మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
* ప్రజల రాకపోకలపై మే 3 వరకూ నిషేధం కొనసాగుతుంది. రైళ్లు, విమానాలు, మెట్రో రైళ్లు, బస్సులు సహా అన్ని రకాల రవాణా సదుపాయాలు మూసి ఉంటాయి. ట్యాక్సీలు, ఆటోలు కూడా నడవవు.
* నిత్యావసరాలు, అగ్నిమాపక, శాంతిభద్రతలు, అత్యవసర సేవలు అందించే వాహనాలు మాత్రమే తిరుగుతాయి. సరుకుల రవాణాకు, సహాయ కార్యక్రమాలకు రైల్వే, ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాల వంటివాటి సేవలు కొనసాగుతాయి.
* ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, ల్యాబ్‌లు, క్లినిక్‌లు, వైద్య సామగ్రి దుకాణాలు, నర్సింగ్ హోంలు, అంబులెన్స్‌ల వంటివన్నీ నడుస్తాయి.
* ఏప్రిల్ 20 తర్వాత వ్యవసాయ, పశుసంవర్థక కార్యకలాపాలకు, ప్రభుత్వ మార్కెట్లు, కొనుగోళ్ల కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.
* ఉపాధి హామీ పథకం పనులకు అనుమతి ఉంటుంది. అయితే, అందరూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి.
* ఏప్రిల్ 20 తర్వాత ఫార్మాసూటికల్ పరిశోధన కార్యకలాపాలు, ఔషధాలు, వైద్య పరికరాల తయారీకి అనుమతి ఉంటుంది.
* సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, క్రీడా సముదాయాలు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు మే 3 వరకూ మూసే ఉంటాయి.
* రేషన్ దుకాణాలు, ఆహారం, నిత్యావసర సరకులు, పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, పశువుల దాణా, ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు అమ్మే దుకాణాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది.
* ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల్లో 50 శాతం లోపు సిబ్బందితో కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.
* స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు... ఇలా అన్ని రకాల విద్య, శిక్షణ, పరిశోధన, కోచింగ్ సంస్థలు మూసే ఉంటాయి.
* మత ప్రార్థన స్థలాలకు, ఆలయాలకు సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు. మతపరమైన సభలు, ర్యాలీలు నిర్వహించకూడదు.
* అన్ని రకాల సామాజిక, క్రీడ, విద్య, సాంస్కృతిక సభలు, కార్యక్రమాలు, సమావేశాలపై నిషేధం అమల్లో ఉంటుంది.
* అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనడానికి వీల్లేదు.
* బహిరంగ ప్రదేశాల్లో, కార్యాలయాల్లో తప్పకుండా మాస్క్ ధరించాలి.
* కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువగా ఉన్న హాట్‌స్పాట్లను గుర్తిస్తారు. ఈ ప్రాంతాల్లో ఆంక్షలు కట్టుదిట్టంగా అమలవుతాయి.
* కార్యాలయాల్లో ఒకరికొకరు కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి. సామాజిక దూరాన్ని పాటించేందుకు వీలుగా ఉద్యోగుల షిఫ్టులను మార్చుకోవాలి.
* కార్యాలయాలకు వచ్చే, పోయే మార్గాల్లో శానిటైజర్ తప్పనిసరిగా ఉంచాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి