9, జనవరి 2021, శనివారం

దివీస్ ల్యాబ్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు గాను రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్


 

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అన్నవరం మీదుగా దివీస్ ప్రభావిత ప్రాంతాలకు పర్యటనకు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ గారి వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు.

దివిస్ లాబొరేటరీస్ కాలుష్యంతో ప్రభావితమయ్యే ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు బాసటగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ ఈ పర్యటన తలపెట్టగా తూర్పుగోదావరి ఎస్పీ తొలుత అనుమతి ఇచ్చి అనంతరం నిరాకరించారు.

దీంతో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ శనివారం ఉదయం రాజమండ్రి చేరుకుంటానని కార్యక్రమాలకు హాజరవుతానని ప్రకటించారు.. తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంపై తమ అసంతృప్తిని తెలియజేశారు.

ఈ పరిణామాల తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్ చేపట్టిన పర్యటనకు కొత్త పాకల గ్రామంలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతులు మంజూరు చేశారు. 

శుక్రవారం రాత్రి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఫోన్ చేసి ఈ కార్యక్రమాలకు అనుమతిస్తున్నట్లు తెలియజేశారు. 

రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్

8, జనవరి 2021, శుక్రవారం

పవన్ కళ్యాణ్ బహిరంగ సభపై ఆంక్షలా?

నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్


* తూ.గో జిల్లా ఎస్పీ వైఖరి గర్హనీయం 
* వైఎస్సార్సీపీ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది
* జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని కొత్తపాకల గ్రామంలో 9వ తేదీన ఏర్పాటు చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభకు అనుమతులు లేవని చివరి నిమిషంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ప్రకటించడం అప్రజాస్వామికం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

‘‘పోలీసు వ్యవస్థకే తలవంపులు. తొండంగి మండలం కొత్తపాకల గ్రామంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ ల్యాబరేటరీస్ పై అక్కడ సమీప గ్రామస్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సభ నిర్వహిస్తున్నట్లు ముందుగానే జనసేన నాయకులు ఎస్పీకి తెలియజేశారు. 

సభకు అనుమతి కావాలని, పవన్ కళ్యాణ్ గారికి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని కోరినప్పుడు ఆయన సుముఖుత వ్యక్తం చేసి, సభ నిర్వహించడానికి ఆమోదం తెలిపారు. 

అయితే ఈ రోజు సాయంత్రం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సభకు అనుమతులు రద్దు చేసుకుంటున్నామని, 144 సెక్షన్ విధిస్తున్నామని ఎస్పీ చెప్పడం వైఎస్ఆర్సీపీ ఆదేశాలను అమలు చేయడంగానే భావిస్తున్నాం. 

దివీస్ కంపెనీ వల్ల కాలుష్యం బారిన పడుతున్నామని వేలాదిమంది ప్రజలు ఆవేదన, ఆక్రోశం, నిస్సహాయత వ్యక్తం చేస్తున్న తరుణంలో శాంతియుతంగా వారి మనోభావాలను అర్ధం చేసుకోవడానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమానికి పోలీసుల ద్వారా అవరోధాలు సృష్టించడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నాం. 

ఏదీఏమైనప్పటికీ కార్యక్రమాన్ని యధావిధిగా 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజా గళాన్ని వినిపిస్తాం. పోలీసులను అడ్డుపెట్టుకొని జనసేన కార్యక్రమాలని అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే అందుకు జగన్ రెడ్డిగారి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసులు ప్రజల పక్షాన ప్రజాస్వామ్య వ్యవస్థలో పని చేస్తున్నామన్న విషయాన్ని గుర్తెరగాలి’’ అని నాదెండ్ల ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

7, జనవరి 2021, గురువారం

పవన్ కళ్యాణ్: ఆలయాల రక్షణపై ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలి

చినజీయర్ స్వామి, పవన్ కళ్యాణ్

 

కమీషన్లు వచ్చే కాంట్రాక్ట్ పనులపైనే కాదు.. సి.సి.కెమెరాల ఏర్పాటుపైనా దృష్టిపెట్టాలి

లయాల ఆస్తులు, విగ్రహాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వ వైఖరి... తీసుకొనే చర్యల గురించి ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన సమయంలోనే అన్ని ఆలయాలలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు రామతీర్థంలో శ్రీ కోదండరామ స్వామి విగ్రహం తల నరికిన దుస్సంఘటన తరవాత అదే మాట చెబుతున్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో సుమారు 26వేల ఆలయాలు ఉన్నాయి. అందులో ఎన్ని ఆలయాలకు సి.సి.కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు? అనేది ప్రశ్నార్థకమే. ఆలయాలే ఆ కెమెరాలను, పర్యవేక్షణను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుండటం సరికాదు. ధూప దీప నైవేద్యాలకు కూడా నిధులు సమకూర్చని ప్రభుత్వం ఇప్పుడు సి.సి. కెమెరాలను ఆలయాలే ఏర్పాటు చేసుకోవాలనడం బాధ్యతను విస్మరించడమే. 

గత ప్రభుత్వ కాలంలో కూల్చినవాటిని కడుతున్నామని చెబుతున్న ఈ పాలక పక్షం గత 18 నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు. విగ్రహాల ధ్వంసం ఘటనల క్రమంలోనే ప్రభుత్వం విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణం అంటోంది.  విజయవాడ దుర్గ గుడి అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించి పనులు మొదలుపెడతామన్నారు. ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు ప్రభుత్వ విధి నిర్వహణలో భాగమే. వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చేస్తున్న పనులుగా వాటిని చూడలేము. కాంట్రాక్టుల్లో వచ్చే కమీషన్ల మీదపెట్టే శ్రద్ధ రాష్ట్రవ్యాప్తంగా 26వేల ఆలయాలకు సి.సి.కెమెరాలు ఏర్పాటు మీదా దృష్టిపెట్టాలి. ఉత్సవ విగ్రహాల్లా ఉండే కెమెరాలు కాకుండా ఆధునిక సాంకేతికత ఉన్న కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను సిద్ధం చేయాలి. లేదంటే ఈ ప్రభుత్వం కేవలం ప్రకటనలకు, ప్రచారానికి మాత్రమే సి.సి. కెమెరాలు అనే మాట చెబుతుందని భావించాల్సి వస్తుంది.

 

(పవన్ కల్యాణ్)

అధ్యక్షులు, జనసేన

పవన్ కళ్యాణ్: ‘గెరిల్లా వార్ ఫేర్ అంటూ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నారు

పవన్ కళ్యాణ్, చినజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి

కటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైగా దేవాలయాలపై గత రెండేళ్ల కాలంలో దాడులు జరిగాయి.. రథాలు దగ్ధాలు, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి.. జరుగుతున్న ఈ ఆరాచకంపై మాట్లాడితే “ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ నడిపిస్తున్నాయి” అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చెప్పడం బాధ్యత నుంచి తప్పించుకునే విధంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

‘‘ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజలు హర్షించరు. మీరు ఎంతటి శక్తిమంతులో ఈ దేశ ప్రజలందరికి తెలుసు. మీరు ఒక్క లేఖ రాస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అయిపోతారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా వార్ ఫేర్ చేయడానికి ఎవరు సాహసిస్తారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 115 మంది ఐ.పి.ఎస్ లు, మరో 115 మంది అదనపు ఎస్.పి.లు వేలాది మంది పోలీసు సిబ్బంది మీ చేతుల్లో ఉండగా విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉంది. నిస్సహాయుడైన డాక్టర్ సుధాకర్ గారి పైన, సోషల్ మీడియాలో మీపైన, మీ పార్టీ వారిపైన పోస్టులు పెట్టేవారిపై అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసేవారిని పట్టుకుని ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు. ఊరికో వాలంటీరు చొప్పున 2.60 లక్షల మందిని నియమించారు కదా .. వారు కూడా సమాచారం ఇవ్వలేకపొతున్నారా? ఎక్కడ వుంది లోపం? మీలోనా? మీ నీడలో వున్న వ్యవస్థలోనా?

