మదర్స్ డే Mother's day ప్రతి సంవత్సరం మే నెలలో రెండో ఆదివారం జరుపుకొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో మదర్స్ డే పాటిస్తారు.
సుమారు వందేళ్ల కిందట అమెరికాలో మొట్టమొదటిసారి ఈ మదర్స్ డే కాన్సెప్ట్‌ను మొదలుపెట్టిన మహిళ అన్నా జార్విస్. అయితే, ఇది క్రమేపీ ఆడంబరమైన కార్యక్రమంగా మారిపోవడంతో తరువాత కాలంలో ఆమె మదర్స్ డే వేడుకలు రద్దు చేయాలంటూ ఉద్యమం కూడా చేశారు.
ఎలా మొదలైంది..
అన్నా జార్విస్ తల్లిదండ్రులకు 13 మంది పిల్లలు. వారిలో 9 మంది చనిపోయారు. అప్పట్లో రకరకాల జబ్బుల కారణంగా పిల్లలు చనిపోతుండేవారు.
అమ్మ కోసం ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలన్న ఆలోచన అన్నా జార్విస్‌కు ఆమె తల్లి నుంచే వచ్చింది.
జార్విస్ తల్లి తనలాంటి మిగతా అమ్మలను అనేక విషయాలపై చైతన్యం చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి ఆమె మిగతా తల్లులకూ నిత్యం జాగ్రత్తలు చెబుతుండేవారు.
అంతేకాదు.. అమ్మలు చేసేపనికి గుర్తింపు ఉండాలని ఆమె భావించేవారు.
1858లో ఆమె మదర్స్ డే వర్క్ క్లబ్ ప్రారంభించారు. ఈ మదర్స్ డే వర్క్ క్లబ్బులు శిశుమరణాల రేటు తగ్గించడం కోసం పనిచేసేవి.
అప్పటికి పశ్చిమ వర్జీనియాలోని గ్రాఫ్టన్ ప్రాంతంలో శిశుమరణాలు అధికంగా ఉండేవి. ప్లేగు, ఇతర అంటువ్యాధుల కారణంగా పిల్లలు చనిపోతుండేవారు. ఆమెకు కూడా 13 మంది సంతానమైనప్పటికీ అందులో 9 మంది శిశుప్రాయంలోనే చనిపోవడానికి కారణం ఇలాంటి వ్యాధులే.
1905లో అన్నా జార్విస్ తల్లి మరణించారు. అప్పుడు ఆమె చుట్టూ ఉన్న నలుగురు పిల్లల్లో అన్నా జార్విస్ తన తల్లికి ఒక మాటిచ్చారు.
అమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తానని ఆమె మాటిచ్చారు.
ఆ క్రమంలోనే ఆమె ప్రపంచంలోనే గొప్ప అమ్మ అంటే ఎవరు..? ఎవరి అమ్మ వారికి ప్రపంచంలోనే గొప్ప అమ్మ అనే కాన్సెప్ట్‌తో మదర్స్ డే జరపడం ప్రారంభించారు.
అందుకే ఇది Mothers Day అని బహువచనంతో కాకుండా Mother's Day అని ఏకవచనంలో ఉంటుంది.
మొట్టమొదటిసారి మదర్స్ డే ఎప్పుడు జరిపారంటే..
1905లో అన్నా జార్విస్ తల్లి మరణించిన తరువాత మూడేళ్లకు అంటే 1908లో తొలిసారి గ్రాఫ్టన్ మెథడిస్ట్ చర్చిలో మే రెండో ఆదివారాన మదర్స్ డే నిర్వహించారు.
అన్నా జార్విస్ రెండో ఆదివారాన్ని ఎంచుకోవడానికి కారణం ఆమె తల్లి మరణించిన మే 9వ తేదీకి రెండో ఆదివారం సమీపంలో ఉండడమే కారణం.
ఆ తరువాత మదర్స్ డే ప్రాచుర్యం విపరీతంగా పెరిగింది. 1910లో వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలో మదర్స్ డేకు సెలవు ఇచ్చారు.
1914కి వచ్చేసరికి ఏకంగా అమెరికా వ్యాప్తంగా ఆ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించారు అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్.
కానీ, అన్నా జార్విస్ కోరుకున్నది ఇది కాదు. వేడుకలు పూర్తిగా వాణిజ్య రూపంలోకి మారడంతో ఆమె ఆవేదన చెందారు. మదర్స్ డే వేడుకలను ఇలా మార్చేయొద్దంటూ ఆమె పత్రికా ప్రకటనలిచ్చారు.
కానీ, ఆమె గోడు ఎవరూ పట్టించుకోలేదు.
1920 నాటికి మదర్స్ డే రోజు పువ్వులు కొనడం, బొకేలు కొనడం మానుకోవాలంటూ ఆమె ప్రజలను కూడా అర్థించారు. తాను కోరుకున్న స్ఫూర్తిని మరచి వివిధ సంస్థలు కూడా దీన్ని పూర్తిగా మార్చేయడంపై ఆమె బాధపడేవారు.
ఆమె ఇలా మదర్స్ డేకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించడంతో ఆమె చేస్తున్న ఆ వ్యతిరేక ప్రచారం ఎలాగైనా ఆపించాలని బొకేలు, గ్రీటింగ్ కార్డుల వ్యాపారులు ఆమెకు డబ్బు ఇవ్వజూపారు. కానీ ,ఆమె అందుకు లొంగలేదు.
మదర్స్ డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించడానికి ముందు ఆమె ‘మే రెండో ఆదివారం, మదర్స్ డే’ అనేదానికి కాపీరైట్ తీసుకున్నారు. మదర్స్ డేను వాణిజ్యపరంగా నిర్వహించేవారిపై ఆమె కేసులు వేసేవారు.
దీంతో కొన్ని సంస్థలు ఈ వేడుకలను జరిపేటప్పుడు మదర్స్ డేను బహువచనం(Mothers Day)గా వాడుతూ కాపీరైట్ నుంచి తప్పించుకునేవారు.
80 ఏళ్ల వయసులో ఆమె ఫిలడెల్ఫియాలోని ఒక శానిటోరియంలో ఉండేవారు.. అప్పుడు కూడా ఆమె కళ్లు కనిపించకపోయినా ఇళ్లిళ్లూ తిరుగుతూ మదర్స్ డే వేడుకలు వద్దంటూ సంతకాలు సేకరించేవారు.
చివరికి అన్నా జార్విస్ 1948లో గుండెపోటుతో మరణించారు.
మా ఇతర కథనాలు:
- ఈడీ అమీన్: శత్రువుల రక్తం తాగి, మర్మావయవాలనూ తినేసిన నియంత.. ఆయన దారుణాలు చదివితేనే వణుకు పుడుతుంది
- Aarogy Setu ఆరోగ్య సేతు యాప్ ఎలా పనిచేస్తుంది? ఎవరు తయారుచేశారు? ఎన్ని భాషల్లో ఉంది?
- అయినా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ?
- రకుల్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ కేసులో బయటపెట్టిన రియా చక్రవర్తి? తెలుగు సినీ, రాజకీయ స్నేహితుల పేర్లూ బయటకొస్తాయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి