ఆరోగ్య సేతు యాప్‌లో డేటా సెక్యూరిటీ పరంగా లోపాలున్నాయంటూ ఒక ఎథికల్ హ్యాకర్ హెచ్చరించడంతో ఆ యాప్ బృందం స్పందించింది.
సదరు హ్యాకర్‌ను సంప్రదించామని చెబుతూ.. హ్యాకర్ లేవనెత్తిన అంశాలు, వాటికి సమాధానాలను ఒక ప్రకటన రూపంలో విడుదల చేసింది.
ఆరోగ్యసేతు యాప్ కొన్ని సందర్భాలలో యూజర్ లొకేషన్ డేటాను తీసుకుంటుందన్న హ్యాకర్ క్లెయిమ్‌కు.. ‘‘ఈ యాప్ డిజైన్లోనే అది ఉంది. అందుకే ప్రైవసీ పాలసీలోనూ స్పష్టంగా ఆ విషయం పేర్కొన్నాం.
యూజర్ లొకేషన్ డేటాను తీసుకుని మా సర్వర్‌లో భద్రంగా, ఎన్‌క్రిప్టెడ్‌గా, అనామకంగా ఉంచుతాం’’ అని సమాధానం ఇచ్చింది.
పరిధి, అక్షాంశరేఖాంశాలను మార్చుతూ యూజర్ తన చుట్టూ ఉన్న కేసుల వివరాలను తెలుసుకోగలుగుతాడన్న క్లెయిమ్‌కు సమాధానమిస్తూ.. 500 మీటర్లు, 1 కిలోమీటర్, 2 కి.మీ., 5 కి.మీ., 10 కి.మీ. పరిధి స్థిర పరామితులు యాప్‌లోనే ఉన్నాయని.. వాటినే యూజర్ మార్చి గణాంకాలు తెలుసుకోగలరని.. ఇది కాకుండా ఇంకే పరిధిలో సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నించినా అది ఒక కిలోమీటరు పరిధిలో సమాచారం మాత్రమే అందించేలా యాప్ డిజైన్ ఉందని వివరించింది.
ఎవరి వ్యక్తిగత డేటాకైనా ముప్పు ఉందని ఈ హ్యాకర్ నిరూపించలేదని.. తాము నిరంతరం ఈ యాప్‌ను పరీక్షిస్తూ అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఆరోగ్యసేతు టీం చెప్పింది.
ఇంకెవరైనా ఇందులో లోపాలను గుర్తిస్తే తమ దృష్టికి తేవాలంటూ support.aarogyasetu@gov.inకు మెయిల్ చేయాలని కోరారు.