పైగా ప్రతిపక్షాలు అన్నింటినీ ఒకే గాటన కట్టి దుష్ప్రచారం చేస్తున్నారని మీరు చెప్పడం 'ఆడలేక మద్దెలు ఓడు' అన్నట్లు ఉంది. గత రెండేళ్లుగా సహనంతో ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్డుపైకి రావలసిన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది.ఇకనైనా ఇటువంటి మాటలు కట్టిపెట్టి దోషులను పట్టుకుని, వారిని ప్రజల ముందు నిలబెట్టే పనిలో ఉంటే మంచిది.’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

2, జనవరి 2021, శనివారం

పవన్ కళ్యాణ్ : హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమే

పవన్ కళ్యాణ్

పాకిస్థాన్ దేశంలోనే ఆలయాల ధ్వంసం గురించి చదువుతున్నాం... మన రాష్ట్రంలో దేవతా విగ్రహాల ధ్వంసాన్ని చూస్తున్నాం 

దేవుడిపై భారం వేయడం ముఖ్యమంత్రి ఉదాసీనతను తెలియచేస్తోంది 

‘‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దేవుడి విగ్రహం ధ్వంసంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ పరిస్థితి నెలకొనడం అత్యంత దురదృష్టకరం. హిందూ ధర్మాన్ని విశ్వసించేవారి మనోభావాలను దెబ్బ తీసే ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకొందని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. రాజమహేంద్రవరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చేతులను ఖండించడం వేదనకు లోను చేసింది’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

‘‘పాకిస్థాన్ దేశంలో హిందూ ఆలయాలను ధ్వంసం చేసి, విగ్రహాలు పగలగొడుతూ ఉంటారని చదువుతుంటాం. ఇప్పుడు మన రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం, ఆలయ రథాల దగ్ధం చూస్తున్నాం.  రామ నామాన్ని జపించే పవిత్ర భూమి మనది... రామ కోటి సభక్తికంగా రాసే నేల ఇది... రామాలయం లేని ఊరంటూ కనిపించదు మన దేశంలో. రాముణ్ణి ఆదర్శంగా తీసుకొంటూ ఉంటాం. మన రాష్ట్రంలో ఆ భావనలు చెరిపేయాలనుకొంటున్నారా? భద్రాచలం తరహాలో అధికారికంగా శ్రీరామనవమి చేయాలనుకొన్న రామతీర్థం క్షేత్రంలో కొద్ది రోజుల కిందటే కోదండరాములవారి విగ్రహం తలను నరికి పడేసే మత మౌఢ్యం పెచ్చరిల్లడం ఆందోళనకరం. ఈ బాధ భక్తుల మనసుల్లో ఇంకా పచ్చిగానే ఉంది. ఇప్పుడు  దేవ గణాలకు సేనాధిపతి అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం చేతులను నరికేయడం ధ్వంస రచన పరాకాష్టకు చేరుతున్నట్లు అనిపిస్తోంది. 

రామతీర్థం క్షేత్రంలో కోదండ రాముని విగ్రహాన్ని పగలగొట్టడం.. అంతకు ముందు పలు చోట్ల విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలను తగలపెట్టడం చూస్తుంటే ఒక పథకం ప్రకారమే ఈ దుశ్చర్యలకు తెగబడుతున్నారు.  రాష్ట్రంలో ఒకరి మత విశ్వాసాలను మరొకరు గౌరవించే సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించడం లేదు. రామతీర్థం క్షేత్రంలో శ్రీ కోదండరాముల వారి  విగ్రహం తలను నరికిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన ఉదాసీనంగా ఉంది. దేవుడితో చెలగాటమాడితే దేవుడే శిక్షిస్తాడు అంటూ చెప్పడం చూస్తే ఈ వరుస దాడులపై ఆయన ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యాఖ్యలు నేరం చేసేవారిని నిలువరించవు సరికదా... మరో దుశ్చర్యకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి.  ఈ ఘటనలకు ఇతర పక్షాలే కారణం అంటూ అధికార పక్షంవాళ్లు చెబుతున్నారు. మరి వారి చేతుల్లోనే పోలీసు, నిఘా విభాగాలు ఉంటాయి కదా... బాధ్యులను ఇప్పటి వరకూ ఎందుకు గుర్తించి అరెస్టు చేయడం లేదు.

దేవుడిపై భారం వేసేసి ఆలయాలను కాపాడే బాధ్యత నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. అంతర్వేది ఘటనపై నిరసన తెలిపినవారిపైనా... అక్కడ ఓ ప్రార్థన మందిరానికి నష్టం జరిగితే ఆఘమేఘాలపై కేసులుపెట్టిన ప్రభుత్వం - హిందూ ఆలయాలు, దేవత విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎందుకు దేవుడిపై భారం వేస్తుంది. విజయవాడ అమ్మవారి ఆలయ రథంలో వెండి విగ్రహాల అపహరణ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. పిఠాపురం, కొండబిట్రగుంట కేసులు ఎటుపోయాయో ప్రజలకు అర్థం కావడం లేదు. వరుస ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో దేవాదాయ శాఖ అనేది ఒకటి ఉందా అనిపిస్తుంది. హిందూ దేవాలయాలపై సాగుతున్న దాడులను ఏ మత విశ్వాసాన్ని ఆచరించేవారైనా నిరసించాలి. అన్ని మతాల పెద్దలు ఒక వేదికపైకి వచ్చి విగ్రహ ధ్వంసాలు, రథాల దగ్ధాలను ఖండించాలి. అప్పుడే మత సామరస్యం, లౌకిక వాదం పరిఢవిల్లుతాయి’’ అన్నారు పవన్ కళ్యాణ్.

31, డిసెంబర్ 2020, గురువారం

జనసేన: ‘చంద్రబాబుకి మంత్రి కొడాలి నానికి ఏదో రహస్య సంబంధం ఉంది’



తక్షణ సాయం రూ.10వేలు... పరిహారం రూ.35 వేలు ఎప్పుడిస్తారో చెప్పాలి 

అసెంబ్లీ ముట్టడి పిలుపుతో కేబినెట్ లో అలజడి 

జనాన్ని దోచుకోవడానికే వాలంటీర్ల వ్యవస్థ

ఖైదీ సాబ్ పాలనలో రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది

పదవి పోతుందనే మంత్రి పేర్ని నాని చిడతల సౌండ్ పెంచారు

కోట్లు దోచుకుంటున్న మంత్రులు కొడాలి, పేర్ని, వెల్లంపల్లి బోడిలింగాలే 

విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస యాదవ్, పోతిన వెంకట మహేష్   


మంత్రులకు ప్రజా సమస్యలపై పట్టింపు లేదు... పదవులు కాపాడుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంటే... మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడటం పాలకపక్షం చేతగానితనాన్ని తెలుపుతోంది అన్నారు. మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే క్యాబినెట్ లో ఏదో అలజడి మొదలైందని అర్థమవుతోంది అని చెప్పారు. పదవులు కాపాడుకోవడం కోసం మంత్రులు ముఖ్యమంత్రి చుట్టూ చేరి భజన చేస్తున్నారన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ తో కలిసి బుధవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ “తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రజలు మరిచిపోతున్న సమయంలో మంత్రి కొడాలి నాని మాత్రం పదే పదే ఆయన పేరు తలుస్తూ గుర్తు చేస్తున్నారు. మేము రైతుల గురించి మాట్లాడితే సమయం, సందర్భం లేకపోయినా చంద్రబాబుతో మా పార్టీకి లింకుపెట్టి ఆయన మాట్లాడతారు. కొడాలి నాని వ్యవహారశైలి చూస్తుంటే ఆయనకు చంద్రబాబు గారికి ఏదో రహస్య ఒప్పందం ఉందనే అనుమానం కలుగుతోంది. మరో మంత్రి పేర్ని నాని గారు తాము సీఎంకు చిడతలు కొడతాం అని గొప్పగా చెప్పుకొంటున్నారు తప్ప రైతులకు న్యాయం చేస్తామని చెప్పడం లేదు. వైసీపీ పార్టీ అవినీతిని కచ్చితంగా  ప్రజలు ముందుకు తీసుకొస్తాం. పవన్ కళ్యాణ్ గారిపై నోళ్లేసుకుని పడటమే తప్ప‌.. రైతుల గురించి మాత్రం ఒక్కరూ మాట్లాడలేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. మీకు తగిన బుద్ధి చెబుతారు. వైసిపి నాయకులు ప్రజాసేవపై దృష్టిపెట్టాలి..‌ ప్రతిపక్షాలపై కాదు.

అప్పుడు జన్మభూమి కమిటీలు... ఇప్పుడు వాలంటీర్లు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను దోచుకోవడానికే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవడానికి వీలుగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాలంటీర్లు ప్రజల దగ్గర పదో పరకో తీసుకొని పనిచేస్తున్నారు తప్పితే... ఫ్రీగా ఎవరూ పని చేయడం లేదు. తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు చేసిన తప్పులే వైసీపీ హయాంలో వాలంటీర్లు చేస్తున్నారు. చంద్రబాబు గారు గ్రామానికి నలుగురిని పెడితే... జగన్మోహన్ రెడ్డి గారు వంద మందిని పెట్టి దోచుకుంటున్నారు. రైతు భరోసా పథకంలో సగం మంది రైతులను తప్పించారు. ఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అది జనం సొమ్ముతోనే తప్ప సొంత జేబుల నుంచి తీసి ఎవరూ కార్యక్రమాలు చేపట్టరు. నవరత్నాలు అని పెట్టినా, 99 రత్నాలు అని పెట్టిన అది ప్రజల సొమ్మే.  చంద్రబాబు పసుపు, కుంకుమ ఎలా అయితే మూల చేరిపోయాయో... నవరత్నాలు కూడా మూలన చేరిపోతాయి. 

ప్రజా సమస్యలను ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్తున్నాం. ఇసుక పాలసీ, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, ఇప్పుడు రైతు సమస్యలపై ఎలా అయితే మాట్లాడామో... భవిష్యత్తులో ఏ వర్గానికి ఇబ్బందులు ఎదురైనా మాట్లాడతాం.  అందులో రాజీపడే ప్రసక్తే లేదు. తుపాన్ బాధిత రైతులకు జనసేన పార్టీ డిమాండ్ చేసినట్లు రూ. 35వేలు నష్టపరిహారం చెల్లించాలి, అలాగే తక్షణమే రూ. 10 వేలు ఇవ్వాలి. లేని పక్షంలో అధ్యక్షులు వారు చెప్పినట్లు అసెంబ్లీని ముట్టడించి తీరుతామ”ని హెచ్చరించారు.


బూతులు మీద ఉన్న శ్రద్ధ గుడివాడ గోతుల మీద లేదు: పోతిన వెంకట మహేష్ 

పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ “”నోరుంది కదా అని బూతులు మంత్రి కొడాలి నాని గారు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పేద ప్రజలకు సన్న బియ్యం సరఫరా చేయలేని సన్నాసి మంత్రి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేని దద్దమ్మ మంత్రి. కొడాలి నాని శివలింగం ఏంటి.... కచ్చితంగా బోడి లింగమే. నీకు కోట్లు అప్పిచ్చిన పాపానికి వంక విజయ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం కాదా? అమెరికాలో వ్యాపారం చేసుకొనే వ్యక్తిని తీసుకొచ్చి గన్నవరంలో నిలబెట్టి నీ పబ్బం గడుపుకున్న మాట వాస్తవం కాదా? ఆయన ఓడిపోయిన తర్వాత వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేను మీ పార్టీలోకి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఎన్నికల ముందు రంగా గారి ఫోటోలకు పూలమాలలు వేసి జయంతి, వర్థంతిలకు హాజరైన నాని... మొన్న జరిగిన వర్థంతికి ఆహ్వానించినా ఎందుకు వెళ్లలేదో సమాధానం చెప్పాలి. మల్లవరం భూముల్లో 15 ఎకరాలు నీ అనుచరులతో కబ్జా చేయించి రూ. 150 కోట్లు కాజేశారు. కె. కన్వెన్షన్ లో పేకాట క్లబులు నడుపుతున్న మాట వాస్తవం కాదా.? ఇతర దేశాలకు రేషన్ బియ్యాన్ని అమ్ముకొని వందల కోట్లు సంపాదిస్తుంది నిజం కాదా? ఆయనకు బూతులు మీదున్న శ్రద్ధ గుడివాడ గోతులు మీద లేదు. కనీసం బూతులైనా తగ్గిస్తే గోతులైన పూడుకునేవి. 

ఓ లారీ క్లీనర్ రాష్ట్ర మంత్రి అయ్యాడని మేము ఆనందిస్తుంటే.. ఆయన వ్యవహారం మాత్రం ఇంకా దాబాల దగ్గర సిగరెట్ పీకలు ఏరుకునే వ్యవహారం లాగే ఉంది. కొడాలి నాని రాజీనామా చేసి ఎన్నికలకు వస్తే ఆయన శివ లింగమో బోడి లింగమో ప్రజలే నిర్ణయిస్తారు. పవన్ కల్యాణ్ అనే సింహం రైతుల సమస్యపై గర్జించింది... ఈ బులుగు గ్రామ సింహాలన్నీ భౌభౌ అంటూ మొరుగుతున్నాయి

మా అధినేతపై ఇష్టానుసారం మాట్లాడితే మేము మీ అధ్యక్షుడిని ఖైదీ సాబ్ అని పిలవాల్సి ఉంటుంది.  శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులు, రైతుకూలీలతో అసెంబ్లీని ముట్టడిస్తే అడ్రస్ ఎక్కడ గల్లంతవుతుందనే భయంతోనే తాడేపల్లి ప్యాలస్ నుంచి ఖైదీ సాబ్ స్పందించారు. ఈ ఖైదీ సాబ్ పాలనలో రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతోంది. ఈ ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ అన్నీ రాజకీయ విమర్శలే తప్ప ఒక్కటి కూడా రైతుకు మేలు చేసే మాట మాట్లాడలేదు. 

కాపుల సంక్షేమం మీద చిత్తశుద్ధి లేదు :

ఆరు నెలల్లో మంత్రి పదవి పోతుందని తెలిసే మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేద్దాం అని చిడతల సౌండ్ బాగా పెంచారు. నేను కాపుని.. కాపుని అని పదే పదే చెప్పుకునే ఆయన... కాపులకి ఈబీసీ కోటాలో ఎందుకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదని ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించరు. కాపు సంక్షేమం కోసం ఉపయోగించవలసిన కార్పొరేషన్ నిధులు మళ్లిస్తే దాని గురించి మాట్లాడరు. నీకు నిజంగా కాపుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు వీటిపై ప్రశ్నించాలి. ఈ రాష్ట్రానికి పట్టిన మరో దరిద్రం.. అరిష్టం దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.  ఆయన మైల పడిన మంత్రి. హిందూ సంప్రదాయల ప్రకారం విధులు నిర్వర్తించడానికి అనర్హుడు. వక్ఫ్ బోర్డు ఆస్తులను దోచేయడానికి నకిలీ దస్తావేజులను సృష్టిస్తున్నారు. దుర్గ గుడిలో కోటి రూపాయిలు విలువ చేసే ఇనుమును తన మనుషులతో రూ. 50 లక్షలకే కొనిపించారు. ఎన్నికలకు ముందు అప్పుల్లో ఉన్న ఆయన... ఇవాళ వందల కోట్ల రూపాయలకు పడగలెత్తి.. చీమకుర్తి గనుల్లో పెట్టుబడులు పెట్టారు. రాజకీయ భిక్షపెట్టి ఎమ్మెల్యేగా గెలిపించిన కుటుంబంపైనే విమర్శలు చేస్తున్నాడు. ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ గారి కాళ్లు పట్టుకున్న మాట వాస్తవం కాదా? 

రాజకీయ విమర్శలు చేసే ముందు రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పండి. తుపాన్ ప్రభావిత ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 35వేలు ఇవ్వాలని, తక్షణమే రూ. 10 వేలు ఇవ్వాలని  డిమాండ్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు కనుకే ఇవాళ ఉద్యమాన్ని వేరే దశకు తీసుకెళ్లాం.  గడుపులోపు రైతులకు న్యాయం చేయకపోతే కచ్చితంగా అసెంబ్లీని ముట్టడించి తీరుతామ”ని హెచ్చరించారు.


30, డిసెంబర్ 2020, బుధవారం

Pawan Kalyan: అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తుంటే.... విజయనగరంలో రాములవారి విగ్రహం ధ్వంసం చేశారు

పవన్ కళ్యాణ్


దేవత విగ్రహాలు... ఆలయ ఆస్తులపై దాడులు పెరగడం బాధాకరం

విజయనగరం జిల్లాలో శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై శ్రీ కోదండరాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరం ఖండించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. 

‘‘స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం... స్వామి శిరస్సు కనిపించకుండా పోవడం తెలుసుకొంటే చాలా బాధ కలిగింది. 

మన రాష్ట్రంలో గత యేడాదిన్నర కాలంగా దేవతా విగ్రహాలు, ఆలయ రథాలు ధ్వంసం చేస్తున్నారు. 

అందుకు పరాకాష్టగా రామతీర్థంలోని ఘటన కనిపిస్తోంది. 

శ్రీరాముని విగ్రహాన్ని పగలగొట్టి శిరస్సు భాగాన్ని తీసుకువెళ్ళడం ఏదో పిచ్చివాళ్ళ చర్య అనుకూకూడదు. 

మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాదపు చర్య ఇది. పిఠాపురం, కొండ బిట్రగుంట, అంతర్వేది ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి తూతూ మంత్రంగా వ్యవహరించడం వల్లే చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయంలో దుర్మార్గపు చర్యకు తెగబడ్డారు. 

ఇప్పటి వరకూ అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధం వెనక ఉన్నవారిని, ఆ నేరానికి పాల్పడ్డవారినీ పట్టుకోలేదు. దేవత విగ్రహాలు, ఆలయ ఆస్తులపై దాడులను ఏ విధంగా చూడాలి? ఇవి మతి స్థిమితం లేనివారి చర్యలు కాదు. మత స్థిమితం లేనివారి పనులుగా భావించాల్సి వస్తోంది.

రామజన్మ భూమి అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాగుతున్న తరుణం ఇది. మన రాష్ట్రంలో మాత్రం రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 

హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు. ఆయనకు ఏ మత విశ్వాసం ఉన్నా పరమతాలను గౌరవించాలి. 

హిందూ మతంపై ఒక పథకం ప్రకారమే దాడులు సాగుతున్నాయి. అన్యమత పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రికి పవిత్ర తిరుమల క్షేత్రం నుంచి మంత్రులు శుభాకాంక్షలు చెప్పడం దురదృష్టకరం. 

శ్రీవారి కొండపై రాజకీయాలు మాట్లాడకూడదు, అన్యమత సంబంధ విషయాలు ప్రస్తావించకూడదు అనే నియమాలను కావాలనే విస్మరిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత యేడాదిన్నరగా దేవాలయాలపై దాడులు చేస్తూ దేవత విగ్రహాలను, రథాలను ధ్వంసం చేస్తున్న ఘటనలపై కేంద్ర హోమ్ శాఖ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వరుస సంఘటనలపై సి.బి.ఐ.తో దర్యాప్తు చేయించాలి’’ అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

28, డిసెంబర్ 2020, సోమవారం

పవన్ కళ్యాణ్: ‘ప్రజా ప్రతినిధులకు పేకాట క్లబులపై ఉన్న శ్రద్ధ... ప్రజా సేవపై లేదు’

పవన్ కళ్యాణ్


 బాధ్యతగా వ్యవహరించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు

నోటి దురుసుతో మాట్లాడితే బలంగా ఎదుర్కొంటాం

సిమెంట్, మైనింగ్, మీడియా సంస్థలు నడుపుతూ మీరు రాజకీయాలు చేయొచ్చు..

మేము మాత్రం సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా?

గుడివాడలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

పేకాట క్లబులు నడుపుతున్నంత సమర్ధవంతంగా ప్రజల అవసరాలను తీర్చడంలో వైసీపీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. ఓడిపోయాక భయపడిపోతాం, పారిపోతాం అని కొందరు భ్రమ పడుతున్నారు... ఆశయం ఉన్నవాడికి ఓటమి ఉండదు, ముందడుగే ఉంటుందని అన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా బాధ్యతగా వ్యవహరించకపోతే, వాళ్లు ఏ స్థాయి వ్యక్తులైనా రోడ్ల మీదకు తీసుకురాగల సత్తా జనానికి ఉందని స్పష్టం చేశారు. ప్రజలను భయపెట్టి పాలిద్దాం అంటే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. సోమవారం ఉదయం గుడివాడలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తుపాన్ మూలంగా నష్టపోయిన రైతాంగానికి హేతుబద్ధమైన పరిహారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం వెళ్తూ మార్గమధ్యంలో గుడివాడ సభలో ప్రసంగించారు. గుడివాడలో జనసైనికులు ఘన స్వాగతం పలికారు. అత్యంత భారీ పూలమాలను క్రేన్ సహాయంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు.

 ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... "నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి న్యాయం జరగాలని కృష్ణాజిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని మచిలీపట్నం వెళ్తున్నాను. అందులో భాగంగా మొదటసారి గుడివాడ వచ్చాను. జీవితంలో మరిచిపోలేని ఘనస్వాగతం పలికారు. ఈ అనుభూతిని చివరి శ్వాస వరకు గుర్తు పెట్టుకుంటాను.  అన్ని కులాలు, అన్ని మతాలకు సమ న్యాయం జరగాలనే జనసేన పార్టీ స్థాపించాను.

* రహదారుల దుస్థితిపై ప్రజాప్రతినిధులను నిలదీయాలి

కంకిపాడు నుంచి గుడివాడ వచ్చే దారిలో రోడ్లు అస్తవ్యవస్థగా ఉన్నాయి. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులను ప్రజలు ప్రశ్నించాలి. నిలదీయాలి. దాష్టీకానికి పాల్పడుతూ, నోటి దురుసుతో మాట్లాడే ఏ ప్రజాప్రతినిధినైనా జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుంది. గుడివాడ నడిబొడ్డున నిలబడి చెబుతున్నాను... అంతిమ శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండగా నిలబడతాను. 

 సినిమాలు చేస్తూ ఏం రాజకీయాలు చేస్తారని కొందరు మాట్లాడుతున్నారు.. పేకాట క్లబులు నడిపి మీరు రాజకీయం చేయగా లేనిది నిజాయితీగా సినిమాలు చేసుకుంటూ నేను రాజకీయాలు చేయకూడదా? సిమెంటు ఫ్యాక్టరీలు, మైనింగ్ సంస్థలు, మీడియా సంస్థలు నడిపి మీరు రాజకీయం చేస్తుంటే... సినిమాలు చేసుకుంటూ మేమెందుకు రాజకీయాలు చేయకూడదు? ఎంతసేపూ మీరంటున్న మాటలు పడుతూ, మీ కిందే ఊడిగం చేయాలా? ఆ రోజులు పోయాయి. ఎదురు తిరిగే రోజులు వచ్చాయి.  చొక్కా పట్టుకొని నిలదీసే రోజులివి జాగ్రత్తగా ఉండండ"ని హెచ్చరించారు. ఈ పర్యటనలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.

* పెడన నియోజకవర్గంలో ఘన స్వాగతం

పెడన  నియోజకవర్గం లోకి అడుగుపెట్టగానే జనసేన అభిమానులు ఘన స్వాగతం పలికారు. రైతులు ట్రాక్టర్లు ఎడ్ల బళ్ళల్లో వచ్చి జేజేలు పలికారు. కైకలూరు నియోజకవర్గం నుంచి రైతాంగం ఈ ప్రాంతానికి చేరుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. రైతులు తమ సమస్యలు వివరించారు. గుడివాడ, పెడన నియోజక వర్గాల్లో కృష్ణాజిల్లా నాయకులు శ్రీ బూరగడ్డ శ్రీకాంత్, శ్రీ పోతిన మహేష్, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ అక్కల గాంధీ, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ ఆకుల కిరణ్ కుమార్, శ్రీ తాడిసెట్టి నరేష్, శ్రీ పులిపాక ప్రకాష్, శ్రీ బత్తిన హరిరాం, శ్రీ వై.రామ్ సుధీర్, శ్రీమతి వరుదు రమాదేవి, శ్రీ చలపతి తదితరులు పాల్గొన్నారు.