14, మార్చి 2021, ఆదివారం

కడుపు మీద కొడతామని బెదిరించి వైసీపీ మున్సిపాల్టీల్లో గెలిచింది: పవన్ కల్యాణ్

 


కులాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన పాలకులు తమ కులానికే నష్టం చేస్తున్నారు

గుణం... సామర్థ్యం లేనివాణ్ని మన కులంవాడని వెనకేసుకొస్తే సమాజానికి అన్యాయం చేసినవాళ్లం అవుతాం

బహుజన విధానం.... సర్వ జనుల అభ్యున్నతే లక్ష్యం

జనసైనికులకు తెలంగాణ బీజేపీ గౌరవం ఇవ్వలేదు... వారి బాధను అర్థం చేసుకున్నాను

జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు

బహుజన విధానంతో ముందుకెళ్తూ... సర్వజనుల అభ్యున్నతిని కాంక్షిస్తూ జనసేన ప్రస్థానం ముందుకు సాగుతుందని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అగ్రవర్ణ పేదలకు అండగా ఉంటూనే... బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం జనసేన పాటుపడుతుందన్నారు. సమాజంలో మార్పు రావాలి, సమతుల్యతతో కూడిన సర్వేజనా సుఖినోభవంతు విధానం రావాలని ఆకాంక్షించారు.  జనసేన పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవాలు  హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్,  భగత్ సింగ్, నారాయణ గురు, ఝాన్సీ లక్ష్మీ భాయ్, పూలే, బూర్గుల రామకృష్ణారావు చిత్ర పటాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుష్పాంజలి ఘటించారు. అనంతరం జనసేన జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తెలంగాణ చాలా చైతన్యవంతమైన నేల. అన్యాయం జరిగితే నాటక, పద్య, కళ, గేయ రూపంలో ప్రజలు అన్ని చోట్ల గళమెత్తుతారు. అలాంటి గడ్డపై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా సందర్భాలలో చెప్పాను... ఆంధ్రా నాకు జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మ ఇచ్చింది. అలాంటి నేలకు నేను చాలా రుణపడి ఉన్నాను. 2014లో పార్టీ ప్రారంభించాను. ఇప్పటికి 7 ఏళ్లు పూర్తయ్యింది. పార్టీ ముఖ్య ఉద్దేశాలు, జనసేన ప్రస్థానం, బీజేపీతో పొత్తు, ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అండగా నిలబడిన విధానాలపై పెద్ద సభ పెట్టి మాట్లాడాలి అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. సామాజిక స్పృహ, దేశభక్తి జనసేన పార్టీని స్థాపించేలా చేశాయి.

2008లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు బడుగు, బలహీన వర్గాల కష్టాలను చూశాను. అగ్రవర్ణాల్లో పేదల కష్టాలను అర్థం చేసుకున్నాను. కులాలను వాడుకొని అధిపత్యం చెలాయించే కుటుంబాలు, వారి దగ్గర నలిగిపోయే ప్రజల బాధలు మనస్తాపం కలిగించాయి. బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పరితపించే నాయకులు, ప్రజా సంఘాలు, దళిత, బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, అగ్రవర్ణాల్లో పేదల అభ్యున్నతిని ఆకాంక్షించే మిగతా వర్ణాల నాయకులు వీళ్లందరిని కలిపే సమగ్ర ఆలోచన విధానం లేకుండాపోవడం గమనించాను. కొన్ని సమూహాలే రాజ్యాధికారానికి దగ్గరై మిగతా వారందరిని యాచించే స్థాయిలో పెట్టడం లాంటివి చాలా బాధ కలిగించాయి.  వీటిపై మాట్లాడి వదిలేయకుండా నా వంతు బాధ్యతగా ఏదైనా చేయాలని… దెబ్బ తిని... ఓటములు, వంచనలు, వెన్నుపోట్లు ఉంటాయని తెలిసి కూడా జనసేన పార్టీ పెట్టాను. 

 దేశ సమగ్రత... సామాజిక సమతుల్యత...

తెలంగాణ రాష్ట్రంలో తిరిగాను. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని కోరుకునేవాడిని. శ్రీ కాన్షీరామ్ గారిని అమితంగా గౌరవించే వ్యక్తిని. బహుజన సిద్దాంతాలను సంపూర్ణంగా తెలుసుకున్నవాడిని. కాలానికి అనుగుణంగా ఉండాలి. సర్వేజన సుఖినోభవంతు అని ముందుకు వెళ్లకపోతే తప్పు చేసిన వాళ్లం అవుతాం. కాన్షీరాం గారు ప్రారంభించిన దళిత ఉద్యమం బహుజన ఉద్యమంగా మారి అటు పిమ్మట సర్వజన విధానంగా రూపుదిద్దుకుంది. కొద్ది మందికే నిలబడతాం అని కాకుండా అణగారిన వర్గాలకు నిలబడతాం, అందరికి న్యాయం చేస్తామనే ఆలోచనతో ముందుకు వెళ్లాలి. ఆ ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చాను. బహుజన సిద్ధాంతం అని ఎందుకు చెబుతున్నాను అంటే – అణగారిన వర్గాలు సాధికారత సాధించాలి. సంఖ్యాబలం ఉండీ రాజ్యాధికారాన్ని సాధించని కులాలు కూడా  ఉన్నాయి. రాజ్యాధికారం కొన్ని ఆధిపత్య కుటుంబాలకే పరిమితమైంది. పాలక వర్గంలో ఉన్నవారు కులాన్ని ఆధారంగా చేసుకొని వచ్చి.. ఆ తరవాత తమ కులానికే నష్టం కలిగిస్తున్నారు.  సంఖ్యా బలం ఉండీ అధికారం లేని వాళ్లు, అసలు సంఖ్యా బలమే లేని రజక, నాయిబ్రాహ్మణ, వెనుకబడిన సంచార జాతులు, మాదిగ సమాజం, మిగతా దళిత సమూహాలకు అండగా నిలబడతాం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కుల వ్యవస్థ చాలా బలీయమైనది. దానిని వాడుకొని కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడుతున్నాయి. జగన్ రెడ్డి గారు తప్పు చేస్తే రెడ్డి సామాజిక వర్గం ఎందుకు సఫర్ అవ్వాలి. ఆ సామాజిక వర్గంలో ఎంతమంది కూలీ పనులుకు వెళ్తారో నాకు తెలుసు. పేరుకే అగ్ర వర్ణం  బ్రాహ్మణ సమాజం. వారు జీవనానికి ఎన్నో ఇబ్బందులకు లోనవుతుంటారు. కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చిన పాలకులు తప్పులు చేస్తే కమ్మవారు బలైపోయారు. పాలకులుగా కులాన్ని వాడుకొని వచ్చినవాళ్లు తమ కుటుంబం కోసం, తమ వ్యక్తిగత వర్గం కోసం చూసుకుంటారు. కులానికి నష్టం చేశారు.

అల్పోత్సాహం కాదు... దీర్ఘకాలిక ఆలోచన కావాలి

వేల కోట్లు ఉంటే తప్ప రాజకీయం చేయలేని పరిస్థితుల్లో  పార్టీ పెట్టడం అనేది సాహసోపేతమైనది. చాలా ఒత్తిడి ఉంటుంది. ఒక మాట ఎక్కువ మాట్లాడినా, ఒక మాట తక్కువ మాట్లాడినా ఇబ్బంది అయిపోయిన పరిస్థితుల్లో చాలా ఆలోచించి ఒత్తిడి తీసుకొని పార్టీ పెట్టాను. 2006లోనే ఒక ఐపీఎస్ అధికారి నా దగ్గరకు వచ్చి ... మీ కుటుంబం రాజకీయాల్లోకి వస్తే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ మీద, మీ కుటుంబం మీద దాడి చేస్తారని చెప్పారు. అప్పటికి ఇంకా మా కుటుంబం రాజకీయాల్లోకి వస్తుందని చెప్పలేదు. ‘మీ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ప్రజలు చైతన్యవంతులవుతారు... సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. అందుకే మీపై దాడి జరిగే అవకాశం ఉంది. మీ మేలు కోరే చెబుతున్నాను’ అన్నారు. దాడి జరుగుతుంది అని తెలిసి కూడా ఇటు వైపు వచ్చాం. రాజకీయ పార్టీ పెట్టాలంటే అల్పోత్సాహం కాదు దీర్ఘకాలిక ఆలోచన కావాలి. అందుకే 25 ఏళ్ల ప్రస్థానం అన్నాను. ఆ దిశగా జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పాను. దానికి నిలబడే ఉన్నాను.

ముప్పావలా కోడికి మూడు రూపాయల దిష్టి

151 మంది ఎమ్మెల్యేలు, 22 ఎంపీలను ప్రజలు గెలిపిస్తే ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉందో మనందరికీ తెలుసు. విభజన తరవాత  రాజధానే లేని రాష్ట్రానికి మూడు రాజధానులు అంటున్నారు. 13 జిల్లాలకే దిక్కు లేదు అంటే 36 జిల్లాలు చేస్తామంటున్నారు. అభివృద్ది కనిపించని చోట నాలుగు అభివృద్ధి మండళ్లు.. ఇవన్నీ చూస్తుంటే ముప్పావలా కోడికి మూడు రూపాయలతో దిష్టి తీసిన చందంగా ఉంది.

 

బెదిరింపుల్లోకెల్లా బెస్ట్ బెదిరింపు

స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపులకు దిగారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన దళిత మహిళా సర్పంచుపై దాడికి దిగారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలవచ్చు కానీ... ఆ గెలుపు భయపెట్టి తెచ్చుకున్నది. రావి శాస్త్రి గారు ఓ రచనలో చెప్పారు.. ‘బెదిరింపుల్లో బెస్టు బెదిరింపు కడుపు కొడతానని బెదిరించడం’ అని. వైసీపీ కూడా అదే చేసింది. మా పార్టీకి ఓటు వేయకపోతే రేషన్ తీసేస్తాం... మీ తల్లిదండ్రులకు పెన్షన్లు కట్ చేస్తాం... మీ పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అమ్మ ఒడి డబ్బులు ఇవ్వం.. సంక్షేమ పథకాలు నిలిపి వేస్తామని భయపెట్టి గెలిచారు తప్ప గుండెల్లో భరోసా నింపి కాదు.

మార్పునకు బలమైన సంకేతం

వేల కోట్లు, కుల బలంతో ముడిపడిన రాజకీయాల్లో దళిత మహిళలు సర్పంచులుగా గెలవడం, పూరింటి నుంచి వచ్చిన వ్యక్తులు గెలవడం,  ఎక్కడో మారుమూల ప్రాంతంలో నివసించే మత్స్యకార కుటుంబంలో వ్యక్తులు విజయం సాధించడం జనసేన పార్టీ లేకపోతే సాధ్యపడేదికాదు. శ్రీకాకుళం జిల్లాలో ఓ మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడు బి.టెక్. చదువుకొని జీవనం కోసం చేపలు అమ్ముతున్నారు. ఆ యువకుడు పార్టీ మద్దతుతో సర్పంచ్ అయ్యాడు. స్థానిక ఎన్నికల్లో తమ వారు తప్ప మిగతా వారిని రాకుండా అధికార పార్టీ కట్టుదిట్టం చేసింది. నేను ఒకటే చెప్పాను.. ముందు పోరాటం చేయండి, అనుభవం వస్తుంది అని చెప్పాను. నా మాటలతో 6 శాతం ఉన్న జనసేన ఓటు బ్యాంకు 27 శాతానికి పెరిగింది. ఇదే మార్పునకు బలమైన సంకేతం. వేల కోట్లు ఉన్న రాజకీయ పార్టీకి ఎదురొడ్డి నిలబడ్డారు అంటే దానికి ఆడపడుచులు, నిస్వార్థంగా పని చేసిన జనసైనికులే కారణం.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనకు బలం ఉంది

ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి గారు మాట్లాడిన కొన్ని మాటలు నా దృష్టికి వచ్చాయి.  స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ అంశంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటానికి... పవన్ కల్యాణ్ ను అపాయింట్మెంట్ ఇప్పించమనండి అని అన్నారు. నాకు ఒకటే అనిపించింది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మీకు అపాయింట్మెంట్ ఇప్పించాలా? ఓడిపోయిన వాడిని వదిలేయ వచ్చు కదా... అయినా వదలరు. ఎందుకంటే మార్పు తీసుకొచ్చే బలం మనకు ఉంది అని వారికీ తెలుసు. అయితే- ‘ఏమీ లేదు... ఏమీ లేదు’ అని చెప్పి మన బలం మనకు తెలియనీయకుండా చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో  జనసేనకు చాలా బలం ఉంది. ఆ బలం బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడుతుంది.

అగ్ర శూద్ర కులాల్లోని పెద్దలు ఆలోచించాలి

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విధానపరమైన విభేదాలే ఉంటాయి. చాలా మంది నాకు తెలిసిన, సమాజంలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు కొంతమంది నా దగ్గరకు వచ్చి పోయినసారి తెలుగుదేశంకు సపోర్టు చేశావు కదా... ఈసారి మా వాడికి చేయవచ్చు కదా అని అడిగారు. అప్పుడు నాకు అనిపించింది. ఈ స్థాయి వ్యక్తులు తమ వాడు పైకి రావాలి అనుకున్నారే తప్ప బడుగు, బలహీన వర్గాలు బయటకు రావాలని ఆశించలేదు అని. నేను ఎందుకు సార్ అలా మాట్లాడారు అని వాళ్లను అడిగితే...  రాజ్యాధికారం మిగతా కులాలు చేయలేవని చెప్పారు.

 

వారికీ, అందరికీ  ఈ సందర్భంగా రాష్ట్రకవి రాంధారి సింగ్ దినకర్ గారు చెప్పిన ఓ హిందీ కవితను గుర్తు చేయాలి. గుణం లేనివాడిని, సామర్థ్యం లేని వాడిని మన కులంలో ఉన్నాడని వెనకేసుకొస్తే దేశానికి, సమాజానికి ద్రోహం చేసినవాళ్లం అవుతాం. అగ్రశూద్రకులాల్లో పెద్దలు దీనిపై ఆలోచించాలి. ఈ విషయంపై  రామ్ ధారిసింగ్ దినకర్ గారు పరుశురామ్ కి ప్రతిక్ష అని ఒక కవిత సంకలనం రాశారు. ఆయన మూడు నాలుగుసార్లు రాజ్యసభ సభ్యులు. చైనా యుద్ధంలో సైనికులు చనిపోయి.. మన భూభాగాన్ని దురాక్రమణ చేసినప్పుడు విగత జీవులైన సైనికులు ఎందుకు చనిపోయారని ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది అనేది అర్ధం చేసుకొని ... యుద్ధం జరిగే ముందు ఏ పరిస్థితులు వచ్చాయి.. ఎలా నివారించి ఉండాల్సింది అనే అంశాలపై చనిపోయిన సైనికులను అడుగుతూ ఒక కవిత రాశారు.  హే వీర్ బాధు దాయి... అని సాగే ఈ కవిత అర్థం ఏమిటంటే ‘వీర బాంధువుడా నీ చావుకి కారకులెవ్వరు?’ అని కవి ప్రశ్నిస్తే  ‘చాలా కష్టమైన క్లిష్టమైన ప్రశ్నవేశావు.  మమల్ని చంపినవాళ్ళు పదో ఇరవై మంది అయితే చెప్పేవాడిని. అడుగడుగునా ఒక ఘాతకుడు, నలుదిక్కుల నయవంచుకులు .. దేవతల్లాగా సుందరంగా ఉంటారు, మంచి మాటలు మాట్లాడతారు కానీ కార్యాలయంలోకి వెళ్లి ప్రజలకు హాని చేసే సంతకాలు చేస్తారు. ఈ నయవంచుకులకు కావాల్సింది గుణం కాదు.. ప్రతిభ కాదు.గోత్రం...కులం. వాళ్లు చంపారు మమ్మల్ని.. శత్రుదేశం చంపే ముందే మనోళ్లే మమ్మల్ని చంపేశారు’.  ఈ మాటలు ఎందుకొచ్చాయంటే.. ఆ రోజున ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు యుద్ధవ్యూహాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులను ఉన్నతమైన స్థానాల్లో పెట్టడం వల్ల వచ్చే తప్పు వల్ల జరిగింది.

