26, మార్చి 2021, శుక్రవారం

పవన్ కళ్యాణ్: నవతరానికి యుద్ధ కళలు... సాహస క్రీడల్లో నైపుణ్యాలు అవసరం


నెల్లూరుకు చెందిన మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు... గిన్నిస్ బుక్ రికార్డ్ గ్రహీత శ్రీ ప్రభాకర్ రెడ్డికి సత్కారం,

    ఆర్థిక సాయం

యువతకు దేహ దారుఢ్యంతోపాటు మానసిక బలం చేకూరేందుకు యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు దోహదం చేస్తాయి... వీటిని నేర్చుకోవడం ఎంతైనా అవసరమని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. మన దేశంలోనూ పలు సంప్రదాయ యుద్ధ కళలు ఉన్నాయి... వాటితోపాటు పలు ఆసియా దేశాల మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయన్నారు. చిన్నప్పటి నుంచీ బాలబాలికలకు నేర్పిస్తే ఆత్మ రక్షణ విద్యగాను, మనోస్థైర్యం ఇచ్చే మార్గంగాను ఇవి ఉపయోగపడతాయి అన్నారు. నెల్లూరుకు చెందిన మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు, పలు గిన్నిస్ బుక్ రికార్డులు పొందిన శ్రీ ప్రభాకర్ రెడ్డి గారిని శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు సత్కరించారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు నెలకొల్పిన ట్రస్ట్  ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ ద్వారా రూ.లక్ష చెక్ అందచేశారు.

 ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “వింగ్ చున్ అనే మార్షల్ ఆర్ట్.. మన దేశంలో ఉన్న శిక్షకుల  గురించి బ్రౌజ్ చేస్తుంటే శ్రీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి తెలిసింది. మార్షల్ ఆర్ట్స్ లో వివిధ దేశాల్లో శిక్షణ పొంది, రికార్డులు సాధించిన ఆయన పెద్ద పెద్ద నగరాలకు వెళ్లిపోకుండా తన ఊళ్ళో ఉంటూ యువతకు శిక్షణ ఇవ్వడం సంతోషం. ఇలాంటివారిని ప్రోత్సహించాలి. ఈ క్రమంలోనే మా ట్రస్ట్ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించాను” అన్నారు.

శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ “మార్షల్ ఆర్ట్స్ లో 29 ప్రపంచ రికార్డులు సాధించాను. చైనా, థాయిలాండ్, మలేసియా, శ్రీలంకల్లో పలు యుద్ధ కళలు నేర్చుకున్నాను. చైనాలోని షావోలిన్ టెంపుల్ లో శిక్షణ పొందాను. యువతకు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉండటం ఎంతో ఉపయోగపడుతుంది. మన దేశంలో వీటిని నేర్చుకొంటున్నవారు తక్కువగానే ఉన్నారు. శ్రీ పవన్ కల్యాణ్ గారికి పలు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది. వీటిపై ఆసక్తి కూడా చాలా ఎక్కువ. వారు నన్ను పిలిచి సత్కరించి, ఆర్థిక సహాయం ఇవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది. శ్రీ పవన్ కల్యాణ్ గారికి నా కృతజ్ఞతలు” అన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు ‘వింగ్ చున్’ గురించి తెలుసుకున్నారు. వింగ్ చున్ వుడెన్ డమ్మీపై కొన్ని మెళకువలు తెలుసుకున్నారు.


మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న పవన్ కల్యాణ్






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి