ల వయసులో ఆమె ఫిలడెల్ఫియాలోని ఒక శానిటోరియంలో ఉండేవారు.. అప్పుడు కూడా ఆమె కళ్లు కనిపించకపోయినా ఇళ్లిళ్లూ తిరుగుతూ మదర్స్ డే వేడుకలు వద్దంటూ సంతకాలు సేకరించేవారు.

చివరికి అన్నా జార్విస్ 1948లో గుండెపోటుతో మరణించారు.

మా ఇతర కథనాలు:

19, ఏప్రిల్ 2021, సోమవారం

కేసీఆర్‌కు కరోనా

 


తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

ఆయన స్వల్ప లక్షణాలున్నాయని.. హోం ఐసోలేషన్‌లో ఉండమని వైద్యులు సూచించినట్లు ఆయన చెప్పారు.

ప్రస్తుతం కేసీఆర్ ఫాం హౌస్‌లో ఉన్నారని చెప్పారు.

16, ఏప్రిల్ 2021, శుక్రవారం

పవన్ కల్యాణ్‌కు కరోనా

 

పవన్

జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కల్యాణ్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది.

ప్రస్తుతం నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు చెప్పారు.

''ఈ నెల 3న తిరుపతిలో జరిగిన పాదయాత్ర,  బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న తరవాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి. అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయక్షేత్రంలోనే క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. 

ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్‌కు వచ్చి పవన్ కల్యాణ్‌కు చికిత్స ప్రారంభించారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు'' అని ఒక ప్రకటనలో వెల్లడించారు.

''అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి ఆయన్ను పరీక్షించింది. అపోలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డి పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. జ్వరం ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

11, ఏప్రిల్ 2021, ఆదివారం

క్వారంటీన్‌లో పవన్ కల్యాణ్



జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముందు జాగ్రత్త చర్యగా క్వారంటీన్‌లోకి వెళ్లారు.

ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ముఖ్యమైన కార్యనిర్వహకులలో కొందరు కరోనా బారిన పడడంతో ఆయన ముందు జాగ్రత్తగా క్వారంటీన్‌లోకి వెళ్లారు. 

గత వారం రోజులుగా ఆయన పరివారంలోని వారు ఒక్కరొక్కరుగా కరోనా బారిన పడుతుండడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఆయన ప్రశాంత వాతావరణంలో ఉంటూ రోజువారీ పనులు, పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు.

పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతున్నారు.

3, ఏప్రిల్ 2021, శనివారం

తిరుపతిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ, పాదయాత్రకు పోటెత్తిన జనం

 

తిరుపతిలో పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  తిరుపతిలోని ఎమ్మార్ పల్లి సర్కిల్ నుంచి పాదయాత్ర చేశారు. పవన్ కల్యాణ్ వెంట వేల సంఖ్యలో జనసేన, బిజెపి కార్యకర్తల నడిచారు. 

పవన్ బహిరంగ సభలో జనసేన నాయకులతో పాటు సునీల్ దేవధర్ తదితర బీజేపీ జాతీయ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

తిరుపతిలో పవన్ కళ్యాణ్ సభకు వచ్చిన భారీ జనసందోహం


పవన్ కళ్యాణ్
రత్నప్రభ, పవన్, సునీల్ దేవధర్


తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, పవన్ కళ్యాణ్, సునీల్ దేవధర్



30, మార్చి 2021, మంగళవారం

ఏప్రిల్ 3న తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

పవన్ కళ్యాణ్


ఎమ్.ఆర్.పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పాదయాత్ర

శంకరంబాడి సర్కిల్ లో భారీ బహిరంగ సభ

ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న జనసేన, బీజేపీ శ్రేణులు

వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడితే తిరగబడతాం

* బలిజ సామాజిక వర్గాన్ని బెదిరిస్తున్నారు

రేణిగుంట విమానాశ్రయం వద్ద మీడియా సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ

   ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏప్రిల్ 3న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి శ్రీమతి రత్నప్రభ గారికి మద్దతుగా తిరుపతి పట్టణంలోని ఎమ్.ఆర్.పల్లి సర్కిల్ నుంచి ఏఐఆర్ బైపాస్ మీదుగా శంకరంబాడి సర్కిల్ వరకు కవాతు చేస్తారని తెలిపారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ-జనసేన పొత్తు మంచి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కల్పించే విధంగా ఈ కవాతు ఉంటుందని చెప్పారు. సాయంత్రం మూడు గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుందని, పాదయాత్ర అనంతరం శంకరంబాడి సర్కిల్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్షుల వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో పాటు రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. అధ్యక్షుల వారితో కలిసి తామందరం కూడా పాదయాత్రలో పాల్గొని శ్రీమతి రత్నప్రభ గారిని గెలిపించమని ఓటర్లను అభ్యర్ధించనున్నట్లు పేర్కొన్నారు.  మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ... “శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ కూడా ఎదురు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి నేతృత్వంలో దీని కోసం ప్రత్యేకంగా కమిటీ కూడా వేశారు. అధ్యక్షులవారి పర్యటనను విజయవంతం చేయడానికి బీజేపీ కూడా శాయశక్తుల కృషి చేస్తోంది. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులను కూడా ఆహ్వానిస్తున్నాము.

బీజేపీ, జనసేన పొత్తుపై అనేక అనుమానాలు, అపోహలు, అసత్యాలు సృష్టించి ప్రత్యర్థులు దుష్ర్పచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే రెండు పార్టీల కలయిక జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడిగా ఎదగడమే కాకుండా, ప్రజల్లో విశ్వాసం నింపే విధంగా పనిచేస్తారు.

దౌర్జన్యాలు చేస్తే తిరగబడతాం

జనసేన పార్టీ సానుభూతిపరులను స్థానిక అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని తమ దృష్టికి వచ్చింది. ముఖ్యంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులను, వ్యాపారస్థులను పిలుపించుకొని బెదిరిస్తున్నారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబడితే తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యాపారాలు చేయనివ్వమని బెదిరింపులకు దిగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదు. ఎన్నికలు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి కానీ, ఇలా దౌర్జన్యాలకు పాల్పడితే మాత్రం తప్పకుండా తిరగబడతాం. ప్రజాప్రతినిధులు ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. ప్రజలను కులాలు, మతాలుగా విభజించి అధికార పార్టీ గెలవాలని చూస్తుంది. దానిని ఖండిస్తున్నాం. వైసీపీకి నిజంగా బలం ఉంటే నిజాయతీగా పోరాడాలి.  151 మంది ఉండి కూడా ధైర్యంగా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మండలానికో ఎమ్మెల్యే, నియోజకవర్గానికో మంత్రిని పర్యవేక్షకుడిగా నియమిస్తున్నారని” అన్నారు.

29, మార్చి 2021, సోమవారం

పవన్ కళ్యాణ్ 100 శాతం ముఖ్యమంత్రి అభ్యర్థి



అంకితభావంతో ప్రజల కోసం నిలిచే శ్రీ పవన్ కల్యాణ్ గారు రాష్ట్రానికి అవసరం

శ్రీ సోము వీర్రాజు గారు చెప్పిన మాటను అభినందిస్తూ స్వాగతిస్తున్నాం

పొత్తు ధర్మానికి కట్టుబడి బీజేపీ అభ్యర్ధి విజయానికి కృషి చేద్దాం

జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి రత్నప్రభ గారు విజయం కోసం సభ

వచ్చే వారం తిరుపతిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో

రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలకు ఎదుర్కొని ధైర్యంగా నిలిచేది  జనసైనికులే

కొత్త ఇసుక విధానంపై వైసీపీ ఎమ్మెల్యేలే తిరగబడతారు

ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలి

కరోనా లేదన్నారు.. ఎన్నికలు లేవు.. బడ్జెట్ సమావేశాలెందుకు నిర్వహించరు?

అప్పుల్లోనే ఈ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారు

సంక్షేమ పథకాల అమలు, నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

తిరుపతి క్రియాశీలక సభ్యుల సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి విజయం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చే వారం రోడ్ షో నిర్వహించేందుకు అంగీకరించినట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. రోడ్ షో తరవాత బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీ క్రియాశీలక సభ్యులంతా బాధ్యత తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి నియోజకవర్గ క్రియాశీలక సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. వారికి సభ్యత్వానికి సంబంధించి బీమా పత్రాలతో కూడిన కిట్లను అందచేశారు.

ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ప్రజాస్వామ్యంలో ఒక మార్పు కోసం.. ప్రజల కోసం ఈ ర్యాలీ చేస్తున్నాం. ఒక మంచి అభ్యర్ధిని ఎన్నుకోవాలని కోరుతూ ఈ ర్యాలీ చేస్తున్నాం. భవిష్యత్తులో జనసేన-బీజేపీ ఏ విధంగా కలసి పనిచేయబోతున్నాయో చెప్పేందుకు ర్యాలీ చేస్తున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒక కవాతు మాదిరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. తిరుపతి పట్టణంలోని జనసైనికులంతా సమష్టిగా పని చేయాలి.

 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులే ఆ మాట అన్నారు

శ్రీ పవన్ కళ్యాణ్ గారు 100 శాతం ముఖ్యమంత్రి అభ్యర్థి. జాతీయ పార్టీ బీజేపీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులే ఆ మాటన్నారు. శ్రీ సోము వీర్రాజు గారు మాటలను అభినందిస్తూ స్వాగతిస్తున్నాం. శ్రీ పవన్ కల్యాణ్ గారు నాయకత్వం రాష్ట్రానికి అవసరం. నిజాయతీగా ప్రజల కోసం ఒక అంకిత భావంతో పని చేసే అలాంటి వ్యక్తి అవసరం. ఒక ప్రణాళికతో మార్పు కోసం ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ దిశగా ప్రజల్లో మార్పు తీసుకువచ్చే విధంగా మీరంతా కష్టపడాలి. అందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటే సరిపోదు. మీరంతా బయటకు రావాలి. ప్రతి గడపా తొక్కాలి. ఇంటింటికీ వెళ్లి జనసేనకు ఎందుకు ఓటెయ్యాలో చెప్పాలి. ఈ సందర్భంగా బీజేపీతో ఎందుకు కలసి పని చేస్తున్నామన్న విషయాన్ని వివరించాలి.

పొత్తులో భాగంగా తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి అభ్యర్ధి శ్రీమతి రత్నప్రభ విజయం కోసం సహకరించాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు, సీటు కేటాయింపు వ్యవహారంలో మీరంతా ఇబ్బందిపడ్డారు. ఆవేదన వ్యక్తపరిచారు. అయితే ఈ నిర్ణయం వెనుక రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. రాజకీయ పార్టీగా ఇప్పుడిప్పుడే అడుగులు వేసుకుంటూ ఎదుగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రత్యేకంగా ఆలయాలు, గుడులపై చేస్తున్న దౌర్జన్యాల వ్యవహారాన్ని తిప్పికొట్టాలి. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నిక మనందరికీ ఒక పరీక్ష లాంటిది.

భారతీయ జనతా పార్టీతో మనకున్న పొత్తుని అంతా గౌరవించండి. రాష్ట్రంలో మార్పు రావాలి. ఆ మార్పు ఈ కలయిక ద్వారా వస్తుంది. మంచి అభ్యర్థిని ఎంపిక చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ అధిష్టానానికి పదేపదే చెబుతూ వచ్చారు. అందుకు వారు కొంత సమయం తీసుకున్నారు విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీమతి రత్నప్రభ గారిని ఎంపిక చేశారు. ఆవిడ ఉన్నతమైన చదువులు చదివారు. సమాజానికి ఎంతో సేవ చేశారు. శ్రీమతి రత్నప్రభ గారు గెలిస్తే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

ఇక్కడ ప్రస్తావనార్హమైన మరో అంశం- స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు ఎదురు నిలిచింది జనసేన పార్టీయే. ముఖ్యమంత్రి గారు ప్రకటించుకున్నట్టు 96 శాతం ప్రజలు వైసీపీకి మద్దతు పలుకుతున్నది వాస్తవం అయితే, ఆ నమ్మకం, దమ్ము వారిలో ఉంటే రీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎంత మంది జనసేన నాయకులు గెలుస్తారో నిరూపిస్తాం. ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో జనసేన పార్టీ నాయకులు కనిపించేలాగా చేస్తాం. ఎప్పుడో 14 నెలల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ చూపి ఎన్నికలు జరపకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్థితులను

 

 మీరంతా ఖండించాలి. అందుకే జనసేన పార్టీ తరఫున కోర్టుకు వెళ్లాం. జగన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ది ఉంటే రీ నోటిఫికేషన్ ఇవ్వండి. ప్రజల్లో ధైర్యాన్ని నిలబెట్టే విధంగా, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా, స్వేచ్ఛగా పోలీసు యంత్రాంగాన్ని, వాలంటీర్ల ఉపయోగించుకుండా ఎన్నికలు నిర్వహిస్తే జనసేన బలం ఏంటో చూపగలుగుతాం.

పదిమంది జనసైనికులు వెయ్యిమందితో సమానం

మనమంతా నిజాయితీగా నిలబడిన వ్యక్తులం. మనం స్వార్థం కోసం రాజకీయాలు చేయడం లేదు. కానీ మనకు పదవి అవసరం. మనకి ఒక వ్యూహం ఉండాలి. పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులు ఎంతో కష్టపడ్డారు. అన్ని సామాజిక వర్గాల నుంచి మహిళలను తీసుకువచ్చి, వారిని ప్రోత్సహించి పోటీ చేయించారు. వారి కోసం దెబ్బలు తిన్నారు. చివరికి విజయోత్సవ ర్యాలీల్లో కూడా దెబ్బలు తిన్న వ్యక్తులు మన జనసైనికులు. పది మంది జనసైనికులు వెయ్యి మందితో సమానం. రాష్ట్రంలో మొన్న పంచాయితీ ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలు, రేషన్ కార్డులు తీసేస్తాం, ఇళ్ల పట్టాలు తీసేస్తాం, ఫించన్లు తీసేస్తాం అంటూ బెదిరించారు. వాలంటీర్లు ఇళ్లకు వచ్చి ఓట్లు లెక్కపెడతాం అని బెదిరించిన సందర్భాల్లోనూ పార్టీకి  ధైర్యంగా అండగా నిలబడింది వీర మహిళలే.

అప్పుల్లో ఉన్న వృద్ధి సంక్షేమంలో లేదు

ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఇప్పుడు దేశంలోనే ఉన్నత స్థాయికి చేరింది. రోజుకీ రూ.500 కోట్ల అప్పు చేస్తున్నారు. మరి సంక్షేమం ఎంత మందికి చేరింది? మీరు చేస్తున్న అప్పులకు నూటికి నూరు శాతం సంక్షేమం  కోసం, ప్రజల కోసం అందిస్తున్నారా? గత ఏడాదితో పోలిస్తే అప్పులు 54 శాతం పెంచారు. మరి గత ఏడాదితో పోలిస్తే  సంక్షేమం ఎంత పెంచారు? ఇసుకలో సంపాదించే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? మద్యంలో సంపాదించిన డబ్బు, సిమెంట్ ఫ్యాక్టరీలలో సంపాదించిన డబ్బు ఎక్కడికి పోతోంది? ఒక్కో ఎమ్మెల్యే భూముల్లో స్కాములు చేసి ఎంత సంపాదించాడో  అందరికీ తెలుసు.

ఇసుక అక్రమ సంపద సింగిల్ విండోలో ఒక చోటికే చేరుతుంది

ప్రస్తుత పాలకులు ప్రభుత్వంలో ఉండి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సినవి కూడా ఉండడం లేదు. గతంలో వెయ్యి రూపాయలకు ట్రాక్టర్ ఇసుక దొరికేది. ఈ రోజు ఏమైపోయింది. ఇసుక సమృద్ధిగా దొరికే చిత్తూరు లాంటి జిల్లాలో సైతం ట్రాక్టర్ ఆరు వేల రూపాయలు చేశారు. ఆ డబ్బంతా ఎక్కడికి పోతుంది. మాట్లాడితే అనుభవం అంటారు. ప్రజాజీవితానికే అంకితమయ్యాం అంటారు. నిజాయితీ అంటారు. మరి ఇప్పుడు ఇసుక తవ్వుకునేందుకు వచ్చిన ఈ సంస్థ ఎవరిది? 151 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి,  రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, పోలీస్ శాఖ కలసి చేయలేకపోయారు. మూడు సంవత్సరాల్లో  మూడు విధానాలు తెచ్చారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఒక ప్రయివేటు కంపెనీకి ఇచ్చేస్తున్నారు. వారు చేయగలరా? ప్రతి రీచ్ ఒక ఎమ్మెల్యే వారి పేరు మీద రాసేసుకున్నారు. కొత్త ఇసుక విధానం వల్ల ముందుగా తిరగబడేది ఆ వైసీపీ ఎమ్మెల్యేలే. కొత్త విధానంతో మొత్తం సింగిల్ మ్యాన్ షో అయిపోతోంది. సింగిల్ విండో స్కీమ్ లో ముఖ్యమంత్రి, వారి అనుచరులకు వెళ్తుంది. సామాన్యుడికి ఇల్లు కట్టుకునే కలను ఈ ప్రభుత్వం  నాశనం చేసింది.

 

అసెంబ్లీ నిర్వహించకపోవడానికి కారణం తెలుసుకోవాలి

సాధారణంగా మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు జరగాలి. మనం జనవరిలో ఛలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చాం. మరి సమావేశాలు నిర్వహించకపోవడానికి కారణం ఏంటో అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఎన్నికలు లేవు. కరోనా లేదని మీరే చెబుతున్నారు. అయినా బడ్జెట్ లేదు. లెక్కలు చూపలేరు. వాస్తవాలు ప్రజలకు చూపలేరు. బడ్జెట్ సమావేశాలకే ప్రభుత్వం దూరమయ్యే పరిస్థితి. దీన్ని ప్రశ్నించాలి. అత్యవసర సమయాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావచ్చు, ఆర్డినెన్స్ ద్వారా కావచ్చు గవర్నర్ గారి ఆమోదంతో పెట్టుకోవచ్చు. ఆ క్లాజుని ఉపయోగించుకుని బడ్జెట్ సమావేశాలు నిర్వహించకుండా ప్రభుత్వం తప్పుకుంటోంది. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ది ఉంటే అవసరాలు, ఆర్థిక పరిస్థితిని  దృష్టిలో ఉంచుని సంక్షేమం కోసం ఖర్చు చేసిన నిధుల లెక్కలు, అమలుయాపి శ్వేతపత్రం విడుదల చేయాలి.

బలిజ సోదరులు అధైర్యపడవద్దు

శ్రీ  జగన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసి జనం విసుగెత్తిపోతున్నారు. ఎక్కడా అధైర్యపడకండి. బలిజ సోదరులందరికీ చెప్పండి. వారికి ధైర్యం నింపుదాం. వ్యాపారాలు, షాపుల్ని చూపి ప్రజాప్రతినిధులే స్వయంగా రంగంలోకి దిగి బెదిరిస్తున్నారు. మీరు భయపడవద్దు, మీకు ధైర్యం నింపే నాయకుడు  శ్రీ పవన్ కళ్యాణ్ గారు. స్థానికంగా ఏ సమస్య వచ్చినా స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరం అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి మీకు అండగా నిలుస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల యువత నష్టపోతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. .

తిరుపతిలో క్రియాశీలక సభ్యత్వ ప్రక్రియను చక్కగా ముందుకు తీసుకువెళ్లారు. సంఖ్య గురించి ఆలోచించడం లేదు. మొదటి విడతలో కరోనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇక్కడ నమోదు జరిగింది. సభ్యత్వం ద్వారా రూ. 5 లక్షల ప్రమాద బీమా, ర్యాలీల్లో చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఉపయోగపడే విధంగా రూ. 50 వేల మెడికల్ పాలసీలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీమా కంపెనీలతో మాట్లాడి మరీ తీసుకువచ్చారు. దీన్ని మీరంతా ఉపయోగించుకోండి. దీని ద్వారా కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది” అన్నారు. ఈ కార్యక్రమంలో పి.ఎ.సి. సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంఛార్జ్ శ్రీ కిరణ్ రాయల్, పార్టీ నాయకులు శ్రీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


26, మార్చి 2021, శుక్రవారం

పవన్ కళ్యాణ్: నవతరానికి యుద్ధ కళలు... సాహస క్రీడల్లో నైపుణ్యాలు అవసరం


నెల్లూరుకు చెందిన మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు... గిన్నిస్ బుక్ రికార్డ్ గ్రహీత శ్రీ ప్రభాకర్ రెడ్డికి సత్కారం,

    ఆర్థిక సాయం

యువతకు దేహ దారుఢ్యంతోపాటు మానసిక బలం చేకూరేందుకు యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు దోహదం చేస్తాయి... వీటిని నేర్చుకోవడం ఎంతైనా అవసరమని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. మన దేశంలోనూ పలు సంప్రదాయ యుద్ధ కళలు ఉన్నాయి... వాటితోపాటు పలు ఆసియా దేశాల మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయన్నారు. చిన్నప్పటి నుంచీ బాలబాలికలకు నేర్పిస్తే ఆత్మ రక్షణ విద్యగాను, మనోస్థైర్యం ఇచ్చే మార్గంగాను ఇవి ఉపయోగపడతాయి అన్నారు. నెల్లూరుకు చెందిన మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు, పలు గిన్నిస్ బుక్ రికార్డులు పొందిన శ్రీ ప్రభాకర్ రెడ్డి గారిని శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు సత్కరించారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు నెలకొల్పిన ట్రస్ట్  ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ ద్వారా రూ.లక్ష చెక్ అందచేశారు.

 ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “వింగ్ చున్ అనే మార్షల్ ఆర్ట్.. మన దేశంలో ఉన్న శిక్షకుల  గురించి బ్రౌజ్ చేస్తుంటే శ్రీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి తెలిసింది. మార్షల్ ఆర్ట్స్ లో వివిధ దేశాల్లో శిక్షణ పొంది, రికార్డులు సాధించిన ఆయన పెద్ద పెద్ద నగరాలకు వెళ్లిపోకుండా తన ఊళ్ళో ఉంటూ యువతకు శిక్షణ ఇవ్వడం సంతోషం. ఇలాంటివారిని ప్రోత్సహించాలి. ఈ క్రమంలోనే మా ట్రస్ట్ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించాను” అన్నారు.

శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ “మార్షల్ ఆర్ట్స్ లో 29 ప్రపంచ రికార్డులు సాధించాను. చైనా, థాయిలాండ్, మలేసియా, శ్రీలంకల్లో పలు యుద్ధ కళలు నేర్చుకున్నాను. చైనాలోని షావోలిన్ టెంపుల్ లో శిక్షణ పొందాను. యువతకు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉండటం ఎంతో ఉపయోగపడుతుంది. మన దేశంలో వీటిని నేర్చుకొంటున్నవారు తక్కువగానే ఉన్నారు. శ్రీ పవన్ కల్యాణ్ గారికి పలు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది. వీటిపై ఆసక్తి కూడా చాలా ఎక్కువ. వారు నన్ను పిలిచి సత్కరించి, ఆర్థిక సహాయం ఇవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది. శ్రీ పవన్ కల్యాణ్ గారికి నా కృతజ్ఞతలు” అన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు ‘వింగ్ చున్’ గురించి తెలుసుకున్నారు. వింగ్ చున్ వుడెన్ డమ్మీపై కొన్ని మెళకువలు తెలుసుకున్నారు.


మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న పవన్ కల్యాణ్






14, మార్చి 2021, ఆదివారం

కడుపు మీద కొడతామని బెదిరించి వైసీపీ మున్సిపాల్టీల్లో గెలిచింది: పవన్ కల్యాణ్

 


కులాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన పాలకులు తమ కులానికే నష్టం చేస్తున్నారు

గుణం... సామర్థ్యం లేనివాణ్ని మన కులంవాడని వెనకేసుకొస్తే సమాజానికి అన్యాయం చేసినవాళ్లం అవుతాం

బహుజన విధానం.... సర్వ జనుల అభ్యున్నతే లక్ష్యం

జనసైనికులకు తెలంగాణ బీజేపీ గౌరవం ఇవ్వలేదు... వారి బాధను అర్థం చేసుకున్నాను

జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు

బహుజన విధానంతో ముందుకెళ్తూ... సర్వజనుల అభ్యున్నతిని కాంక్షిస్తూ జనసేన ప్రస్థానం ముందుకు సాగుతుందని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అగ్రవర్ణ పేదలకు అండగా ఉంటూనే... బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం జనసేన పాటుపడుతుందన్నారు. సమాజంలో మార్పు రావాలి, సమతుల్యతతో కూడిన సర్వేజనా సుఖినోభవంతు విధానం రావాలని ఆకాంక్షించారు.  జనసేన పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవాలు  హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్,  భగత్ సింగ్, నారాయణ గురు, ఝాన్సీ లక్ష్మీ భాయ్, పూలే, బూర్గుల రామకృష్ణారావు చిత్ర పటాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుష్పాంజలి ఘటించారు. అనంతరం జనసేన జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తెలంగాణ చాలా చైతన్యవంతమైన నేల. అన్యాయం జరిగితే నాటక, పద్య, కళ, గేయ రూపంలో ప్రజలు అన్ని చోట్ల గళమెత్తుతారు. అలాంటి గడ్డపై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా సందర్భాలలో చెప్పాను... ఆంధ్రా నాకు జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మ ఇచ్చింది. అలాంటి నేలకు నేను చాలా రుణపడి ఉన్నాను. 2014లో పార్టీ ప్రారంభించాను. ఇప్పటికి 7 ఏళ్లు పూర్తయ్యింది. పార్టీ ముఖ్య ఉద్దేశాలు, జనసేన ప్రస్థానం, బీజేపీతో పొత్తు, ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అండగా నిలబడిన విధానాలపై పెద్ద సభ పెట్టి మాట్లాడాలి అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. సామాజిక స్పృహ, దేశభక్తి జనసేన పార్టీని స్థాపించేలా చేశాయి.

2008లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు బడుగు, బలహీన వర్గాల కష్టాలను చూశాను. అగ్రవర్ణాల్లో పేదల కష్టాలను అర్థం చేసుకున్నాను. కులాలను వాడుకొని అధిపత్యం చెలాయించే కుటుంబాలు, వారి దగ్గర నలిగిపోయే ప్రజల బాధలు మనస్తాపం కలిగించాయి. బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పరితపించే నాయకులు, ప్రజా సంఘాలు, దళిత, బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, అగ్రవర్ణాల్లో పేదల అభ్యున్నతిని ఆకాంక్షించే మిగతా వర్ణాల నాయకులు వీళ్లందరిని కలిపే సమగ్ర ఆలోచన విధానం లేకుండాపోవడం గమనించాను. కొన్ని సమూహాలే రాజ్యాధికారానికి దగ్గరై మిగతా వారందరిని యాచించే స్థాయిలో పెట్టడం లాంటివి చాలా బాధ కలిగించాయి.  వీటిపై మాట్లాడి వదిలేయకుండా నా వంతు బాధ్యతగా ఏదైనా చేయాలని… దెబ్బ తిని... ఓటములు, వంచనలు, వెన్నుపోట్లు ఉంటాయని తెలిసి కూడా జనసేన పార్టీ పెట్టాను. 

 దేశ సమగ్రత... సామాజిక సమతుల్యత...

తెలంగాణ రాష్ట్రంలో తిరిగాను. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని కోరుకునేవాడిని. శ్రీ కాన్షీరామ్ గారిని అమితంగా గౌరవించే వ్యక్తిని. బహుజన సిద్దాంతాలను సంపూర్ణంగా తెలుసుకున్నవాడిని. కాలానికి అనుగుణంగా ఉండాలి. సర్వేజన సుఖినోభవంతు అని ముందుకు వెళ్లకపోతే తప్పు చేసిన వాళ్లం అవుతాం. కాన్షీరాం గారు ప్రారంభించిన దళిత ఉద్యమం బహుజన ఉద్యమంగా మారి అటు పిమ్మట సర్వజన విధానంగా రూపుదిద్దుకుంది. కొద్ది మందికే నిలబడతాం అని కాకుండా అణగారిన వర్గాలకు నిలబడతాం, అందరికి న్యాయం చేస్తామనే ఆలోచనతో ముందుకు వెళ్లాలి. ఆ ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చాను. బహుజన సిద్ధాంతం అని ఎందుకు చెబుతున్నాను అంటే – అణగారిన వర్గాలు సాధికారత సాధించాలి. సంఖ్యాబలం ఉండీ రాజ్యాధికారాన్ని సాధించని కులాలు కూడా  ఉన్నాయి. రాజ్యాధికారం కొన్ని ఆధిపత్య కుటుంబాలకే పరిమితమైంది. పాలక వర్గంలో ఉన్నవారు కులాన్ని ఆధారంగా చేసుకొని వచ్చి.. ఆ తరవాత తమ కులానికే నష్టం కలిగిస్తున్నారు.  సంఖ్యా బలం ఉండీ అధికారం లేని వాళ్లు, అసలు సంఖ్యా బలమే లేని రజక, నాయిబ్రాహ్మణ, వెనుకబడిన సంచార జాతులు, మాదిగ సమాజం, మిగతా దళిత సమూహాలకు అండగా నిలబడతాం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కుల వ్యవస్థ చాలా బలీయమైనది. దానిని వాడుకొని కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడుతున్నాయి. జగన్ రెడ్డి గారు తప్పు చేస్తే రెడ్డి సామాజిక వర్గం ఎందుకు సఫర్ అవ్వాలి. ఆ సామాజిక వర్గంలో ఎంతమంది కూలీ పనులుకు వెళ్తారో నాకు తెలుసు. పేరుకే అగ్ర వర్ణం  బ్రాహ్మణ సమాజం. వారు జీవనానికి ఎన్నో ఇబ్బందులకు లోనవుతుంటారు. కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చిన పాలకులు తప్పులు చేస్తే కమ్మవారు బలైపోయారు. పాలకులుగా కులాన్ని వాడుకొని వచ్చినవాళ్లు తమ కుటుంబం కోసం, తమ వ్యక్తిగత వర్గం కోసం చూసుకుంటారు. కులానికి నష్టం చేశారు.

అల్పోత్సాహం కాదు... దీర్ఘకాలిక ఆలోచన కావాలి

వేల కోట్లు ఉంటే తప్ప రాజకీయం చేయలేని పరిస్థితుల్లో  పార్టీ పెట్టడం అనేది సాహసోపేతమైనది. చాలా ఒత్తిడి ఉంటుంది. ఒక మాట ఎక్కువ మాట్లాడినా, ఒక మాట తక్కువ మాట్లాడినా ఇబ్బంది అయిపోయిన పరిస్థితుల్లో చాలా ఆలోచించి ఒత్తిడి తీసుకొని పార్టీ పెట్టాను. 2006లోనే ఒక ఐపీఎస్ అధికారి నా దగ్గరకు వచ్చి ... మీ కుటుంబం రాజకీయాల్లోకి వస్తే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ మీద, మీ కుటుంబం మీద దాడి చేస్తారని చెప్పారు. అప్పటికి ఇంకా మా కుటుంబం రాజకీయాల్లోకి వస్తుందని చెప్పలేదు. ‘మీ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ప్రజలు చైతన్యవంతులవుతారు... సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. అందుకే మీపై దాడి జరిగే అవకాశం ఉంది. మీ మేలు కోరే చెబుతున్నాను’ అన్నారు. దాడి జరుగుతుంది అని తెలిసి కూడా ఇటు వైపు వచ్చాం. రాజకీయ పార్టీ పెట్టాలంటే అల్పోత్సాహం కాదు దీర్ఘకాలిక ఆలోచన కావాలి. అందుకే 25 ఏళ్ల ప్రస్థానం అన్నాను. ఆ దిశగా జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పాను. దానికి నిలబడే ఉన్నాను.

ముప్పావలా కోడికి మూడు రూపాయల దిష్టి

151 మంది ఎమ్మెల్యేలు, 22 ఎంపీలను ప్రజలు గెలిపిస్తే ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉందో మనందరికీ తెలుసు. విభజన తరవాత  రాజధానే లేని రాష్ట్రానికి మూడు రాజధానులు అంటున్నారు. 13 జిల్లాలకే దిక్కు లేదు అంటే 36 జిల్లాలు చేస్తామంటున్నారు. అభివృద్ది కనిపించని చోట నాలుగు అభివృద్ధి మండళ్లు.. ఇవన్నీ చూస్తుంటే ముప్పావలా కోడికి మూడు రూపాయలతో దిష్టి తీసిన చందంగా ఉంది.

 

బెదిరింపుల్లోకెల్లా బెస్ట్ బెదిరింపు

స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపులకు దిగారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన దళిత మహిళా సర్పంచుపై దాడికి దిగారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలవచ్చు కానీ... ఆ గెలుపు భయపెట్టి తెచ్చుకున్నది. రావి శాస్త్రి గారు ఓ రచనలో చెప్పారు.. ‘బెదిరింపుల్లో బెస్టు బెదిరింపు కడుపు కొడతానని బెదిరించడం’ అని. వైసీపీ కూడా అదే చేసింది. మా పార్టీకి ఓటు వేయకపోతే రేషన్ తీసేస్తాం... మీ తల్లిదండ్రులకు పెన్షన్లు కట్ చేస్తాం... మీ పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అమ్మ ఒడి డబ్బులు ఇవ్వం.. సంక్షేమ పథకాలు నిలిపి వేస్తామని భయపెట్టి గెలిచారు తప్ప గుండెల్లో భరోసా నింపి కాదు.

మార్పునకు బలమైన సంకేతం

వేల కోట్లు, కుల బలంతో ముడిపడిన రాజకీయాల్లో దళిత మహిళలు సర్పంచులుగా గెలవడం, పూరింటి నుంచి వచ్చిన వ్యక్తులు గెలవడం,  ఎక్కడో మారుమూల ప్రాంతంలో నివసించే మత్స్యకార కుటుంబంలో వ్యక్తులు విజయం సాధించడం జనసేన పార్టీ లేకపోతే సాధ్యపడేదికాదు. శ్రీకాకుళం జిల్లాలో ఓ మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడు బి.టెక్. చదువుకొని జీవనం కోసం చేపలు అమ్ముతున్నారు. ఆ యువకుడు పార్టీ మద్దతుతో సర్పంచ్ అయ్యాడు. స్థానిక ఎన్నికల్లో తమ వారు తప్ప మిగతా వారిని రాకుండా అధికార పార్టీ కట్టుదిట్టం చేసింది. నేను ఒకటే చెప్పాను.. ముందు పోరాటం చేయండి, అనుభవం వస్తుంది అని చెప్పాను. నా మాటలతో 6 శాతం ఉన్న జనసేన ఓటు బ్యాంకు 27 శాతానికి పెరిగింది. ఇదే మార్పునకు బలమైన సంకేతం. వేల కోట్లు ఉన్న రాజకీయ పార్టీకి ఎదురొడ్డి నిలబడ్డారు అంటే దానికి ఆడపడుచులు, నిస్వార్థంగా పని చేసిన జనసైనికులే కారణం.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనకు బలం ఉంది

ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి గారు మాట్లాడిన కొన్ని మాటలు నా దృష్టికి వచ్చాయి.  స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ అంశంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటానికి... పవన్ కల్యాణ్ ను అపాయింట్మెంట్ ఇప్పించమనండి అని అన్నారు. నాకు ఒకటే అనిపించింది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మీకు అపాయింట్మెంట్ ఇప్పించాలా? ఓడిపోయిన వాడిని వదిలేయ వచ్చు కదా... అయినా వదలరు. ఎందుకంటే మార్పు తీసుకొచ్చే బలం మనకు ఉంది అని వారికీ తెలుసు. అయితే- ‘ఏమీ లేదు... ఏమీ లేదు’ అని చెప్పి మన బలం మనకు తెలియనీయకుండా చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో  జనసేనకు చాలా బలం ఉంది. ఆ బలం బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడుతుంది.

అగ్ర శూద్ర కులాల్లోని పెద్దలు ఆలోచించాలి

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విధానపరమైన విభేదాలే ఉంటాయి. చాలా మంది నాకు తెలిసిన, సమాజంలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు కొంతమంది నా దగ్గరకు వచ్చి పోయినసారి తెలుగుదేశంకు సపోర్టు చేశావు కదా... ఈసారి మా వాడికి చేయవచ్చు కదా అని అడిగారు. అప్పుడు నాకు అనిపించింది. ఈ స్థాయి వ్యక్తులు తమ వాడు పైకి రావాలి అనుకున్నారే తప్ప బడుగు, బలహీన వర్గాలు బయటకు రావాలని ఆశించలేదు అని. నేను ఎందుకు సార్ అలా మాట్లాడారు అని వాళ్లను అడిగితే...  రాజ్యాధికారం మిగతా కులాలు చేయలేవని చెప్పారు.

 

వారికీ, అందరికీ  ఈ సందర్భంగా రాష్ట్రకవి రాంధారి సింగ్ దినకర్ గారు చెప్పిన ఓ హిందీ కవితను గుర్తు చేయాలి. గుణం లేనివాడిని, సామర్థ్యం లేని వాడిని మన కులంలో ఉన్నాడని వెనకేసుకొస్తే దేశానికి, సమాజానికి ద్రోహం చేసినవాళ్లం అవుతాం. అగ్రశూద్రకులాల్లో పెద్దలు దీనిపై ఆలోచించాలి. ఈ విషయంపై  రామ్ ధారిసింగ్ దినకర్ గారు పరుశురామ్ కి ప్రతిక్ష అని ఒక కవిత సంకలనం రాశారు. ఆయన మూడు నాలుగుసార్లు రాజ్యసభ సభ్యులు. చైనా యుద్ధంలో సైనికులు చనిపోయి.. మన భూభాగాన్ని దురాక్రమణ చేసినప్పుడు విగత జీవులైన సైనికులు ఎందుకు చనిపోయారని ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది అనేది అర్ధం చేసుకొని ... యుద్ధం జరిగే ముందు ఏ పరిస్థితులు వచ్చాయి.. ఎలా నివారించి ఉండాల్సింది అనే అంశాలపై చనిపోయిన సైనికులను అడుగుతూ ఒక కవిత రాశారు.  హే వీర్ బాధు దాయి... అని సాగే ఈ కవిత అర్థం ఏమిటంటే ‘వీర బాంధువుడా నీ చావుకి కారకులెవ్వరు?’ అని కవి ప్రశ్నిస్తే  ‘చాలా కష్టమైన క్లిష్టమైన ప్రశ్నవేశావు.  మమల్ని చంపినవాళ్ళు పదో ఇరవై మంది అయితే చెప్పేవాడిని. అడుగడుగునా ఒక ఘాతకుడు, నలుదిక్కుల నయవంచుకులు .. దేవతల్లాగా సుందరంగా ఉంటారు, మంచి మాటలు మాట్లాడతారు కానీ కార్యాలయంలోకి వెళ్లి ప్రజలకు హాని చేసే సంతకాలు చేస్తారు. ఈ నయవంచుకులకు కావాల్సింది గుణం కాదు.. ప్రతిభ కాదు.గోత్రం...కులం. వాళ్లు చంపారు మమ్మల్ని.. శత్రుదేశం చంపే ముందే మనోళ్లే మమ్మల్ని చంపేశారు’.  ఈ మాటలు ఎందుకొచ్చాయంటే.. ఆ రోజున ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు యుద్ధవ్యూహాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులను ఉన్నతమైన స్థానాల్లో పెట్టడం వల్ల వచ్చే తప్పు వల్ల జరిగింది.

బీజేపీ కేంద్ర నాయకత్వం మన బలాన్ని అర్థం చేసుకొంది

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీకి న్యాయం జరిగే విధంగా ఉండాలని కోరుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తామని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భరోసా ఇవ్వడంతో మద్దతు ప్రకటించాను. బీజేపీ కేంద్ర నాయకత్వానికి మనం అన్నా, మన పార్టీ అన్నా చాలా గౌరవం. మన బలాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆడపడుచులు, జనసైనికులు అండగా నిలబడిన విధానం చూసి స్వయంగా కేంద్ర హోంశాఖా మంత్రి శ్రీ అమిత్ షా గారే ప్రత్యేకించి ప్రశంసించారు. కానీ దురదృష్టం, బాధ కలిగించే అంశం ఏమిటంటే స్థానికంగా ఉండే బీజేపీ నాయకత్వం దానిని గుర్తించడానికి సిద్ధంగా లేదు.  పైగా జనసైనికులు, ఆడపడుచులను చులకన చేసేలా మాట్లాడం మనస్తాపం కలిగించిదని కొందరు ఆడపడుచులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఒక్క ఓటు ఉన్నా వారిని గౌరవిస్తాం. అలాంటిది లక్షల మంది ఉన్న జనసైనికులకు గౌరవం ఇవ్వకపోవడంతో వారు బాధపడటాన్ని అర్ధం చేసుకున్నాను.  గౌరవం లేని చోట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నేను నెట్టను. ఆడబిడ్డలకు, జనసైనికులు, జనసేన నాయకులకు గౌరవం లేని చోట స్నేహం చేయండి అని చెప్పే ధైర్యం నాకు లేదు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ పీవీ నరసింహరావు గారు... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన కుమార్తె వాణీదేవి గారికి మద్దతు ఇస్తామని తెలంగాణ విభాగం నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ... వారి ఇష్టాలను గౌరవించాలి తప్ప... నా ఇష్టాలను బలవంతంగా రుద్దలేను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను.

తెలుగు వారి ఐక్యత కోసం పదవి వదిలేసిన మహనీయుడు శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు

బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం దిశగా జనసేన కృషి చేస్తోంది. ఆ దిశగా మా ప్రయాణం తెలంగాణ నుంచే ప్రారంభించాను. తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు దివంగత శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి గురించి మాట్లాడాలి. తెలుగు ప్రజల ఐక్యత కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు. అలాంటి వ్యక్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలి. ఇంకొక వ్యక్తి

 

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు. భూ సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్న వ్యక్తి. రాష్ట్రంలో, ఢిల్లీలో ఆయన ఎదుగుదలను అడ్డుకున్నారు. రాజకీయాలు వదిలేద్దాం అనుకున్న సమయంలో అనూహ్యంగా ఆయన ప్రధాని అయ్యారు. దేశమంతా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అలాంటి మహానుభావుడిని చితి కాలిక ముందే వదిలేసి అగౌరపరిచారు. ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. అలాంటి మహానుభావులకు సముచిత గౌరవం ఇవ్వాలి.

గెలుపు కాదు... పోరాటం ముఖ్యం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం చేసినంత వేగంగా తెలంగాణలో చేయలేకపోయాను. ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన వారికి సంఘీభావంగా పార్టీ నిర్మాణం కాస్త నెమ్మదించిన మాట వాస్తవమే. తెలంగాణ వీర మహిళలు నా దగ్గరకు వచ్చి... రాష్ట్ర విభజన అయిపోయింది. ప్రజలు కుదుట పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబంలో వ్యక్తి తనకు కుటుంబంలో అన్యాయం జరిగిందని తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టారు. నిర్మాణం కూడా చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతు తెలుపుతున్నాం. ఇప్పటికైనా పార్టీ నిర్మాణం జరగకపోతే చాలా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదన, భావోద్వేగాన్ని అర్ధం చేసుకొని మార్చి 14 తర్వాత తెలంగాణలో చురుకుగా, బలంగా, వ్యూహాత్మకంగా పార్టీ నిర్మాణం జరుతుందని చెప్పాను. దానిలో భాగంగా ఈ రోజు తెలంగాణకు సంబంధించి తెలంగాణ వీర మహిళల కమిటీని ప్రకటిస్తున్నాం. ఎన్ని సీట్లు గెలుస్తాం, ఎన్ని ఓట్లు వస్తాయనేది పక్కన పెట్టి స్థానిక ఎన్నికల్లో పోరాటం చేయాలి” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్, ఉపాధ్యక్షులు శ్రీ బి.మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ శంకర్ గౌడ్, పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం, అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్, పార్టీ ముఖ్యులు శ్రీ రామ్ తాళ్లూరి,  శ్రీ టి.సి.అశోక్, శ్రీ యాతం నగేష్, శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, శ్రీ ఈ.సాంబశివప్రతాప్, శ్రీ బొమ్మదేవర శ్రీధర్, శ్రీ మండలి రాజేష్, శ్రీ రాధారం రాజలింగం, శ్రీ కూసంపూడి శ్రీనివాస్ పాల్గొన్నారు.