కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ |
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో చివరి విడతగా మరికొన్ని వివరాలను ప్రకటించారు. లాక్‌డౌన్ ప్రకటించిన వెంటనే ఆహారం అవసరం ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని గరీబ్ కల్యాణ్ యోజన ప్రారంభించామన్నారు. మూడు నెలలకు సరిపడా ఆహార గింజలు అందించామని వెల్లడించారు.
వలస కూలీల తరలింపులో 85 శాతం ఖర్చును కేంద్రమే భరిస్తోందని నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు.
మే 16వ తేదీ వరకు 8.19 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. మొత్తం రూ. 16,394 కోట్లు ఇస్తామన్నారు.
ఎన్‌ఎస్ఏపీ లబ్ధిదారులకు రూ.2807 కోట్లు రెండు విడతల్లో అందజేసినట్లు చెప్పారు.
20 కోట్ల జన్‌ధన్ ఖాతాలకు రూ. 10,025 కోట్లు జమ చేసినట్లు తెలిపారు
భవన నిర్మాణ కార్మికులకు రూ. 3950 కోట్లు ఇచ్చామని.. 6.81 కోట్ల మంది ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించామని వెల్లడించారు.
శ్రామిక్ రైళ్లు వేసి వలస కార్మికులను తరలిస్తున్నట్లు చెప్పారు. వారిని స్టేషన్లకు చేర్చే బాధ్యత తీసుకోవాలని రాష్ట్రాలను కోరుతున్నామని.. మిగతా 85 శాతం ఖర్చు కేంద్రమే భరిస్తుందని అన్నారు.
ఏడు అంశాల్లో సంస్కరణలను ఆమె ప్రకటించారు
1. గ్రామీణ ఉపాధి హామీ
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పన మరింత పెంచేందుకు గాను రూ.40 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
2. వైద్యం- విద్య
కోవిడ్-19 కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. టెస్టింగ్ ల్యాబ్స్, కిట్లు, ఇతర అత్యవసర పరికరాల కోసం రూ.15,000 కోట్లు రాష్ట్రాలకు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు.
టెలికన్సల్టేషనన్ సర్వీసెస్, ఆరోగ్య సేతు యాప్ వంటివి ప్రారంభించినట్లు చెప్పారు.
హెల్త్ కేర్ వర్కర్స్‌కు రూ. 50 లక్షల చొప్పున బీమా ప్రకటించామని.. రాష్ట్రాలకు రూ. 4113 కోట్లకు పైగా నిధులు విడుదల చేశామని చెప్పారు.
* ఆరోగ్యంపై ప్రభుత్వం చేసే ఖర్చు పెంచుతామని చెప్పారు.
* పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెంచుతాం.
* ప్రతి జిల్లాలో సాంక్రమిక వ్యాధుల ఆసుపత్రుల ఏర్పాటు
* దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత ప్రజారోగ్య పరీక్ష కేంద్రాల ఏర్పాటు
* నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభిస్తాం.
- విద్యారంగం విషయానికొస్తే మే 30 నాటికి దేశంలో టాప్ 100 యూనివర్సిటీలు ఆన్ లైన్ కోర్సులు ప్రారంభిస్తాయని చెప్పారు.
- పాడ్‌కాస్ట్, రేడియో కార్యక్రమాలు ఉంటాయి. అంధ, బధిర విద్యార్థుల కోసం ప్రత్యేక ఈ-కంటెంట్ అందుబాటులోకి తెస్తాం.
- ‘పీఎం ఈ-విద్య’ పేరుతో డిజిటల్ ఎడ్యుకేషన్ కార్యక్రమం వెంటనే ప్రారంభిస్తాం.
- ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రతి క్లాస్‌కు ఒక టీవీ చానల్
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘దీక్ష’ ఏర్పాటు. ఇందులో ఈ-కంటెంట్, క్యూఆర్ కోడెడ్ టెక్స్ట్ బుక్స్ వంటివన్నీ అందుబాటులో ఉంటాయి.
- మనోదర్పన్: విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సైకలాజికల్ సపోర్ట్ అందించే కార్యక్రమం.
3. వ్యాపారం-కోవిడ్
* దివాలా ప్రక్రియ ప్రారంభానికి పరిమితి రూ. కోటికి పెంపు
* ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక దివాలా ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణ పథకాన్ని ప్రకటిస్తాం.
4. డీక్రిమినలైజేషన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్
* చిన్నపాటి సాంకేతిక పొరపాట్లు, ప్రక్రియాపరమైన పొరపాట్లకు కంపెనీల చట్టం ఉల్లంఘనల నేరాల నుంచి మినహాయింపు
* కాంపౌండబుల్ అఫెన్సెస్‌లో చాలా సెక్షన్లను అంతర్గత న్యాయనిర్ణయ వ్యవస్థలోకి(ఐఏఎం) మార్చడం. ఇప్పటివరకు 18 సెక్షన్లు ఐఏఎం పరిధిలో ఉండగా ఇప్పుడవి 58 సెక్షన్లకు పెంచుతున్నారు.
5. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
* అనుమతించదగ్గ విదేశీ చట్టపరిధుల్లో ఉన్న భారతీయ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు సెక్యూరిటీస్‌లో డైరెక్ట్ లిస్టింగ్
* స్టాక్ ఎక్స్చేంజ్‌లలో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు లిస్ట్ చేసే ప్రయివేట్ కంపెనీలను లిస్టెడ్ కంపెనీలుగా పరిగణించరు.
* నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్ఏటీ)లకు అదనపు, ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటుచేసుకునే అధికారం
* చిన్నకంపెనీలు, ఏక వ్యక్తి కంపెనీలు, ప్రొడ్యూసర్ కంపెనీలు, స్టార్టప్‌లు చెల్లింపులు చేయకపోతే వాటిపై జరిమానాల తగ్గింపు
6. ప్రభుత్వ రంగ సంస్థలు
* అన్ని రంగాల్లో ప్రయివేటుకు అవకాశం.
* వ్యూహాత్మక రంగాల్లో కనీసం ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంటుంది. ప్రయివేటుకూ అనుమతులు ఇస్తారు.
* మిగతా రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను దశలవారీగా ప్రయివేటీకరిస్తారు.
* నిర్వహణ, పాలనావ్యయాల నియంత్రణకు గాను వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను 1 నుంచి 4 వరకు పరిమితం చేస్తారు.
మిగతావాటిని విలీనం చేయడమో, హోల్డింగ్ కంపెనీలుగా మార్చడమో, ప్రయివేటీకరించడమో చేస్తారు.
7. రాష్ట్రాలకు వరాలు
2020-21కి గాను రాష్ట్రాల రుణ పరిమితిని జీఎస్‌డీపీలో 5 శాతానికి పెంచారు. ప్రస్తుతం ఇది 3 శాతంగా ఉంది.
3 శాతం లెక్కన ప్రస్తుతం రూ.6.41 లక్షల కోట్లకు పరిమితి ఉండగా ఇప్పుడు అదనంగా మరో రూ.4.28 లక్షల కోట్ల వరకు రుణం తెచ్చుకునే వీలు కల్పించారు.
ఇప్పటికే రాష్ట్రాలకు అందించిన సహాయం..
* ఏప్రిల్‌లో రూ.46,038 కోట్లు పన్నుల ఆదాయం బదిలీ
* రాష్ట్రాలకు రెవెన్యూ లోటు రూ.12,390 కోట్లు భర్తీ
* ఎస్డీఆర్ఎఫ్ నిధుల కోసం ఏప్రిల్ మొదటివారంలో రూ.11,092 కోట్ల అడ్వాన్స్ చెల్లింపు
* కోవిడ్ నివారణ చర్యల కోసం నేరుగా కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రూ.4,114 కోట్లు విడుదల
* కేంద్రం వినతి మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల విషయంలో మద్దతుగా నిలిచింది.
- రాష్ట్రాల వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితిని 60 శాతానికి పెంచింది.
- రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ వరుస రోజుల పరిమితిని 14 నుంచి 21 రోజులకు పెంచింది.
- త్రైమాసికంలో ఓవర్ డ్రాఫ్ట్ రోజుల పరిమితిని 32 నుంచి 50 రోజులకు పెంచింది.