బీజేపీ కేంద్ర నాయకత్వం మన బలాన్ని అర్థం చేసుకొంది

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీకి న్యాయం జరిగే విధంగా ఉండాలని కోరుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తామని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భరోసా ఇవ్వడంతో మద్దతు ప్రకటించాను. బీజేపీ కేంద్ర నాయకత్వానికి మనం అన్నా, మన పార్టీ అన్నా చాలా గౌరవం. మన బలాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆడపడుచులు, జనసైనికులు అండగా నిలబడిన విధానం చూసి స్వయంగా కేంద్ర హోంశాఖా మంత్రి శ్రీ అమిత్ షా గారే ప్రత్యేకించి ప్రశంసించారు. కానీ దురదృష్టం, బాధ కలిగించే అంశం ఏమిటంటే స్థానికంగా ఉండే బీజేపీ నాయకత్వం దానిని గుర్తించడానికి సిద్ధంగా లేదు.  పైగా జనసైనికులు, ఆడపడుచులను చులకన చేసేలా మాట్లాడం మనస్తాపం కలిగించిదని కొందరు ఆడపడుచులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఒక్క ఓటు ఉన్నా వారిని గౌరవిస్తాం. అలాంటిది లక్షల మంది ఉన్న జనసైనికులకు గౌరవం ఇవ్వకపోవడంతో వారు బాధపడటాన్ని అర్ధం చేసుకున్నాను.  గౌరవం లేని చోట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నేను నెట్టను. ఆడబిడ్డలకు, జనసైనికులు, జనసేన నాయకులకు గౌరవం లేని చోట స్నేహం చేయండి అని చెప్పే ధైర్యం నాకు లేదు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ పీవీ నరసింహరావు గారు... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన కుమార్తె వాణీదేవి గారికి మద్దతు ఇస్తామని తెలంగాణ విభాగం నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ... వారి ఇష్టాలను గౌరవించాలి తప్ప... నా ఇష్టాలను బలవంతంగా రుద్దలేను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను.

తెలుగు వారి ఐక్యత కోసం పదవి వదిలేసిన మహనీయుడు శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు

బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం దిశగా జనసేన కృషి చేస్తోంది. ఆ దిశగా మా ప్రయాణం తెలంగాణ నుంచే ప్రారంభించాను. తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు దివంగత శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి గురించి మాట్లాడాలి. తెలుగు ప్రజల ఐక్యత కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు. అలాంటి వ్యక్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలి. ఇంకొక వ్యక్తి

 

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు. భూ సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్న వ్యక్తి. రాష్ట్రంలో, ఢిల్లీలో ఆయన ఎదుగుదలను అడ్డుకున్నారు. రాజకీయాలు వదిలేద్దాం అనుకున్న సమయంలో అనూహ్యంగా ఆయన ప్రధాని అయ్యారు. దేశమంతా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అలాంటి మహానుభావుడిని చితి కాలిక ముందే వదిలేసి అగౌరపరిచారు. ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. అలాంటి మహానుభావులకు సముచిత గౌరవం ఇవ్వాలి.

గెలుపు కాదు... పోరాటం ముఖ్యం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం చేసినంత వేగంగా తెలంగాణలో చేయలేకపోయాను. ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన వారికి సంఘీభావంగా పార్టీ నిర్మాణం కాస్త నెమ్మదించిన మాట వాస్తవమే. తెలంగాణ వీర మహిళలు నా దగ్గరకు వచ్చి... రాష్ట్ర విభజన అయిపోయింది. ప్రజలు కుదుట పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబంలో వ్యక్తి తనకు కుటుంబంలో అన్యాయం జరిగిందని తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టారు. నిర్మాణం కూడా చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతు తెలుపుతున్నాం. ఇప్పటికైనా పార్టీ నిర్మాణం జరగకపోతే చాలా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదన, భావోద్వేగాన్ని అర్ధం చేసుకొని మార్చి 14 తర్వాత తెలంగాణలో చురుకుగా, బలంగా, వ్యూహాత్మకంగా పార్టీ నిర్మాణం జరుతుందని చెప్పాను. దానిలో భాగంగా ఈ రోజు తెలంగాణకు సంబంధించి తెలంగాణ వీర మహిళల కమిటీని ప్రకటిస్తున్నాం. ఎన్ని సీట్లు గెలుస్తాం, ఎన్ని ఓట్లు వస్తాయనేది పక్కన పెట్టి స్థానిక ఎన్నికల్లో పోరాటం చేయాలి” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్, ఉపాధ్యక్షులు శ్రీ బి.మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ శంకర్ గౌడ్, పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం, అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్, పార్టీ ముఖ్యులు శ్రీ రామ్ తాళ్లూరి,  శ్రీ టి.సి.అశోక్, శ్రీ యాతం నగేష్, శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, శ్రీ ఈ.సాంబశివప్రతాప్, శ్రీ బొమ్మదేవర శ్రీధర్, శ్రీ మండలి రాజేష్, శ్రీ రాధారం రాజలింగం, శ్రీ కూసంపూడి శ్రీనివాస్ పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి