30, మార్చి 2021, మంగళవారం

ఏప్రిల్ 3న తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

పవన్ కళ్యాణ్


ఎమ్.ఆర్.పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పాదయాత్ర

శంకరంబాడి సర్కిల్ లో భారీ బహిరంగ సభ

ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న జనసేన, బీజేపీ శ్రేణులు

వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడితే తిరగబడతాం

* బలిజ సామాజిక వర్గాన్ని బెదిరిస్తున్నారు

రేణిగుంట విమానాశ్రయం వద్ద మీడియా సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ

   ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏప్రిల్ 3న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి శ్రీమతి రత్నప్రభ గారికి మద్దతుగా తిరుపతి పట్టణంలోని ఎమ్.ఆర్.పల్లి సర్కిల్ నుంచి ఏఐఆర్ బైపాస్ మీదుగా శంకరంబాడి సర్కిల్ వరకు కవాతు చేస్తారని తెలిపారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ-జనసేన పొత్తు మంచి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కల్పించే విధంగా ఈ కవాతు ఉంటుందని చెప్పారు. సాయంత్రం మూడు గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుందని, పాదయాత్ర అనంతరం శంకరంబాడి సర్కిల్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్షుల వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో పాటు రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. అధ్యక్షుల వారితో కలిసి తామందరం కూడా పాదయాత్రలో పాల్గొని శ్రీమతి రత్నప్రభ గారిని గెలిపించమని ఓటర్లను అభ్యర్ధించనున్నట్లు పేర్కొన్నారు.  మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ... “శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ కూడా ఎదురు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి నేతృత్వంలో దీని కోసం ప్రత్యేకంగా కమిటీ కూడా వేశారు. అధ్యక్షులవారి పర్యటనను విజయవంతం చేయడానికి బీజేపీ కూడా శాయశక్తుల కృషి చేస్తోంది. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులను కూడా ఆహ్వానిస్తున్నాము.

బీజేపీ, జనసేన పొత్తుపై అనేక అనుమానాలు, అపోహలు, అసత్యాలు సృష్టించి ప్రత్యర్థులు దుష్ర్పచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే రెండు పార్టీల కలయిక జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడిగా ఎదగడమే కాకుండా, ప్రజల్లో విశ్వాసం నింపే విధంగా పనిచేస్తారు.

దౌర్జన్యాలు చేస్తే తిరగబడతాం

జనసేన పార్టీ సానుభూతిపరులను స్థానిక అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని తమ దృష్టికి వచ్చింది. ముఖ్యంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులను, వ్యాపారస్థులను పిలుపించుకొని బెదిరిస్తున్నారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబడితే తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యాపారాలు చేయనివ్వమని బెదిరింపులకు దిగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదు. ఎన్నికలు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి కానీ, ఇలా దౌర్జన్యాలకు పాల్పడితే మాత్రం తప్పకుండా తిరగబడతాం. ప్రజాప్రతినిధులు ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. ప్రజలను కులాలు, మతాలుగా విభజించి అధికార పార్టీ గెలవాలని చూస్తుంది. దానిని ఖండిస్తున్నాం. వైసీపీకి నిజంగా బలం ఉంటే నిజాయతీగా పోరాడాలి.  151 మంది ఉండి కూడా ధైర్యంగా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మండలానికో ఎమ్మెల్యే, నియోజకవర్గానికో మంత్రిని పర్యవేక్షకుడిగా నియమిస్తున్నారని” అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి