19, నవంబర్ 2022, శనివారం

Kim Daughter: ఉత్తరకొరియా సుప్రీం లీడర్ కిమ్ కూతురిని చూశారా

kim jong un daughter kim ju ae



ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంగతి తెలుసు కదా. మామూలు నియంత కాదు... మహామహా నియంతలే నోరెళ్లబెడతారు ఆయన గురించి విని.

అగ్రరాజ్యం అమెరికాకే పోయించే రకం కిమ్. తిండి, అభివృద్ధి లేకుండా తన దేశం, ప్రజలు అల్లాడిపోతున్నా కూడా పగపగ అంటూ రోజూ తన దాయాది దేశం దక్షిణ కొరియాపైకి, దానికి మద్దతిచ్చే అమెరికా వైపు మిసైళ్లు ప్రయోగిస్తుంటాడు ఈ కిమ్.

కోవిడ్ వచ్చిన రోగులకు ప్రపంచంలోని ప్రతి దేశమూ ట్రీట్మెంట్ చేస్తే.. ఉత్తర కొరియాలో ఫస్ట్ కోవిడ్ వచ్చిన మనిషికి కిమ్ ఇచ్చిన ట్రీట్మెంట్.. తుపాకీ బుల్లెట్. అట్లుంటది మనోడితోని.

కిమ్ తన గురించి ఒక్క చిన్న క్లూ కూడా అమెరికా సీక్రెట్ ఏజెంట్లకు కూడా దొరక్కుండా జాగ్రత్తపడుతుంటాడు.

ఆయన భార్య ఎలా ఉంటుందో చూసినవారు ఈ భూమి మీద చాలా కొంచెం మంది మాత్రమే. ఎక్కడా ఫొటో కూడా కనిపించదు.

ఇక ఆయన పిల్లల గురించైతే ఇంతవరకు ఎవరికీ తెలియదు.

అలాంటిది.... ఇప్పుడు ఒక్కసారిగా కిమ్ కూతురి ఫొటోలు బయటకు వచ్చాయి. అది కూడా కిమ్ చేయి పట్టుకుని నడుస్తున్న ఫొటోలు వచ్చాయి. అది కూడా ఉత్తరకొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ వీటిని ఆన్ లైన్లో ఉంచింది. కానీ, ఎక్కడా కిమ్ కూతురు అని ఏజెన్సీ రాయలేదు. ఆమె పేరు కూడారాయలేదు. అయితే కిమ్ చేయి పట్టుకుని నడిచే పాప ఆమె కూతురు కాకుండా వేరే ఎవరూ అయి ఉండరన్న అంచనాతో అంతా ఆమెను కూతురిగానే భావిస్తున్నారు.

kim ju au Kim Daughter


కిమ్ ఆమెను పబ్లిగ్గా బయటకు తీసుకొచ్చారు. ఉత్తర కొరియా తయారుచేపసిన అతిపెద్ద ఖండాంతర క్షిపనిని శుక్రవారం పరీక్షించిన సమయంలో తనిఖీ చేయడానికి వెళ్లిన కిమ్ తనతో పాటు కూతురిని కూడా తీసుకెళ్లారు. ఆమె పేరు ‘కిమ్ చూ ఆ’ అంటున్నారు. ఆమె వయసు 12 నుంచి 13 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు.

అంతకుముందు సెప్టెంబరు నెలలో ఉత్తర కొరియా నేషనల్ డే వేడుకల సమయంలో కూడా ఆమెను కిమ్ తీసుకొచ్చారని కొందరు చెప్పినా ఆ ఫొటోలు కానీ వీడియోలు కానీ ఎక్కడా లేవు.

కాగా కిమ్‌కు ముగ్గురు పిల్లలున్నారని.. అందులో ఈ అమ్మాయే పెద్దదని.. మరో అమ్మాయి, అబ్బాయి ఉన్నారని చెబుతుంటారు.

అయితే, కిమ్ కుటుంబం గురించి ఊహాగానాలే తప్ప ఎవరికీ ఏమీ స్పస్టంగా తెలియదు. ఆయన అంతరంగికులు కొందరికి మాత్రమే కిమ్ గురించి తెలుసు.

3, అక్టోబర్ 2022, సోమవారం

Munugodu Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

Election Commission of India


మునుగోడు ఉపఎన్నిక నవంబరు 3న నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.

మహారాష్ట్ర, బిహార్, హరియాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో మొత్తం ఏడు సీట్లకు ఉపఎన్నికలను అదే రోజున నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది.

నోటిఫికేషన్: అక్టోబరు 7

నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 14

నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 15

ఉపసంహరణ గడువు: అక్టోబర్ 17

పోలింగ్: నవంబర్ 3

ఓట్ల లెక్కింపు: నవంబర్ 6


16, మే 2021, ఆదివారం

Tauktae: కేరళను వణికిస్తున్న తౌక్టే తుపానుకు Myanmar Gecko తొండలకు సంబంధం ఏమిటి.. ఆ పేరెవరు పెట్టారు

cyclone Tauktae

తౌక్టే.. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుపాను కేరళను కకావికలం చేస్తోంది. ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు.

మల్లాపురం, కోళీకోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్‌, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిసూర్, పాలక్కాడ్ జిల్లాల్లో తౌక్టే ప్రభావం తీవ్రంగా ఉంది.

దీని ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలలోనూ వర్షాలు కురుస్తున్నాయి. తౌక్టే తుపాను గుజరాత్‌లో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.

తౌక్టే అంటే అర్థమేమిటి.. ఈ పేరెవరు పెట్టారు

తౌక్టే అనే పేరు మయన్మార్ పెట్టింది. బర్మా భాషలో తౌక్టే అంటే ఒక రకమైన చిన్న తొండ (Gecko) . ఈ రకం తొండలు చూడ్డానికి బాగా చిన్నగా ఉంటాయి కానీ పెద్ద శబ్దం చేస్తాయి.

తౌక్టే మగ తొండలు జత కూడే కాలంలో పెద్ద శబ్దం చేస్తూ ఆడ తొండలను ఆకర్షిస్తాయి.

తుపాన్లకు పేర్లు ఎలా పెడతారు? ఎవరు నిర్ణయిస్తారు?

వరల్డ్ మెటిరియలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా పసిఫిక్... భారత్, బంగ్లాదేశ్, మియన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్‌లు సభ్య దేశాలుగా ఉన్న ఒక కూటమి కలిపి ఈ పేర్లను నిర్ణయిస్తాయి. 

కొన్ని పేర్లతో ఒక జాబితాను తయారుచేస్తాయి. 

2004లో ఇలా ఈ 8 దేశాలు ఒక్కో దేశం 8 చొప్పున పేర్లు నిర్ణయించి మొత్తం 64 పేర్లతో జాబితా రూపొందించాయి.

ఏటా వచ్చే తుపాన్లకు ఈ జాబితాలోని పేర్లను వరుసగా పెడుతుంటాయి.

2004లో రూపొందించిన జాబితాలోని 64 పేర్లలో చిట్టచివరి పేరు Amphan. 

అయితే, 2018లో వరల్డ్ మెటిరియలాజికల్ ఆర్గనైజేషన్ మొదట ఉన్న 8 దేశాలకు కూటమిలో మరో 5 దేశాలను చేర్చింది. అవి ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్.

వాటిని జోడించాక కూటమిలో మొత్తం 13 దేశలయ్యాయి.

దాంతో ప్రతి దేశం 13 చొప్పున 13 దేశాలు కలిపి 169 పేర్లతో కొత్త జాబితా రూపొందించారు.



తుపాన్లకు అసలు పేర్లెందుకు పెడతారు?

ఒక్కో సముద్రంలో జనించే తుపాన్ల విషయంలో కన్ఫ్యూజన్ తగ్గించడానికి ఇలా పేర్లు పెట్టడం ప్రారంభించారు. 

ప్రతి మహాసముద్ర పరిధిలో ఏర్పడే తుపాన్లకు అక్కడి ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు, ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్లు పేర్లు పెడుతుంటాయి.

తుఫాన్లకు పేర్లు పెట్టడానికి ఉన్న రూల్సేమిటి?

* తుపాన్లకు పెట్టే పేర్లకు రాజకీయాలతో సంబంధం ఉండకూదు.

* ఏ ఒక్క జెండర్‌నో , ఏ ఒక్క కల్చర్‌నో, ఏ ఒక్క మతాన్నో సూచించేలా ఉండకూడదు. వీటన్నిటికీ అతీతమైన పదం అయ్యుండాలి.

* ఎవరి సెంటిమెంట్లను బాధపెట్టేలా ఉండకూడదు.

* తీవ్రమైన, క్రూరమైన పదజాలం కాకూడదు.

* చిన్న పదాలు, సులభంగా పలికేవి అయ్యుండాలి.

* ఇంగ్లిష్‌లో 8 అక్షరాలు కంటే ఎక్కువ ఉండకూడదు.

ఇండియా పెట్టిన పేర్లేమిటి?

కొత్త జాబితాలో ఇండియా పెట్టిన పేర్లు కూడా 13 ఉన్నాయి.

Tej(తేజ్)

Murasu(మురసు)

Aag(ఆగ్)

Vyom(వ్యోమ్)

Jhar(ఝర్)

Probaho(ప్రొబాహో లేదా ప్రవాహ)

Neer(నీర్)

Prabhanjan(ప్రభంజన్)

Ghurni(ఘుర్ని)

Ambud(అంబుధ్)

Jaladhi(జలధి)

Vega(వేగ)



8, మే 2021, శనివారం

పవన్: కరోనా నుంచి కోలుకున్న ‘వకీల్ సాబ్’

 

పవన్

నసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడిన పవన్ కల్యాణ్‌కు వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలు నిర్వహించారు. 

ఆ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. కరోనా అనంతరం వచ్చే నిస్త్రాణం వంటివి మాత్రం ఉన్నాయని... ఆరోగ్యపరంగా పవన్ కల్యాణ్ గారికి ఇబ్బందులు లేవని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలియచేశారు. 

తన ఆరోగ్యక్షేమాల కోసం ఆకాంక్షించినవారికి, పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, నాయకులు, అభిమానులకు శ్రీ పవన్ కల్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియచేశారు. 

ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

Mother's Day: మదర్స్ డే మొదలుపెట్టిన మహిళే వద్దని కూడా ప్రచారం చేశారు.. ఎందుకో తెలుసా

Anna Jarvis  Mother's day


మదర్స్ డే Mother's day ప్రతి సంవత్సరం మే నెలలో రెండో ఆదివారం జరుపుకొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో మదర్స్ డే పాటిస్తారు.

సుమారు వందేళ్ల కిందట అమెరికాలో మొట్టమొదటిసారి ఈ మదర్స్ డే కాన్సెప్ట్‌ను మొదలుపెట్టిన మహిళ అన్నా జార్విస్. అయితే, ఇది క్రమేపీ ఆడంబరమైన కార్యక్రమంగా మారిపోవడంతో తరువాత కాలంలో ఆమె మదర్స్ డే వేడుకలు రద్దు చేయాలంటూ ఉద్యమం కూడా చేశారు.

ఎలా మొదలైంది..

అన్నా జార్విస్ తల్లిదండ్రులకు 13 మంది పిల్లలు. వారిలో 9 మంది చనిపోయారు. అప్పట్లో రకరకాల జబ్బుల కారణంగా పిల్లలు చనిపోతుండేవారు.

అమ్మ కోసం ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలన్న ఆలోచన అన్నా జార్విస్‌కు ఆమె తల్లి నుంచే వచ్చింది. 

జార్విస్ తల్లి తనలాంటి మిగతా అమ్మలను అనేక విషయాలపై చైతన్యం చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి ఆమె మిగతా తల్లులకూ నిత్యం జాగ్రత్తలు చెబుతుండేవారు. 

అంతేకాదు.. అమ్మలు చేసేపనికి గుర్తింపు ఉండాలని ఆమె భావించేవారు. 

1858లో ఆమె మదర్స్ డే వర్క్ క్లబ్ ప్రారంభించారు. ఈ మదర్స్ డే వర్క్ క్లబ్బులు శిశుమరణాల రేటు తగ్గించడం కోసం పనిచేసేవి.

అప్పటికి పశ్చిమ వర్జీనియాలోని గ్రాఫ్టన్ ప్రాంతంలో శిశుమరణాలు అధికంగా ఉండేవి. ప్లేగు, ఇతర అంటువ్యాధుల కారణంగా పిల్లలు చనిపోతుండేవారు. ఆమెకు కూడా 13 మంది సంతానమైనప్పటికీ అందులో 9 మంది శిశుప్రాయంలోనే చనిపోవడానికి కారణం ఇలాంటి వ్యాధులే.

1905లో అన్నా జార్విస్ తల్లి మరణించారు. అప్పుడు ఆమె చుట్టూ ఉన్న నలుగురు పిల్లల్లో అన్నా జార్విస్ తన తల్లికి ఒక మాటిచ్చారు.

అమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తానని ఆమె మాటిచ్చారు.

ఆ క్రమంలోనే ఆమె ప్రపంచంలోనే గొప్ప అమ్మ అంటే ఎవరు..? ఎవరి అమ్మ వారికి ప్రపంచంలోనే గొప్ప అమ్మ అనే కాన్సెప్ట్‌తో మదర్స్ డే జరపడం ప్రారంభించారు.

అందుకే ఇది Mothers Day అని బహువచనంతో కాకుండా Mother's Day అని ఏకవచనంలో ఉంటుంది.


మొట్టమొదటిసారి మదర్స్ డే ఎప్పుడు జరిపారంటే..

1905లో అన్నా జార్విస్ తల్లి మరణించిన తరువాత మూడేళ్లకు అంటే 1908లో తొలిసారి గ్రాఫ్టన్ మెథడిస్ట్ చర్చిలో మే రెండో ఆదివారాన మదర్స్ డే నిర్వహించారు.

అన్నా జార్విస్ రెండో ఆదివారాన్ని ఎంచుకోవడానికి కారణం ఆమె తల్లి మరణించిన మే 9వ తేదీకి రెండో ఆదివారం సమీపంలో ఉండడమే కారణం.

ఆ తరువాత మదర్స్ డే ప్రాచుర్యం విపరీతంగా పెరిగింది. 1910లో వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలో మదర్స్ డేకు సెలవు ఇచ్చారు.

1914కి వచ్చేసరికి ఏకంగా అమెరికా వ్యాప్తంగా ఆ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించారు అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్.

కానీ, అన్నా జార్విస్ కోరుకున్నది ఇది కాదు. వేడుకలు పూర్తిగా వాణిజ్య రూపంలోకి మారడంతో ఆమె ఆవేదన చెందారు. మదర్స్ డే వేడుకలను ఇలా మార్చేయొద్దంటూ ఆమె పత్రికా ప్రకటనలిచ్చారు.

కానీ, ఆమె గోడు ఎవరూ పట్టించుకోలేదు.

1920 నాటికి మదర్స్ డే రోజు పువ్వులు కొనడం, బొకేలు కొనడం మానుకోవాలంటూ ఆమె ప్రజలను కూడా అర్థించారు. తాను కోరుకున్న స్ఫూర్తిని మరచి వివిధ సంస్థలు కూడా దీన్ని పూర్తిగా మార్చేయడంపై ఆమె బాధపడేవారు. 

ఆమె ఇలా మదర్స్ డేకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించడంతో ఆమె చేస్తున్న ఆ వ్యతిరేక ప్రచారం ఎలాగైనా ఆపించాలని బొకేలు, గ్రీటింగ్ కార్డుల వ్యాపారులు ఆమెకు డబ్బు ఇవ్వజూపారు. కానీ ,ఆమె అందుకు లొంగలేదు. 

మదర్స్ డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించడానికి ముందు ఆమె ‘మే రెండో ఆదివారం, మదర్స్ డే’ అనేదానికి కాపీరైట్ తీసుకున్నారు. మదర్స్ డేను వాణిజ్యపరంగా నిర్వహించేవారిపై ఆమె కేసులు వేసేవారు.

దీంతో కొన్ని సంస్థలు ఈ వేడుకలను జరిపేటప్పుడు మదర్స్ డేను బహువచనం(Mothers Day)గా వాడుతూ కాపీరైట్ నుంచి తప్పించుకునేవారు.

80 ఏళ్ల వయసులో ఆమె ఫిలడెల్ఫియాలోని ఒక శానిటోరియంలో ఉండేవారు.. అప్పుడు కూడా ఆమె కళ్లు కనిపించకపోయినా ఇళ్లిళ్లూ తిరుగుతూ మదర్స్ డే వేడుకలు వద్దంటూ సంతకాలు సేకరించేవారు.

చివరికి అన్నా జార్విస్ 1948లో గుండెపోటుతో మరణించారు.

మా ఇతర కథనాలు:

19, ఏప్రిల్ 2021, సోమవారం

కేసీఆర్‌కు కరోనా

 


తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

ఆయన స్వల్ప లక్షణాలున్నాయని.. హోం ఐసోలేషన్‌లో ఉండమని వైద్యులు సూచించినట్లు ఆయన చెప్పారు.

ప్రస్తుతం కేసీఆర్ ఫాం హౌస్‌లో ఉన్నారని చెప్పారు.

16, ఏప్రిల్ 2021, శుక్రవారం

పవన్ కల్యాణ్‌కు కరోనా

 

పవన్

జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కల్యాణ్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది.

ప్రస్తుతం నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు చెప్పారు.

''ఈ నెల 3న తిరుపతిలో జరిగిన పాదయాత్ర,  బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న తరవాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి. అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయక్షేత్రంలోనే క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. 

ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్‌కు వచ్చి పవన్ కల్యాణ్‌కు చికిత్స ప్రారంభించారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు'' అని ఒక ప్రకటనలో వెల్లడించారు.

''అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి ఆయన్ను పరీక్షించింది. అపోలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డి పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. జ్వరం ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

11, ఏప్రిల్ 2021, ఆదివారం

క్వారంటీన్‌లో పవన్ కల్యాణ్



జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముందు జాగ్రత్త చర్యగా క్వారంటీన్‌లోకి వెళ్లారు.

ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ముఖ్యమైన కార్యనిర్వహకులలో కొందరు కరోనా బారిన పడడంతో ఆయన ముందు జాగ్రత్తగా క్వారంటీన్‌లోకి వెళ్లారు. 

గత వారం రోజులుగా ఆయన పరివారంలోని వారు ఒక్కరొక్కరుగా కరోనా బారిన పడుతుండడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఆయన ప్రశాంత వాతావరణంలో ఉంటూ రోజువారీ పనులు, పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు.

పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతున్నారు.